మహా కుంభమేళా ముగిసింది. ప్రపంచ చరిత్రలో ప్రయాగరాజ్‌ కొత్త పుటను తెరిచింది. నలభయ్‌ అయిదు రోజులలో ఒకే భావనతో, ఒక ధర్మానికి వారసులమని ప్రగాఢంగా నమ్ముతూ, తాదాత్మ్యంతో జనసంద్రాలు ఏకత్రితమైన పుణ్యస్థలిగా మేళాను నిఖిల ప్రపంచం గుర్తించక తప్పలేదు. ఒక కోటి మంది కాదు, పది కోట్లు కాదు, 66 కోట్లమందికి పైగా త్రివేణీ తీర్థంలో స్నానాలు చేశారు.  జాతీయ భావన, ఆధ్యాత్మిక చింతన అనే తీరాలను ఒరుసుకుంటూ వెళ్లిన వారసత్వ ప్రవాహంలో స్నానమాచరించి జాతి పునీత అయిందనే అందరి విశ్వాసం. సగం భారతదేశం సంగమానికి విచ్చేసిందన్నమాటే. ఈ కుంభమేళా హిందువుల మహా విజయం. ఆత్మ విస్మృతి అనే కశ్మలాన్ని త్రివేణి వదిలించిందనే ఎక్కువ మంది నమ్మకం. అయినా ఇతర మతస్థులూ నిర్మలమైన హృదయాలతో భాగమయ్యారు. భారత్‌లోని ప్రతి రాష్ట్రం నుంచే కాదు, 76 దేశాల నుంచి వచ్చిన అనేక జీవన విధానాల వారు, విశ్వాసాల వారు సంగమంలో స్నానించారు. సరిగ్గా సంవత్సరం క్రితమే అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ ఘట్టాన్ని చూసి విస్తుపోయిన విశ్వంÑ ఇప్పుడు ప్రయాగరాజ్‌ను చూసి  ఆధ్యాత్మిక వారసత్వం పట్ల హిందువులు ప్రదర్శించిన దృఢబంధాన్ని చూసి, ధర్మం పట్ల చూపిన నిబద్ధతను పరికించి వినయంగా ప్రణమిల్లుతున్నది. హిందూ వ్యతిరేకులు ప్రపంచానికి చూపించిన కులమతాల భారత్‌ అక్కడ కనిపించకపోవడం వారికి మరీ విచిత్రం. ఇందరు హిందువులు ఒకచోట చేరినా, ధర్మం ఇచ్చిన గాఢమైన భక్తితో పోటెత్తినా.. ఒక్క ముస్లిం మీద, ఒక్క క్రైస్తవుడి మీద అయినా దాడి జరిగిన జాడే లేకపోవడం, చర్చ్‌ మీదనో, మసీదు మీదనో ఓ రాయి పడిన వైనం నమోదు కాకపోవడం మరీ మరీ చిత్రం ప్రపంచానికి. అదే సమయంలో కొందరికి నిరాశ కూడా. అందుకే మహాకుంభ్‌ చాలామందిని భారతీయత పట్ల ఉన్న వ్యతిరేకత నుంచి విముక్తం చేసి ఉండాలి. కళ్లు తెరిపించి ఉండాలి. 

అయినా… త్రివేణీ సంగమంలో మహాకుంభ్‌ స్నానం అంటే మూడు మునకలు కాదు. ఒక పురాతన ఆచారంతో, శతాబ్దాల నాటి సంప్రదాయంతో, భారతీయ ఆధ్యాత్మిక పరంపరతో మమేకమవుతూ ఆత్మ క్షాళనం కావాలని శిరస్సు వంచి సంగమాన్ని వేడుకోవడం. పురిశెడు జలంతో ఆచమనం చేయడమే కాదు, పునరుజ్జీవనోద్యమం అవసరాన్ని గుర్తించి, ఆ ఉద్యమంతో కలసి సాగడం. అర్ఘ్యంలో సూర్య భగవానుడినే కాదు, విశ్వగురు స్థానంలో నిలబడవలసిన ఆర్యావర్తాన్ని కూడా దర్శించుకోవడం. భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, అందులోని పరంపరను త్రివేణీ అలలు భక్తుడి ఆత్మకు చేర్చి, దానిని క్షాళన చేసిన క్షణమది. ప్రయాగలో అదే ప్రతిబింబిం చింది. ఆ లిప్తలలో భౌతిక ప్రపంచానికి అతీతమైన అనుభూతి ఏదో తమను ఆలింగనం చేసుకున్నదని లక్షలాది మంది స్నాతలు చెప్పడం ఇందుకే. ఇలాంటి అనుభూతిని శాశ్వతం చేసుకోవాలని ఆకాంక్షించిన వారే అక్కడ ఎక్కువ. కోకొల్లలుగా దర్శనమిచ్చిన నాగసాధువుల కోలాహలం అందుకు సంబంధించినదే. యజ్ఞకుండం నుంచి ఎగసిన జ్వాలను మరిపిస్తూ ఆ తీరాన్ని చుట్టిన కాషాయవాహిని అంతరంగం కూడా అదే. వారందరి ఉనికి మహాకుంభ్‌ వేడుకకే ఒక మార్మికతను అద్దింది. భక్తుల భగవన్నామ స్మరణ, శంఖారావాలు, ఘంటారావాలు, అగరవత్తుల గుబాళింపు, హారతి కర్పూరం సువాసనలు, సాధుసంతుల మంత్రోచ్చారణలు, భజనలు, పీఠాధిపతుల ధ్యానం ఆ గాలిని ఒక ఆధ్యాత్మిక భావ తరంగంలా మలిచాయి. ఆ సంగమ తీరానికి ఎవరు వెళ్లినా  ఆ ఆధ్యాత్మిక పరిమళంలో భాగమైపోయారు. ఆత్మ విస్మృతితో కోల్పోయిన ఏకత్వభావననీ, ఏకాత్మతా దృష్టినీ ప్రతివారి ఉచ్ఛ్వాసనిశ్వాసాలలో వినేటట్టు చేసింది ఆ క్షణం. మహాకుంభ్‌ కేవలం మత కార్యక్రమం కాదు. అదొక ఆధ్యాత్మిక యానం. అందుకే జీవితమంతా గుర్తుంచుకునే ఒక అనుభూతిని ప్రసాదించి ప్రతి యాత్రికుడిని తిప్పి పంపింది. ఇవాళ కుంభమేళా ఫలితాలు, అనుభవాలు ప్రపంచానికి పాఠాలుగా నిలిచాయి. ఆధ్యాత్మికతలో ఆర్థికాంశాలకు చోటు తక్కువే అయినా, కుంభమేళాలో ఇప్పుడు వాటిని శోధించే పరిశోధకులు కనిపిస్తున్నారు. జనవాహినిని అదుపు చేయడంలో కుంభమేళా ఒక కొండగుర్తుగా నిలిచిందంటున్నారు. ఈ 45 రోజులు మహామేళా నిండా ఎన్నో మైలురాళ్లు, మరెన్నో గీటురాళ్లు కూడా.

మహాకుంభమేళా సరికొత్త ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకోవడంతో సరిపుచ్చుకోకుండా అంగరంగ వైభవంలో, దివ్యత్వంలో ప్రపంచానికి ఓ ప్రామాణికతను స్థిరపరిచింది. ఈ 45 రోజుల ఆధ్యాత్మిక జాతర అనూహ్యమైన రీతిలో గుమిగూడిన జన సందోహానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. 66 కోట్ల మందికిపైగా భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేయడంతో చరితార్థులైనారు. తమ పేర్లను భారత్‌ ఆధ్యాత్మిక చరిత్రలో లిఖించు కున్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం అండదండలతో యోగి ప్రభుత్వం అదే పనిగా చేసిన కృషితో ప్రయాగరాజ్‌ చెప్పుకోదగిన రీతిలో రూపాంతరం చెందింది. మహాకుంభమేళా మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఓ వైభవాన్ని, దివ్యత్వాన్ని సంతరించు కుంది. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కలిసికట్టుగా మహాకుంభమేళాకు చేసిన ఏర్పాట్లు భువిపై  దివ్యలోకాన్ని నిలిపాయి.

మహాకుంభమేళాలో 66 కోట్ల మందికిపైగా పాల్గొనడం ఓ చరిత్రాత్మకమైన మైలురాయి. మరే ఇతర వేడుక కూడా ఇంత భారీ సంఖ్యలో భక్తులు ఓ చోట గుమిగూడటాన్ని ఇప్పటిదాకా చూసింది లేదు. 66 కోట్లు అనే ఈ అంకె భారత్‌ జనాభాలో 50 శాతాన్ని దాటిపోయింది. ప్రపంచంలో అనేక దేశాల జనాభాను మించిపోయింది.

మొత్తం 13 అఖాడాల ప్రతినిధులు వారి వారి సంప్రదాయాలకు లోబడి మహాకుంభమేళాలో పాల్గొన్నారు. అమృతస్నానం చేయాల్సి వచ్చిన మూడు సందర్భాల్లోనూ ఆ క్రతువును నిర్విఘ్నంగా సంపూర్ణం చేశారు. మిగిలిన అఖాడాలు జునా అఖాడాకు అనుబంధితమైన కిన్నర్‌ అఖాడాతో చేరడం ఈ సారి కుంభమేళాలో ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ అఖాడాలు కొత్తగా సాధువులను చేర్చుకునే కార్యక్రమాన్ని, మహామండలేశ్వర్‌ లాంటి కీలకమైన పదవుల్లో నియామకాలను విజయ వంతంగా పూర్తి చేశాయి.

6 వేడుకలు.. కోట్లలో స్నానాలు..!

45 రోజుల వేడుకలో భక్తుల సంఖ్య రోజులు గడుస్తున్న కొద్దీ పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. భక్తులు స్నానం చేసేందుకు కీలకమైన ఆరు పర్వదినాల్లో వారి సంఖ్య కోట్లలో నమోదైంది. పర్వదినాల్లో మొదటిదైన జనవరి 13న పుష్య పూర్ణిమ నాడు 1.7 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాకు వచ్చారు. ఆ తర్వాత జనవరి 14న మకర సంక్రాంతి నాడు 3.5 కోట్ల మంది భక్తులు, జనవరి 29న మౌని అమావాస్య నాడు 7.64 కోట్లు, ఫిబ్రవరి 3న వసంత పంచమి నాడు 2.57 కోట్లు, ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ నాడు 2.04 కోట్లు, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినాన 1.53 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానం చేశారు. ఫిబ్రవరి 15 నుంచి 26 తేదీల మధ్య కాలంలో ఏ ఒక్క రోజూ కూడా భక్తుల సంఖ్య ఒక కోటికి తగ్గకపోవడం గమనార్హం.

రాష్ట్రపతి నుంచి రవీనా టాండన్‌ దాకా

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోమ్‌ మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, అనేక మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఆయా అసెంబ్లీల స్పీకర్లు, ఆయా రాష్ట్రాల మంత్రులు త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానమాచరించారు. రాజకీయాలకు అతీతంగా సమాజ్‌వాది పార్టీ  అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో విపక్ష నేత మాతా ప్రసాద్‌ పాండే, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌, ఇతర పేరొందిన రాజకీయ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌, సచిన్‌ పైలట్‌, అభిషేక్‌ మను సింఫ్వీు, రాజీవ్‌ శుక్లా, ధర్మేంద్ర యాదవ్‌ తదితరులు మహాకుంభమేళాను సందర్శించినవారిలో ఉన్నారు.

హిందీ సినీ ప్రముఖులు అక్షయ్‌ కుమార్‌, విక్కీ కౌశల్‌, కత్రీనా కైఫ్‌, పంకజ్‌ త్రిపాఠీ, రాజ్‌కుమార్‌ రావు, ఈషా గుప్తా, రవీనా టాండన్‌, వివేక్‌ ఓబెరాయ్‌, అనుపమ్‌ ఖేర్‌, హేమామాలిని, రవికిషన్‌, తమన్నా భాటియా, సోనాలి బింద్రే, రెమో డిసౌజా, షాన్‌, కైలాష్‌ ఖేర్‌, శేఖర్‌ సుమన్‌, ఉదిత్‌ నారాయణ్‌, పారిశ్రామిక ప్రముఖులు ముకేష్‌ అంబానీ, అనిల్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, లక్ష్మి మిట్టల్‌, ఆనంద్‌ పిరమల్‌, అశోక్‌ హిందూజా, ఓలా వ్యవస్థాపకుడు భవేష్‌ అగర్వాల్‌, క్రీడా ప్రముఖులు సునీల్‌ గవాస్కర్‌, సురేష్‌ రైనా, ది గ్రేట్‌ ఖలీ, సైనా నెహ్వాల్‌, బైచుంగ్‌ భుటియా, అనిల్‌ కుంబ్లే, ఆర్‌పీ సింగ్‌, ఇశాంత్‌ శర్మ, తదితరులు త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి తోడు సాధువుల ఆశీస్సులు అందుకున్నారు.

త్రివేణీ తీరాన కేబినెట్‌ భేటీలు

ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు మహా కుంభమేళా వద్ద మంత్రివర్గ సమావేశాలను నిర్వ హించాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తన కేబినెట్‌ సహచరులతో పవిత్ర స్నానమాచరించిన అనంతరం వారితో సమావేశానికి అధ్యక్షత వహించారు. రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ, ఆయన మంత్రిమండలి సభ్యులు కూడా అదే బాట పట్టారు.  పలు ఇతర రాష్ట్రాలకు చెందిన సీఎంలు సైతం కేబినెట్‌ భేటీ కోసమని తమ మంత్రులను ప్రయాగ రాజ్‌కు తీసుకొచ్చారు.

డిజిటల్‌ మహాకుంభ్‌ అద్బుతం

మహాకుంభమేళాలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిజిటల్‌ మహాకుంభ్‌. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం కోసమని ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ను తొలిసారిగా కుంభమేళాలో ఆరంభించారు. నిర్వాహ కులు మహాకుంభ్‌ నగర్‌ అంతటా నిరంతరాయంగా నావిగేషన్‌ కోసమని గూగుల్‌తో ఓ పరస్పర అవగాహన ఒప్పందం `ఎంవోయూ కుదుర్చు కున్నారు. డిజిటల్‌ ఖోయా`పాయా కేంద్ర తప్పిపోయిన వేలాది మందిని వారి కుటుంబాలతో తిరిగి కలపడం ద్వారా సముహాల నిర్వహణలో ఓ చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది.

4 వేల హెక్టార్లు.. రూ.7 వేల కోట్లు..!

యోగి ప్రభుత్వం మహాకుంభమేళాను ఘనంగా నిర్వహించడంలో అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోలేదు. మహాకుంభ్‌ నగర్‌ను 4,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో 25 సెక్టార్లుగా ఏర్పాటు చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కొత్తగా 12 కి.మీ.ల మేర ఘాట్‌లు నిర్మించారు. వాహనాల పార్కింగ్‌ కోసమని 1,850 హెక్టార్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఇవే కాకుండా 31 పంటూన్‌ వంతెనలు, 67వేలకు పైగా వీధి దీపాలు, ఒకటిన్నర లక్షలకుపైగా మరుగుదొడ్లు, భక్తుల కోసమని 25వేల విడుదులు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మహాకుంభమేళా కోసమని రూ.7 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించగా, కేంద్ర ప్రభుత్వం ప్రయాగరాజ్‌ను అభివృద్ధి చేయడం కోసమని మొత్తంగా రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టింది.

మహాకుంభమేళాతో 35 బిలియన్‌ డాలర్లు

మహాకుంభమేళా ఆధ్యాత్మికతను, ఆర్థిక చేతనత్వాన్ని పెనవేసే ఓ ప్రబలమైన తార్కాణమైంది. అది ధార్మికాచారాన్ని మించిపోయే ఓ కీలకమైన ఆర్థిక ఉత్ప్రేరకంగా పనిచేస్తోంది. 800 మిలియన్‌ డాలర్ల అంచనా బడ్జెట్‌తో సంపూర్ణమైన మహాకుంభ మేళా తనదైన ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలోకి దాదాపు 30 బిలియన్‌ డాలర్ల నుంచి 35 బిలియన్‌ డాలర్ల నిధుల వ్రవాహాన్ని వెల్లువెత్తిస్తుంది. యూపీ ప్రభుత్వం మహాకుంభమేళా నుంచి రూ.54 వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. ఈ  వేడుక పర్యాటకం, ఆతిథ్యం, రవాణా, స్థానిక వాణిజ్యంలో దాదాపు 60 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి ద్వారా లబ్ది చేకూర్చింది. కోట్లాదిగా భక్తుల రాకపోకలతో బస, ఆహార సేవలు, ధార్మిక సేవలకు అనూహ్యమైన గిరాకీ ఏర్పడిరది. చిన్న వ్యాపారులు, తోపుడి బండి వ్యాపారులు, భారీ కార్పోరేట్ల ఆదాయంలో గణనీయమైన వృద్ధి కనిపించింది.

ఆకాశాన్నంటిన బ్యాంకింగ్‌, ఆర్థిక లావాదేవీలు

మహాకుంభమేళాలో యాత్రీకులకు ఆర్థిక సౌలభ్యం కోసమని 16 బ్యాంకులు వాటి శాఖలను మహాకుంభ్‌ నగర్‌ ప్రాంగణంలో నెలకొల్పాయి. ఈ బ్యాంకులు రూ.37 కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహించాయి. యాత్రీకులు 16 బ్యాంకుల్లో అత్యధికంగా ఎస్‌బీఐలో నగదు జమలు చేశారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం నగదు జమలతో పోలిస్తే నగదు ఉపసంహరణ చాలా తక్కువగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున నగదు జమలు యాత్రికులు ధార్మిక వేడుకల్లో పాల్గొనేటప్పుడు తమ నగదు భద్రంగా ఉండాలని కోరుకుంటున్న వైనాన్ని సూచిస్తోందని అధికారులు తెలిపారు. బ్యాంకు శాఖలకు తోడు 50 మొబైల్‌ ఏటీఎంలతో కలుపుకొని మొత్తం 55 ఏటీఎం బూత్‌లను నెలకొల్పారు. అయితే పెరిగిన డిజిటల్‌ లావాదేవీలతో ఏటీఎంలకు అనుకున్నంత గిరాకీ రాలేదు.

ప్రపంచ దేశాల ఆధ్యాత్మిక వేడుక

మహాకుంభమేళా కేవలం భారత్‌కు మాత్రమే పరిమితమైంది కాదు. అది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఓ ఆధ్యాత్మిక వేడుక. 76 దేశాల ప్రతినిధులు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద పట్ల అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్టుగా మహాకుంభమేళాలో పాల్గొన్నారు. భూటాన్‌ రాజు త్రివేణి సంగమంలో స్నానం చేశారు. ఒక్క నేపాల్‌ నుంచే 50 లక్షల మందికి పైగా భక్తులు ప్రయాగరాజ్‌కు వచ్చారు. 27 ఇతర దేశాల నుంచి 2 లక్షల మందికి పైగా యాత్రీకులు మేళాలో పాలుపంచుకున్నారు. ఇదే విషయమై ప్రయాగరాజ్‌కు వచ్చిన యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ కళత్రం లారెన్‌ పోవెల్‌ జాబ్స్‌ మాట్లాడుతూ ‘‘ఇక్కడ పొందే ఆధ్యాత్మిక అనుభూతి మరెక్కడా దొరకదు. ఈ వేడుక నుంచి పొందే శక్తి, దివ్యత్వం, వేడుక పరిమాణం మాటలకందనిది’’ అని అన్నారు.

పారిశుద్ధ్య కార్మికులతో యోగి సహపంక్తి భోజనం

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రయాగ రాజ్‌లో మహాకుంభమేళా విజయవంతమైన సందర్భంగా ఫిబ్రవరి 27న అక్కడి క్షేత్రస్థాయి సిబ్బందిని కలిశారు. ఆధ్యాత్మిక వేడుకను సమర్థమంతంగా నిర్వహించడంలో కీలకమైన పాత్ర పోషించారంటూ వారిని కృతజ్ఞతాపూర్వకంగా అభినందించారు. మహా కుంభమేళాలో అవిశ్రాంతంగా విధులు నిర్వర్తించిన 75 వేల మంది పోలీసులకు ఒక్కొక్కరికి బోనస్‌ రూపేణా రూ.10 వేలు, ఏడు రోజులు సెలవు మంజూరు చేస్తామని యోగి ప్రకటించారు. స్వచ్ఛ కుంభ్‌ నిధి కింద వారందరికీ బహుమతులు, బీమా ధృవీకరణ పత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహాకుంభమేళాలో సేవలందించిన ప్రతీ పారిశుద్ధ్య కార్మికుడు, ప్రతీ ఆరోగ్య కార్యకర్తకూ అదనపు బోనస్‌ రూపేణా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు అందజేస్తుందని తెలిపారు. వారందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ లేదా ముఖ్యమంత్రి జన ఆరోగ్య యోజన కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమాను వర్తింపజేస్తామని ప్రకటించారు. యూపీ సీఎం అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో సహపంక్తి భోజనం చేశారు.

పర్యావరణ హితానికి ఆర్‌ఎస్‌ఎస్‌ సంచులు, కంచాలు

ప్రయాగరాజ్‌లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ రహిత వాతావరణాన్ని నెలకొల్పడానికి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) నడుం బిగించింది. ప్లాస్టిక్‌ సంచులు, ప్లేట్లకు బదులుగా గుడ్డ సంచులు, స్టీలు కంచాలు వాడాలని కుంభమేళా సందర్శకులకు పిలుపునిచ్చింది. ఒక సంచీ – ఒక కంచం నినాదాన్ని భక్త జన సందోహంలోకి తీసుకొని వెళ్లింది. ఆర్‌ఎస్‌ఎస్‌ లక్షలాదిగా గుడ్డ సంచులు, స్టీలు కంచాలు, లోటాలను యాత్రికులకు పంచిపెట్టింది.

వందేళ్లుగా కుంభమేళాకు..

ఆగస్టు 8,1896న జన్మించిన స్వామి శివానంద సరస్వతి గడచిన వందేళ్లుగా  క్రమం తప్పకుండా ప్రయాగరాజ్‌లో జరిగే కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానమాచరిస్తున్నారు. 129 ఏళ్ల వయసులో ఆబాలగోపాలానికి స్ఫూర్తిగా నిలిచారు.

ఏడడుగుల కండల బాబా

కుంభమేళాలో ఏడడుగుల ఎత్తుండి వస్తాదు తరహాలో కండలను కలిగి ఉన్న ఆత్మప్రేమగిరి మహరాజ్‌ అక్కడకు వచ్చినవారందరి దృష్టిని ఇట్టే ఆకర్షించారు. ఆత్మప్రేమగిరి మహరాజ్‌ అసలు పేరు ఎలెస్కి గార్సిన్‌. రష్యాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవారు. విదేశాల్లో పర్యటిస్తూ భారత దేశానికి వచ్చారు. సనాతనమైన హిందూ ధర్మం పట్ల ఆకర్షితులయ్యారు. హిందూ ధర్మ ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆత్మప్రేమగిరి మహరాజ్‌  నేపాల్‌లో ఉంటున్నారు.

అమ్మ కోసం అపర శ్రవణ కుమారుడు..!

65 ఏళ్ల సుదేష్‌ ముజఫ్ఫర్‌ నగర్‌ వాస్తవ్యులు. ఆయన మాతృమూర్తి 92 ఏళ్ల జగ్‌బిరి దేవి. ఆమెకు ఎప్పట్నుంచో కుంభమేళాకు వెళ్లాలని, అక్కడ పవిత్రమైన నదీజలాల్లో స్నానం చేయాలనే ఉండేది. సుదేష్‌ అమ్మ కోరిక తీర్చడానికి ఓ చిన్నపాటి ఎద్దుల బండిపై అమ్మను కూర్చుండబెట్టారు.  ఆయన ఆ బండిని తానే లాగుతూ రోజుకు 50 కి.మీ.ల దూరాన్ని అధిగమిస్తూ 13 రోజుల్లో ప్రయాగరాజ్‌ చేరుకున్నారు. పవిత్ర స్నానంతో అమ్మ కోరిక తీర్చారు.

భక్తుల సేవలో 16 వేల మంది స్వయంసేవకులు

ప్రయాగరాజ్‌ కుంభమేళాకు కోట్లాదిగా భక్తులు కోసం, అక్కడ వాహనాల రాకపోకలు సజావుగా జరగడం కోసం, భక్తులకు నిత్యావసర సేవలు సమకూర్చడానికని 16,000 మంది స్వయం సేవకులు అవిశ్రాంతంగా పని చేశారు.

కాశీ, అయోధ్యకు లక్షల్లో భక్తులు

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మహాకుంభమేళాతో రాష్ట్రంలో పర్యాటకం వృద్ధి చెందిన వైనాన్ని గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక పర్యాటకంలో భాగంగా అనేక సర్క్యూట్‌లు ఆవిష్కృతమయ్యాయని తెలిపారు. అలాంటి సర్క్యూట్‌లలో ప్రయాగరాజ్‌ నుంచి మా వింధ్యవాసిని ధామ్‌ మీదుగా కాశీకి చేరుకునే సర్క్యూట్‌ ఒకటని ఆయన చెప్పారు. మహాకుంభ మేళాను పురస్కరించుకొని కోట్లాదిగా భక్తులు ప్రయాగరాజ్‌కు వచ్చినట్టుగా మా వింధ్యవాసిని ధామ్‌ను ప్రతి రోజూ 5 లక్షల నుంచి 7 లక్షల మంది భక్తులు సందర్శించు కున్నారని తెలిపారు. అలాగే కాశీలో బాబా విశ్వనాథ్‌ ధామ్‌ను ప్రతి రోజూ 10 లక్షల నుంచి 15 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆ 45 రోజుల్లో అయోధ్యకు ప్రతి రోజూ 10 లక్షల నుంచి 15 లక్షల మంది భక్తులు వచ్చి బాలరామునికి పూజలు చేశారని చెప్పారు. గోరఖ్‌పూర్‌ను ప్రతి రోజూ 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది భక్తులు దర్శించు కున్నారు. మహాకుంభమేళా విషయానికి వస్తే ఈ 45 రోజుల్లో మొత్తంగా 66 కోట్ల 30 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచ రించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడిరచారు.

గిన్నిస్‌ ప్రపంచ రికార్డుల పుస్తకంలో చోటు

మహాకుంభమేళా అథారిటీ సాధించిన మూడు చరిత్రాత్మక ఘనతలకు గిన్నిస్‌ ప్రపంచ రికార్డుల పుస్తకంలో చోటు దక్కింది. ఆ ఘనతల్లో మొదటిది 329 మంది కార్మికులు పెద్ద ఎత్తున అనేక చోట్ల నది జలాలను నిరంతరాయంగా శుద్ధి చేసే కార్యక్రమం, రెండవది 19 వేల మంది కార్మికులు చేపట్టిన అతిపెద్ద పారిశుద్ధ్య కార్యక్రమం. ఘనతల్లో మూడవదిగా 10,102 మంది కళాకారులు ఎనిమిది గంటలు శ్రమించి చేతులతో రూపొందించిన అతిపెద్ద కళాఖండం ఉంది. ఈ సందర్భంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఫిబ్రవరి 27న గిన్నిస్‌ ప్రపంచ రికార్డుల పుస్తకం అధికారుల నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నారు.

ఇండియా రికార్డుల పుస్తకంలో చోటు

ప్రయాగరాజ్‌లో మహా శివరాత్రిని పురస్కరించు కొని ఫిబ్రవరి 26న 108 చిత్రకారులు 108 నిమిషాల్లో 108 రూపాల్లో మహా శివుని చిత్రించిన చరిత్రాత్మక ఘటనకు ఇండియా రికార్డుల పుస్తకంలో చోటు దక్కింది. పరమార్థ్‌ నికేతన్‌ ప్రాంగణంలో శివ ఫెస్ట్‌ పేరిట జరిగిన వేడుక ఈ ఘటనకు వేదికగా మారింది.  ఇది మహాకుంభ మేళాలో చిరస్మరణీయ ఘటనల్లో ఒకటిగా నిలిచింది.

16 వేల రైళ్లు.. 5 కోట్ల మంది భక్తులు..!

భారతీయ రైల్వేలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ రాజ్‌లో 45 రోజులపాటు సాగే మహాకుంభమేళాకు భక్తుల సౌకర్యార్థం 13 వేల రైళ్లు నడపాలని మొదట భావించింది. అయితే అధికారుల అంచనాలకు మించి భక్తుల సంఖ్య కోట్లను దాటిపోవడంతో ఎట్టకేలకు 16 వేలకు పైగా రైళ్లను నడిపింది. ఆ రైళ్లలో 4.5 కోట్ల నుంచి 5 కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్‌కు రాకపోకలు సాగించారు.

లక్షలాది చెట్లతో పర్యావరణ పరిరక్షణ

సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం మహాకుంభమేళాలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేయాలనే లక్ష్యంతో మియవకి అటవీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆ క్రమంలో 2023, 2024 మధ్య కాలంలో 34,200 చ.మీ.ల విస్తీర్ణంలో 63 జాతులకు చెందిన 1,19,700 మొక్కలను నాటారు. వాటిలో మామిడి, వేప, చింత,  రావి, తులసి, తురాయి, ఔషధ మొక్కలు ఉన్నాయి. అప్పటిదాకా వ్యర్థ పదార్థాలకు పారవేయడానికి ఉపయోగించే బుస్వర్‌ డంపింగ్‌ యార్డులో 27 వేల మొక్కలు నాటడంతో అది కాస్త పచ్చదనంతో నిండిపోయింది.

దాహార్తి తీర్చిన 233 నీటి ఏటీఎంలు

ప్రయాగరాజ్‌లోని మహాకుంభమేళాలో 233 నీటి ఏటీఎంలు భక్తుల దాహార్తిని పరిశుభ్రమైన నీటితో 45 రోజులూ నిరంతరాయంగా తీర్చాయి. అన్ని రోజులూ కూడా అధికారులు రివర్స్‌ ఓస్మోసిస్‌ పద్ధతిలో శుద్ధి చేసిన తాగు నీటితో ఏటీఎంలను నింపారు. ప్రతీ ఏటీఎంకు ఓ సెన్సర్‌ను అమర్చడం ద్వారా ఏటీఎం పనితీరులో ఎలాంటి అంతరాయం, పొరపాట్లు లేకుండా చూసుకున్నారు. మొదట్లో నాణేల ద్వారా లేకుంటే యూపీఐ చెల్లింపుల ద్వారా  భక్తుల నుంచి లీటరు నీటికి ఒక రూపాయి వసూలు చేసినప్పటికీ ఆ తర్వాత ఒక్క పైసా కూడా తీసుకో కుండా ఉచితంగా నీటిని అందించారు. సిమ్‌ ఆధారిత సాంకేతికత ద్వారా నీటి సరఫరాను పర్యవేక్షించారు. ప్రతీ ఏటీఎం రోజుకు 12 వేల నుంచి 15 వేల లీటర్ల మంచి నీటిని భక్తులకు అందించింది. ఏటీఎం దగ్గర ఉండే సిబ్బంది యాత్రీకులు నీటిని నింపుకోవడంలో ప్లాస్టిక్‌ సీసాలకు బదులుగా గాజు సీసాలను తప్పనిసరిగా వినియోగించేలా చూడటం ద్వారా పవిత్రమైన చోట వ్యర్థాలను తగ్గించడంలో తమ వంతు పాత్రను సమర్థమంతంగా పోషించారు.

90 టవర్లతో  బీఎస్‌ఎన్‌ఎల్‌  భేష్‌

మహాకుంభమేళాలో భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ` బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆత్మనిర్భర్‌ భారత్‌కు లోబడి కోట్లాది యాత్రీకులు, అధికారులు, భద్రతా బలగాలు, వలంటీర్లకు కమ్యూనికేషన్‌ మౌలిక సదుపాయాల కల్పనలో ఓ కీలకమైన పాత్రను పోషించింది. మేళా ప్రాంతానికి ప్రత్యేకించి ఒక వినియోగదారు సేవా కేంద్రాన్ని నెలకొల్పింది. దేశ నలుమూలల నుంచి వచ్చిన యాత్రీకులకు వారి సంబంధిత బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్కిళ్లకు అనుగుణంగా సిమ్‌ కార్డులను ఉచితంగా సమకూర్చింది. ఉదాహరణకు ఎవరైనా యాత్రికుడు సిమ్‌ కార్డును పోగొట్టుకున్నా, సిమ్‌ కార్డు పాడైపోయినా దానికోసమని అతడు తన సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లాల్సిన పనిలేకుండానే అదే రాష్ట్రానికి చెందిన సిమ్‌ కార్డును బీఎస్‌ఎన్‌ఎల్‌ అందించింది.

ఈ పని చేసినందుకు యాత్రీకుల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయకపోవడం విశేషం. తద్వారా మహాకుంభ మేళాకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి కుటుంబాలతో అనుసంధానమై ఉన్నారు. ఈ వేడుకలో ఫైబర్‌ కనెక్షన్లు, లీజ్‌డ్‌ లైన్‌ కనెక్షన్లు, మొబైల్‌ రీచార్జీలకు ఎక్కడ లేని గిరాకీ వచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ గిరాకీకి తగ్గట్టుగా అవసరమైన వారందరికీ వాటిని సమకూర్చింది. అంతరాయం లేని కమ్యూనికేషన్‌ కోసమని మేళా ప్రాంతంలో మొత్తంగా 90 బీటీఎస్‌ టవర్లను యాక్టివేట్‌ చేసింది.

నలభీములకు పప్పూ ఉప్పూ..!

మహాకుంభమేళాలో స్వయంపాకం చేసుకునే యాత్రికులకు శుభ్రమైన ఆహార పదార్థాలను అందించడంలో అటు కేంద్ర ప్రభుత్వమూ, ఇటూ యూపీ ప్రభుత్వమూ అనేక చర్యలను సమర్థమంతంగా అమలు చేశాయి. అధికారులు అందరికీ అందుబాటు ధరల్లో 1,000 మెట్రిక్‌ టన్నులకుపైగా ఆహార పదార్థాలను 20 మొబైల్‌ వ్యాన్ల ద్వారా సరఫరా చేశారు. యాత్రీకుల నుంచి వాట్సప్‌ లేదా నిర్దేశిత ఫోన్‌ నంబరు ద్వారా తీసుకున్న ఆర్డర్లను వారికి నేరుగా అందించారు. రాయితీ మీద గోధుమ పిండి, బియ్యాన్ని 10 కేజీల పొట్లాల్లో, పెసరపప్పు, కందిపప్పు, సెనగపప్పును ఒక కేజీ పొట్లాల్లో భక్తులకు సమకూర్చారు. కొత్తగా 25వేల రేషన్‌ కార్డులు, 3,500 గ్యాస్‌ కనెక్షన్లు, 35 వేలకు పైగా గ్యాస్‌ సిలిండర్లను అందించారు. రోజుకు 5,000 గ్యాస్‌ సిలిండర్లను రీఫిల్‌ చేశారు. రోజూ 20 వేల మందికి ఉచితంగా భోజనం పెట్టారు.

గగన వీధులన్నీ కుంభమేళా వైపే..!

మహాకుంభమేళాను పురస్కరించుకొని 45 రోజలపాటు భక్తుల రద్దీని తట్టుకోవడానికి వీలుగా ప్రయాగరాజ్‌ విమానాశ్రయాన్ని అత్యంత అధునాతనమైన సౌకార్యాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దేశంలో అనేక నగరాలకు, ప్రయాగరాజ్‌కు మధ్య పర్యాటకులకు నిరంతరాయంగా విమాన సర్వీసులు అందించడం కోసమని ఎల్లెయన్స్‌ ఎయిర్‌తో ఓ భాగసామ్య ఒప్పందం చేసుకుంది. జనవరిలో కొత్తగా 81 విమానాలు గగన వీధుల్లోకి వచ్చాయి. దీంతో మొత్తం విమానాల సంఖ్య 132కు పెరిగింది. విమాన పర్యాటకులు నెలకు దాదాపు 80 వేల సీట్లను వినియోగించుకున్నారు. డిసెంబర్‌, 2024లో 8 నగరాలకే పరిమితమైన డైరెక్ట్‌ కనెక్టివిటీ 17 నగరాలకు పెరిగింది. ప్రయాగరాజ్‌ నుంచి విమానాలు శ్రీనగర్‌, విశాఖపట్టణంను కలుపుకొని 26 నగరాలకు రాకపోకలు సాగించాయి. వారానికి 30,172 ప్రయాణికులు, 226 విమానాలతో ప్రయాగరాజ్‌ విమానాశ్రయం పండుగ వాతావరణాన్ని చవిచూసింది. ఈ విమానాశ్రయం నుంచి తొలిసారి అన్నట్టుగా ఒక్కరోజులో 5,000 మందికిపైగా యాత్రీకులు విమానాలెక్కారు. 106 ఏళ్ల విమానాశ్రయ చరిత్రలో మొట్టమొదటిసారిగా పగలు, రాత్రి తేడా లేకుండా విమానాలు తిరిగాయి.

ప్రతి 10 నిమిషాలకో బస్సు..!

మహాకుంభమేళాలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున మొత్తంగా 4,250 బస్సులు యాత్రీకులను ప్రయాగరాజ్‌ చేర్చడమే పనిగా రోడ్ల మీద తిరిగాయి. నగరంలో రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చడం కోసమని రంగంలోకి దిగిన 750 స్పెషల్‌ షటిల్‌ బస్సులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్‌ స్టేషన్ల వద్ద ప్రతి రెండు నిమిషాలకు అందుబాటులో ఉంటూ భక్తులను ఎక్కించుకొని తిప్పాయి.

పోలీసులే పెన్నిధి

మహాకుంభమేళా సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు భక్తులకు అండగా నిలిచారు. అనూహ్యమైన అంకిత భావాన్ని ప్రదర్శించారు. విధుల పట్ల నిబద్ధత వారికి అంతర్జాతీయ గుర్తింపును సంపాదించి పెట్టింది. యోగి ప్రభుత్వం సమర్థమంతమైన నిర్వహణకు తార్కాణమైంది. ఆ క్రమంలో యూపీ పోలీసులు 15 దేశాలు, 20 రాష్ట్రాల నుంచి వచ్చి తప్పిపోయిన భక్తులను, వారి కుటుంబాలతో కలపడంలో విజయవంతమైనారు. మచ్చుకు కొన్ని నిదర్శనాలు..

రాజస్థాన్‌లో జైపూర్‌ నుంచి వచ్చిన పుష్పేంద్ర సింగ్‌ షెకావత్‌ ఫిబ్రవరి 17న తన వాలెట్‌ పోగొట్టు కున్నారు. అందులో రెండు ఐఫోన్లు, రూ.69 వేల నగదు, ఓ బంగారు గొలుసు, రెండు ఉంగరాలు, ఏటీఎం కార్డులున్నాయి. అయితే అదృష్టవశాత్తూ అరెయిల్‌ ఘాట్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారి అరవింద్‌ కుమార్‌ సింగ్‌కు ఆ వాలెట్‌ దొరి కింది. వాలెట్‌లో ఉన్న మొబైల్‌ ఫోన్‌లో కాంటాక్టుల ఆధారంగా అధికారి సింగ్‌ షెకావత్‌కు వాలెట్‌ను భద్రంగా అందించారు. చత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌ నుంచి వచ్చిన రాజకుమారి యాదవ్‌ కుంభమేళాలో ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు. కానిస్టేబుళ్లు ప్రశాంత్‌కుమార్‌, రవీంద్ర సింగ్‌ వెంటనే ఓ అంబులెన్సును పిలిపించి ఆమెను ఓ ఆస్పత్రిలో చేర్పించారు. రష్యా నుంచి వచ్చిన భక్తురాలు రీటా జనవరి 29న సంగమం వద్ద పవిత్ర స్నానమాచరి స్తుండగా తన కుటుంబ సభ్యుల నుంచి తప్పి పోయారు.

దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆమెకు కానిస్టేబుల్‌ అమర్‌దీప్‌ అండగా నిలిచారు. ఆమెను కుటుంబ సభ్యులతో కలిపారు. జర్మనీ నుంచి వచ్చిన ఓ భక్తుల బృందం జనవరి 15న నవాబ్‌గంజ్‌కని బయలు దేరి దారి తప్పింది. వారు సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరు కోవడంలో కానిస్టేబుల్‌ రాజుసింగ్‌ ఎంతగానో తోడ్ప డ్డారు. బెంగళూరునుంచి వచ్చిన శోభ జనవరి 15న కుంభమేళాలో గాయపడ్డారు. కానిస్టేబుల్‌ సుర్జీత్‌ యాదవ్‌ వెంటనే రంగంలోకి దిగి ఆమెకు ఓ అంబులెన్సు ఏర్పాటు చేశారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందేలా చేశారు. జనవరి 24న సంగమ్‌ మార్గ్‌లో కారు నడుపుకుంటూ వెళుతున్న వివేక్‌ భారతి ఉన్నట్టుండి మూర్చ వ్యాధికి లోనయ్యారు. కానిస్టేబుళ్లు గురుదీప్‌, కపిల్‌ కుమార్‌ వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తీసుకొనివెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కోలుకున్న వివేక్‌ భారతి కారుతో పాటుగా సురక్షితంగా ఇంటికి చేరుకోవడంలో ఇద్దరు పోలీసులు కీలకమైన పాత్ర పోషించారు.

ఆ రెండూ దురదృష్టకరం

జనవరి 29న మౌని అమావాస్యనాడు తెల్లవారు జామున రెండు గంటలకు సంగం ఘాట్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 30 మంది మరణించారు. మరో 60 మంది గాయపడ్డారు. ఫిబ్రవరి 15న ఢల్లీిలోని రైల్వే స్టేషన్‌లో మహాకుంభమేళాకు వస్తున్న యాత్రీకుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. మరణించినవారి ఆత్మలకు సద్గతులు ప్రాప్తించాలని ఆశిద్దాం.


సనాతన ధర్మానికి కుంభమేళ జోతలు

ప్రపంచంలోని ధార్మిక సమ్మేళనాలలో అగ్రగణ్యం కుంభమేళ. సనాతన ధర్మంలో అతి పెద్ద వేడుక. ఐక్యతా,ఏకత్వాల సంరంభం. విఘాతాలు సృష్టించే ఎవరెన్ని యత్నాలు చేసినా, చేస్తున్నా కొనసాగుతూ వస్తున్న అతి ప్రాచీనం, చైతన్యవంత మైన ఆధ్యాత్మిక పర్వం. ‘కుంభమేళా జరిగే ప్రాంతం మాదే’ అనే కొన్ని శక్తుల రాగాలు, ‘కుంభ్‌ మేళా కాదు.. మృత్యుమేళ’ అనే వెటకారాలు, ‘కుంభ మేళాలు, పవిత్ర స్నానాలు మూఢాచారం’లాంటి వ్యాఖ్యలు ప్రజల ఆధ్యాత్మిక భావన ముందు వెలవెలబోయాయి. దక్షిణ భారత దేశం చిట్టచివరి కొన నుంచీ వ్యయ ప్రయాసలకు ఓర్చి గంగాస్నా నానికి వెళ్లడాన్నే బట్టే దీని విశిష్టత వెల్లడవుతోంది.

మధ్య యుగంలో మౌర్య, గుప్త రాజవంశాలు కుంభమేళాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయని చరిత్ర చెబుతుండగా, శంకరభగవత్పాదుల ప్రచారంతో దీనికి మరింత ప్రాచుర్యం లభించి, అలాంటి మహనీయుల దివ్యాశీస్సులతో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆధునిక కాలంలో ప్రజా ప్రభుత్వాలు ఈ ఆధ్యాత్మిక తీర్థ సంప్రదాయాన్ని కొనసాగిస్తుండగా, ముఖ్యంగా` ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ చొరవ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన నిమిత్తం లేదు.

సృష్టికర్త సమస్త విశ్వాన్ని నీటి నుంచే సృష్టించాడట. ప్రాణులకు జలం మాతృసమానమే కాక జీవనాధారం. ఆ నీరు ప్రవహించే నదుల ద్వారానే నాగరిత వర్థిల్లింది. నదీజలాల్లోని అమృతత్వం రోగాలను నివారించి శారీరక, ఆయుర్వుద్ధి కలుగచేస్తాయని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. ‘పవిత్రమైన నీటితో మాకు తృప్తి కలిగించు’అని విన్నవించడం మన సంప్రదాయంలో కనిపిస్తుంది. నదీ స్నానం, కుంభమేళాలో పవిత్ర స్నానం గురించి పురాణాలు ఎంతో కీర్తించాయి.ఆ సమయంలో నదీజలంలో నక్షత్రాల సంగం ఉండి, స్నానాలు ఆచరించిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అందుకే, అనారోగ్యాది కారణాలతో నదీస్నానాలకు వెళ్లలేనివారు, అక్కడి నుంచి తెప్పించుకున్న తీర్థాన్ని స్థానికంగా స్నానం చేసే నీటిలో కలుపుకొనే సంప్రదాయం కనిపిస్తుంది.

ప్రపంచంలోనే ఎక్కువ మంది యాత్రికులు, భక్తులు హాజరయ్యే ఆధ్యాత్మిక సందర్భం కుంభమేళ. ఒకనాడు చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రారంభమైన ఈ తీర్థం కాలవాహినిలో అత్యంత అతిపెద్ద ఉత్సవంగా పరిణమించింది. ముఖ్యంగా యువత దీనిని ఆసక్తిగా గమనించి, ఆధ్యాత్మిక గురువుల నుంచి అనేక అంశాలను తెలుసుకునే దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.

 కుంభమేళాలు, పుష్కరాలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలు. ఇవి భారతీయులకూ, విదేశీయులకే కాదు… దేవతలకూ పరమ పావన మైనవిగా పెద్దలు చెబుతారు. ఈ సంరంభ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం ముక్తి మార్గమని, కుంభమేళా పుణ్నస్నానంతో మనస్సు, ఆత్మశుద్ధి అవుతాయని భక్తుల విశ్వాసం. త్రివేణి సంగమంలోని మూడు భాగాలను అగ్నిస్వరూప యజ్ఞవేదికలుగా భావిస్తారు. ఆయా ప్రదేశాలలో భక్తిశ్రద్ధలతో స్నానమాచరించి, ఒక్కొక్క రాత్రి బస చేయడం వల్ల త్రేతాగ్నుల ఉపాసన ఫలం సిద్ధిస్తుందని నమ్మకం. ఈ సంగమంలో మునక వేసి, పునీతులు కావడానికి దేవతలు కూడా మానవ రూపంలో దిగివస్తారని పురాణగాథ.

ప్రజలలో జాతీయ,నైతిక, ఆధ్యాత్మిక భావనల వృద్ధికి కుంభపర్వం దోహదపడుతుందని విజ్ఞులు అంటారు. గంగానదిలో కార్తికంలో వెయ్యిసార్లు స్నానాలు, మాఘంలో వంద సార్లు స్నానాలు, నర్మదలో వైశాఖంలో కోటిసార్లు స్నాన ఫలం ప్రయాగ్‌ కుంభమేళ స్నానంతో సమానమని స్కంద పురాణం పేర్కొంటోంది. అక్కడ మాఘ స్నానం అత్యంత పుణ్యప్రదమన్న ౖపద్మపురాణం వాక్కు మేరకు ఇటీవలే ముగిసిన కుంభమేళాలో భక్తులు పోటెత్తారు. అమావాస్య నాటి స్నానం పరమోత్తమం అనే నానుడి ప్రకారం, జనవరి 29న మౌని అమావాస్యనాడు అతి పెద్ద స్నానోత్సవం జరిగింది. పూర్వికులను స్మరించుకుంటూ స్నానమాచరించి, దానాలు చేయడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయన్న విశ్వాసాన్ని ఆచరణలో పెట్టారు. హిమాలయ గుహలలో తపస్సు చేసుకునే మహాత్ములు, యోగులు, నాగసాధువులు, వివిధ సంప్రదాయాల గురువులు, ఆచార్యులు ప్రవచనాలు, సందేశాలతో ఆధ్యాత్మిక వెల్లివిరిసింది.

ఈ ఆధ్యాత్మిక సంరంభం పట్ల వివిధ దేశాలు ఆకర్షితమయ్యాయి. విదేశీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో ఎందరో పరిశోధకులు కుంభమేళాను అసక్తితో గమనించారు. పలు మతాలకు చెందిన వారు పవిత్ర స్నానం చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుమారు 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలకు వస్తారని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. అంతకు మించి భక్తులు రావడం విశేషంగా పరిగణిస్తున్నారు.

సుమారు శతాబ్ద కాలంలో జరిగిన కుంభ మేళాలను పరిశీలిస్తే, కుంభమేళ`2025కు ఒక విశిష్టత ఉంది. అయోధ్య దివ్య భవ్యమందిర అయిదు శతాబ్దాల పైచిలుకు కల సాకారమై, సాకేత సార్వభౌముడు కొలువు దీరిన ఏడాదికే ఈ కుంభమేళ రావడం ప్రత్యేకత. 1966 నాటి కుంభమేళ అప్పటి దాకా ఎన్నడూ ఎరుగునంతటి కార్యక్రమని చరిత్ర చెబుతుండగా, ప్రస్తుత కుంభమేళా దానిని తిరగరాసింది. ఈసారి ప్రపంచవ్యాప్త భక్తులు డిజిటల్‌ ద్వారా వీక్షించారు. కుంభ మేళాలో తొలిసారిగా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌(ఏఐ) చాట్‌ సేవలు వినియోగించారు. కుంభమేళ సమాచారాన్ని 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచారు.


యూపీలో 5 ఆధ్యాత్మిక కారిడార్లు

మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్‌లో ఆధ్యాత్మిక పర్యాటకానికి సంబంధించి సరికొత్త బాటలు వేసింది. రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ప్రధానమైన ధార్మిక గమ్యంగా స్థిరపరిచింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మహాకుంభమేళా సందర్భంగా రాష్ట్రమంతటా పేరొందిన ధార్మిక ప్రాంతాలకు యాత్రీకుల రాకపోక లను మెరుగుపరచడం లక్ష్యంగా కీలకమైన ఐదు ఆధ్యాత్మిక కారిడార్లను అభివృద్ధి చేసింది. వాటి వివరాలు..

ప్రయాగరాజ్‌-వింధ్యాచల్‌-కాశీ కారిడార్‌:

ఈ కారిడార్‌ యాత్రికులను ప్రయాగరాజ్‌ నుంచి వింధ్యాచల్‌ దేవీధామ్‌కు అక్కడి నుంచి కాశీకి (వారణాసి) ప్రయాణించడానికి మార్గం సుగమం చేస్తుంది. శక్తి, మహా శివుడి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ మార్గం ఈ పవిత్రమైన స్థలాల మీదుగా ఓ ఆధ్యాత్మిక యాత్రను అందిస్తోంది.

ప్రయాగరాజ్‌-లక్నో-నైమిశారణ్య కారిడార్‌:

ఈ మార్గం భక్తులను ప్రయాగరాజ్‌ నుంచి లక్నో మీదుగా నైమిశారణ్యానికి చేరుస్తుంది. నైమిశారణ్య ధామ్‌ హిందూయిజమ్‌కు సంబంధించి 88 పవిత్రమైన తీర్థయాత్రా స్థలాల్లో ఒకటిగా నిలిచింది. ఇది 88 వేల మంది రుషుల ధ్యాన కేంద్రంగా పేరొందింది. ఈ ధామ్‌కు బ్రహ్మదేవుడు, మహా విష్ణువు, మహా శివుడు, సతీ అమ్మవారికి చెందినది.

ప్రయాగరాజ్‌-రాజాపూర్‌ (బాందా) – చిత్రకూట్‌ కారిడార్‌:

శ్రీరామచంద్రుని ప్రవాసంతో ముడిపడి ఉన్న ఈ మార్గం భక్తులను చిత్రకూట్‌ ధామ్‌కు చేరుస్తుంది. ఇది కామాద్గిరి పర్వత్‌, రామ్‌ఘాట్‌, హనుమాన్‌ ధార లాంటి పవిత్రమైన స్థలాలకు నిలయమైంది. ఈ మార్గం రామచరిత మానస్‌, వినయ్‌ పత్రిక, తదితర హిందూ ధార్మిక గ్రంథాలను రచించిన గోస్వామి తులసీదాస్‌ జన్మస్థలమైన రాజాపూర్‌ (బాందా) మీదుగా వెళుతుంది.

ప్రయాగరాజ్‌-మథుర-బృందావనం-శుక తీర్థ్‌ కారిడార్‌ (వయా బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే):

ఈ కారిడార్‌ భక్తులను బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే మీదుగా మథుర` బృందావనం, ఆ తర్వాత మహర్షి శుకాచార్యుడు ధ్యానం చేసినట్టుగా పేరొందిన శుక తీర్థానికి తీసుకెళుతుంది. యాత్రీకులు ఈ కారిడార్‌ ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముని జన్మస్థలమైన మథుర`బృందావనాన్ని సందర్శించ వచ్చు. బాలకృష్ణుని లీలలతో ముడిపడిన ప్రాంతాలను దర్శించుకొని, ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు.

ప్రయాగరాజ్‌-అయోధ్య-గోరఖ్‌పూర్‌ కారిడార్‌:

ఈ కారిడార్‌ శ్రీరామచంద్రుడు, గోరఖ్‌నాథ్‌ సంప్రదాయాలకు చెందిన ప్రాంతాలను అనుసంధానం చేస్తుంది. భక్తులు ప్రయాగరాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత లేటె హనుమాన్‌ దేవస్థానం,  అక్షయ్‌ వట్‌, సరస్వతి కూప్‌ లాంటి స్థలాలను సందర్శించుకో వచ్చు. అనంతరం అక్కడి నుంచి అయోధ్యకు బయలుదేరి వెళ్లి బాలరాముడి దర్శనం చేసుకోవచ్చు. భక్తులు అయోధ్య నుంచి గోరఖ్‌నాథ్‌ చేరుకొని గోరఖ్‌నాథ్‌ దేవస్థానంలో ఆశీస్సులు కోరవచ్చు.


జాతి చేతనత్వం జాగృతం

‘‘మహా కుంభమేళా సంపూర్ణమైంది.. ఐక్యతా మహా యజ్ఞం సంపూర్ణమైంది. ఎప్పుడైతే జాతి చేతనత్వంతో జాగృతమైందో, ఎప్పుడైతే వందల యేళ్ల నాటి బానిస మనస్తత్వపు బంధనాలను తెంచుకొని సరికొత్త చేతనత్వంతో శ్వాస తీసుకోవడం ఆరంభిం చిందో సరిగ్గా అలాంటి ఓ దృశ్యమే జనవరి 13 నుంచి ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా ఐక్యతలో మన ముంగిట సాక్షాత్కరించింది. జనవరి 22, 2024న నేను అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో భగవద్భక్తి ద్వారా దేశభక్తి గురించి మాట్లాడాను.

ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా సందర్భంగా సర్వ దేవీ దేవతలు గుమిగూడారు. పిల్లలు, వృద్ధులు గుమిగూడారు. మహిళలు, యువత గుమిగూడారు. మనమంతా జాగృతమైన దేశ చేతనత్వానికి సాక్షుల మైనాము. ఈ మహాకుంభమేళా ఓ ఐక్యతా మహా కుంభమేళా. ఈ వేడుక ద్వారా 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసం 45 రోజులపాటు ఐక్యమైంది. ఆ విశ్వాసం మహాకుంభమేళాతో మమేకమైపోవడం ఓ అద్భుతం. నేను గడచిన 45 రోజులుగా ప్రతి రోజూ దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు త్రివేణి సంగమ తీరానికి ఎలా చేరుకుంటున్నదీ చూశాను. సంగమం వద్ద స్నానం చేయాలనే భావోద్వేగాల కెరటం నానాటికీ ఉధృత మైంది. ప్రతి ఒక్క భక్తుడి ధ్యాస సంగమం వద్ద ఒక్కసారైనా స్నానం చేయాలనేదానిమీదే ఉంది. పవిత్రమైన గంగ, యమున, సరస్వతీ నదుల సంగమం ప్రతి భక్తుడి ఉత్సాహం, శక్తి, విశ్వాసంతో నిండి పోయింది. నేడు ఇంత పెద్ద వేడుకకు ప్రపంచంలో మరేదీ సాటి రాదు. అమెరికా జనాభాకు రెండిరతలు అన్నట్టుగా కోట్లాది భక్తులు మేళాలో పాల్గొన్నారు. చిన్ని కృష్ణుడు యశోద మాతకు యావత్‌ ప్రపంచాన్ని తన నోటిలో చూపించినట్టుగా, 144 యేళ్ల తర్వాత జరుపుకున్న మహాకుంభమేళాతో యావత్‌ భారతీయులు, ప్రపంచమూ భారత్‌ శక్తిని విరాట్‌ రూపంలో దర్శించుకున్నారు. వేదాల నుంచి వివేకానందుడి వరకు, ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల వరకు భారత్‌ ఘనమైన సంప్రదాయాలు ఈ జాతికి ఓ రూపానిచ్చాయి. ఈ ఐక్యతా మహాకుంభమేళా మన నదులను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకునేలా మనకు స్ఫూర్తినిచ్చింది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత తేలిక కాదని నాకు తెలుసు. నేను గంగా మాత, యమునా మాత, సరస్వతి మాతను వేడుకుంటున్నాను. ఏమనంటే.. ఓ మాత మిమ్మల్ని కొలుచుకోవడంలో మేమేదైనా తక్కువ చేసి ఉంటే దయచేసి మమ్మల్ని మన్నించు. భగవత్‌ స్వరూపులైన భక్తులకు సేవ చేయటంలో మేమేదైనా తక్కువ చేసి ఉంటే నన్ను మన్నించాలని అశేష జన వాహినిని ప్రార్థిస్తున్నాను. నేను ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎంపీగా ఓ మాట గర్వంగా చెబుతున్నాను. అదేమి టంటే యోగీజీ నేతృత్వంలో ప్రభుత్వమూ, అధికార యంత్రాంగమూ, ప్రజలూ ఒక్కతాటిపై నిలబడి ఈ ఐక్యతా మహాకుంభమేళాను దిగ్విజయం చేశారు. అది కేంద్రం కావొచ్చు, రాష్ట్రం కావొచ్చు, పాలకుడు కావొచ్చు, అధికారి కావొచ్చు ప్రతి ఒక్కరూ కూడా భక్తిభావాన్ని అణువణువునా నింపుకున్న ఓ సేవకుడైనారు. ప్రత్యేకించి ప్రయాగరాజ్‌ వాసులు, ఉత్తరప్రదేశ్‌ ప్రజలు ఈ 45 రోజులూ ఎన్ని కష్టనష్టాలు ఉన్నప్పటికీ భక్తులకు అనిర్వచనీయమైన సేవలు చేశారు. నేను వారందరికీ కృతజ్ఞతాభావంతో అభినందనలు తెలుపుతున్నాను. ఇదంతా చూశాక జాతి ఉజ్వల భవిత పట్ల నా విశ్వాసం మరింత బలపడిరది. నేను త్వరలో శ్రీ సోమనాథుని సంద ర్శించుకుంటాను. ప్రతి భారతీయుడి భక్తి, ప్రార్థనల రూపంలో నా సంకల్ప పుష్పాన్ని స్వామికి సమర్పించు కుంటాను. మహాకుంభమేళా భౌతిక రూపం మహా శివరాత్రితో సంపూర్ణమైంది. కానీ నాకైతే గంగా మాత ఎలాగైతే నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుందో అదే తీరుగా ధార్మిక చేతనత్వం, మహా కుంభమేళా ఐక్యత ఎడతెరిపి లేకుండా దేశ ప్రజల నరనరాల్లో ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తూ ఉంటా యనే ఓ గట్టి నమ్మకముంది.’’ మహాకుంభమేళా సంపూర్ణమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాటలివి.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE