భారత్‌లో తీవ్రమైన పేదరికం రేటు 1 శాతం దిగువకు పడిపోయిందని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. ఆర్థికవేత్తలు సుర్జీత్ ఎస్ భల్లా, కరణ్ భాసిన్ 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఇంటింటికీ అయిన ఖర్చుపై – హెచ్‌సీయీఎస్ ఆధారంగా చేపట్టిన అధ్యయనం భారత్ తీవ్రమైన పేదరికాన్ని విజయవంతంగా నిర్మూలించిందని, గడచిన దశాబ్ద కాలంలో పేదరిక స్థాయులు గణనీయంగా పడిపోయాయని వెల్లడించింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో దేశ జనాభాలో దారిద్య్ర రేఖకు దిగువ ఉన్నవారు 12.2 శాతం కాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి అది కాస్త 1 శాతానికి తగ్గింది. గడిచిన 12 ఏళ్లలో దేశంలో ఆర్థిక అసమానత తగ్గిపోయింది. 2011-12లో 37.5 శాతంగా ఉన్న ఆర్థిక అసమానత 2023-24కు వచ్చేసరికి 29.1 శాతంగా ఉంది.
ఇటీవలి కాంలో పేదల్లో కొనుగోలు శక్తి పెరిగింది. పేదలు 2022-23, 2023-24 సంవతర్సాల్లో ఆహారంపై చేసే ఖర్చు 10.7 శాతం పెరిగింది. అదే కాలానికి గృహోపకరణాలకు చేసే ఖర్చు 24.2 శాతం పెరిగింది. మొత్తంగా పేదలు సగటును ఓ నెలకు చేసే వ్యయం 11.9 శాతం పెరిగింది.
భారత్‌లో పేద కుటుంబాలు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెరిగిన ఆదాయాలు, దేశ ఆర్థిక వృద్ధి తోడ్పడ్డాయి. ఇవన్నీ చూశాక అందరూ అనుకుంటున్న ట్టుగా భారత్‌లో పేదరికం ఇప్పటికీ ఉందనే ఓ నమ్మకం వీగిపోయింది. తీవ్రమైన పేదరికాన్ని దాదాపుగా తుడిచిపెట్టడం ద్వారా అభివృద్ధి చెందుతున్న అతి కొద్ది దేశాలు మాత్రమే సాధించగలిగే ఘనతను భారత్ ఇట్టే సాధించేసింది.
ప్రస్తుతం భారత్‌లో పేదరికాన్ని అంచనా వేయడంలో పాత లెక్కలు ప్రాతిపదికగా టెండూల్కర్ దారిద్య్ర రేఖ (వ్యక్తి నెలసరి ఆదాయం రూ.870), రంగరాజన్ దారిద్య్ర రేఖ(వ్యక్తి నెలసరి ఆదాయం రూ.1,098)ను వినియోగిస్తున్నారు. అయితే అధ్యయనం చేపట్టినవారు ఐరోపాలో మధ్యస్థ ఆదాయంలో 60 శాతంగా పేదరికాన్ని నిర్వచించిన తరహాలో భారత్‌లో దారిద్య్ర రేఖను సవరించాలని ప్రతిపాదించారు. దీన్నే కనుక భారత్‌లో వినియోగించిన పక్షంలో దేశ జనాభాలో 16.5 శాతం పేదల కిందకు వస్తారు. మరో పద్ధతిలో సగటు ఆదాయంలో 50 శాతాన్ని పరిగణనలోకి తీసుకున్న పక్షంలో దేశంలో 24.7 శాతం ప్రజలు దారిద్య్ర రేఖ దిగువకు వస్తారు. భారత్‌లో వృద్ధి చెందిన ఆర్థిక స్థితిని ప్రతిబింబించేలా దారిద్య్ర రేఖను సవరించాల్సిన అవసరం ఉందని అధ్యయనకారులు తెలిపారు.
