కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలోని గుల్లలమోదలో నెలకొల్పే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రెండో మిస్సైల్ టెస్టింగ్ రేంజి సెంటర్ (ఎంటీఆర్- క్షిపణి పరీక్ష కేంద్రం)కు భూమిపూజకు రంగం సిద్దమవుతోంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆ ఏర్పాట్లలో ఉంది. ఇప్పటికే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్‌లో పరిపాలన భవనం పూర్తయింది. టెస్టింగ్ అవసరాలకు సంబంధించిన యూనిట్లను, బ్లాక్‌లను నిర్మించాలి. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినపుడు ఈ మిస్సైల్ టెస్టింగ్ సెంటరుకు కూడా శంకుస్థాపన చేయించే అవకాశాలున్నాయి. వాస్తవానికి ఇటీవల మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంలోనే వర్చువల్‌గా శంకుస్థాపన చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో ఆయన కార్యక్రమం నుంచి దీనిని తప్పించాల్సి వచ్చిందంటున్నారు.
మిస్సైల్ టెస్టింగ్ రేంజి సెంటర్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కావటంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రత్యేకంగా భూమిపూజ చేయించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనకు వస్తే పనిలో పనిగా ఈ టెస్టింగ్ సెంటర్‌కు కూడా శంకుస్థాపన చేయించాలని భావిస్తున్నారు. అమరావతి కార్యక్రమం లేకపోయినప్పటికీ త్వరలోనే ఆయన ద్వారానే ఈ కార్యక్రమం జరిగే అవకాశముంది.
ఎలాంటి ప్రయోగాలు
ఈ కేంద్రంలో ప్రధానంగా డీఆర్‌డివో ఆవిష్క రించే అనేక రకాల క్షిపణులను మిస్సైల్స్‌ను పరీక్షిస్తారు. పరీక్షల అనంతరం గుర్తించిన అంశాలతో వీటిని మరింత అభివృద్ధి చేస్తారు. ప్రత్యేకంగా రెండు రకాల మిసైల్స్‌ను పరీక్షించే అవకాశం ఉంది. దూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే బాలిస్టిక్ మిసైల్స్‌తో పాటు క్రూజ్ మిస్సైల్స్, యాంటీ మిస్సైల్స్ సిస్టమ్స్ వంటివి ఇక్కడ పరీక్షిస్తారు. మిస్సైల్ గైడెన్స్ ‘సిస్టమ్స్, ప్రొపల్షన్ సిస్టమ్స్‌తో పాటు అనేక కీలక సాంకేతిక విభాగాలు ఏర్పాటు చేస్తారు. సిమ్యులేషన్, డేటా విశ్లేషణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. మిస్సైల్‌ను పరీక్షించిన సందర్భంలో డేటాను విశ్లేషించేందుకు కంప్యూటర్ ఆధారితంగా సిమ్యులేషన్ వ్యవస్థలను ఉపయోగించుకుంటారు.
భౌగోళిక పరిస్థితులు అనుకూలం
ఈ క్షిపణి పరీక్షా కేంద్రానికి ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులే అనుకూల అంశాలుగా డీఆర్‌డీవో భావించింది. ఉపగ్రహం నుంచి ఈ ప్రాంతాన్ని పరిశీలించినా పరీక్షలు జరిపే స్థలంపై ఎక్కువ సమయం నీడ పడే అవకాశం ఉండటంతో రక్షణపరంగా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ జరిగే పరీక్షల గురించి ఇతర దేశాలు పసిగట్టే అవకాశం ఉండదని రక్షణ రంగ నిపుణులు అంచనా వేశారు. దీనికి తోడు క్షిపణి పరీక్షలు నిర్వహించే ప్రదేశం గుల్లలమోదలో ఇప్పటికే నిర్మితమైన పరిపాలన భవనం నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉండటం జనావాసాలపై ప్రభావం చూపకపోవటం పరీక్ష కేంద్రం ఏర్పాటుకు డీఆర్డీవో ఆసక్తి చూపడానికి మరోకారణం. అలాగే దీవి ప్రాంతం చుట్టూ ఉండే సముద్రం ఎక్కువగా మెరక తేలి ఉండటంతో సముద్రమట్టం గుండా ఈ ప్రాంతానికి ఇతర దేశాల రక్షణ ఓడలు రావటానికి ప్రతికూల అంశమని చెబుతున్నారు.
దశాబ్దంన్నరగా ఎదురుచూపులు
రాష్ట్ర విభజనకు ముందే కేంద్ర ప్రభుత్వం ఈ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని మంజూరు చేసింది. కాని అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర విభజన తరువాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చొరవ కారణంగా కదలిక వచ్చింది. 381 ఎకరాలను కేటాయించగా, ఈ భూముల ప్రాంతంలో మడ అడవులు ఉండటంతో పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అడవులకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి భూములు కేటాయించడంతో సమస్య తొలగింది. ఈ ప్రాంతం సీఆర్‌జెడ్ పరిధిలో ఉండటంతో దాని నుంచి కూడా కేంద్రం 2018లో మినహాయింపునిచ్చింది. ఆ మరుసటి సంవత్సరం ఆగస్టు 9న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ రెండోదశ అనుమతులు కూడా ఇవ్వటంతో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్డీవో చుట్టూ రక్షణ గోడ, పరిపాలన భవనం నిర్మించింది. తొలిదశలో రూ.1800 కోట్లకుపైగా అంచనాతో పనులు ప్రారంభించి 2021లో పూర్తి చేయాలని డీఆర్‌డీవో భావించింది. అందుకు గన్నవరం సమీపంలో అతిథిగృహాల నిర్మాణం, ముఖ్య శాస్త్రవేత్తల నివాస సముదాయాలకు స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.అయితే నాటి వైసీపీ ప్రభుత్వం స్పందించకపోవటంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేక ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇటీవల ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావటంతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు డీఆర్‌డీవో అంగీకారం తెలపటంతో ప్రాజెక్టు పట్టాలెక్కింది. గత అక్టోబరు నెలలో 10వ ప్రధాని మోదీ నేతృత్వంలోని సెక్యూరిటీ కమిటీ కౌన్సిల్ ఈ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇటీవలే ఈ కేంద్రం పరిపాలనా భవనం పనులు పూర్త య్యాయి. క్షిపణి పరీక్షకు సంబంధించిన మిగిలిన విభాగాలను కూడా ఏర్పాటు చేయాలి. రానున్న ఐదేళ్లలో రూ.26వేల కోట్ల మేర డీఆర్‌డీవో ఖర్చు చేసే అవకాశాలున్నాయి.
ఉపాధి అవకాశాలు మెరుగు
రక్షణ పరీక్ష కేంద్రం ఏర్పాటుతో యువతకు భారీఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావించవచ్చు. వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు, అందునా రక్షణ రంగ ప్రాజెక్టు కావటంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని స్థానికులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ డీఆర్డీవోకు విడిపరికరాలు తయారుచేసే వందలాది చిన్న యూనిట్లు వెలిశాయని, అలాంటి అవకాశాలే ఇక్కడా మెరుగుపడతాయని డీఆర్‌డీవోకు విడిభాగాలు అందించే దివి పారిశ్రామికవేత్త ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేంద్రానికి మౌలిక వసతులు సమకూర్చే క్రమంలో స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అలాగే కార్మికులకు ఓ టౌన్‌షిప్ వచ్చే అవకాశం ఉందని, దీంతో ఈ ప్రాంత ప్రజల రూపురేఖలు మారే అవకాశం ఉంది.
కృష్ణాతీరం కీలకం
గుల్లలమోదలో క్షిపణి పరీక్ష కేంద్రం కృష్ణాతీరం అభివృద్ధిలో కీలకం కానుంది. ఈ కేంద్రానికి భారీ వాహనాల రాక పోకలకు అనువుగా రహదారుల నిర్మాణం జరిగి, ఈ ప్రాంతానికి బయటి ప్రాంతాలతో అనుసంధానత మరింత మెరుగుపడుతుంది ఇప్పటికే మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభమవటంతో కృష్ణాతీర ప్రాంతంలో మచిలీపట్నం కీలకమైన ఓడరేవుగా నిలవనుంది. మచిలీపట్నం రేవును కలుపుతూ జాతీయ రహదారి 65ను నిర్మించాలన్న, స్ధానిక ఎంపీ విజ్ఞప్తి మేరచు డీపీఆర్‌ను తయారు చేస్తున్నారు. మొత్తం కోస్తా ప్రాంతాన్ని కలుపుతూ సాగరమాల ప్రాజెక్టు పేరుతో తీర రహదారి నిర్మాణం జరగనుంది. దీనికి తోడు రైల్వేలైన్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే రైల్వే మంత్రిత్వ శాఖ మచిలీపట్నం నుంచి బాపట్ల వరకు రైల్వేలైన్ ప్రతిపాదించగా, తొలిదశలో మచిలీపట్నం నుంచి రేపల్లె లేదా భట్టిప్రోలు వరకు కొత్త లైన్ వేసేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది.
పర్యాటకంగానూ ప్రగతి
దివిసీమలో నాగాయలంక మండలం కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో గుల్లలమోద ఉంది.చుట్టూ మడ అడవులు, ఆవల సముద్రం, ఈ రెంటినీ కలుపుతూ కృష్ణానది మొత్తంగా అందమైన ప్రదేశం గుల్లలమోద. అక్కడి దీపస్తంభం (లైట్ హౌస్), ఆ ప్రాంతంలోని పచ్చదనాన్ని చూసేందుకు ప్రకృతి ప్రేమికులు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
నాగాయలంక పడవల రేవు నుంచి ప్రత్యేక పడవుల్లో గులల్లమోదకు చేరుకోవచ్చు. సొర్లగొంది. గుల్లలమోద, సంగమేశ్వరం, ఎదురు మొండి గ్రామాల నుంచి కృష్ణానదీ పాయల్లో ప్రయాణించి గుల్లలమోద దీపస్తంభం చేరుకోవచ్చు. దీనిని బ్రిటీష్ కాలంలో నిర్మించగా, 1972 సంవత్సరంలో ఆధునికీ కరించారు. తొమ్మిది అంతస్తులతో ఉన్న దీని ఎత్తు 135 అడుగులు.
1977లో వచ్చిన పెను ఉప్పెనతో ఐదో అంతస్తు వరకు వరద నీరు చేరినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ దీపస్తంభాన్ని ఆధునికీకరంచిక ముందు సాయంకాలం దీప స్తంభాల అద్దాలను తుడిచి కిరోసిన్ దీపం వెలిగించే వారు. సుమారు 25 కిలో మీటర్ల దూరం వరకు దాని కాంతి కిరణాలు పడేవి. తదనంతరం దీపస్తంభాన్ని సోలార్ దీపంగా ఆధునీకరించారు.
ఛార్జీల భారం
గుల్లలమోద దీపస్తంభం ప్రత్యేకతను సంతరించు కుంది. ఈ ప్రాంత అందాలను తనివితీరా చూడాలంటే రానుపోను ఆరు గంటలపాటు 20 కిలోమీటర్ల పైగా లాంచీలో వెళ్లాలి. మత్స్యకారులు ఎక్కువ మొత్తాలను వసూలు చేస్తున్నారు. గుల్లలమోద దీప స్తంభాన్ని చూడాలని ఆసక్తి ఉన్నా… పడవ ప్రయాణంలోని భారీ చార్జీలను చెల్లించలేక పేద ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు. దీప స్తంభం ప్రాంతాన్ని పాపికొండల తరహాలో అభివృద్ధి చేయాలి. వారానికి రెండుసార్లు పర్యాటక శాక పడవలను నడపాలి. పిల్లల పార్క్, దివిసీమ చరిత్ర తెలిపే మ్యూజియం ఏర్పాటు చేయాలి. మంచినీరు, భోజన, అల్పాహారం సౌకర్యాలు ఏర్పాటుచేయాలని, సందర్శకులకు తక్కువ ఛార్జీలు నిర్ణయించాలని పర్యాటకులు కోరుతున్నారు.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్