భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ` ఐఎస్‌ఎస్‌ నుంచి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణకు స్వస్తి పలుకుతున్నట్టుగా భారత కాలమానం ప్రకారం మార్చి 19, బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలో ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌కు చెందిన ‘క్రూ డ్రాగన్‌ ఫ్రీడమ్‌’ వ్యోమనౌక  సునీతా విలియమ్స్‌తో పాటుగా మరో ముగ్గురు వ్యోమగాములను అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని తలహస్సీ నగరంలో అట్లాంటిక్‌ సముద్ర తీర ప్రాంతానికి సురక్షితంగా చేర్చింది. ఆమెతో పాటుగా ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా డ్రాగన్‌ నుంచి వెలుపలకు వచ్చిన ఇతర వ్యోమగాములు నిక్‌ హేగ్‌, అలెగ్జాండర్‌, విల్మోర్‌ చిరునవ్వులు చిందిస్తూ విజయసంకేతంగా బొటనవేలును చూపించారు.


ఐఎస్‌ఎస్‌ నుంచి బయలుదేరిన డ్రాగన్‌ అట్లాంటిక్‌ సముద్ర జలాలకు 18 వేల అడుగుల ఎత్తులో ఉండగా డ్రాగన్‌కు చెందిన రెండు డ్రోగ్‌చూట్లు తెరుచు కున్నాయి. అప్పటికి డ్రాగన్‌ గంటకు 560 కి.మీ.ల వేగంతో సముద్రం వైపునకు వస్తోంది. డ్రోగ్‌చూట్లు విచ్చుకున్న కారణంగా వ్యోమనౌక వేగం గణనీయంగా తగ్గిపోయింది. ఆ తర్వాత దాని వేగం గంటకు 190 కి.మీ.లకు చేరుకునేసరికి డ్రాగన్‌ సముద్ర జలాలకు 6,500 అడుగుల ఎత్తులో ఉంది. సరిగ్గా అప్పుడే దాని వేగాన్ని మరింత తగ్గించడానికి అన్నట్టుగా రెండు పారాచూట్లు తెరుచుకున్నాయి. కాసేపటికి పునరుపయోగించే డ్రాగన్‌ వ్యోమనౌక నెమ్మదిగా సముద్ర జలాల్లోకి ఓ గాలి బుడగలా దిగి తేలియాడ సాగింది. ఆ సరికే డ్రాగన్‌ను మేగన్‌ నౌక మీదకు సురక్షితంగా చేర్చడానికి అవసరమైన సిబ్బందితో ఆ చుట్టుపక్కల మోహరించిన స్పీడ్‌ బోట్లలో ఒకటి వేగంగా నీటిని చీల్చుకుంటూ డ్రాగన్‌ దగ్గరకు చేరుకుంది. స్పీడ్‌ బోట్‌లో ఉన్న ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు పబ్లిక్‌ పార్కులో రాకెట్‌ను పోలిన జారుడు బల్లపైకి పిల్లలు లంఘించినట్టుగా వ్యోమనౌక మీదకు ఎగిరి దుమికాడు. డ్రాగన్‌ను తాళ్లతో బంధించి, దానిపైనే ఉండిపోయాడు. ఈ లోగా అప్పటికే అక్కడకు చేరుకున్న డాల్ఫిన్లు వ్యోమనౌక చుట్టూ తిరుగుతూ సముద్ర జలాల్లో గంతులు వేయసాగాయి. ఆ తర్వాత స్పీడ్‌ బోటు తోడు రాగా మేగన్‌ నౌకను చేరుకున్న డ్రాగన్‌ను నౌకకు అమర్చిన రెండు భుజాలను గుండ్రంగా కలిపినట్టుగా ఉన్న ఓ ఛట్రం మేగన్‌ మీద ఉన్న వృత్తాకారంలో ఉన్న మెత్తటి పరుపు మీదకు చేర్చింది. అనంతరం ఆ పరుపు పట్టాల మీదుగా డ్రాగన్‌ను నౌక మధ్య భాగంలోకి చేర్చింది. అక్కడ ఉన్న సిబ్బంది వ్యోమనౌకపైకి గొట్టాలతో నీళ్లను పోయడం ద్వారా దానిని శుద్ధి చేశారు. అదే సమయంలో సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత ఏ మాత్రం వేడి దాని మీద ఉన్నా కానీ అది ఈ జలాభి షేకంతో చల్లారిపోయింది. ఆ తర్వాత డ్రాగన్‌పైన ఉన్న చిన్నపాటి తలుపును తెరిచారు. సిబ్బందిలో ఒకరు లోపలకు వెళ్లారు. లోపల నలుగురు వ్యోమగాములు ప్రత్యేక దుస్తులతో, పక్కపక్కనే ఉన్న నాలుగు కుర్చీలో కూర్చొని మెలకువగా కనిపించారు.  అలా లోపలకు వెళ్లిన వ్యక్తి మొదటగా ఆ నలుగురు దగ్గర ఉన్న ట్యాబ్‌లను తీసుకొని లోపలి నుంచే బైట ఉన్న సిబ్బందికి అందించాడు. బైట ఉన్న సిబ్బంది ఆ తర్వాత తెరిచి ఉన్న తలుపునకు ఓ చెక్కబల్ల లాంటి దాన్ని చేర్చారు. అదే సమయానికి ఓ స్ట్రెచర్‌ను కూడా అక్కడికి తీసుకువచ్చారు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా నలుగురు వ్యోమగాములను డ్రాగన్‌ లోపలి నుంచి వెలుపలకు తీసుకొనివచ్చారు. వెలుపలకు వచ్చిన ఆ నలుగురు చిరునవ్వులు చిందించారు. అప్పటికే సిద్ధంగా ఓ హెలికాప్టర్‌ వారిని హూస్టన్‌లో నాసాకు చెందిన హూస్టన్‌ అంతరిక్ష కేంద్రానికి తరలించింది. ఆ విధంగా 286 రోజులు ఐఎస్‌ఎస్‌లో అనుకోకుండా ఉండిపోయిన సునీతా విలియమ్స్‌ రోదసి యాత్ర సుఖాంతమైంది.

భారత పుత్రికకు అభినందనల వెల్లువ

భూమి మీదకు క్షేమంగా తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్‌ పైన అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదే విషయమై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన ఓ సందేశంలో సునీతా విలియమ్స్‌ను ‘భారత పుత్రిక’ అని పిలిచారు. ఆమెతో పాటుగా మరో ముగ్గురు వ్యోమగాములను సురక్షితంగా భూమికి చేర్చడం వెనుక కృషి చేసిన యావత్‌ బృందానికి అభినందనలు తెలిపారు. ‘‘వారి చరిత్రాత్మక యాత్ర సంకల్పం, సంఘటిత శ్రమ, అసాధారణమైన సాహసం సమ్మిళితమైన ఓ వృత్తాంతం. వారి దృఢ సంకల్పానికి సెల్యూట్‌ చేస్తున్నాను. వారు ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యోమగాములకు స్వాగతం పలికారు. ప్రధాని ఎక్స్‌లో రాసుకొచ్చిన ఓ సందేశంలో ‘‘క్రూ 9కు సుస్వాగతం. ఈ ధరిత్రి మీరు లేని లోటును తట్టుకోలేకపోయింది. వారు ఎదుర్కొన్న పరీక్ష శౌర్యం, తెగింపు, హద్దుల్లేని మానవ స్ఫూర్తికి పరీక్ష. సునీతా విలియమ్స్‌, తదితర వ్యోమగాములు నిజమైన పట్టుదల అంటే ఏమిటో మరోసారి మనకు చూపించారు. అనంతమైన అజ్ఞాతాన్ని ఎదుర్కోవ డంలో అచంచలమైన వారి సంకల్పం కోట్లాది మందికి శాశ్వతంగా స్ఫూర్తిని ఇస్తుంది’’ అని ప్రధాని కొనియాడారు. ఇదే సందర్భంగా భారత్‌కు రావాల్సిం దిగా సునీతా విలియమ్స్‌కు మోది ఆహ్వానించారు.

సునీతా పూర్వికుల గ్రామంలో హరహర మహదేవ్‌

సునీతా విలయమ్స్‌ భూమి మీదకు సురక్షితంగా చేరుకున్నారనే వార్త గుజరాత్‌లోని మెప్‌ాసనా జిల్లాలోని ఆమె తండ్రి దీపక్‌ పాండ్యా పూర్వీకుల గ్రామం రaులసాన్‌లో సంబరాలు ఆకాశాన్ని అంటాయి. ఆ గ్రామ ప్రజలు ఆమె భూమికి తిరిగి వస్తున్నారనే వార్త తెలిసినప్పటి నుంచి ఆమె సురక్షితంగా చేరుకోవాలని ప్రార్థిస్తూ దేవాలయంలో గుమిగూడారు. యజ్ఞం నిర్వహించారు. అఖండ జ్యోతిని వెలిగించారు. గ్రామస్తులు టెలివిజన్‌పై సునీతా విలియమ్స్‌ భూమికి చేరుకున్న వైనాన్ని లైవ్‌లో చూడగానే బాణసంచా కాల్చారు. నాట్యం చేశారు. ‘హరహర మహదేవ్‌’ అంటూ లయకారుడైన మహాశివుడికి భజన చేశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సునీతా విలియమ్స్‌ ఫోటోతో ఊరేగింపు చేపట్టారు.

గగన్‌యాన్‌కు ఊతం

వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ఐఎస్‌ఎస్‌లో తొమ్మిది నెలలు ఉండి భద్రంగా తిరిగి భూమికి చేరుకోవడంతో భారత్‌ ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ మిషన్‌కు మద్దతు లభించినట్టయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ` ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ వీ నారాయణన్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘దీని నుంచి మనం రెండు పాఠాలు నేర్చుకోవాలి. ఒకటి ఈ రకమైన మిషన్‌ సాంకేతికంగా ఎంతగానో పురోగమించినది. ఇక రెండవది ఇది ఓ సవాల్‌తో కూడుకున్న మిషన్‌. అంతరిక్ష కార్యక్రమంలో అయితే విజయం లేదంటే ఓటమి ఉంటుంది. నూటికి 95 శాతం విజయం అనే అంచనా ఏ మాత్రమూ ఉండదు. సునీతా విలియమ్స్‌ భూమికి తిరిగి చేరుకోవడాన్ని మేం నిశితంగా పరిశీలించడానికి కారణం మేము కూడా అలాంటి ఓ మిషన్‌ (గగన్‌యాన్‌) చేపడుతున్నాం కాబట్టి’’ అని అన్నారు.

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ మిషన్‌ ఉద్దేశం ముగ్గురు వ్యోమగాములను వ్యోమనౌకలో భూమి నుంచి 400 కి.మీ.లపైన కక్ష్యలో మూడు రోజులు పరిభ్రమించేలా చేసి, వారిని తిరిగి భూమి మీదకు సురక్షితంగా తీసుకురావడం.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE