1906 డిసెంబరులో కలకత్తాలో దాదాబాయ్ నౌరోజీ అధ్యక్షతన జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు ‘‘వందేమాతరం’’ జాతీయగీతంగా అంగీకారమైంది. ఇది స్వాతంత్రోద్యమంలో ఓ ముఖ్యఘట్టం. ప్రజల్లో దేశాభిమానం, స్వాతంత్రేచ్ఛ రగులుకుంది. కవులు చారిత్రక నాటకాలు రాసిందీ కాలంలోనే. తెలుగు కవులు భారతాదిక కథలను గ్రహించి, వాటిల్లో పాత్రలను వీరరస ప్రధానంగా తీర్చిదిద్దారు. రసపుత్ర చారిత్రకాంశాలను తీసుకొని స్వదేశాభిమాన దీక్షను చిత్రించారు. అలాంటివారిలో కోలాచలం శ్రీనివాసరావు ఒకరు.
‘‘తాళికోట యుద్ధంలో పరాజయం పొందిన హిందూ రాజులు విజయనగరాన్ని కోల్పోయారు. అదే యుద్ధంలో రామరాజు తల నరికినవాడు, అతడి సేనాధిపతుల్లోని ఒక మహమ్మదీయుడు’’ అని ఒక చరిత్రకారుడు రాశాడు. కోలాచలం శ్రీనివాసరావు దీని ఆధారంగా ‘రామరాజు చరిత్ర (కర్ణాటక రాజ్య నాశనం)’ అనే నాటకాన్ని రాశారు. ఈ నాటకాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చింది బళ్లారి రాఘవా చారి. శ్రీనివాసరావు చారిత్రక నాటకాలు రాయటం వెనుక కారణాన్ని వివరిస్తూ ‘‘ఒక రచయితకు పౌరాణిక కథలను నాటకాలుగా మలచడం పెద్ద కష్టమేమీ కాదు. సామాన్యప్రజలకు చరిత్ర గురించి పెద్దగా తెలియదు. కనుక వారికి చరిత్రను తెలియపరచడం కోసమని చారిత్రకాంశాలతో నాటకాలను రాశాను’’ అని అన్నారు. (పేజీ. 265).
విషాదభరితమైన సారంగధర నాటకం కథ విషయానికి వస్తే, భానుమతీ-విమలాదిత్యుల పుత్రుడు రాజరాజ నరేంద్రుడు. ఇతడి రాజధాని రాజమహేంద్రవరం. ఇతడు వేంగి దేశపురాజు. రాజరాజ నరేంద్రుడి పెద్ద కొడుకు సారంగధరుడు. ఇతడు శాంతస్వభావుడు. తన పినతల్లి వల్ల వచ్చిన ఆపదను దాటుకొని ‘‘చొరంగి’’ అనే సిద్ధుడిగా మారాడు. దీన్ని ఆంధ్రనాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు తెలుగు కథగా మార్చారు. సారంగధర కథను పోలిన కథలు గ్రీకు రోమన్ సాహిత్యంలోనూ ఉన్నాయి.
మరో ప్రసిద్ధ నాటక కర్త శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి రాసిన నాటకాలన్నింటిలో ఎక్కువ పేరు తెచ్చుకున్న నాటకం ‘‘బొబ్బిలి యుద్ధము’’ (1908). దీనిలో రంగారాయుడు కథానాయకుడు. కాని అతడి మరణంతో నాటకం ముగుస్తుంది. వేదం వెంకట రాయశాస్త్రి ఇదే నాటకాన్ని 1916లో రాశారు. ఈ నాటకానికి తెలుగు రాష్ట్రాలలో మంచి ఆదరణ దక్కింది.
కొప్పరపు సుబ్బారావు ప్రాచ్య పాశ్చాత్య నాటక రచనా విధానవేత్త. సుబ్బారావు తన తొలి రచన ‘‘రోషనారా’’ను ఇంగ్లీషులో రాసి విదేశాల్లో ప్రదర్శిం చటం విశేషం. ఆయన విదేశాల్లో నివసించే అల్ప సంఖ్యాక భారతీయులకు అత్యంత సన్నిహితులుగా, సోదరభావంతో మెలిగేవారు. సుబ్బారావు స్వదేశానికి తిరిగి వచ్చాక రోషనారా నాటకాన్ని తెలుగులో రాశారు. రోషనారా మొగలాయి చక్రవర్తి ఔరంగజేబు చెల్లెలు. ఈమె శివాజీకి చిక్కింది. ఆమె ఛత్రపతిని గాఢంగా ప్రేమించింది. కానీ శివాజీ ఆమెను మాత్రం గౌరవంతో తిప్పి పంపించివేశాడు. రోషనారా తన ప్రేమ విఫలమైనందుకు శివాజీపై పగ పడుతుంది. ఆయనపై దండెత్తుతుంది. చివరకు ప్రాణాలు కోల్పోతుంది. ఇదీ ఈ నాటకం ఇతివృత్తం. రోషనారా-శివాజీల పాత్రల చిత్రణలో కవి చాలా నేర్పు చూపాడు. రోషనారా తన ప్రేమను వెల్లడించి నప్పుడు శివాజీ వితర్కము; భారత జాతి రక్షకునిగా, ప్రేమించిన యువతిని మాతృ గౌరవంతో చూసిన ఉదాత్తత; ప్రేమకు విఘాతం కలగడంతో కదన రంగాన నిలచి పోరాడి ఓడిపోతుంది రోషనారా. అయినప్పటికీ తన ప్రేమను వదులుకోలేక పోతుంది. ఆమె మరికాసేపట్లో మరణిస్తుందనగా శివాజీపై తన ప్రేమను వదులుకోలేక సకల భారత సామ్రాజ్యాధినేత కాదగిన అర్హత నీకే ఉందంటూ అతడికి శుభాకాంక్షలు చెబుతుంది. నాటకంలో ఇలాంటి ఘట్టాలు విషాదానికి దగ్గరగా ఉండి ప్రజల మనస్సులను ఆకట్టుకొన్నాయి. ఈ నాటకంలో రోషనారా పాత్రలో స్థానం నరసింహరావు, శివాజీ పాత్రలో మాధవపెద్ది వెంకట్రామయ్య నటించారు. వీరిద్దరూ తెలుగు నాటక రంగాన్ని ఏలారు. ఈ నాటకానికి ఇంత పేరు రావడాన్ని తట్టుకోలేక అప్పటి ప్రభుత్వం రోషనారాను నిషేధించింది.
చారిత్రక నాటకాల్లో కొండముది గోపాలరాయ శర్మ రాసిన ‘‘గౌతమబుద్ధ’’, ఆత్రేయ రచించిన ‘‘అశోక సమ్రాట్’’, దుర్బా వెంకట కృష్ణమూర్తి రాసిన ‘‘విషాద తిమ్మరుసు’’(1946), వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు రచించిన ‘‘నరసన్నభట్టు’’ (1957) లాంటివి చాలా ఉన్నాయి. విషాద తిమ్మరుసు నాటకానికి ఉత్తమ విషాద నాటకమనే పేరుంది. పుత్రశోకంతో తిమ్మరుసు కనుగుడ్లు పీకించాలని ఆజ్ఞాపించిన కృష్ణరాయని మానసిక వ్యధ, జీవిత మంతా కృష్ణరాయల సేవల్లో గడిపి, వృద్ధాప్యంలో శరీర బాధకు మించిన