అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం – ఐఎస్‌ఎస్‌ భూమిని ఆవరించి ఉన్న కక్ష్యలో పరిభ్రమించే అతిపెద్ద అంతరిక్ష వాహనం. ఇది వ్యోమగాములు, అంతరిక్ష యాత్రికులకు ఓ ఇల్లు. ఐఎస్‌ఎస్‌ ఓ అద్వితీయమైన ప్రయోగశాల. దీనిని అనేక దేశాలు కలసికట్టుగా పనిచేసి నిర్మించాయి. వ్యోమగాములు రోదసీలోనే విడివిడిగా ఉన్న భాగాలన్నింటినీ కలపడం ద్వారా ఐఎస్‌ఎస్‌కు రూపకల్పన చేశారు. ఇది భూమికి దాదాపు 402.336 కి.మీ.ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. గంటకు 28,163.52 కి.మీ.ల వేగంతో తిరుగుతుంది. దానర్థం అది ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. అమెరికా సమాఖ్య ప్రభుత్వానికి చెందిన ఓ స్వతంత్ర ఏజెన్సీ నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ – నాసా రోదసిలో మనుషుల జీవనాన్ని, పనితీరును తెలుసుకునేందుకు దీనిని వినియోగిస్తోంది. ఇలా తెలుసుకున్న విషయాలు భవిష్యత్తులో మానవులను కనీవినీ ఎరుగని రీతిలో  రోదసీలోకి పంపించడాన్ని సుసాధ్యం చేస్తుంది.

ఐఎస్‌ఎస్‌కు ఎన్నేళ్లు?

ఐఎస్‌ఎస్‌ తొలి భాగానికి అంకురార్పణ నవంబరు, 1998లో జరిగింది. రష్యాకు చెందిన ఓ రాకెట్‌ రష్యన్‌ జార్యా అనే నియంత్రణ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపించింది. అమెరికా దేశానికి చెందిన ఎండీవర్‌ అనే రోదసీ నౌక రెండు వారాల తర్వాత జార్యాను కక్ష్యలో కలుసుకుంది. అంతరిక్ష సిబ్బంది యూనిటీ నోడ్‌ను జార్యాతో జోడిరచారు. తర్వాతి రెండేళ్లలో ఐఎస్‌ఎస్‌ కోసమని మరిన్ని భాగాలను జోడిరచారు. మొట్టమొదటగా ఐఎస్‌ఎస్‌ సిబ్బంది నవంబర్‌ 2, 2000లో చేరుకున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ మరిన్ని భాగాల జోడిరపుతో నిర్మాణం కొనసాగింది. నాసా, ప్రపంచమంతటా ఉన్న దాని భాగస్వాములు 2011 నాటికి అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేశాయి.

ఫుట్‌బాల్‌ స్టేడియం సైజులో

ఐఎస్‌ఎస్‌ పరిమాణంలో ఓ ఐదు పడక గదుల ఇల్లు లేదా రెండు బోయింగ్‌ 747 జెట్‌లైనర్లు అంత ఉంటుంది. ఇందులో ఆరుగురికి చోటు ఉంటుంది. అదే ఐఎస్‌ఎస్‌ను భూమి మీద తూచినప్పుడు దాని బరువు 45,359.237 కిలోలు లేదా 45.359 టన్నులు  ఉంటుంది. దీనికి బిగించిన సౌర ఫలకాల అమరిక అంచుల నుంచి కొలిచినప్పుడు అది ఓ ఫుట్‌బాల్‌ స్టేడియం అంత ఉంటుంది. ఇదంతా అమెరికా, రష్యా, జపాన్‌, ఐరోపా దేశాలు పంపించిన ప్రయోగశాల మాడ్యూల్స్‌ను కలుపుకొని వేసిన లెక్కలు.

పని చేస్తుందిలా..

ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములు శాస్త్రీయ పరిశోధన చేసుకోవడానికి ఉపకరించే ప్రయోగశాలలకు తోడు అనేక ఇతర విభాగాలు ఉంటాయి. రష్యా ప్రప్రథమంగా పంపించిన మౌలిక వ్యవస్థలతో కూడిన మాడ్యూళ్లు ఇది పనిచేయడానికి ఎంతగానో అవసరపడతాయి. అవి మానవులు బస చేయడానికి చోటును కూడా సమకూరుస్తాయి. నోడ్స్‌ అని పిలిచే మాడ్యూళ్లు దీనిలో విభాగాలను ఒకదానితో మరొకదాన్ని అనుసంధానం చేస్తాయి. ఐఎస్‌ఎస్‌ తన రెక్కలను చాపుతున్న ట్టుగా సౌర ఫలకాలు ఉంటాయి. ఇవి దీనికి విద్యుచ్ఛక్తి కోసమని సూర్యుడి నుంచి సౌర శక్తిని సేకరిస్తాయి. సౌర ఫలకాలు లంగోటీని పోలిన ట్రుస్‌ అనే పొడవైన దాని ఆధారంగా  ఐఎస్‌ఎస్‌కు  అనుసంధానమై ఉంటాయి. ట్రుస్‌ పైన అమర్చిన రేడియేటర్లు దీనిలో ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి.

