ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరిస్తున్న డేటాయిజమ్ మానవ మనుగడకు ఓ సరికొత్త సవాల్‌ను విసిరింది. ఓపెన్ ఏఐ, డీప్‌సీక్ మధ్య నడుస్తున్న ప్రచ్ఛన్నయుద్ధం, ఈ ఏడాది ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ప్యారిస్‌లో కృత్రిమ మేథ – ఏఐపై తీసుకోవాల్సిన చర్యపై అసంపూర్తిగా ముగిసిన సదస్సు ఏఐను సహేతుకంగా వినియోగించు కోవడంలో అత్యవసరంగా ఓ ఏకాభిప్రాయాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకతను చెప్పకనే చెప్పాయి. ఇక్కడితో ఆధునిక సాంకేతిక పురోగతులను ఆమోదించే ధోరణికి స్వస్తి పకాలి.
మానవ జీవితంపై ఏఐ దుష్ప్రభావాలను గురిచి లోతైన, ఆలోచనాపూర్వకమైన చర్చలు జరగాలి. అమెరికా అభివృద్ధి చేసిన ఓపెన్ ఏఐ కావొచ్చు చైనాకు చెందిన డీప్‌సీక్ కావొచ్చు.. ఇలాంటి ఏఐ వేదికలు వాటి సొంత దేశాల భావజాలానికి తగ్గట్టుగా కంటెంట్‌ను అందిస్తున్న వైనాన్ని వాటి వినియోగదారులు ఇప్పటికే రుచి చూశారు.
ఇక్కడ ఉదాహరణకు వికీపీడియాను చెప్పుకోవచ్చు. అది తనను తాను ఎవరైనా సవరించే ఉచిత విజ్ఞాన సర్వస్వం అని చెప్పుకుంటుంది. కానీ అది ఏకపక్షంగా ఉంటుంది. తనను ఆడించేవారి చేతుల్లో ఓ కీలుబొమ్మ. ఏఐ వేదికల విషయానికి వస్తే అవి తమదైన ఏకపక్ష భావజాలాన్ని జనబాహుళ్యంలోకి తీసుకొస్తాయి. చివరకు ఆ ఏకపక్ష భావజాలమే ఓ ప్రామాణికమౌతోంది. ఈ పక్రియలో వినియోగదారులు పొందేది మనుష్యుల చేతుల్లోని యంత్రం ద్వారా ధ్రువీకృతమైన ఓ ‘కృత్రిమ నిజం’. నిజానికి ఓ బొమ్మ లేదా ఓ వీడియో రూపంలో నిర్మితమైన డీప్ ఫేక్ నుంచి ఎలాంటి సవాల్, సంక్షోభం ఉండదు. అసలైన సంక్షోభం పుట్టుకొచ్చేది అంతర్గతంగా నిర్మితమైన ఏకపక్ష భావజాలాల పునాదుపై కృత్రిమ నిజం కట్టుబడి నుంచే.
ఈ డేటా కేంద్రీత జీవనం, నియంత్రిత మేథ నుంచి వచ్చే మరో సమస్య అది కొత్త రూపాల్లో పుట్టించే గుత్తాధిపత్యాలు. డేటా అనేది ఇప్పటికే వలసరాజ్య స్థాపన పక్రియకు సరికొత్త ఉపకరణమైంది. సాంకేతిక చోదక మేథపై అర్థం లేకుండా ఆధారపడటమనేది మానవ మేథకు ఆత్మహత్యా సదృశం. ఐనప్పటికీ ఇప్పటికీ అన్ని దేశాలు అదే దానిపై బుర్ర లేకుండా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రస్తుతం నైతిక ఏఐ అనే సరికొత్త వాదన చలామణీలోకి వచ్చింది. అది ఇతర దేశాలకు ఉన్న పోటీతత్వంతో కూడుకున్న మూలాధార ఏఐ నమూనాలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని తోసిరాజంటోంది. అభివృద్ధి చెందిన దేశాలుగా పిలిపించుకునే దేశాలు ఓ వైపు అందరికీ అందుబాటులో టెక్నాలజీని తీసుకురావడంపై అభయం ఇస్తూనే మరోవైపు ప్రపంచం నుంచి అడ్డూ అదుపూ లేకుండా లాభాలు పిండుకునే పనిలోపడి ద్వంద్వ వైఖరిని పాటిస్తున్నాయి. ఇది వలసరాజ్య స్థాపనకు సరికొత్త రూపం తప్ప మరొకటి కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు (గ్లోబల్ సౌత్) తప్పకుండా ఏకం కావాలి. ఏఐ అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలి. దానిని మానవాళి మేలు కోసం వాడుకోవాలి. నిరభ్యంతరంగా వాడుకునేలా ఉచిత డేటాను సమకూర్చని పక్షంలో ఏఐ మూలాధార వేదికలు పనికిమాలినవిగా మిగిలిపోతాయి.
నేటి ప్రపంచంలో రాజ్య సార్వభౌమత్వం అనే మాట అనేక సవాళ్లను ఎదుర్కుంటోంది. సోషల్ మీడియా వేదికలు, అంతర్జాతీయ ఎన్జీవోలు ఇప్పటికే దురుద్దేశాలతో ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటూ దుర్వినియోగమౌతున్నాయి. ఏఐ సాంకేతికత మొబైల్ ఫోన్ల ద్వారా అర్థంపర్ధం లేకుండా విస్తరిస్తోంది. అది సార్వభౌమ న్యాయ నియంత్రణలతో కూడుకున్న ప్రజాస్వామ్య తావుల పరిరక్షణకు పెను సవాల్‌గా పరిణమిస్తోంది.
మానవ వివేకము, భావోద్వేగాలు అతి పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయి. మానవ జీవితాల్లో అన్ని పార్శ్వాలు అంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణాలతో యంత్రాలకు కృత్రిమంగా శిక్షణ ఇవ్వొచ్చు. కానీ అలా శిక్షణ పొందిన యంత్రాలు మానవ భావోద్వేగాలు, సంబంధాలను భర్తీ చేయగలవా? అని అడిగితే ప్రస్తుతానికి లేదనే సమాధానం వస్తోంది. భారతీయ తత్వంపై నమ్మకం పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్యారిస్ సదస్సులో మానవ మేథపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఆధ్యాత్మికత, సైన్సు విశ్వజనీనమైనవి. అవి ఒకే నాణేనికి బొమ్మా బొరుసూ లాంటివి. అవి ప్రకృతికి అతీతంగా కాకుండా ప్రకృతికి లోబడి జీవనయానం సాగించడానికి ఉద్దేశించినవి. డేటా వక్రీకరణ, గుత్తాధిపత్యం ఆధారిత సరికొత్త ప్రచ్ఛన్నయుద్ధంలో కృత్రిమ మేథ మానవత్వాన్ని కబళించివేస్తుంది. ఈ పరిణామాత్మక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఉన్న ఏకైక దారి భారతీయ తత్వచింతనతో కూడుకున్న ఆధ్యాత్మిక సాంకేతికత.
ముంచుకొస్తున్న ఏఐ పోటీ కోసం భారత్ తనంతటతానుగా తయారు కావాలి. అదే సమయంలో మన ఆధ్యాత్మిక చాతుర్యం జ్ఞానాన్ని ఏకీకృతం చేయడంలో ఓ చుక్కాని కావాలి. అది సాంకేతిక పురోగమనానికి మానవ వివేకాన్ని జోడిస్తుంది.