మానసిక వ్యధకు లోనైన తిమ్మరుసు మానసిక స్థితి ఈ నాటకంలో కనిపిస్తుంది. ఈ నాటక రచయిత స్వయంగా నటుడు కూడా కావడం వల్ల ఆయన రచన దానికి తగ్గట్టుగా సాగింది. నండూరి రామకృష్ణమాచారి నాటకం ‘‘ధర్మచక్రం’’ (1950). ఈ నాటకంలో ప్రధాన పాత్రలు చంద్రగుప్తుడు, చాణక్యుడు, బిందుసారుడు. చంద్ర గుప్తుడికి ఓ కుమారుడు ఉన్నాడు. అతడు వీరవనిత ఉషా సుందరి మోహంలో ఉన్నప్పుడు ఆ రాజ్యముపైకి గ్రీకులు దండెత్తి వచ్చారు. అప్పుడు ఉషా సుందరి సర్వసేనాపతి బిందుసారుడికి వీరఖడ్గాన్ని అందిస్తుంది. ఆమె అక్కడితో ఆగకుండా ధర్మదీక్ష చేపడుతుంది. బిందుసారుడికి ధర్మపత్నీ సమేతంగా రాజ్యచక్రాన్ని శాసిస్తూ, ధర్మచక్రాన్ని శిరసావహించ మనే ప్రభోదం చేసింది. దండనీతికి ప్రాధాన్యమిచ్చిన చంద్రగుప్త-చాణక్యులకు, ధర్మదీప్తి కోసమని సర్వస్వాన్ని త్యాగం చేసిన అశోకుడు- చంద్రగుప్తులకు మధ్యకాలంలో రాజ్యమేలిన బిందుసారునిలో సమన్వయం పొందిన ఆ రెండు యుగ ధర్మాలను ఈ నాటకంలో హృద్యంగా చూపించారు. నండూరి రామకృష్ణమాచారి రచించిన ఛత్రపతి శివాజీ (1947), ఉరికంబం (1954), శ్రీకృష్ణ దేవరాయలు (1953), త్యాగరాజు-భక్తిపూరిత నాటిక (1954), తెలుగు గడ్డ-వ్యంగనాటిక (1954).. ఇవన్నీ రంగస్థలంపై విజయవంతంగా ప్రదర్శితమయ్యాయి.
కన్నస్వామి రాసిన ‘‘మహారుద్రీయం’’ మరో చారిత్రక నాటకం. ప్రతాప రుద్రదేవుడు తన తండ్రి హత్యకు కారణమవ్వడం, ఈ కారణంగా అతడికి తన తమ్ముడితో మనస్పర్థ ఏర్పడటం, చివరకు ప్రతాప రుద్రదేవుడు తన తమ్ముడికి తన పట్ల విశ్వాసం కలిగించి, మళ్లీ అతడి నుంచి గౌరవాభిమానాలను పొందటం ఈ నాటకం కథాంశం. పెమ్మరాజు వేణుగోపాలకృష్ణమూర్తి రాసిన ‘‘వీర కాపయ్య’’, ‘‘నాగమ నాయకుడు’’ లాంటి నాటకాలు కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి.
తెలుగు నాటక సాహిత్యంపై భారత జాతీయ ఉద్యమ ప్రభావం అమితంగా ఉండేది. అప్పట్లో దేశభక్తి భావన ఎంత తీవ్రంగా ప్రజల హృదయాల్లో నాటుకు పోయిందంటే పెళ్లిళ్లు జరిగేటప్పుడు బ్యాండు వాయిద్యాల్లో మాకొద్దీ తెల్ల దొరతనం (గరిమెళ్ల) పాట వినిపించేది, స్త్రీలు ‘‘రారా గాంధీకుమారా’’ను నలుగుపాటగా, తలుపు దగ్గర పాటగా వినిపించేది. ‘‘మంగళంబు భారతమాత’’ను మంగళ హారతి పాటగా పాడేవారు.