ఐఎస్‌ఎస్‌కు ఆనుకొని వెలుపలి వైపు రోబొటిక్‌ బాహువులు బిగించి ఉంటాయి. ఇవి రోదసి కేంద్రం నిర్మాణంలో ఎంతగానో సాయపడటమే కాకుండా వ్యోమగాములు అందులో నుంచి వెలుపలకు వచ్చి శూన్యంలో నడుస్తున్నప్పుడు వారికి వెన్నుదన్నుగా ఉంటాయి. రోదసి యాత్రికులు వెలుపలకు తెరుచుకునే ఎయిర్‌లాక్స్‌ గుండా బైటకు వచ్చి అంతరిక్షంలో నడుస్తుంటారు. డాకింగ్‌ పోర్టులు ఇతర వ్యోమనౌకలను ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కావడానికి అనుమతిస్తాయి.  ఈ పోర్టుల ద్వారానే కొత్త రోదసి యాత్రికులు, సందర్శకులు ఇక్కడికి చేరుకుంటారు. వారు భూమి నుంచి ఐఎస్‌ఎస్‌కు చేరుకోవడంలో రష్యన్‌ సోయుజ్‌ సేవలందిస్తుంది. రష్యన్‌ సోయుజ్‌కు చెందిన రోబోటిక్‌ వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌కు అవసరమైన వస్తువులను డాకింగ్‌ పోర్టుల ద్వారా సరఫరా చేస్తుంది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన అంతరిక్ష నౌకలు కూడా ఇలాంటి పనిలోనే ఉంటాయి.

వెండితో నీటి శుద్ధి!

భూమి నుంచి ఐఎస్‌ఎస్‌కు దేన్నయినా రవాణా చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఉదాహరణకు ఒక గ్యాలన్‌ నీరు అంటే 3.78 లీటర్ల నీటిని ఐఎస్‌ఎస్‌కు చేర్చాలంటే 83,000 డాలర్ల ఖర్చవుతుంది. అందులో నలుగురు వ్యోమగాములు ఉంటారు. వారిలో ఒక్కొక్కరికి తాగడానికి, తదితర అవసరాలకు రోజుకు 12 గ్యాలన్ల నీరు కావాలి. అంత నీరు పంపించాలంటే  నాసాకు ఖర్చు తడిసి మోపెడంత అవుతుంది. అందుకని ఐఎస్‌ఎస్‌ అందుబాటులో ఉన్న ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టే ఓ సంమిశ్రమైన నీటి వ్యవస్థను కలిగి ఉంటుంది. అది పునరుపయోగించే స్నానపు నీరు, అంతకు ముందు ఉండిపోయిన వ్యోమగామి చెమట, మూత్రం, తదితరాలను శుద్ధి చేసిన తర్వాత వచ్చే తాగు నీటిని వ్యోమగాములకు సమకూరుస్తుంది. ఐఎస్‌ఎస్‌  అదే సమయంలో అత్యవసరం కోసమని దాదాపు 530 గ్యాలన్ల నీటిని సైతం నిల్వ ఉంచి పెడుతుంది. నాసా నీటి వ్యవస్థలు ఐఎస్‌ఎస్‌లో నీటి ఎద్దడి లేకుండా  మనుషుల నుంచి, పరిశోధన కోసమని తెచ్చిన జంతువుల శ్వాస నుంచి తేమ, చెమట, మూత్రం, నీటి సింకుల నుంచి వాడగా వచ్చిన నీరు, స్నానపు నీటిని సేకరిస్తుంటాయి. ఇదే విషయమై ఐఎస్‌ఎస్‌ నీటి వ్యవస్థను అలబామాలో మార్షల్‌ ఫ్లయిట్‌ సెంటర్‌ నుంచి నిర్వహించే లేనె కార్టర్‌ మాట్లాడుతూ ‘‘మీరు అది మూత్రాన్ని శుద్ధి చేయగా వచ్చిన నీరు అని అనుకోనంతవరకు అచ్చం మన దగ్గర బాటిల్‌లో దొరికే నీటిలాగే మంచి రుచిగా ఉంటుంది’’ అని అన్నారు. అలాగని అక్కడున్న వ్యోమగాములందరూ మూత్రాన్ని శుద్ధి చేయగా వచ్చిన నీటిని తాగుతారు అని అనుకుంటే పొరపాటే. ఐఎస్‌ఎస్‌లో రెండుగా ఉన్న నీటి వ్యవస్థల్లో ఒకటి అమెరికాది ఐతే మరొకటి రష్యాది. అమెరికా నీటిలో ఎలాంటి మలినాలు లేకుండా ఉండటానికి అయోడిన్‌ వాడుతుంటే రష్యా మాత్రం అయోడిన్‌కు బదులుగా వెండి లోహాన్ని వినియోగిస్తుంటుంది.

