ఉత్తరప్రదేశ్‌లో ఒక పట్టణం బర్సానా. భారతదేశంలో చాలా పట్టణాలకి ఉన్నట్టే బర్సానాకీ ఒక ప్రత్యేకత ఉంది. పైగా ఆ ఖ్యాతి విశ్వవ్యాప్తం. ఎందుకంటే అక్కడ ప్రత్యేకంగా జరిగే హోలీ. హోలీ దేశమంతటా జరుపుకుంటారు. కానీ ఈ హోలీ ప్రత్యేకం. అందుకే ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. లాఠ్‌మార్ హోలీ అంటారు. ఇక్కడ లాఠీ, బడిత పూజలో ఉపయోగించే లాఠీయే. అలాంటి లాఠీలతో కొడతారు- పురుషులని స్త్రీలు. అయితే సుతి మెత్తగానే సుమండి! ఇదే ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నది. హిందూ పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసంలో పున్నమి రోజున హోలీ జరుపుకుంటారు. ఎన్ని రంగులు ఆ పండుగను అలంకరిస్తాయో, అన్ని ఛాయలు కూడా దానికి ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిన జరుపుతారు. వీటన్నిటినీ కలిపి ఇక్కడ బ్రజ్ మండల్ హోలీ ఉత్సవాలని పిలుచుకుంటారు. మధుర, బృందావనం, బర్సానా, నందగావ్‌లో ఇంకాస్త జోరుగా సాగుతుంది. బర్సానాలో ఈ పండుగ ఇంకాస్త వైవిధ్యంగా జరుపుతారు. రాసియా పేరుతో కొన్ని జానపద గీతాలు కూడా ఆలపిస్తారు. ఈ పాటలలో రాధాకృష్ణుల సంవాదం ఉంటుంది. ఇక్కడ మహిళల చేత బడిత పూజ చేయించుకునే పురుష పుంగవులంతా నందగావ్‌కు చెందినవారే. వీళ్లు బర్సానా వచ్చి అక్కడి రాధారాణి ఆలయం దగ్గర జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాన్ని ఆపడానికి అన్నట్టు బర్సానా మహిళలు కర్రలతో సుతారంగా వడ్డిస్తూ ఉంటారు. ఇంకొందరు రంగులతో వారిని ముంచెత్తుతూ ఉంటారు. అలాగే మగవాళ్లు స్త్రీవేషధారణలో నృత్యం చేసే దాకా కూడా బడిత పూజ కొనసాగుతుంది. అది కూడా ఇందులో భాగమే.
అయితే అప్పుడు పురుషులు కిక్కురుమనకుండా ఉండాల్సిందే. ఇక్కడ నందగావ్ ప్రత్యేకత ఏమిటీ అంటే, దానిని కృష్ణుడి గ్రామంగా విశ్వసిస్తారు. అంటే నందగావ్ నుంచి బడిత పూజ చేయడానికి బర్సానాకు ఆహ్వానిస్తారన్నమాట. బర్సానాలోనే లాడ్లీజీ మహరాజ్ ఆలయం ఉంది. ఇక్కడ హోలీలో మరొక ముచ్చట కనిపిస్తుంది. దాని పేరు లడ్డు మార్. అంటే లడ్డులతో కొట్టుకోవడం. రంగులు, లడ్డుల యుద్ధంతో పసందుగా ఉంటుందన్న మాట. ఇంతకీ బ్రజ్, బర్సానాలలో వసంత పంచమికే హోలీ సంబరాలు మొదలైపోతాయి. నలభయ్ రోజుల పాటు జరుగుతాయి. ఆఖరిగా లాఠ్‌మార్, లడ్డూమార్ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏమైనా ఒక్కసారైనా బర్సానా వెళ్లిరావాల్సిందే.