దామరాజు పుండరీకాక్షుడు (1898) గుంటూరు జిల్లా పెదమద్దూరు గ్రామవాసి. ఆయన చిన్నప్ప ట్నుంచే దేశభక్తుడు. ‘‘స్వరాజ్య సోపాన పంక్తి ప్రచురణములు’’ పేరుతో ఆయన రాసిన నాటకాలు ప్రచురితమయ్యాయి. వాటిల్లో ‘‘గాంధీ మహోదయం’’, ‘‘పాంచాల పరాభావము’’ అనే నాటకాలకు అప్పట్లో మంచి పేరు వచ్చింది. ఆయనలో పాండిత్యం, ఉత్సాహం, దేశభక్తి, ధైర్య సాహసాలు మూర్తీభవించి ఉండేవి.
‘‘పాంచాల పరాభవము’’ నాటకం పంజాబు దురంతాలను ప్రత్యక్షంగా వర్ణించింది. ఈ నాటకం కథాంశం ‘‘డయాసురుడు’’ (డయ్యర్) పరిపాలన. దామరాజు పుండరీకాక్షుడు రాసిన నాటకాలు బ్రిటిష్ పార్లమెంటులో కూడా అలజడి రేపాయి. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి రచించిన ‘‘తిలక్ మహారాజు’’ నాటకంలో (1921) పాత్రధారి ‘‘సుజలాం, సుఫలాం’’ అంటూ వందేమాతర గేయాన్ని పాడుతూ రంగస్థలం మీదకు రావడం గమనార్హం. తిలక్ మరణంతో నాటకం పూర్తి అవుతుంది. శాస్త్రి ‘‘స్వరాజ్యోదయ’’ పేరుతో మరో నాటకాన్ని కూడా రాశారు. ఇటువంటిదే డి.సీతారామయ్య రచించిన ‘‘స్వరాజ్య ధ్వజము’’ (1921), జంధ్యాల అయ్యవారి శాస్త్రి ఖిలాఫత్ ఉద్యమంపై రాసిన ‘‘ఆలీ ప్రభృతుల నిర్బంధము’’ (1921), బుద్దవరపు పట్టాభిరామయ్య రచించిన ‘‘మాతృదాస్య విమోచనము’’ (1924). గరుత్మంతుడు తన తల్లి దాస్యమును పోగొట్టిన కథే ఈ మాతృదాస్య విమోచనము అనే నాటకం. రచయిత ఈ నాటకంలో పరోక్షంగా అప్పటి స్వాతంత్రోద్య మాన్ని గురించి ప్రస్తావించారు. ‘‘మాతృ ప్రేమతో ప్రజలెల్ల మసలునట్లు, దాస్యమున నేడు బాధల నందకుండునట్లు’’ చేయమని భరత వాక్యము. మాతృదాస్య విమోచనములో పౌరాణిక కాలం నాటి స్వాతంత్య్ర సమరయోధుడు గరుత్మంతుడు వాసవుని అర్థించుట గమనార్హం.
‘‘చిచ్చుల పిడుగు’’ నాటకాన్ని కాంగ్రెస్ పత్రిక ప్రచురించింది. 1857 నాటి విప్లవవీరుడు మంగళ్ పాండే కథ ఆధారంగా హనుమంతుని వెంకటప్ప రచించారు. కాని పేరు పెట్టకపోవడంతో ‘కాంగ్రెస్’ సంపాదకుడు మద్దూరి అన్నపూర్ణయ్య జైలుకెళ్లారు. ఈ నాటకాన్ని ఆమంచర్ల గోపాలరావు గుంటూరులో విజయవంతంగా ప్రదర్శించారు. ఇదే వరుసలో దేవినేని వీర రాఘవ కవి రచించిన ‘‘పృథ్వీరాజు విజయం’’, అవసరాల శేషగిరిరావు రాసిన ‘‘రాణీ సంయుక్త’’, యలమర్తి శ్రీనివాసరావు రచించిన ‘‘పీష్వా నారాయణరావు వధ’’ (1929), జమ్మలమడక లక్ష్మీనరసింహం రాసిన ‘‘సిరాజుద్దౌలా లేక అసమాన్య’’, శనగవరపు రాఘవ శాస్త్రి రామరాజుతో పాటుగా ఇతర కవులు రచించిన అనేక నాటకాలు వెలువడ్డాయి.
