షడ్రుతువులలో వసంతం నవరస భరితమై, నవరాగ రంజితమై సర్వులకు ఆనందామృతం పంచేటట్టిది. తెలుగువారి ఆశలకు, ఆశయాలకు ప్రతీకగా ప్రత్యక్షమయ్యేది సంవత్సరాది పండుగే. తెలుగుదనం ముమ్మూర్తుల, మూడు పూవులు ఆరు కాయలుగా వెలుగొందే, ప్రాకృతిక రామణియకంలో నర్తించే వసంతలక్ష్మి బాహ్య స్వరూపమే సంవత్సరాది సౌందర్యం. ఆ కాంత పండుటాకు వస్త్రాలను తీసివేసి సరికొత్త చిగురాకులను ధరించి, ముసిముసి నవ్వులు వొలకబోస్తుంటే, గున్న మావిచిగుళ్లు మేసి కోయిలలు మత్తిలి పాడుతుంటే, పూలతో, నెత్తావి నిగనిగలతో ప్రతిచోటా పులకించిపోతుంటే, పూతేనియలు గ్రోలి రెక్కలార్చుకొంటు ఎగిరే సీతాకోక చిలుకల, భ్రమరాల ఝంకార నినాదాలు నినదిస్తుంటే, అందుకు వేసంగి వరిపొలాలు తలలూపుతూ తాళాలేస్తుంటే, తెలుగింటి తలుపులు తట్టి, వలపులు రేపే వసంత లక్ష్మి వయో లావణ్యలాస్యమే సంవత్సరాది పండుగ సౌందర్యం. షడ్రుచులు మేళవించిన వేపపచ్చళ్లు, మధురిమలతో, అభ్యంగన స్నానపానాదులతో, నూతన వత్సర పంచాంగ శ్రవణాదులతో, సర్వేసర్వత్ర గత జీవితంలోని దుర్గతులకు తిలోదకాలిచ్చి, నవనవోన్మేష జీవితాలకూ ప్రాతిపదికలు వేసుకునే తెలుగయ్యలకు, అమ్మలకూ ప్రియనెచ్చెలి సంవత్సరాది.

ఇంతటి మనోహర పర్వదినాన్ని గూర్చి నాటి నుంచి నేటివరకు ఎందరో కవితిలకులు తమ కవితల్లో స్తుతిస్తూ, సంవత్సరాది సౌందర్యాలను తాము దర్శించి, ప్రదర్శించి యావదాంధ్రులను రసపరవశులజేశారు. ఆ అమలిన తారకా సముదయంబుల నెన్నని లెక్కించుట? దిఙ్ఞ్మాత్రంగా అటు జానపద సాహిత్యంలోనూ, ఇటు జ్ఞానపద వాఙ్మయంలోనూ నీరాజనాలీయబడిన సంవత్సరాది సాహితీ సౌందర్య విశేషాలను కొన్నింటిని తిలకించి, పులకిద్దాం.

ప్రకృతీ పురుషుల కలయికను ఆకాంక్షిస్తూ, నిరభ్యంతరంగా, సర్వజనులలో సమతాపూర్వకా శ్లేషాన్ని ఆశంసిస్తూ యడవల్లివారు తమ శతపత్ర కావ్యంలో నవ వసంత శోభను నిండార వర్ణించారు.

‘‘క్రొన్నన దంతకాంతులను కొంచెపు నవ్వుల రువ్వుచున్నదీ/నన్నని జాజి కుంజము; ప్రశాంతము నిచ్చటు, గంధవాయువుల్‌

‌చెన్నుగ సంస్పృశించెడిని శీతకరమ్ముల, కోకినాంగనల్‌/‌సన్నగ నాలపించు, మనసారగని య్యెడనేక మౌదమే…’’

భాష కన్నా, భావానికి పెద్దపీట వేస్తూ, సామాన్యుని ఎదలోతులు తాకే రీతి నీతులతో ఉగాది కర్తవ్యాన్ని ప్రబోధిస్తున్నారు అభ్యుదయ ప్రజాకవి సి.నా.రె. పరికించండి.

‘‘మ్రగ్గిన గతానికి నాడె అగ్గివెట్టి,

గతుకుబడిన మతాలకు చితిరగిల్చి

సామ్య జీవన సాధనాశయము దీర్ప,

కట్టుకొండి ఉగాదిని కంకణంబు’’

భావ కవితా పయోనిధి, ఆత్మాశ్రయ సాహితీ సార్వభౌములు, దేవులపల్లి కృష్ణశాస్త్రి నిరాశావాదం లోనే తన ఉగాది తలపులు తెలుపుతూ, పరోక్షంగా నైనా అది అభ్యున్నతికి ప్రతీక అంటున్నారు.

‘‘నాకుగాదులు లేవు, నాకుషస్సులు లేవు. నేను హేమంత కృష్ణానంత శార్వరిని, నాకు కాలమ్మొక్కటే కారురూపునా బ్రతుకువోలె. నా శోకమ్మువలెనే, నా వలెనే’.

బాల వాఙ్మయంలోనూ ఉగాది దైనందిన కార్యక్రమాన్ని గూర్చి అచ్చతెనుగు కూర్పులో అచ్చివచ్చిన తీరులో చెప్పారు.

‘‘ఉగాది పండుగ వచ్చిందీ,

ఊరికి అందం తెచ్చిందీ

ఉత్సవాలలో దేవుళ్లకు,

ఊరేగింపులు సాగాయి.

గుడిలో దేవుని పూజించి,

గురువుల పెద్దల రావించి,

పంచాంగాలను చదివించి,

మంచీ చెడ్డలు విన్నాము

అక్కలు, బావలు ఆసలతో,

చక్కా వచ్చారు పండక్కి

అమ్మ వేకువనే లేచింది,

అందరి తలలూ కడిగింది

సరిపడ నగలు ఇచ్చింది,

క్రొత్త బట్టలను పెట్టింది

కులదేవతలను కొలిచింది,

కూర్మిమీరగా నిలిచింది

ఊటలు నోట్లో వూరగ,

ఉగాది పచ్చడి పెట్టింది’’

మరో అభ్యుదయ కవి ఉగాది ఊసులు చిత్తగించండి;

‘‘ఎప్పుడెప్పుడా

పండుగ, ఉగాది

పండగ, ఇచ్చినోళ్ల పుణ్యం

ఇయ్యనోళ్ల పాపం

కోయిల కో అని పిలిచింది,

కొమ్మల చిగురులు మొలచినవి

కలకల పూవులు విరిసినవి,

కొమ్మల గాలులు విసిరినవి,

కిలకిల చిలుకలు పలికినవి,

ఫలములు రసములు చిలికినవి,

‘‘పాఠ్యేగేయేచ మధురమ్‌’’ అన్నట్లు వికసించిన ప్రకృతి పద్మాలను పండుగ సంబరంతో ఎంత మనోఙ్ఞంగా, దిగువ గేయంలో చిత్రించారో కవిచంద్రులు, తిలకించండి.

‘‘జగానికంతకు జాగృతి నీయగ•,

ఉగాది వచ్చెను ఉల్లాసముగను

మామిడి చిగురును మేసిన కోయిల,

మత్తిలి పాడెను మధురగీతులను

నవపల్లవ సుమతరువల్లరి,

నవనవమై వికసించెను నిండుగ

తూరుపు దిక్కున తోచిన సూర్యుడు,

వేడినియిచ్చెను వేడుకలలరగ

చైత్రలక్ష్మి సర్వాంగములందున,

చేతసత్వములు పొంగి పొరలెను

మంచిగతమున కొంచెమేనను,

నీరసాలకు నమమలొసగి

నవ్య జీవన గతుల పాత్రల

నవరసాలను నింపుకొందాం

ఆటపాటల నోలలాడుచు,

చైత్రలక్ష్మికి ప్రణుతులిద్దాం.’’

రాయప్రోలువారి మరో రమణీయ సుందర గీతి ఇది.

‘‘పాడవే నీ పాట పాడవే చెల్లెలా।

వేడితో వుడికేటి విశ్వంబు చల్లపడ

వీడరానీబాట వీడరా తమ్ముడా।

హింసతో సకలంబు ధ్వంసమగు నీ పాట

 ఆధునిక కవితా మహారథి దాశరథి ఉగాది శపథం ఇది.

‘ఈ ఉగాదికి క్తొత శపథం చేయవలెరా,

పోయెనా స్వాతంత్య్ర సంపద ముందెన్నడు రాదురా.’’

మరో యువకవి గుండెలు పిండే ఉగాది పచ్చడిలాంటి చేదునిజాన్ని,

‘‘తిండి గింజల్లేవు పాప

పిండివంటలెక్కడివి తల్లి?’’

అని ఆక్రోశిస్తూ ఉన్నారు.

మామూలు కవుల నుంచి మహాకవుల వరకు ఎందరెందరో సంవత్సరాది సౌందర్యాలను విభిన్న రీతులలో విశ్లేషించి చూపారు. కలిమిలేముల కావడి కుండల జీవితంతో పోరాటం సాగిస్తున్న సగటు మనిషిని సంపద్భరితం చేసి ఆత్మానుశీలనం కలిగించి, భవిష్యద్బంగరు జీవితానికి పట్టుకొమ్మయై ఆనందా మోదాలను గూర్చే తెలుగువారి జాతీయ పర్వదినం సంవత్సరాది.

తెలుగుల సమగ్ర భవితవ్యానికి సంవత్సరారంభంలోనే నాందీ గీతం పలికే ఈ తెలుగింటి ఆడబడుచు నర్చించి, సక్రమ ప్రగతి పథ విధాతల మవటమే నేటి మన వక్తవ్యకర్తవ్యాలు కావాలి.

‘‘నవ్య వాసంతశోభల వత్సరమ్ము

దివ్య మధురోహ లహరుల నిచ్చుగాక.’’

– ‘సుచంద్ర’, జాగృతి, 07.04.1978

About Author

By editor

Twitter
YOUTUBE