యూట్యూబ్‌లో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ కార్యక్రమంలో పాడ్‌కాస్టర్ రణ్‌వీర్ అల్హాబాదియా ఇటీవల చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సామే రైనా, అల్హాబాదియాలపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విషయం సుప్రీం కోర్టు దాకా వెళ్లడం తాజా పరిణామం. నిజానికి ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ కార్యక్రమంలో గతంలో వీరిద్దరూ అసభ్యతకు, వివాదానికి మధ్యన అడ్డుగా ఉన్న రేఖను కూడా చెరిపేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి యూట్యూబ్‌లో ప్రసారమైన షార్ట్ క్లిప్‌లో అల్హాబాదియా చేసిన అసభ్యత, అశ్లీలతతో కూడిన మాటలు నెటిజన్లలో ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. వీరిద్దరితో పాటు ప్యానల్‌కు సంబంధించిన ఇతరులపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.
2024 జూన్ నెలలో రైనా ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ‘అసభ్య హాస్యం’తో కూడిన ఎటువంటి సెన్సార్ చేయని కార్యక్రమం ఇది. టీవీ రియాల్టీ షో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ దీనికి స్ఫూర్తి. ఈ కార్యక్రమంలో రైనాతో సహా న్యాయనిర్ణేతలతో కూడిన ప్యానల్ ఉంటుంది. వీరు అడిగే ప్రశ్నలకు పోటీలో పాల్గొనేవారు సమాధానాలివ్వాలి. ఇక్కడ మరొకరితో పోటీపడే కంటే, తన గురించి తనకు ఎంత తెలుసన్న అంశం ప్రాతిపదికగానే ప్రశ్నలు అడుగుతుంటారు. ఇది అమెరికన్ కామెడీ పాడ్‌కాస్ట్ ‘కిల్ టోనీ’ కార్యక్రమం మాదిరిగా ఉంటుంది. అమెరికన్ కమేడియన్ టోనీ హించ్‌క్లిఫ్ దీన్ని నిర్వహిస్తాడు. అంతేకాదు అల్హా బాదియా అడిగిన ప్రశ్న తరహాలోనే ఆస్ట్రేలియాలో నిర్వహించే పాపులర్ షో ‘‘ఓజీ క్రూస్ ట్రూత్ ఆర్ డ్రింక్’’లో కూడా పోటీదారుని అడిగారు. ఆస్ట్రేలి యాలో దీన్ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకో లేదు. కానీ మనదేశంలో పెను దుమారం రేపడం చూస్తున్నాం. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ మొదటి ఎపిసోడ్ ఏడునెలల క్రితం ప్రసారమైంది. దీనికి ఊహించని రీతిలో వ్యూయర్‌షిప్ రావడంతో నిర్వాహకుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ కార్యక్రమానికి కనీస వ్యూస్ 20 మిలియన్లు కాగా గరిష్ట వ్యూస్ 40 మిలియన్లుగా తేలింది. ఈ షో విజయవంతం కావడంతో రైనా ‘ఇండియాస్ గాట్ లేటెంట్ యాప్‌ను కూడా ప్రారంభిం చాడు. ఇందులో కూడా ఏవిధమైన సెన్సార్ లేకుండా యథేచ్ఛగా కంటెంట్ అప్‌లోడ్ చేస్తూ వస్తున్నాడు.
వివాదం మొదలు
ఫిబ్రవరి 9న ప్రసారమైన ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ కార్యక్రమంలో రణవీర్ అల్హాబాదియా ఒక పోటీదారుని వివాదాస్పద ప్రశ్న అడిగాడు (ఇది రాయడానికి వీల్లేని భాషలో ఉంది). అంతేకాదు తాను చెప్పినట్టు చేస్తే రూ.2 కోట్లు ఇస్తానని కూడా అన్నాడు. వీక్షకులు ఊహించని ప్రశ్న ఇది. ఇంతటి జగుప్సాకరమైన ప్రశ్నతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు రణవీర్ అల్హాబాదియా, రైనా, అశీష్ ఛంచ్‌లానీ, జస్‌ప్రీత్‌సింగ్, అపూర్వ మఖీజాలపై దేశంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ షో ద్వారా అశ్లీలతను, అసభ్యతను ప్రోత్సహిస్తున్నారనేది ఈ కేసుల సారాంశం. సంప్రదాయం, సమాజం కూడా నిషేధించిన లైంగిక సంబంధాలను ప్రోత్సహిస్తు న్నాడని కూడా ఆరోపణ. అస్సాం ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వశర్మ దీన్ని విమర్శిస్తూ ట్వీట్ చేసిన తర్వాత మొట్టమొదటి కేసు గౌహతి పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది. దీనిపై బాంబే హైకోర్టు న్యాయమూర్తులు అశీష్ రాయ్, పంకజ్ మిశ్రాలు స్పందిస్తూ ఈ షోలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫాల్సెంకర్, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు లేఖలు రాశారు. తాజాగా సుప్రీంకోర్టు కలుగజేసుకొని అల్హాబాదియాను సోషల్ మీడియాలో కంటెంట్‌ను పోస్ట్ చేయకుండా నిషేధించింది. సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్ భారతీయ న్యాయ సంహిత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఈ వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ కార్యకర్త నీలోత్పల్ మృణాల్ పాండే ముంబయి ఖర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చివరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దీనిపై స్పందిస్తూ ‘‘ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్య్రం ఉంది. కానీ ఇది మరొకరి స్వేచ్ఛలోకి ప్రవేశించకూడదు. ఎవరైనా ఈవిషయంలో పరిమితులు దాటితే చర్యలు తప్పవు’ అని హెచ్చరించే దాకా వెళ్లింది.
ఎవరీ సామే రైనా?
సామే రైనా భారత్‌లో స్టాండప్ కమేడియన్. ముఖ్యంగా ఇతడి అభ్యంతరకరమైన వ్యంగ్య హాస్యశైలి యూట్యూబ్‌లో విపరీతమైన ఫాలోవర్లను తెచ్చిపెట్టింది. ఇతడు కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందినవాడు. తన 16వ ఏట నుంచి యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తూ వస్తున్నాడు. పూణెలోని పీవీజీ కళాశాలలో ప్రింట్ ఇంజినీరింగ్ కోర్సులో చేరాడు. కానీ కోర్సును మధ్యలో వదిలేసి మైక్ పట్టుకొని ఈవెంట్స్ నిర్వహించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా తన మొట్టమొదటి ‘వ్యంగ్య హాస్య’ మైక్ ఈవెంట్ 2017 ఆగస్టులో నిర్వహించాడు. తర్వాతికాలంలో అనిర్భాన్ దాస్‌గుప్తా, అభిషేక్ ఉపమన్యు వంటి కమేడియన్లకు కూడా తన షోల్లో అవకాశం ఇచ్చాడు. కామిక్‌స్థాన్ స్టాండప్ కంటెస్ట్ రెండో సీజన్‌లో తన సహచర పోటీదారైన ఆకాశ్ గుప్తాతో కలిసి విజేతగా నిలవడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.
రైనా కొవిడ్-19 సమయంలో తన యూట్యూబ్ ఛానల్‌లో చెస్ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. యూట్యూబర్ అంటానియో రాడిక్ (అగడ్‌మాటర్), భారతీయ గ్రాండ్ మాస్టర్ విదిత్ గుజరాతీ, ప్రసిద్ధ చెస్ క్రీడాకారులు విశ్వనాథన్ ఆనంద్, అనిష్ గిరి, తైమూర్ రాజ్‌బోవ్, చెస్ క్రీడలో దిగ్గజాలైన మాగ్నస్ కార్ల్‌సన్, వ్లాదిముర్ క్రామ్నిక్, జూడిట్ పోల్గార్ వంటి వారి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చాడు. తర్వాత కమెడియన్ ఆన్ బోర్డ్ (సీఓబీ) సిరీస్ పేరుతో ఎన్నో ఆన్‌లైన్ చెస్ పోటీలు నిర్వహించాడు. 2021లో చెస్.కామ్ నిర్వహించిన ‘బోడ్జ్ బుల్లెట్ ఇన్విటేషనల్’ పోటీలో ఏకంగా 10వేల డాలర్లు గెలుచుకున్నాడు. రైనా ఛెస్‌బేస్ ఇండియా, నాడ్విన్ గేమింగ్‌ల సమన్వయంతో ‘చెస్ సూపర్ లీగ్’ను కూడా నెలకొల్పాడు. భారతీయ, విదేశీ క్రీడాకారులు ఇందులో పాల్గొనేవారు. ఈ గేమ్‌లో విజేతకు ప్రైజ్ మనీగా రూ.40లక్షలు చెల్లించేవారు. రైనాకు యూట్యూబ్‌లో 7.4 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరుమిలియన్ల ఫాలోవర్లు వున్నారు.
అల్హాబాదియా క్షమాపణ
అల్హాబాదియాకు యూట్యూబ్‌లో 4.5 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.05కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. షోలో అతడు వేసిన ప్రశ్న ఇంతటి దుమారం రేపడంతో క్షమాపణలు చెప్పాడు. ‘ఇండియాస్ గాట్ లేటెంట్ ’ షోలో నేనావిధంగా మాట్లాడి ఉండాల్సింది కాదు. నిజంగా అది చాలా అసంబద్ధం. నేను మాట్లాడింది ఫన్నీగా కూడా లేదు. సారీ చెబుతున్నా’ అంటూ వీడియో సందేశం పోస్ట్ చేశాడు. రైనా కూడా క్షమాపణ చెప్పాడు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఇందులోని వివాదాస్పద భాగాలను తొలగించడం తాజా పరిణామం. అల్హా బాదియా గతంలో బాలీవుడ్ ప్రముఖులు, మంత్రులు, క్రికెట్ ప్రముఖులు, హాలీవుడ్ నటులను ఇంటర్వ్యూ చేశాడు. గత ఏడాది ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ‘నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ ట్రోఫీ’ అందుకు న్నాడు. ఇంతటి స్థాయికి ఎదిగిన వ్యక్తి, సోషల్ మీడియా వేదికపై ఇంతటి ‘అనుచిత, అసభ్య, అశ్లీలమైన’ ప్రశ్నను ఎట్లా అడగగలిగాడన్నది అసలైన ప్రశ్న. కేవలం వ్యూయర్‌షిప్ కోసం, ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదు. వాక్‌స్వాతంత్య్రం ఉంది కదాని నోటికొచ్చినట్టు మాట్లాడ•టం ఎంతవరకు సమంజసం?
అల్హాబాదియా సమర్థకులు
ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అపర్ గుప్తా, రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ తరఫు సభ్యుడు సాకేత్ గోఖలే వంటివారు అల్హాబాదియాకు మద్దతుగా నిలబడటం విచిత్రం. అల్హాబాదియాపై చర్యలు తీసుకోవడమంటే వాక్‌స్వాతంత్య్రాన్ని హరించడమేనంటూ వీరు వాదించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ‘‘అభ్యంతరకర మాటలంటే వాటిని విమర్శించండి తప్పులేదు. కానీ మీ నైతిక భావోద్వేగాలు దెబ్బతింటున్నాయన్న నెపంతో వ్యక్తులను పూర్తిగా మాట్లాడకుండా చేయడం తప్పు’’ అంటూ వీరు పోస్ట్‌లు పెట్టారు. అసలు ఇతరుల భావోద్వేగాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ ఉండదన్న సత్యం వీరికి తెలియదా? ప్రముఖ కమేడియన్ వీర్‌దాస్ కూడా ఈ వివాదానికి ఏకపక్షంగా విపరీత ప్రచారం కల్పించారంటూ న్యూస్ ఛానల్స్‌పై విరుచుకుపడ్డారు.
బలహీనతలపై దాడి
నిజానికి ఈ షోకు సంబంధించి గత కొన్ని ఎపిసోడ్లలో పోటీదారులు, తీర్పరులు స్త్రీలపై అశ్లీల వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. అప్పుడే విమర్శకు లు ఈ అసభ్యకర వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ షో అశ్లీలతను, అసభ్యతను ప్రోత్సహిస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఒకసారి ఒక పురుష పోటీదారు ప్రముఖ ఫ్యాషన్ ఇన్‌ఫ్లూయన్సర్‌ను, శృంగార చిత్రాల తారతో పోలుస్తూ ‘మీకు ఎంత మంది మగవారితో సంబంధాలున్నాయి’ అని ప్రశ్నించడంతో బిక్కచచ్చి పోయిన ఆమె అప్పటిక ప్పుడే షో నుంచి నిష్క్రమిం చారు. తమలోని బలహీనతలను రెచ్చగొట్టే అంశాలకు బాగా ఆకర్షితులు కావడం మానవుల నైజం. దీన్ని ఆసరాగా చేసుకొని వ్యూయర్‌షిప్ పెంచుకోవడానికి చెత్త జోకులు, అసభ్య పదజాల ప్రయోగంతో రెచ్చిపోవడం సభ్యసమాజం హర్షించదనేది ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షో ఉదంతం స్పష్టం చేసింది. ప్రముఖ చలనచిత్ర రూపకర్త పరోమిత వోహ్రా ‘‘పురుషాహంకారంతో చేసే వ్యాఖ్యలు, అసభ్య కరమైన మాటలు అలా చేసిన వారిలో అంతర్లీనంగా ఉండే హింసాత్మక ప్రవృత్తికి నిదర్శనం. ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహిస్తే, అది బెడిసికొట్టి మిమ్మల్నే దెబ్బతీస్తుంది’’ అంటూ చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యం. అఖిల భారతీయ సినీ కార్మికుల సమాఖ్య సైతం ‘ఇండియా గాట్ లేటెంట్’ షోను నిషేధించాలని డిమాండ్ చేసింది.
అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. సమాజం నైతికం అని భావించే అంశాలపై వివాదా స్పద వ్యాఖ్యలు చేస్తే ఫలితం ఇట్లాగే ఉంటుంది. మానవుల్లోని సహజ బలహీనతలు కొన్ని సమాజం అంగీకరించేవిగా ఉండవు. కానీ అటువంటి బలహీన తలను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించి వ్యూయర్‌షిప్ పెంచుకోవడానికి షో నిర్వాహకులు చేసే యత్నాలు ఎన్నటికీ స
మర్థనీయం కాదు. విభిన్న సంస్కృతులున్న మనదేశ సమాజానికి నైతిక విలువలే గట్టి పునాది. ఈ పునాదిని దెబ్బతీసే విధంగా రూపొందించే ఎటువంటి కార్యక్రమాలు లేదా చర్యలను దేశంలోని అన్ని వ్యవస్థలు ముక్త కంఠంతో ఖండిస్తాయి. అవసరమైన చర్యలు తీసుకుంటాయి. ఇప్పుడు ఈ వివాదం నేపథ్యంలో డిజిటల్ కంటెంట్‌పై మరింత కఠినమైన చట్టాలను అమల్లోకి తేవాలని పార్లమెంటరీ ప్యానల్ ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో సుప్రీం కోర్టు కూడా ఆన్‌లైన్ కంటెంట్‌పై మరింత నియంత్రణ ఉండాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు అపూర్వ అరోరా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్‌సీటీ ఆఫ్ ఢిల్లీ (2024) కేసులో…అసలు ఉపయోగించిన భాషలోని సభ్యత కంటే, అందులోని కంటెంట్ అశ్లీలత, అసభ్యత, లైంగిక కోర్కెలను ప్రకోపించేదిగా ఉన్నదా అన్న అంశంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం గమనార్హం.
డిజిటల్ సెన్సార్‌షిప్
ఇండియాస్ గాట్ లేటెంట్ ఎపిసోడ్ వివాదంతో డిజిటల్ కంటెంట్‌పై సెన్సార్‌షిప్ విధించాలన్న వాదన మళ్లీ మొదలైంది. డిజిటల్ సెన్సార్‌షిప్ కిందికి అభ్యంతరకరమైన వెబ్‌సైట్లు, యాప్‌లను బ్లాక్ చేయడం, అభ్యంతరకర సోషల్ మీడియా కంటెంట్‌ను తొలగించడం, ఓటీటీ (ఓవర్ ది టాప్) స్ట్రీమింగ్ వేదికలపై నియంత్రణ, డిజిటల్ వార్తలు, జర్నలిజంపై పరిమితులు విధించడం వంటివి వస్తాయి.
డిజిటల్ సెన్సార్‌షిప్ ద్వారానే సామాజిక సామరస్యతను దెబ్బతీసే రీతిలో తప్పుడు వార్తలు, విద్వేషపూరిత కంటెంట్‌ను నివారించడం, భారత్‌లో పరిఢవిల్లుతున్న విభిన్న సంస్కృతుల నేపథ్యంలో సాంస్కృతిక భావోద్వేగాల పరిరక్షణ, సైబర్ బెదిరింపులు, ప్రైవసీ అతిక్రమణ, ఆన్‌లైన్ వేధింపులకు చెక్ పెట్టడం, చిన్నపిల్లలకు అనవసరమైన కంటెంట్ విషయంలో నియంత్రణ విధించడం వంటి చర్యల ద్వారా చిన్నపిల్లల భద్రతకు హామీ కల్పించడం వంటివి సాధ్యమవుతుందనేది పలువురి అభిప్రాయం.
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు
* వాక్‌స్వాతంత్య్రపు హక్కు (అధికరణ 19(1)(ఎ): అధికరణ 19(2) ద్వారా వాక్ స్వాతంత్య్రానికి కొన్ని సహేతుక పరిమితుల విధింపు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు సభ్యత, నైతికత, ప్రజల జీవన భద్రతను దృష్టిలో ఉంచుకోవాలి.
* ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (2000): ప్రజల జీవన భద్రత, ఇతరత్రా భద్రతా కారణాల రీత్యా ఇందులోని 69ఎ సెక్షన్ కింద ప్రభుత్వం ఆన్‌లైన్ కంటెంట్‌ను బ్లాక్ చేయవచ్చు.
* ఇంటర్‌మీడియరీ గైడ్‌లైన్స్ & డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్, 2021: సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ న్యూస్ మీడియాను ఇది నియంత్రిస్తుంది.
* సెల్ఫ్ రెగ్యులేషన్ బై ఓటీటీ ప్లాట్‌ఫామ్స్: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలు డిజిటల్ పబ్లిషర్స్ కంటెంట్ గ్రీవెన్సెస్ కౌన్సిల్ (డీపీసీజీసీ) వంటి స్వీయ నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకున్నాయి.
* సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 (అమెండ్‌మెంట్స్ ఫర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్): స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు కూడా సినిమాలకు మాదిరిగానే సెన్సార్ నిబం ధనలు విధించడానికి చేపట్టాల్సిన సవరణలపై చర్చలు జరిగాయి.
* ప్రెస్ & రిజిస్ట్రేషన్ అండ్ పీరియాడికల్స్ బిల్, 2023: డిజిటల్ వార్తల వేదికల నియంత్రణ, ఎడిటోరియల్ జవాబుదారీతనం ఉండాలని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది.
ఇతర దేశాల్లో…
ఇక ప్రపంచ దేశాలను పరిశీలిస్తే చైనాలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కఠినమైన నియంత్రణ అమల్లో వుంది. యూరోపియన్ యూనియన్ దేశాలు డిజిటల్ సర్వీస్ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చాయి. అయితే కంటెంట్‌పై ఈ చట్టం పరిమిత నియంత్రణ విధిస్తుంది. అమెరికా దేశం ఆయా ప్లాట్‌ఫామ్‌లు స్వీయ నియంత్రణ పాటించడానికే ప్రాధాన్యతనిస్తోంది. ఇక్కడ కఠిన నియంత్రణ అమలు చేయడం వల్ల సృజనాత్మకత దెబ్బతింటోంది. పరిమిత నియంత్రణ అమల్లో ఉన్న దేశాల్లో ‘పరిమిత నియంత్రణ’ అనేదానికి స్పష్టమైన నిర్వచనం లేదు. ఫలితంగా ఈ చట్టం దుర్విని యోగం అయ్యే అవకాశాలు ఎక్కువ. మనదేశానికి వస్తే చాలా ప్లాట్‌ఫామ్స్ విదేశాల్లో ఉంటాయి కనుక వాటిపై మన ప్రభుత్వానికి నియంత్రణ ఉండక పోవడం ప్రధాన సమస్య. డిజిటల్ మీడియా ఎప్పటిక ప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగి స్తుండటం వల్ల వీటికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నిబంధనలు కూడా మారుస్తుండాలి. ఇది కష్టసాధ్యం.
అమ్మాయిల చేత అసభ్య పదజాలం పలికించడం, శరీరంలో ప్రతి చోటా తాకుతూ ఉన్న దృశ్యాలు చూపడం ఇటీవల తెలుగు సామాజిక మాధ్యమాలలో కూడా వేలం వెర్రిగా వస్తున్నాయి. దీనితో ఆ షార్టస్ చేస్తున్నవారికి, నిర్మిస్తున్నవారికి కూడా లక్షలలో డబ్బు ముడుతున్నదని చెబుతున్నారు. మొత్తంగా ఒక సమాజం నైతిక స్థాయినీ, యువత బుద్ధినీ పెడతోవ పట్టిస్తూ, అవహేళన చేస్తూ సాగే ఈ కార్యక్రమాలు, వీడియోలు ఈ దేశానికి అవసరమా? దీని మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోగలిగినప్పటికీ తీసుకోవడం లేదన్న విమర్శ ఉంది. అది దారుణం. అంతకంతకూ వాక్ స్వాతంత్య్రానికీ, బూతు మాటలకూ మధ్య తేడా లేని విధంగా మీడియా తయారవుతున్నది.
జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్