తీపి గురుతులతో పాటు చేదు అనుభవాలను మిగిల్చి శ్రీకోధి నామ సంవత్సరం వీడ్కోలు తీసుకుంటోంది. ప్రభవాది ఆరు పదుల వత్సరాలలో 39వదిగా విశ్వావసు నామ సంవత్సరం కొలువు దీరుతోంది. దీని పేరును, రీతిని బట్టి ‘ధనం సమృద్ధిగా లభిస్తుంది’ అని పంచాంగకర్తలు, జ్యోతిష ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడ అంటే ‘ధనం’ కేవలం నగదు కాదని, ఆనందారోగ్యాలు సంపద•తో సమానమని వ్యాఖ్యానిస్తు న్నారు. దాటిపోతున్న ఏడాదిలోని శుభా శుభాలను మననం చేసుకుంటూ కొత్త సంవత్సరంలో శుభాలు కలగాలని, విశ్వావసు అందరి విశ్వాసాలను నిజం చేయాలని అభిలషిద్దాం.
ప్రతి పండుగకు ఏదో హేతుబద్ధ నేపథ్యం ఉంటుంది.‘ఋతూనాం ముఖో వసంతః’ అన్న ఉపనిషద్ వాక్యాన్ని బట్టి రుతువులన్నిటిలో వసంతానిదే అగ్రస్థానం. శిశిరం తరువాత ప్రకృతి కొత్త అందాలు సంతరించుకుంటుంది. ఈ రుతువుతో ప్రారంభమమ్యే చైత్రంలో ప్రకృతి నూతనంగా వికసించినట్లే మనుషులు కొత్త దుస్తులు ధరిస్తారని స్థూలంగా చెబుతారు. బ్రహ్మ సృష్టికార్యాన్ని ఆరంభించిన రోజును పండుగలా అత్యంత వైభవంగా జరుపుకోవాలనే ఆకాంక్షకు ఉగాదికి నాంది అని చెబుతారు.
‘చైత్రే మాసి జగద్బ్రహ్మా ససర్జ ప్రథమే హని
శుక్లపక్షే సమగ్రం తు తదా సూర్యోయే సతి’
(చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినం సూర్యోదయ వేళ బ్రహ్మదేవుడు జగత్తును సృజియించాడు) అని చతుర్వర్గ చింతామణి తదితర ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కనుక సృష్టి కర్తను, కాల సంబంధ పర్వం కనుక ఆదిత్యుడిని అర్చించిన తరువాతే ఇష్టదేవతారాధన చేసి ప్రసాదం స్వీకరించాలని వేదజ్ఞులు చెబుతారు. సూర్య సిద్ధాంతం ప్రకారం, సృష్టి ఆరంభమై 1,95,58,85,125 సంవత్సరాలు. చాంద్రమాన పంచాంగ కర్తల ప్రకారం, కలియుగం ప్రారంభమై ఇది 5,127వ సంవత్సరం.
సంవత్సరాదిగా వ్యవహరిస్తున్న ఉగాది పండుగ నిర్ణయంపై కొన్ని వాదనలు ఉన్నాయి. ఒకప్పడు కార్తెలను బట్టి రుతు నిర్ణయం జరిగేదట. ఉత్తరాయణ ప్రవేశ కాలంలో.. అంటే… ధనిష్ఠా కార్తెతో ప్రారంభ మైన శిశిర రుతువుతో మాఘ పూర్ణిమ నుంచి సంవత్సరం ప్రారంభమయ్యేదని పరిశోధన గ్రంథాలు పేర్కొంటున్నాయి. కృతయుగం వైశాఖ శుద్ధ విదియ నాడు, త్రేతాయుగం కార్తిక శుద్ధ నవమి నాడు, ద్వాపరయుగం శ్రావణ శుద్ధ త్రయోదశి నాడు, ఈ (కలి)యుగం చైత్రశుద్ధపాడ్యమి నాడు ప్రారంభ మయ్యాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.
చంద్రుడి గమనం ద్వారా తిథి, నక్షత్రాలను తెలుసుకోవడాన్ని చాంద్రమానం అంటారు. తెలుగువారు దీనినే పాటిస్తారు.
‘ఉ’ అంటే నక్షత్రం, ‘గ’ అంటే గమనం.‘ఉగ’ అంటే.. నక్షత్ర గమనం. ‘ఉగాది’ అంటే నక్షత్ర గమనాన్ని లెక్కింపు మొదలు పెట్టిన రోజు అని కొందరి అభిప్రాయం. కొన్ని పండుగల విషయంలో తిథి, నక్షత్రాలే ప్రధాన పాత్ర వహిస్తాయని పంచాంగకర్తలు చెబుతారు. ధర్మశాస్త్రాలూ పేర్కొంటున్నాయి. ఉదాహరణకు ఉగాదినే తీసుకుంటే… సూర్యోదయానికి పాడ్యమి ఉంటేనే సంవత్సరాది. మధ్యాహ్నానికి చవితి, నవమి తిథులు ఉంటేనే వినాయక చవితి, శ్రీరామ నవమి. అర్థరాత్రి వేళకు అష్టమి తిథి ఉంటేనే కృష్ణాష్టమి.
ఉగాది పర్వానికి పౌరాణిక, చారిత్రక, సామాజిక పరంగా అనేక విశిష్టతలు ఉన్నాయి. సోమకుడనే దానవుడు అపహరించిన వేదాలను కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే మత్స్యావతారం దాల్చాడని ఐతిహ్యం. శ్రీరామచంద్రుడు, ధర్మరాజు,మహావీరుడు విక్రమాదిత్యుడు, శాలివాహనుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే పట్టాభిషిక్తులయ్యారు.
ఉగాది పచ్చడి సేవనం కేవలం మొక్కుబడి కాకూడదంటారు పెద్దలు. ఇందులోని ఆరు రుచులతో మానవ జీవితం ముడిపడి ఉంది. కష్ట సుఖాలను, సుఖదుఃఖాలను ఒకేలా స్వీకరించాలని ఆ షడ్రుచుల ప్రసాదం చెబుతోంది. ప్రధానంగా తీయదనం విజయానికి, చేదును పరాజయాది అపఖ్యాతులకు ప్రతీకలుగా చెబుతారు. అంతేకాదు. ఇందులో వైద్య అంశాలు, ఆరోగ్య రహస్యం కూడా ఇమిడి ఉంది. షడ్రుచుల ప్రసాదం వ్యాధి నిరోధకశక్తిని పెంచు తుందని వైద్యశాస్త్రం పేర్కొంటోంది. ఉగాది నుంచి చైత్రపూర్ణిమ వరకు దీనిని సేవించడం వలన సంవత్సరమంతా ఎలాంటి అనారోగ్య లక్షణాలు పొడచూపవని, వాతపిత్త శ్లేష్మాలవలన కలిగే దోషాలు తొలగిపోతాయని ఆయుర్వేదం పేర్కొంటోంది ‘శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ/సర్వారిష్ట వినాశంచ నింబకందళ భక్షణమ్’ (వజ్రసమానమైన దేహం, దీర్ఘాయుష్షు లభిస్తాయి. సర్వ అభీష్టాలు తొలగిపోతాయి.) అనీ చెబుతోంది. వేపపూత పచ్చడిని ఆరగించడం సకల అరిష్టాలకు విరుగుడు (‘సర్వ అరిష్ట వినాశయ నింబకందళ భక్షణం’) అని, ‘త్వామష్ఠ శోక నరాభీష్ట,మధుమాస సముద్భవ/నిబామి శోక సంతప్తాం మమశోకం సదాకురు’(మధుమాసంలో పుట్టి శోకబాధలను దరిచేరనివ్వని వేప కుసుమమా! నన్నెల్లప్పుడు శోకరహితుడిని చెయ్యి) అనే శ్లోకాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడిని స్వీక•రించాలని శాస్త్రవచనం.
ఈ ప్రసాదం తయారీలో వినియోగించే ప్రతి పదార్థానికి ఒక ప్రత్యేకత• ఉందని వాటి వినియోగంలో తెలుస్తుంది. ఉదాహరణకు, బెల్లం-వేప కలిపి తినడం వల్ల దేహం వజ్ర సమం అవుతుందట. సంవత్సరానికి ఒకసారి- ఉగాది నాడు తీసుకునే వేప ప్రసాదం వల్ల ఏడాదంతా వ్యాధులు రావా? అని సందేహం వెలిబుచ్చేవారికి శాస్త్రం సమాధానం చెప్పింది. చైత్రశుద్ధపాడ్యమి నుంచి నవమి వరకు (వసంత నవ రాత్రులు) ఉప్పు,కారం, వగరు, చేదు, పులుపు, తీపి రుచులు కలగలసిన పచ్చడి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు అని శాస్త్రాలు చెబుతు న్నాయి. గతంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు దీనిని సేవించేవారట.
కొత్త సంవత్సరంలోని పరిణామాలను (గ్రహాల కదలికలు, సంచారం, శుభాశుభ ఫలితాలు) తెలుసుకొనేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి,వార, నక్షత్ర, యోగ, కరణాలను పంచాంగం అంటారు. ఇవి పంచబ్రహ్మల సృష్టి అని శాస్త్ర వచనం.
‘తిథి ప్రోక్తం మనుబ్రహ్మ వారస్య మయసంభవం
నక్షత్రం త్వష్టృ రూపంచ శిల్పయోగం తదైవచ
దైవజ్ఞం కరణం చైవ ఇత్వేతత్ అంగలక్షణం’
-మనుబ్రహ్మ తిథిని, మయబ్రహ్మ వారాన్ని, త్వష్టృబ్రహ్మ నక్షత్రాన్ని, శిల్పి బ్రహ్మ యోగాన్ని, విశ్వజ్ఞ బ్రహ్మ కరణాన్ని సృష్టించారని శాస్త్రం. వీటిని దేవతా స్వరూపాలుగా సంభావించి నిత్యం తలచుకోవడం కాలదేవతాశక్తిని ఆరాధించడమేనని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ‘శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం/గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం/ఆయుర్వృద్ధి దముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం/నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతామ్’ (పంచాంగ శ్రవణం వలన సంపదలు కలిగి సద్గుణాలు అలవడతాయి. శత్రువులు నశిస్తారు. చెడు కలలు తొలగిపోతాయి. గంగా స్నాన, గోదాన ఫలితం లభిస్తుంది. ఆయుష్షు పెరుగుతుంది. సంతానం కలుగుతుంది. అంటే వంశాభివృద్ధి సంప్రాప్తిస్తుంది) అని ‘పంచాగ’ శ్రవణం విశిష్టతను శ్లాఘించారు.
నవనాయకుల గణన ద్వారా సంవత్సర ఫలితాలను మదింపు చేస్తారు. అంటే.. రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, ఆర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి. అందించే ఫలాలను, శుభాశుభ ఫలితాలు, లాభనష్టాలు, కష్టసుఖాలు, సంఘటనలు లాంటివి చెబుతారు. రాశి ఫలాలను తెలుసుకోవడం ద్వారా వాటిని ముందే అవగాహన
చేసుకొని కార్యక్రమాలు, కార్యాచరణను రూపొందించు
కొని విజయపథంలో సాగిపోవాలన్నది పంచాంగ శ్రవణంలోని అంతరార్థమని చెబుతారు.
కవిసమ్మేళనాలు
ఉగాది నాడు పంచాంగ శ్రవణంతో పాటు కవిసమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పెద్ద ముచ్చట. ఎందరో ప్రసిద్ధ కవులు ఆ ‘సమ్మేళనాల’లో వసంత రుతుశోభను ఆహ్లాదంగా, వైభవోపేతంగా ఆవిష్కరించేవారు. కేవలం తమ కవితా ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా తమ కవితలలో సమకాలీన సమస్యలను ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారానికి సూచనలు చేస్తూ, సమసమాజ, ఆదర్శ సమాజ కాంక్షను వ్యక్తీకరిస్తారు.
ఈ పండుగను ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాలలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. తెలుగు, కన్నడ, మరాఠీయులకు తొలిపండుగ. చాంద్రమానం రీత్యా ఇది సర్వప్రథమైన రోజు. రెండు తెలుగు రాష్ట్ల్రాలు, కర్ణాటకలో ఉగాదిగా, మహారాష్ట్రలో ‘గుడిపాడ్వా’గా, తమిళులు ‘పుత్తాండ’గా, మలయాళీలు ‘విషు’, బెంగాలీలు ‘పొయ్‌లా బైశాఖ్, సిక్కులు ‘వైశాఖీ’అనీ పేరుతో… ఇలా వివిధ ప్రాంతాల వారు సంవత్స రాదిని జరుపుకుంటారు.
తిరుమలేశుడి ఆస్థానోత్సవం
తిరుమలలోని శ్రీనివాసుడికి నిర్వహించే ప్రధాన ఉత్సవాలలో ‘ఉగాది ఆస్థానం’ ఒకటి. ఆలయ కార్యక్రమాలు, ఉత్సవాలు ఉగాది నుంచే ప్రారంభ మవుతాయి. ఆ రోజు సాయంవేళలో భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి దివ్యమంగళరూపంతో మాడవీథుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం అనుగ్రహిస్తారు. ఇది నలభయ్ రోజుల పాటు.. అంటే వైశాఖ శుద్ధ దశమి వరకు కొనసాగుతుంది.
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్