భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
కీచురాళ్ల అరుపులు తప్ప మరే సవ్వడి లేదక్కడ. నల్లని ఆకాశం కింద అంతా సమంగా పరుచుకున్న కటిక చీకటి. దడదడ కొట్టుకుంటున్న గుండె సవ్వడి ఒక్కటే ఆ భయంకర నిశ్శబ్దంలో పెద్దగా వినిపిస్తోంది.
పిల్లిలా తలుపు వెనుక నుంచి మెల్లగా తల కాస్త బయట పెట్టి,
కళ్లు చిట్లించి చూశాడతను. ఊపిరి తీస్తున్న శబ్ధం కూడా బయటకు రాకూడదు అని ప్రయత్నం చేస్తూ, కళ్లు చీకటికి అలవాటు పడేవరకు అలాగే చాలా సమయం నిలబడిపోయాడు.
ఒక్కొక్కటిగా బయట ఉన్నవి కళ్లకు ఆనవాలు తెలుస్తున్నాయి. వాడిమొనలు గల చిన్నచిన్న కర్రలు భూమిలో అడుగు పెట్టే ఖాళీ లేకుండా గట్టిగా పాతి ఉన్నాయి. ధైర్యం చిక్కపట్టి కాస్తా బయటకు వచ్చి చూశాడు. ఊహించినట్లే తాను దాక్కున్న ఆలయం చుట్టూ జానెడు కూడా ఖాళీ లేకుండా వాడిమొన కర్రలు ఉన్నాయి. అడుగువేస్తే పాదాలు తెగి, పడిపోవడం ఖాయం. పడిపోయిన శరీరాన్ని కసిగా రంధ్రాలు చేయడానికి, ప్రాణాలు తియ్యడానికి ఆ కర్రలు వేచి ఉన్నాయి అనిపించింది అతనికి.
నుదుటిన చెమట ధారలు కట్టసాగాయి. జరిగిన పరిణామాలు తలచుకుంటే వెన్నులో వణుకు పుట్టింది. భారతదేశాన్ని గడగడలాడించిన తనకే ప్రాణభయం కల్పించిన అతనిని తలచుకోగానే గుండె చప్పుడు ఎక్కువయ్యింది .
‘హే! భక్తియార్ ఖిల్జీ! నీకు ఎలాంటి దుస్థితి దాపురించింది?’ తనను తానే తిట్టుకున్నాడు. తలపట్టుకొని కూర్చున్నాడు చీకటిని చూస్తూ.
క్రీ.శ. 1206 కామరూప రాజ్యం.
‘‘ఆ నీచుడు అటు తిరిగి, ఇటు తిరిగి ఇప్పుడు మన రాజ్యం వైపు సుశిక్షితులైన పదివేల సైన్యంతో రాబోతున్నాడు’’ అని వేగుల సమాచారం.
ఆ మాట వినగానే భయం, ఆశ్చర్యాలతో మునిగిపోయిన తమ పరివారాన్ని చూస్తూ పెద్దగా నవ్వారు అందరూ ప్రేమగా ‘పృథు’ మహరాజ్ అని పిలుచుకొనే కామరూప ప్రభువు విశ్వ సుందర దేవ్.
తన తండ్రి వల్లభదేవ్ మరణానంతరం క్రీ.శ.1185లో సింహాసనం అధిరోహించారు పృథు మహరాజ్. సకల యుద్ధవిద్యలలో ఆరితేరినవారు, సమర వ్యూహారచనలో తనకు తానే సాటి. బుద్ధిబలం, కండబలం, సాహసం, పౌరుషం కలిసి ఒకే రూపు దాలిస్తే ఆ రూపం పేరే పృథు మహరాజ్. ప్రజలంటే పంచ ప్రాణాలు. హిందూ ధర్మం తన శ్వాస.
మహారాజు నవ్వును అందరూ ఆసక్తిగా చూశారు.
‘‘ఆ పరమ దుర్మార్గుడు మన రాజ్యం వైపు వస్తున్నాడు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎదురువెళ్లి స్వాగతం పలకాలని. రానివ్వండి. ధర్మ యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో…రుచి చూపిద్దాము’’
‘‘ప్రభూ! తమరు మాట్లాడుతున్నది నరరూప రాక్షసుడు, మతోన్మాది భక్తియార్ ఖిల్జీ గురించే కదా’’ ఎంత దాచుకున్నా స్వరంలో వణుకు దాగలేక పోయిందా పుర ప్రముఖునికి.
‘‘సరిగ్గా చెప్పారు. మతోన్మాది సరైన పదం ఆ నీచుడికి. విద్యాదానం చేస్తూ, జ్ఞానదీపాలను ప్రపంచమంతా వెలిగిస్తూ, మనదేశ ఖ్యాతి అయిన నలందా విశ్వవిద్యాలయ్యాన్ని నేలమట్టం చేశాడా పాపి. నిరంతరం శాంతి మంత్రం జపిస్తూ, సమాజహితం కోరే బౌద్ధ సన్యాసుల తలలను మత దురాభిమానంతో ముక్కలు ముక్కలుగా తెగనరికి పచ్చి నెత్తురు తాగిన నికృష్టుడు వాడు’’
అసంకల్పితంగా జారుతున్న కన్నీళ్లను తుడుచు కున్నారు పృథు మహరాజ్.
‘‘నలందాను నాశనం చేసింది దుందుడుకు చర్య కాదు. దాని వెనుక పెద్ద పన్నాగమే ఉంది. అది విశ్వవిద్యాలయాన్ని నేలమట్టం చెయ్యడం మాత్రమే కాదు’’
సభలో అందరూ ఆ దుర్ఘటనను తలచుకుంటూ మౌనంగా రోదించసాగారు.
‘‘విద్య లేకపోతే వృద్ధి, నాగరికత, క్రమశిక్షణా యుత సమాజమే లేదు. అందుకే ఆ అహంకారి సర్వ సైన్యంతో వెళ్లి నలందాను కనుమరుగు చేసి, రక్తపు ఏరులు పారించింది…భవిష్యత్తులో మరలా ఎవ్వరూ విద్యాలయాల స్థాపన కలలో కూడా తలవకూడదు అని’’
నలందా నాశనం వెనుక ఒక వినాశకర ఆలోచన తలచుకోగానే అందరికీ రక్తం ఉడికిపోయింది.
‘‘రెండు వత్సరాల క్రితం బెంగాలు నవద్వీప్‌పై దండయాత్ర చేశాడు ఖిల్జీ. పన్నెండు వేల గుర్రాలతో ఖిల్జీ దండయాత్రకు వస్తున్నాడు అని వినగానే పిరికి రాజు లక్ష్మణ సేన్ పారిపోవడం నాకిప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. తన రాజ్యాన్ని, తననే నమ్ముకున్న ప్రజలను, వారి ప్రాణమానాలను గాలికి వదిలేసి, కేవలం తనొక్కడి ప్రాణరక్షణ కోసం యుద్ధం చేయకుండా పారిపోవడం కన్నా, ప్రాణత్యాగం ఎంతో ఉన్నతమైనది’’
గాఢమైన నిశ్శబ్దం సభలో. మహారాజులు బాధాతప్త హృదయ పలుకులు వింటూ శిలలయ్యారు.
అప్పుడు వినబడింది ఒక ప్రశ్న పుర వాణిజ్య ప్రముఖుడి నుంచి.
‘‘ఆ భయంకర మృగం ఎటువైపు నుంచి మన రాజ్యం మీదకు వస్తోంది? మేము ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి మహారాజా?’’ గిడ్డంగుల్లో అధిక మొత్తాలలో నిల్వ ఉన్న తన సరుకులను తలచుకుంటూ అడిగాడు.
‘‘ఆ వివరాలన్నీ మన మంత్రివర్యులు వివరిస్తారు’’ చిరునవ్వుతో మంత్రివర్యులవైపు చూసారు పృథు మహరాజ్.
ఆసనంలో నుంచి లేచి, నిలబడి ప్రభువులకు ప్రణామాలు తెలిపి ‘‘ ఖిల్జీ టిబెట్ నుండి మన రాజ్యం వైపు వస్తున్నాడు.’’
ఆ మాటలు వినగానే సభలో కలకలం రేగింది. బిహారులో ఉన్న ఖిల్జీ టిబెట్ ఎప్పుడు వెళ్లాడు? మన రాజ్యం నుండే కదా టిబెట్‌కు దారి? ఇలా రాలేదు. మరి ఎలా వెళ్లి ఉంటాడు? అక్కడేం నరమేధం చేసాడో ?
సభికుల గుసగుసలు వింటున్న మంత్రివర్యులు చిరునవ్వుతూ కుడిచేతిని పైకి లేపడం చూసి, అందరూ మౌనం వహించారు.
‘‘అదే చెప్పబోతున్నా..’’ చెప్పడం ప్రారంభించారు.
* * *
‘‘యా అల్లా ! ఇటువైపు భారతదేశం మన గుప్పిట్లోనికి వచ్చింది. బెంగాల్, బీహార్‌లో మన పాలన కొనసాగుతుంది. ఇక నాకు మిగిలింది ఒకటే కోరిక.’’
కోరుకున్నదే తడవుగా సొంతం చేసుకొనే భక్తియార్ ఖిల్జీకి కూడా తీరని కోరికలు ఉంటాయా? చుట్టూ సేనానులు ఆశ్చర్యపడ్డారు.
వారి వదనాలను గమనిస్తూ ‘‘ప్రపంచానికి పైకప్పు అని చెప్పుకొనే ప్రదేశం ఒకటుంది. అక్కడ మనం కాలుపెడితే ప్రపంచం తలపై పాదం పెట్టి నిలబడినట్లే’’ అంటూ పెద్దగా నవ్వాడు.
‘‘టి.. బె.. ట్’’ అస్పష్టంగా గొణికాడు ఒక సేనాని.
‘‘అవును! అదే .. అదే.. టిబెట్ మన కాలికిందకి రావాలి. ఏర్పాట్లు గావించండి’’ హుకుం జారీ చేశాడు ఖిల్జీ.
‘‘మనకు టిబెట్ చేరడానికి సరైన మార్గదర్శి కావాలి. దారులు, కొండలు, అడవులు, నదులు అన్నింటి పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తి కావాలి. మరి..’’ సందేహం రేకెత్తాడు ఒకడు.
ఆసనంపై నుంచి లేచి వికటాట్టహాసం చేసాడు ఖిల్జీ.
‘‘మనము టిబెట్ చేరుకోవడానికి సులభమైన మార్గం కామరూప రాజ్యం వెంబడి బ్రహ్మపుత్ర నదీ తీరం. రేపే మన ప్రయాణం.. ప్రపంచశిఖపై కాలు పెట్టడానికి’’ మరోసారి గట్టిగా నవ్వాడు ఖిల్జీ.
పదివేలమంది సైనికులు, బలమైన అశ్వాలతో, మారణాయుధాలతో కామరూప రాజ్యం వైపు ప్రయాణం సాగించారు.
కామరూప సరిహద్దులో మకాం వేశాడు ఖిల్జీ. ఎటుచూసినా పరమత ధర్మం రాజ్యమేలుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తమకు దారి చూపాలి అంటే మనవాడై ఉండాలి. దూరాలోచన చేసిన ఖిల్జీ ఆ పరిసరాల్లో ఉన్న స్థానిక గిరిజన తెగ నాయకుడిని మచ్చిక చేసుకొని, ఎన్నో రకాలుగా బోధనలు చేసి, అతను ఇస్లాం మతం స్వీకరించి ‘‘అలీమెచ్’ గా రూపాంతరం చెందేలా చెయ్యడంలో సఫలం అయ్యాడు.
అలీకి టిబెట్ వరకు ఉన్న మార్గాలన్నీ కొట్టిన పిండి.
‘‘మా రాజ్యం వైపు నుండి వెళ్తే మనకు ఎదురుదాడి జరగవచ్చు, కాస్తా కష్టమైనా సిక్కిం కొండల గుండా ప్రయాణం చేస్తే ఎటువంటి నష్టం లేకుండా టిబెట్ చేరుకోవచ్చు.’’
అలీ సలహా అనుసరించి టిబెట్ చేరుకుంది బక్తియార్ ఖిల్జీ సైన్యం.
వెళ్లడం వెళ్లడమే గ్రామాలపై పడి ఇళ్లను తగులు బెట్టడం, దొరికిన వారిని దొరికినట్లు నరకసాగింది. స్త్రీలను దోచుకోవడం మొదలుపెట్టింది.