ఊపిరాడేదెలా?

భూమికి దాదాపు 400 కి.మీ.ల ఎత్తున ఉన్న ఐఎస్‌ఎస్‌లో ఉన్న మనుషులకు ఊపిరాడటానికి ఎలక్ట్రోలిసిస్‌ – విద్యుద్విచ్ఛేదనం అనే ప్రక్రియ పనికొస్తుంది. ఇది ఆక్సిజన్‌ను తయారు చేస్తుంది. ఇందుకోసమని ఆక్సిజన్‌ ఉత్పాదక వ్యవస్థ – ఓజీఎస్‌ ఐఎస్‌ఎస్‌లో ఉంటుంది. ఇది నీటిని ఎలక్ట్రోలైజ్‌ చేయడం ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇలా ఉత్పత్తి ఐన ఆక్సిజన్‌ను ఐఎస్‌ఎస్‌ కేబిన్‌లలోకి పంపిస్తారు. ఓజీఎస్‌ పర్యావరణ నియంత్రణ, జీవ మద్దతు వ్యవస్థ – ఈసీఎల్‌ఎస్‌ఎస్‌లో ఓ భాగంగా పనిచేస్తుంటుంది. ఈసీఎల్‌ఎస్‌ఎస్‌లో ఓజీఎస్‌తో పాటుగా నీటిని తిరిగి సేకరించే వ్యవస్థ`డబ్ల్యూ ఆర్‌ఎస్‌ ఉంటుంది. ఓజీఎస్‌, డబ్ల్యూఆర్‌ఎస్‌ ఈ రెండూ కూడా కాడెద్దుల్లా కలిసికట్టుగా పనిచేస్తుంటాయి.

ట్యూబుల్లో ఆహారం నుంచి సమోసాల దాకా..!

మానవుడు రోదసిలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో అంటే 1961లో తన ఆకలి తీర్చుకోవడానికి చిన్నపాటి అల్యూమినియం గొట్టాల నుంచి లేహ్యం లాంటి ఆహారాన్ని తినేవాడు. దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ పెరుగుతున్న టెక్నాలజీకి తోడు ఇంటి దగ్గర ఏవైతే తింటున్నారో దాదాపు అలాంటి ఆహారాన్ని అంతరిక్షంలో వ్యోమగాములు ఇష్టంగా తినే మంచి రోజులు వచ్చేశాయి. రోదసిలో ఐఎస్‌ఎస్‌ ఆవిర్భ వించిన కొద్ది రోజులకే అందులో బస చేసిన వారికి మన పుల్కాలను పోలిన టోర్టిల్లాలను రుచి చేసే భాగ్యం దక్కింది. టోర్టిల్లా అప్పటి నుంచి ఇప్పటివరకు ఐఎస్‌ఎస్‌కు ఎంతో మంది యాత్రికులు వస్తూపోతున్న ప్పటికీ అందరికీ ఇష్టమైన ఆహారంగా నిలిచి పోయింది. టోర్టిల్లాతో ఉన్న సౌలభ్యం ఏమిటంటే దీనితో అల్పాహారం, హామ్‌బుర్గర్‌లు, జెల్లీ సాండ్‌ విచ్‌లు చేసుకోవచ్చు. ఆ తర్వాతి కాలంలో పిజ్జాలు, కాయగూరలు, పండ్లు, ఐస్‌క్రీమ్‌ ఐఎస్‌ఎస్‌ తలుపు తట్టాయి.వ్యోమగాముల జిహ్వ చాపల్యాన్ని తీర్చాయి. భారతీయ మూలాలు ఉన్న సునీతా విలియమ్స్‌ ఓ అడుగు ముందుకు వేసి ఐఎస్‌ఎస్‌కు సమోసాను పరిచయం చేశారు. ఆమె ఒకానొక సందర్భంలో అంతరిక్ష నౌకలో శుభ్రంగా వంట చేసుకొని తిన్నారు. ఐఎస్‌ఎస్‌లో రానున్న రోజుల్లో మూడో విజిల్‌ రాగానే పప్పు, అన్నం పెట్టిన కుక్కర్‌ కట్టేయ్‌ అంటూ ప్రయోగ శాలలో ఉన్న ఓ వ్యోమగామి మరో వ్యోమగామిని పురమాయించినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.

మానవసహిత రోదసి యాత్రలకు పుట్టినిల్లు

మానవులు నిత్యం రోదసీలో ఉండటాన్ని ఐఎస్‌ఎస్‌ సుసాధ్యం చేసింది.  ఇది తన కార్యకలాపా లను ప్రారంభించుకున్న నాటి నుంచి మనుష్యులు నిత్యం అందులో ఉంటూనే వస్తున్నారు. వ్యోమగా ములు దీంట్లో ఉన్న ప్రయోగశాలలను ఉపయోగించు కుంటూ భూప్రపంచంలో కానీ మరెక్కడ కానీ చేయలేని పరిశోధన చేస్తున్నారు. ఈ పరిశోధన భూమిపైన మానవాళికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. అలా అంతరిక్షంలో చేస్తున్న పరిశోధనను మన దైనందిన జీవనంలో సైతం వినియోగించుకుంటున్నాం. పరిశోధన ఫలితాలను ‘స్పినోఫ్స్‌’ అంటారు. అంటే అనుత్పాదకతలు అని అర్థం. మానవులు మైక్రో గ్రావిటీ `సూక్ష్మ గురుత్వాక్షరణ నెలకొన్న పరిస్థితుల్లో ఎక్కువ కాలం ఉన్నప్పుడు వారి దేహానికి ఏమౌతుందనే దానిపైన కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తుంటారు. నాసా, దాని భాగస్వామ్య దేశాలు ఒక అంతరిక్ష నౌకను ఆరోగ్యంగా ఎలా ఉంచేదీ నేర్చుకున్నాయి. ఇలా నేర్చుకున్న పాఠాలన్నీ కూడా భవిష్యత్తులో అంతరిక్షంలో చేపట్టే శోధనలకు కీలకమౌతాయి. నాసా ప్రస్తుతం ఇతర ప్రపంచాలను కనుక్కోవడానికి పనికొచ్చే ఓ ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. అంతరిక్షంలో ఐఎస్‌ఎస్‌ ఏర్పాటుతో ఆ కసరత్తుకు దశాబ్దాల క్రితమే తొలి అడుగు పడిరది. నాసా ఐఎస్‌ఎస్‌ నుంచి నేర్చుకున్న పాఠాలను రోదసిలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో దూరతీరాలకు చేరుకునే మానవసహిత యాత్రలను చేపట్టడానికి వాడుకుంటుంది.


సునీతా విలియమ్స్‌లా కావాలంటే…

ఎవరైనా అంతరిక్షంలో స్పేస్‌వాకర్‌గా ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్న సునీతా విలియమ్స్‌ లాగా వ్యోమగామి కావాలనుకుంటే అలాంటివారికి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో మంచి బ్యాక్‌గ్రౌండ్‌ ఉండాలి. సునీతా విలియమ్స్‌ యూఎస్‌ నావల్‌ అకాడమీ నుంచి ఫిజికల్‌ సైన్స్‌లో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత ఆమె ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసారు. అమెరికాలో నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ – నాసా, స్పేస్‌ఎక్స్‌ తరహాలో మనదేశంలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో వ్యోమగాములను, శాస్త్రవేత్తలను తయారుచేస్తుంటుంది. వారి ద్వారా రోదసిలో పరిశోధనలను చేయిస్తుంటుంది. ఇస్రోలో చేరాలని ఆశించేవారు ఏరోనాటిక్స్‌, ఆస్ట్రో ఫిజిక్స్‌, ఏరోస్పేస్‌, ఫిజిక్స్‌, మ్యాథమేటిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కెమిస్ట్రీ లేదా బయాలజీలో ఇంజనీరింగ్‌ లేదా సాధారణ డిగ్రీ చేసి ఉండాలి. అదే ఇస్రోలో ఉన్నత హోదాల కోసమైతే ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ లేదా ఆస్ట్రోఫిజిక్స్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసి ఉండాలి. భారత్‌లో ఆస్ట్రోనాట్‌ ప్రోగ్రామ్‌లకు ప్రవేశాలు ప్రతిభ, ప్రవేశ పరీక్షల ద్వారా జరుగుతాయి. అందుకోసమని సీపీజీయీటీ, ఐఐటీ జేఏఎం, జీఏటీయీ లాంటి ప్రధానమైన ప్రవేశపరీక్షలు ఉన్నాయి. భారత్‌లో స్పేస్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లో ఉత్తమ ఇన్‌స్టిట్యూట్‌లుగా ఐఐటీ-మద్రాస్‌, ఐఐటీ-బాంబే, ఐఐటీ-కాన్పూర్‌, ఐఐటీ-ఖరగ్‌పూర్‌, ఐఐటీ-హైదరాబాద్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) – ఢిల్లీ పేరొందాయి.

 –  జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE