సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి ఫాల్గుణ శుద్ధ చవితి – 3 మార్చి 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
ప్రపంచాన్ని నిర్వచించడం కాదు, దానిని మార్చాలి అన్నారు తత్త్వవేత్తలు. ఇల్లు అలుకుతూ పేరు మరచిన పేనులా ఈ అద్భుత సత్యాన్ని బాగా ప్రచారం చేసినవారే దాని అంతరార్థాన్ని విస్మరించారు. నిజమే, ప్రపంచాన్ని మార్చవలసిన ఘడియలు సమీపించాయి. ద్వేష భావనలని రాజకీయ సిద్ధాంతాలుగా చెలామణి చేయడానికి ప్రయత్నాలు తీవ్రమవుతున్న ఈ క్షణాలలో ఆ మార్పు అవసరమే. ప్రపంచాన్ని శాశ్వతంగా అరాచకంలో ఉంచడానికి విలువలను ధ్వంసం చేసే పని అప్రతిహతంగా సాగిపోతున్న తరుణంలో ఆ మార్పు అవసరాన్ని కాదనలేం. ప్రజాస్వామ్య రక్షణ పేరుతో ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి పంపడానికి జరుగుతున్న నీచమైన కుట్రల నేపథ్యంలో ఆ మార్పును స్వాగతించాల్సిందే. ఆ సంగతి చక్కగా చెప్పినవారే ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. జాతీయవాదంతో కూడిన సంప్రదాయిక దృష్టిని కలిగి ఉన్న రాజకీయ పక్షాలు ప్రపంచంలో చాలాచోట్ల అధికారంలోకి వచ్చిన వాస్తవాన్ని గుర్తు చేస్తూ మెలోని ఈ విషయం ప్రస్తావించారు. తన ప్రతిపాదనను ఆవిష్కరించడానికి మెలోని అమెరికాలో ఏర్పాటు చేసిన కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌ను వేదికగా చేసుకున్నారు.
కమ్యూనిస్టుల మాటలను నమ్మడానికి ప్రపంచం ఇంకా సిద్ధంగా ఉందని అనుకుంటే పొరపాటేనని మెలోని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా మరొకసారి డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతోనే కమ్యూనిస్టులలో అలజడి ఆరంభమైందని ఆమె అభిప్రాయపడడం అవాస్తవం కాదు. సోవియెట్ రష్యా పతనం తరువాత, చైనాలో కమ్యూనిజం పైపై మెరుగుగానే భ్రమింప చేస్తున్న వేళ కమ్యూనిస్టులు తెర వెనుక ప్రారంభించిన ప్రమాదకర క్రీడ మానవ సమాజాన్ని నిరంతర ఘర్షణ వైపు నడిపించే ఉద్దేశంతో సాగుతున్నదే. ద్వంద్వ ప్రమాణాలతో, అసత్య ప్రచారాలతో ప్రపంచాన్ని నిరంతరం దగా చేయడం కమ్యూనిస్టులకు చేతనైన కళ అని ఆమె చక్కగానే చెప్పారు. ఈ నేపథ్యంలో జాతీయవాదంతో కూడిన, మట్టివాసనతో కూడిన సిద్ధాంతాలు వికసించవలసిన అవసరాన్ని మెలోని ప్రపంచానికి గుర్తు చేశారు. ట్రంప్, నరేంద్ర మోదీ, జేవియర్ మీలీ (అర్జెంటీనా అధ్యక్షుడు), ఇటలీలో తాను అధికారంలోకి రావడం ఆ వికాస క్రమంలో భాగమేనని ఆమె సంకేతించారు.
తామంతా మౌలికంగా ఆమోదిస్తున్న ఒక సూత్రానికి కన్సర్వేటిజం అని పేరు పెడుతున్నా, ఇప్పుడు ప్రజలు దానిని ఆమోదిస్తున్నారు. అదే జాతీయవాదమే పునాదిగా ఉండే మట్టివాసన వేసే సంప్రదాయవాదం. గడచిన వందేళ్లుగా జరిగిన ప్రయోగాలు చూసిన తరువాతనే, ఆ విన్యాసాలను గమనించిన తరువాతనే ప్రపంచ ప్రజానీకం కన్సర్వేటిజం వైపు మొగ్గుతున్నది. కన్సర్వేటిజంతో ఉన్న నేతలను, రాజకీయ పక్షాలకే ప్రజలు ఎందుకు అధికారం అప్పగిస్తున్నారో కూడా ఆమె వివరించారు. ‘మేం స్వాతంత్య్రాన్ని రక్షిస్తున్నాం, మేం జాతిని ప్రేమిస్తున్నాం, మేం సరిహద్దులను రక్షించాలని కోరుకుంటున్నాం, వామపక్ష, ఉదారవాద అరాచకవాదుల నుంచి పౌరులనీ, వ్యాపార వర్గాలను కాపాడుతున్నాం, మేం కుటుంబ జీవితాన్ని గౌరవిస్తున్నాం, మేం ఓకిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం, మేం ఇంగితజ్ఞానాన్ని ఆశిస్తున్నాం’ అన్నారామె. సరిగ్గా వీటినే రకరకాల పేర్లతో కమ్యూనిస్టులు, ఉదారవాదులు ధ్వంసం చేస్తున్నారు. ఇందుకోసం మతోన్మాద ముస్లిం వర్గాలతో చెలిమికి కూడా ఆ వర్గాలు వెనుకాడడం లేదు. కలిగినవారు, లేనివారి మధ్య పోరాటం అనివార్యం అన్న మార్క్స్ సూత్రం భగ్నమైన తరువాత అంధకారంలో పడిపోయిన వామపక్ష విశ్వాసులకి నిజంగా దిక్కు తోచని స్థితే. ఈ ప్రపంచాన్ని ఇంకా చీలికలు పేలికలు చేసి ప్రయోజనం పొందాలనుకుంటున్న శక్తులు ఓడిపోవడం ఖాయమని మెలోని బల్లగుద్ది చెప్పారు. వీటిని గుర్తిస్తూ ముందుకు వెళ్లాలనుకుంటున్న కొత్త సమాజ నిర్మాణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్, తాను తమ వంతు శ్రమిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. 2022లో ఇటలీలో అధికారంలోకి వచ్చిన మెలోని, మన ప్రధాని మోదీ అభిప్రాయాలతో సంపూర్ణంగా ఏకీభవిస్తూ ఉంటారు. 2024లో జరిగిన జి 7 సమావేశంలో తాను మోదీతో ఏ స్థాయిలో ఏకీభవిస్తున్నారో ఆమె చక్కగా ఆవిష్కరించారు. మెలో‘డి’ హ్యాష్‌టాగ్‌తో ఆమె తన ట్వీట్లు పంపేవారు.
ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నామంటూ నియంతృత్వం వైపు రాజకీయ వ్యవస్థలను నడిపించే పని ఇప్పుడు సాగుతున్నది. ఈ పని కోసం కోట్లు కుమ్మరించి పైశాచికానందం పొందే విధ్వంసకులు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నారు. ఈ విధ్వంస కాండకు మధ్య యుగాలనాటి జీవనాన్నీ, న్యాయాన్నీ రుద్దడమే పనిగా పెట్టుకున్న ఇస్లాం మతోన్మాదుల సాయం తీసుకోవడం కూడా ఇవాళ్టి నిజం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోసి, తమ కీలుబొమ్మలను ప్రతిష్ఠించే ప్రణాళికలనే ఆ ఆలోచనా ధోరణి రచిస్తున్నది. నీ దేశం మీద, నీదైన జీవన విధానం మీద దాడి చేసే పని కూడా అందులో ఉంది. అలా అని ఇందులో పేదరిక నిర్మూలనే ప్రధానంగా ఉన్నదా అంటే, అందుకు సమాధానం దొరకదు. రైతునీ, నేతన్నను, విద్యార్థినీ ఎవరినీ ఆదుకునే ఉద్దేశమూ కానరాదు. వృత్తి ఆందోళనకారులను పోషించడం వరకే వాళ్ల పని.
మానవాళి కోరుకోవలసిందీ, స్వాగతించవలసిందీ ఇంకా మెరుగైన ప్రపంచ నిర్మాణం కోసం ఉపయోగపడే ప్రయోగాలని. మూలాలను విస్మరించకుండా, ఆధునికతను ఆదరించే దృష్టిని కోరుకోవాలి. గతంలోని తప్పులను సరిదిద్దు కుంటూ నాగరికతను సుసంపన్నం చేసుకునే చింతనను నిర్మించుకోవాలి. మెలోని మాటలలో వినిపించినదే, భారతదేశంలో నరేంద్ర మోదీ ఆచరిస్తు న్నారు. అందుకే ఆయనకు, ఆయన పార్టీ బీజేపీకి అంత ఆదరణ.