అయితే కాసేపటికే తేరుకున్న టిబెట్ సేనలు, స్థానిక గిరిజనులు తమదైన శైలిలో పోరు ప్రారంభిం చారు. మైదాన ప్రాంత పోరాటాలు తప్ప కొండలలో యుద్ధ అనుభవం లేకపోవడం ఖిల్జీసేనకు తీరని నష్టం కలిగించింది.
మంచుకొండల్లో అలవాటు లేని యుద్ధం, తెలియని వ్యూహాలు ఖిల్జీసేనను తికమకపెట్టాయి. కలవరపాటుకు గురైన ఖిల్జీకి అర్థమయ్యింది . కాలం గడిచేకొద్ది తమ సైన్యం ప్రాణాలు కోల్పోతుందని. ఇక్కడ గెలవడం అంత సులభం కాదని. మరోసారి చూసుకోవచ్చు అని వచ్చిన దారివైపు పారిపోసాగాడు సైన్యంతో సహా.
ఖిల్జీ పలాయనాన్ని ముందుగానే పసిగట్టిన టిబెట్ సేనలు ఆ దారిని మూసివేశాయి.
గతిలేని పరిస్థితుల్లో అలీ సూచన అనుసరించి కామరూప రాజ్యం వైపు ప్రయాణం సాగించాడు.
* * *
‘‘ఇదీ ఇప్పటివరకు జరిగినది. టిబెట్ పరాభవంతో కసిమీదున్న ఖిల్జీ మన రాజ్యాన్ని జయించి, ఇస్లాం పతాకం ఎగురవేయాలని ఆశ పడుతున్నాడు. అతను ఇప్పటివరకు ఎన్నో రాజ్యాలు జయించి ఉండవచ్చు. కానీ ఈ పృథు మహరాజ్ వ్యూహాల ముందు కుదేలు కాక తప్పదు.’’
అంతవరకు కనీవినీ ఎరుగని వ్యూహాన్ని వివరించాడు పృథు మహరాజ్.
‘‘మన రాజ్యం వైపు వస్తున్న ఖిల్జీ సేనకు ఎక్కడా ఆటంకం కలిగించవద్దు’’ వింటూనే మతిపోయింది సభకు. శత్రువును రాజ్యంలోనికి స్వాగతం పలకమని చెప్తున్నారా ప్రభువులు ? ఏమీ??
‘‘ఖిల్జీసేనను బ్రహ్మపుత్ర నది తీరం వెంబడివరకు వచ్చే వరకు ఎదురు చూడండి’’
…చెప్తూ అందరి వదనాలు చూసి చిరునవ్వుతూ ‘‘నాకు అర్థం అయ్యింది, ఆ దుష్టులు గ్రామాలను దోచుకుంటారు అనే కదా. ఖిల్జీసేన వచ్చే మార్గం వెంబడి ఉన్న ప్రతీ గ్రామాన్ని ఖాళీ చేయించండి. ఆహార ధాన్యాలను అక్కడ నుంచి తరలించండి. పశువులు, కోడి, మేకలతో సహా ఏ ఒక్కటి ఉండకూడదు. అలాగే అక్కడ ఉన్న జలవనరులను పాడు పెట్టండి. తాగేందుకు వీలులేకుండా, కనీసం ముఖ ప్రక్షాళనకు సైతం పనికిరాకుండా చెయ్యండి. వారిని అలాగే మన నిర్దేశిత ప్రాంతం వరకు రానివ్వండి’’
సభికులంతా ఊపిరి బిగబెట్టి విన్నారు పృథుమహరాజ్ అద్భుత వ్యూహాన్ని.
మరుక్షణం బృందాలుగా విడిపోయిన పృథు సైనికదళం ఆ గ్రామానికి ఖిల్జీసేన చేరుకొనే లోపలనే పృథు మహరాజ్ వ్యూహాన్ని అమలుచేయసాగింది.
కొన్ని రోజుల అనంతరం కామరూప సరిహద్దుకు చేరుకోగానే
‘‘వూ.. పదండి. టిబెట్‌లో మనకు జరిగిన దానికి ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవాలి. కనబడినవాడినల్లా కత్తితోనే పలకరించండి. ముసలీముతక, ఆడమగ, పిల్లాపీచు ఎవరినీ వదలొద్దు. మనమంటే ఏమిటో మరోసారి ప్రపంచానికి తెలియాలి’’ ఆజ్ఞ జారీచేశాడు ఖిల్జీ.
కత్తులు తిప్పుతూ గ్రామంలో అడుగుపెట్టిన సేన ఆశ్చర్యపోయింది. ఖాళీ అయిన గ్రామాన్ని చూసి. మంటలను గ్రామ ఇళ్లపై పరిచారు.
‘‘చూశారా ! మన ప్రతాపం తెలిసే గ్రామం ఖాళీ చేసి పారిపోయారు. ఇక మనకు తిరుగులేదు, కామరూప రాజ్యం మనదే’’ గుర్రంపై కూర్చొని గెడ్డం సవరించుకుంటూ గర్వంగా పలికాడు ఖిల్జీ.
కామరూప రాజ్యంలోనికి ప్రవేశిస్తున్న కొలది అర్థం అయ్యింది అతనికి అన్ని గ్రామాలు, ఆహార ధాన్యాలు ఖాళీ అని. తినడానికి తిండి లేక ఖిల్జీ సేన విలవిలాడిపోయింది. తాగుదామంటే గుక్కెడు నీళ్లు కూడా లేవు. ఆకలికి ఆగలేని సేన తమ గుర్రాలను చంపి, పచ్చిమాంసం తిని కడుపునింపుకునే వాళ్లు.
పడుతూ లేస్తూ కామరూప రాజధాని హద్దులకు చేరుకున్నారు. గోము నదిపై ఉన్న అతి పురాతన రాతివంతెన దాటి లోయలోనికి అడుగుపెట్టారు.
పృథుమహరాజ్ అప్పటికే స్థానిక బోడో, కోచ్ రాజ్ బాంగజీ, కోయోట్ తెగలను కూటమి చేసి, తనసేనతో కలిపి పోరుకు సిద్ధంగా ఉంటాడు.
ఎత్తైన గుట్టలు, చెట్లపై వేచిఉన్న పృథుసేన వెదురుబాణాలను ఒక్కసారిగా ఆకాశం నుండి దూసుకొస్తున్న చినుకుల్లా కురిపించింది. పల్లపు ప్రాంతంలో నిలబడిన ఖిల్జీసేనకు మతిపోయింది శత్రువు దాడి చూసి.
అప్పుడు అర్థం అయ్యింది ఖిల్జీకి ఎందుకు గ్రామాలు ఖాళీగా ఉన్నాయో. చాలా దూరం ప్రయాణింపజేసి, ఆహారం అందుబాటులో లేకంఉడా చేసి నిస్సత్తువ కలిగించడమే పృథు మహరాజ్ వ్యూహం అని గ్రహించి ఒక్కసారిగా భీతిల్లాడు.
ఒక్కసారిగా కడలి అలలా విరుచుకుపడి, అవతలవారిని అయోమయంలోనికి నెట్టడమే తెలిసిన తమకు అదే వ్యూహంతో హడలు పుట్టిస్తున్న పృథు మహారాజ్ పేరు తలచుకోవడానికే భయపడ్డాడు.
ఎటునుంచి రివ్వున బాణాలు దూసుకొని వస్తున్నాయో తెలిసే లోపలే, ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.గాయాలైన గుర్రాలు చిందులు తొక్కుతూ తమ రౌతునే పడవేసి, కుమ్మేస్తున్నాయి. చూస్తూండగానే సగం సైన్యం హతమవడం చూసి, తన గుర్రాన్ని వేగంగా పురాతన వంతెన వైపు దౌడు తీయించాడు ప్రాణ భీతితో. అతని వెనుకనే ఖిల్జీ సేనకూడ.
పురాతన రాళ్ల వంతెన దాటి, కామరూప సరిహద్దులు దాటి ప్రాణాలను దక్కించుకోవాలి అనుకున్న ఖిల్జీ వంతెన దగ్గరకు చేరుకోగానే ఒక్కసారిగా తుళ్లిపడ్డాడు.
అంతకు ముందు ఉన్న వంతెన సమూలంగా పడగొట్టేసి ఉంది. తాము పారిపోయే వీలులేకుండా తన రాజ్య వంతెనను తానే నాశనం చేసిన పృథు మహరాజ్ ఆలోచనను తలచుకోగానే వెన్నులో వణుకుపుట్టింది ఖిల్జీకి.
ఇంతలో పృథు మహరాజ్ సైన్యం మూడువైపుల నుంచి చుట్టి ముట్టి చక్ర బంధం చేసింది. ఒకపక్క చూస్తే వడివడిగా పరుగులుతీస్తూ భీతి గొల్పుతున్న బ్రహ్మపుత్రా నది. ఇటుచూస్తే ప్రాణాలను తృణంగా భావించే పృథుసేన. ఉక్కిరి బిక్కిరి అయ్యింది ఖిల్జీ సైన్యం.
ఎత్తిన కత్తిని దించకుండా ఖిల్జీసేన తలలు తెగనరుకుతున్న పృథు మహరాజ్‌ను చూడటానికి ఎవరికీ ధైర్యం సరిపడలేదు. మహరాజ్ సైన్యం వెదురు బాణాలతో, కత్తులతో శత్రువులను ఖండ ఖండాలుగా తెగ నరుకుతుంది. పరిస్థితి చూస్తున్న ఖిల్జీసేనకు ఉన్న ధైర్యం కూడా జారిపోయింది.
తెగించి కొంతమంది నదిలోనికి దూకేశారు. సుడులు తిరుగున్న నీటికి బలయ్యారు. తన మిగిలి ఉన్న ఉన్న సైన్యంతో నదీతీరం వెంబడి పరుగులు తీశాడు ఖిల్జీ. కానీ పంతం వదలని మహారాజ్ సేన తరిమితరిమి కొట్టింది. దొరికిన వాడికి పరుగులు తీసి, అలసిపోయే అవకాశం ఇవ్వకుండా పరలోకం వైపు దారి చూపిస్తోంది.
ప్రాణభయంతో, ఒళ్లంతా స్వేదం చిందుస్తూ పరుగులు తీసున్న ఖిల్జీకి ఎదురుగా కనబడింది మదన కామదేవ ఆలయం. ఒక్కసారిగా శక్తి ప్రవేశించింది ఖిల్జీలో.
హిందూధర్మ పాలకుడైన పృథు మహరాజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయంలో మారణ కాండ చేయడని,ఆయుధంతో ఆలయంలోనికి ప్రవేశించడని తెలిసిన ఖిల్జీ దేవాలయంలోనికి ప్రవేశించి, తలుపులు మూసుకున్నాడు.
ఖిల్జీ పన్నాగం కనిపెట్టిన పృథు ఆలయం చుట్టూ వాడి మొనగల వెదురు కర్రలను ప్రతీ అంగుళానికి పాతి పెట్టాడు.
ఆలోచనలో నుంచి బయటపడి చుట్టూ చూశాడు ఖిల్జీ. ఎక్కడా సవ్వడి లేదు. ఆకలి, నీరసం ప్రాణాలు తోడేస్తున్నాయి. మెల్లగా ఆలయ కుడ్యాలను పట్టుకొని, వెదురు బెదురు నుండి బయటపడి, బ్రతుకుజీవుడా అనుకుంటూ పరుగులు తీశాడు.
దారిలో బతికి బట్టకట్టిన తన మిగిలిన సైన్యం వంద మందిని కలిశాడు. అందరూ కలిసి, కాళ్లకు బుద్ధిచెప్తూ పరుగులు తీశారు. కాలప్రవాహంలో అవమానభారంతో బతుకుతూ దయనీయమైన చావు చచ్చాడు ఖిల్జీ.
ఈశాన్య భారతం పరమత అధీనంలోనికి వెళ్లకుండా ఎవరికి అందని వ్యూహాలు అమలు పరిచి, అత్యుత్తమ పోరు సలిపి, నరరూప రాక్షకుడికే ప్రాణ భయం కలిగించిన పృథు మహరాజ్ సదా చిరస్మర ణీయుడు.
(కామరూప రాజ్యం అంటే ఇప్పటి అస్సాం, ఒక్కప్పటి ప్రాగ్ జ్యోతిషం. ఉత్తర గౌహతిలోని కన్హే బోరోక్సి బోయాక్సిల్ శిలాశాసనం ప్రకారం మార్చి 28వ తేదీని పృథు మహరాజ్ విజయాన్ని పురస్క రించుకొని ‘మహా విజయ్ దివస్’ జరుపుకుంటున్నాం)
– జి.వి. శ్రీనివాస్