పింగళి నాగేంద్రరావు 1922లో ‘‘మేవాడ్ రాజ్యపతనము’’ పేరిట పద్యాల్లేని వచన నాటకాన్ని రాశారు. కలకత్తాకు (నేటి కోల్‌కతా) చెందిన ద్విజేంద్రలాల్‌రాయ్ రచించిన మేవాడు రాజ్యపతనా నికి అనువాదం ఈ నాటకం. దీన్ని 1924లో బందరులో ప్రదర్శించారు. నాటకంలో గోవిందసింగ్ పాత్రలో డి.వి.సుబ్బారావు ఇమిడి పోయారు. పింగళి నాగేంద్రరావు ఆ తర్వాత జేబున్నీసా పేరుతో ఓ నాటకాన్ని రచించారు. కానీ అప్పటి ప్రభుత్వం హిందువులు, ముస్లింల మధ్య మత సామరస్యం దెబ్బతింటుందనే భయంతో ఈ నాటక ప్రదర్శనను నిషేధించింది. నాగేంద్రరావు రాసిన చివరి నాటకం ‘‘క్షాత్ర హిందు’’. ఈ నాటకానికి మూలం పృథ్వీరాజ్ రాసో (చంద్ బర్దాయీ) అనే కావ్యం. రచయిత ఈ నాటకంలో భారత జాతీయతను రక్షించడానికి కంకణం కట్టుకున్న యోధునిగా పృథ్వీరాజ్‌ను, తన వీరపూజకు పృథ్వీ రాజ్‌ను లక్ష్యంగా నిలుపుకున్న వీరవనితగా సంయుక్త పాత్రలను రూపొందించారు. అంతేకాకుండా ఈ నాటకం ద్వారా మతాలకు అతీతమైన జాతీయతను ప్రభోదించడం గమనార్హం. నాగేంద్ర రావు సాటి మానవుణ్ణి బానిస భావంతో చూసే నీచత్వం ఈ దేశంలో ఎవరికీ లేదు అని చాంద్‌బట్టు ప్రభోదించే జాతీయ ధర్మానికి ఆక్రోశించిన కుతుబుద్దీన్, చాంద్‌బట్టుకు తగ్గట్టుగా అతడి భార్య చంచరి, మహా యోధుడు కైమోష్ పాత్రలను చక్కగా తీర్చిదిద్దాడు.
1907లో బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి (నేటి రాజమహేంద్రవరం) వచ్చినప్పుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఆశువుగా ‘‘భరత ఖండంబు చక్కని పాడియావు;-హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు – పితుకుచున్నారు మూతులు బిగియగట్టి’’ అనే పద్యం చెప్పారు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం నాటకాలు రాయడా నికి తోడు రాజమహేంద్రవరంలో హిందూ నాటక సమాజాన్ని నెలకొల్పారు. టంగుటూరి ప్రకాశం పంతులు చిలకమర్తి రాసిన నాటకాల్లో స్త్రీ పాత్రలతో పాటుగా అనేక ఇతర పాత్రల్లో నటించేవారు.
1910లో గుంటూరులోని యువజన సంఘం ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధనకు నాంది పలికింది. అది 1913లో ఆంధ్ర మహాసభ స్థాపనకు కారణమైంది. 1916లో కలకత్తా కాంగ్రెస్ సభలో పట్టాభి సీతారామయ్య పట్టుదల వల్ల భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనకు అంగీకారమైంది. దీంతో ఓ వైపు స్వరాజ్యోద్యమం, మరోవైపు ప్రత్యేక రాష్ట్ర సాధన ఏకకాలంలో సాగాయి. ఈ రెండూ కూడా తర్వాతి కాలంలో సాహిత్య రంగంలో ఉద్యమాలు కావడం గమనార్హం.
డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు