దేవుడు మరణించాడు అన్న నీషే వ్యాఖ్య ఎంత సంక్షోభం సృష్టించిందో, మతం మత్తుమందు అన్న కారల్ మార్క్స్ పిలుపు ఎంత సంచలనమో తెలియనిది కాదు. ఇప్పుడు చరిత్ర నిర్ఘాంతపోయే మరొక మాట వినిపిస్తున్నది. ఇప్పుడు మరొక మాట – తీవ్రవాద వామపక్షవాదం – తీవ్రవాద ఇస్లాం కలసి పనిచేయడం – ఆ రెండిరటినీ మించి ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న మాట. ఈ పరిణామాన్నే ప్రపంచానికి బాగా పరిచయమైన పదబంధంతో చెబితే, అదే – రెడ్-గ్రీన్ అలయెన్స్. ఇంతకీ ఇంత విప్లవాత్మక మార్పు ఎవరిది? మారినది ఇస్లామిస్టులు కాదు. మార్క్సిస్టులే. మతం మత్తుమందు అంటూ శతాబ్దాలుగా అరిచిన గొంతులు ఇప్పుడు మతమే సర్వస్వం అన్న మతంతో కలసి నడుస్తున్నాయి. తాత్కాలికంగా తమ స్వరం మార్చి ఇస్లామిస్టులు పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకం, ప్రపంచీకరణకు వ్యతిరేకం, వలసవాద వ్యతిరేకం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం వంటి నినాదాలు అందుకున్నారు. ‘పాశ్చాత్య సామ్రాజ్యవాదం’ అంటూ పురోగామి ముస్లిం వర్గం కూడా గొంతు చించుకుంటున్నది. పొలిటికల్ ఇస్లాం, రాడికల్ లెఫ్ట్ కలయికగా దీనిని చెబుతున్నారు. మతానికీ, రాజకీయాలకీ మధ్య పెద్దగా దూరం పాటించని ఇస్లాంలోనూ; హింసాయుత పంథాలో కార్మిక నియంతృత్వం ఆవిర్భవిస్తుందని ప్రవచించే కమ్యూనిస్టులకు రాడికల్ అన్న పదం సమంగా విశేషణంగా అలరారుతున్నది. ముస్లిం మతోన్మాదం, వామపక్ష ఉగ్రవాదం ప్రశాంతంగా మార్పు తెచ్చిన ఉదాహరణలు ఎక్కడా ఉండవు. చాలా చిత్రంగా ఈ రెండు విశ్వాసాలు ఇప్పుడు హిట్లర్ కాలం నాటి గోబెల్స్‌ను ఆవాహన చేసుకున్నాయి. కేవలం అసత్యాలతో తమ ప్రత్యర్థులను అన్ని రకాలుగా నిస్సహాయులను చేయాలని చూస్తున్నాయి.
పాలస్తీనా-ఇజ్రాయెల్ ఘర్షణ తారస్థాయికి చేరుకున్న తరుణంలో అనుకోకుండా ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ వెల్లడైనదే రెడ్-గ్రీన్ బంధం. ఆ బంధం గతంలో అంకుర దశలో ఉన్నప్పటికి ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఇంకాస్త బలోపేతం కావడానికి ఎంత ప్రయత్నం జరుగుతున్నదో ప్రపంచానికి స్పష్టంగా కనిపించడం కూడా ఆ ఘర్షణ నేపథ్యం లోనే జరిగింది. రెడ్-గ్రీన్ అలయెన్స్ అన్న పదం 21వ శతాబ్దం ఆరంభంలో అంటే 2000 సంవత్సరంలో మొదటి సారిగా ఫ్రాన్స్‌లో వినపడిరది. ఆ కలయిక ఒక్కసారిగా ప్రపంచం అనుభవంలోకి రావడానికి ఉపయోగపడినది ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం.
అక్టోబర్ 7,2023న పాలస్తీనా లోని హమాస్ స్థావరాల మీద దాడి తరువాత ఇజ్రాయెల్ మీద కొన్ని దేశాలు, కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు, చాలా విశ్వవిద్యాల యాలు, రాజకీయ పార్టీలు విమర్శల యుద్ధాన్ని తీవ్రం చేశాయి. ఇజ్రాయెల్ దేశం మీద పాలస్తీనా మొదటిగా దాడికి దిగిన వాస్తవాన్ని కప్పిపుచ్చి ఇజ్రాయెల్‌దే దురాక్రమణ అంటూ ప్రపంచంలో చాలా దేశాలలో ప్రదర్శనలు జరిపిన సంగతి తెలిసిందే. ఇవి అచ్చంగా రెడ్`గ్రీన్ బంధంలోనివే. హమాస్ అధీనంలో ఉన్న ఇజ్రాయెలీ బందీల ఫోటోలతో కూడిన పోస్టర్లను చించివేయడం దగ్గర నుంచి ఇజ్రాయెల్ అనుకూల ప్రదర్శకుల మీద, హమాస్ దాడిని నిలదీసిన వారి మీద, వీరి ప్రదర్శనల మీద దాడులు జరగడం వరకు ఈ అలయెన్స్ ప్రతాపం కనిపిస్తుంది. రెడ్`గ్రీన్ అనైతిక బంధం ఇప్పుడు పాశ్చాత్య దేశాలలోని ప్రతి పెద్ద పట్టణంలోను తలెత్తింది. ఇజ్రాయెల్‌నీ, అమెరికానీ జమిలిగా దూషించడం అందులో భాగమే. పాలస్తీనా విమోచన అన్న నినాదం కూడా ఇస్తున్నారు. ఇందులో పాలస్తీనాలో హమాస్ సంస్థ మీద ఇజ్రాయెల్ సేనలు చేసిన దాడులు అకృత్యాలు మాత్రమే వినిపిస్తాయి. హమాస్ క్రూరత్వం వినిపించదు. హమాస్, పాలస్తీనా అమాయకులన్న ముద్రతో కనిపిస్తాయి.
దాదాపు ఆరుదశాబ్దాల క్రితం ఇరాన్ షా మహ్మద్‌రెజా ఫాల్వి ప్రపంచానికి ఒక హెచ్చరిక చేశారు. ‘రెడ్-బ్లాక్ పొత్తు ఏర్పడింది, తస్మాత్ జాగ్రత్త’ అన్నదే ఆ హెచ్చరిక. అందులో రెడ్ అంటే వామ పక్షం. బ్లాక్ అంటే ఇస్లామిస్టులు. ఈ హెచ్చరికను విని పశ్చిమ దేశాలు నవ్వేశాయి. 9/11కి ముందు ముస్లిం ఉగ్రవాదం గురించి భారత్ ఘోష వినడానికి అవి ఎలా నిరాకరించాయో, అప్పుడు కూడా ఫాల్వి పిలుపును గమనంలోకి తీసుకోవడంలో దారుణంగా విఫలమైనాయి. కానీ ఇవాళ అదొక వాస్తవం. అయితే ఒక రంగు మారింది. రెడ్-గ్రీన్ మిశ్రమం ఇప్పుడు పశ్చిమ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. రెడ్ అంటే అతివాద వామపక్షం. గ్రీన్ అంటే రాడికల్ ఇస్లామిజం. అంటే ఇస్లామిక్ ఉగ్రవాదం.
అరవై సంవత్సరాల క్రితం కమ్యూనిస్టులు ఒక నినాదం ఇచ్చేవారు. అది, ‘మతం మత్తుమందు’. ఆ సూత్రాన్ని కమ్యూనిస్టులు అదే నిత్యం అదే సత్యం స్థాయిలో పాటిస్తారని పశ్చిమ దేశాలు పిచ్చి భ్రమలలో ఉండిపోయాయి. అందుకే ఇస్లామిస్టులతో కమ్యూనిస్టులు లేదా అతివాద వామపక్షవాదులు కలవడం సూర్యుడు పశ్చిమాన్ని ఉదయించడమే నన్నంత గాఢంగా నమ్మేశారు. అది కాస్తా ఇవాళ భగ్నమైంది.
అమెరికాకు చెందిన అస్రా నొమాని చిరకాలంగా ఇస్లామిస్ట్ ఉగ్రవాదానికి (ముస్లిం ఉగ్రవాదం) వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇస్లాం, ఇస్లామిజం వేర్వేరని ఆమె చెబుతారు. ఆహా ఫౌండేషన్(పశ్చిమ దేశాలలో ఉదారవాద వేదిక)కు సన్నిహితంగా ఉంటారు. ఆమె స్నేహితుడు ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ విలేకరి డేనిjల్ పెర్ల్‌ను 2022లో ఉగ్రవాదులు హత్య చేసిన తరువాత తన ప్రచారాన్ని నొమాని ఉధృతం చేశారు. ఆమె అభిప్రాయాలు గమనిస్తే (ఆహా ఫౌండేషన్ సభ్యులతో పంచుకున్నవి) ఇస్లామిజం, వామపక్ష తీవ్రవాదం మధ్య బలపడిన బంధం బాగా అర్ధమవుతుంది. తన మిత్రుడు హత్యకు గురైన తరువాత ఆమె ఇస్లామిజం బెడద, ప్రమాదాల గురించి ప్రపంచాన్ని హెచ్చరిస్తూ పలు గ్రంథాలు రాశారు. అవి అమెరికా కాంగ్రెస్ పరిశీలనకు కూడా వెళ్లాయి. ఎరుపు`ఆకుపచ్చ (వామపక్షం-ఇస్లామిజం) బంధం గురించి వివరిస్తూ ఆమె ఎన్నో వ్యాసాలు కూడా రాశారు. అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఇటీవలనే ‘వోక్ ఆర్మీ’ పేరుతో పుస్తకం వెలువరించిన ఆమె తన అభిప్రాయాలు, రెడ్-గ్రీన్ బంధంలో వచ్చిన కొత్త పరిణామాల గురించి వివరించారు.
ఇస్లామిజం అంటే తాలిబన్ ఇస్లాం ప్రపంచానికి ఎక్కించిన మత్తు అంటారు నొమాని. అఫ్ఘానిస్తాన్‌లో జరిగిన పరిణామాలనే, తాలిబన్ విధించిన నిబంధనలనే, అమలు చేస్తున్న మధ్యయుగాల నాటి ముస్లిం చట్టాలనే ఇస్లామిజం అనవచ్చు. అయితే నిజమైన ఇస్లాంతో ఇస్లామిజం విభేదిస్తుందని కూడా నొమాని స్పష్టం చేస్తున్నారు. ఇస్లామిజం ప్రకారం మహిళల ముఖాలు బహిరంగంగా కనిపించకూడదు. వారి గొంతులు వినపడరాదు. తాను ముస్లింనే అయినప్పటికి తన తల్లిదండ్రులు అలా పెంచలేదని అంటారామె. పైగా మహిళా సాధికారత ప్రాతిపదికగా తాను పెరిగానని కూడా చెప్పారు. ఆమె వివరణ ప్రకారం ఇస్లామిజం అనే సిద్ధాంతం చెబుతున్నది హమాస్, హిజ్బొల్లా వంటి ఉగ్రవాద సంస్థల వెనుకనే ముస్లింలు నడవమని. దాని ఆశయం పశ్చిమ దేశాలనీ, ఇజ్రాయెల్‌ని తుదిముట్టించడమే. కానీ తన తల్లిదండ్రులు న్యాయం వైపు నిలబడమని చెప్పారని నొమాని అంటున్నారు. అలాగే ఈ ఉగ్రవాదులు ఎంత ప్రమాదకారులో, హింసావాదులో, నేరగాళ్లో లోకానికి తెలియచేయడం తన పవిత్ర కర్తవ్యమని కూడా ఆమె భావిస్తున్నారు. ఇస్లామిజం అంటే ఇస్లాంకు పాలనా విధానానికి సంబంధించి కొన్ని భాష్యాలు అంటకడుతుందని చెబుతారామె. అది కూడా ఆధిపత్య ధోరణితోనే. తన మిత్రుడు పెర్ల్‌తో కలసి పనిచేసినప్పుడు ముస్లిం ఉగ్రవాదుల వ్యవస్థ మీద అధ్యయనం చేసే అవకాశం కలిగిందంటారామె. దీనికి వెనుక ఉద్దేశం ఒక్కటే. ప్రజాస్వామ్యాన్ని, వ్యక్తి స్వేచ్ఛను కాపాడడమే అని చెప్పారామె. తన మిత్రుడు పెర్ల్ యూదు జాతీయుడు కాబట్టే చంపేశారని ఆమె ఆరోపించారు. ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సూత్రాలు, విశ్లేషణ గమనిస్తే మొత్తం రెడ్-గ్రీన్ బంధంలోని ప్రమాదం అవగాహనకు వస్తుంది.
ఇస్లాం శాంతితో, పరమత సహనంతో, ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. ఇస్లామిజం ఒక రాజకీయ సిద్ధాంతం. షరియా ఆధారంగా నడిచే ముస్లిం రాజ్య నిర్మాణానికి అది ప్రాధాన్యం ఇస్తుంది. కాబట్టి వ్యక్తిగత స్వేచ్ఛకు చోటు దొరకదు. ఇస్లాం బోధించిన సమస్త విలువలను ఇస్లామిజం ధ్వంసం చేస్తుంది.
పశ్చిమ దేశాల మీద ఇస్లామిజం కక్ష కట్టింది. ఈ నేపథ్యంలో అమెరికా రాజకీయ, సామాజిక వ్యవస్థల మీద అది తన ప్రభావాన్ని చూపుతున్నదా? అంటే ఔననే చెబుతున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఒకటి ఉంది. అదే` ఇస్లామిజం, అతివాద వామపక్ష సిద్ధాంతంతో కలసి వ్యవస్థలను ప్రభావితం చేయగలుగుతున్నది. ఇందుకు అవి వేసే ముసుగే సామాజిక న్యాయం నినాదం. అమెరికాలో ఈ వికృత బంధం ఇచ్చిన నినాదం, ‘కిల్లర్ కమల (హారిస్)’. దీనికి ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు వంత పాడుతూ ఉంటాయి. రెడ్-గ్రీన్ బంధం ఎక్కడైనా, ఏ వేదిక పేరుతో అయినా చేసేది ప్రజాస్వామ్య పరిరక్షణ కాదు. అందుకు సంబంధించిన వ్యవస్థల విధ్వంసం. అమెరికాలో ఏర్పడిన డెమాక్రటిక్ నేషనల్ కమిటీ అలాంటిదే. ఆ సంస్థ సభ్యులతోనే, అజ్ఞాతం నుంచే కొన్ని అభిప్రాయాలను నొమాని వంటి వారు సేకరించారు. వారి పిలుపు ఒక్కటే, ఇజ్రాయెల్‌ను ధ్వంసం చేయండి. ఇలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నవాళ్లు మార్చి 2024లో షికాగోలో భారీ సమావేశం నిర్వహించారు. ‘మార్చ్‌ఆన్‌డీఎన్‌సీ’ వేదిక ఇదే. ఆ సమావేశాలకు వచ్చిన వారి వివరాలు చూస్తే రష్యా, చైనా, క్యూబా, ఉత్తర కొరియా, వెనుజులా, ఫిలిప్పైన్స్, ఆఫ్రికా దేశాలకు చెందిన వారేనని తేలింది. మార్చ్‌ఆన్‌డీఎన్‌సీలో 242 సంస్థలు ఉన్నాయి. వీటిలో 34 సంస్థలు తమకు తాము సోషలిస్టు బృందాలుగా చెబుతున్నాయి. 166 సోషలిస్టు సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నట్టు చెప్పుకుంటు న్నాయి. 42 వరకు పాలస్తీనా, అరబ్ లేదా ముస్లింలకు సంబంధించిన సంస్థలు.
ఇప్పుడు అమెరికా రెడ్-గ్రీన్ కలయికకి వేదికగా ఉంది. అందుకు ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారమే నిదర్శనం. ఆ ఎన్నికల ప్రచారాన్ని మార్చ్‌ఆన్‌డీఎన్‌సీ వినియోగించుకునే ప్రయత్నం చేసింది. డెమాక్రటిక్ పార్టీలో పైచేయి సాధించడానికి వామపక్షవాదులు ఉగ్రవాద ఇస్లాంతో సన్నిహితంగా ఉంటున్నారు. డెమాక్రటిక్ పార్టీలోనే రషీదా త్లయిబ్, ఇల్హాన్ ఒమర్ నాయకత్వంలోని యువ కాంగ్రెస్ ఎంపీల బృందం ఇందుకు ఉదాహరణ. ఇంతకీ ఇల్హాన్ ఎవరో కాదు, భారత వ్యతిరేక అమెరికా మహిళా రాజకీయ నాయకురాలు. ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించి భారత వ్యతిరేక చర్యకు పాల్పడిన నాయకురాలు. ఇటీవల తన అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీని కలుసుకున్నది ఈమెనే.
ఇక్కడ రాహుల్ గాంధీ ఆటలో అరటిపండులా కనిపించినా, అమెరికాలో వామపక్షవాదులు, ఇస్లామిస్టులు బాగా సన్నిహితులయిన మాట నిజం. దానినే ఇప్పుడు భారతదేశంలోకి తేవాలని కాంగ్రెస్, దాని సన్నిహిత సంస్థలు భావిస్తున్నాయి. అమెరికాలో ప్రభుత్వ స్థాయిలోను, ప్రభుత్వేతర పరిధిలోను కూడా ఆ రెండు వ్యవస్థలు కలసి పనిచేస్తున్నాయి. వీటి అసలు ధ్యేయం ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో అమెరికాకు, అమెరికా మిత్రులకు వ్యతిరేకంగా పనిచేయడమే. అందుకే రెడ్-గ్రీన్ బంధం ఇటీవల కాలంలో అమెరికా విధాన నిర్ణేతలను, ఐరోపా, అరబ్ దేశాల విశ్లేషకుల దృష్టిని కూడా ఆకర్షించింది. అమెరికాలో రెడ్`గ్రీన్ బంధం గురించి డేవిడ్ హోరోవిట్జ్ అనే విశ్లేషకుడు తన గ్రంథం అన్‌హోలీ అలయెన్స్‌లో ప్రస్తావించాడు. ఇస్లాం విస్తరణకు, అధికార విస్తరణకు ఇస్లామిస్టులు కూడా మార్క్సిస్టు దృష్టినే అవలంబిస్తున్నారని ఆయన వాదన. కింద తరగతి ముస్లింలకు, అధికారంలో ఉన్నవారికి మధ్య వైరం తేవడంలోని అంతరార్ధం ఇదే. ఇందుకు ఇటీవలి విశ్లేషకులు చూపుతున్న దృష్టాంతం బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమమే. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం కాస్తా చివరికి యాంటీఫా ఉద్యమంగా పరిణమించింది. అంటే యాంటీ ఫాసిజం ఉద్యమం. ఇందులో ముస్లింల హక్కుల రక్షణ ఎక్కువగా కనిపించింది. గాజా కేంద్ర బిందువుగా చాలా చోట్ల ‘శాంతియుతం’గా ప్రారంభమైన ఉద్యమాలు అధికారంలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా మలుపు తిరిగాయి.
ఓకిజం కూడా రెడ్ గ్రీన్ బంధానికి ఛాయ అనే అనాలి. ఓక్ ఆర్మీ ది రెడ్ -గ్రీన్ అలయెన్స్, దటీజ్ డిస్ట్రాయింగ్ అమెరికాస్ ఫ్రీడమ్ అన్న పుస్తకంలో అస్రా వర్ణించింది. ఓక్ ఆర్మీ అంటే ర్యాడికల్ ఇస్లామిస్టుల, వామపక్ష కార్యకర్తల అపవిత్ర బంధమని అస్రా తేల్చి పారేశారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని సంఘర్షణలో పడేయడంలోను, ఇజ్రాయెల్‌ను ఏకాకిని చేయడంలోను వీరు చాలావరకు సఫలమయ్యారని కూడా అస్రా అంటారు.
ఇప్పుడు ప్రపంచానికే తలనొప్పిగా మారేటంత బలంగా తయారు కావడానికి రెడ్-గ్రీన్ బంధానికి ఉన్న ఆయుధం ఏమిటి? కేవలం అబద్ధాల ప్రచారమే. ఇందుకు పనికొచ్చే సామాజిక మాధ్యమాలను నడుపుతున్నవారు కౌన్సిల్ ఆఫ్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ సభ్యులే. వీటి ప్రధాన అజెండా ముస్లింల, లేదా అమెరికా ముస్లింల హక్కుల రక్షణ మాత్రమే.
కోట్లకు పడగలెత్తిన హంగేరియన్`అమెరికన్ జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్, ప్రోటియస్ ఫండ్ ఓక్ ఆర్మీకి ప్రధాన పోషకుడని అమెరికాలో విస్తృతంగానే ప్రచారంలో ఉంది. అంటే ఉదారవాదం పేరుతో రెడ్-గ్రీన్ అలయెన్స్‌ని ప్రపంచమంతా విస్తరించే పనికి ఇతడు కోట్లాది డాలర్లు వెదజల్లుతున్నాడు. భారతదేశంలో ప్రభుత్వాన్ని మార్చడానికి కొన్ని కోట్ల డాలర్లు అమెరికా నుంచి వచ్చాయని సాక్షాత్తు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడంతో అసలు ఈ వివాదమే కొత్త మలుపు తీసుకుంది. ప్రపంచాన్ని కల్లోల పరిచే కుట్ర ఓకిజంలో లేదా జార్జ్ సోరోస్ దానాల వెనుక ఉందని రుజువు చేసినట్టయింది.
ఇక్కడ సీపీఎం వైఖరిలో మార్పు?
నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల సీపీఐ (ఎం) తన దృక్పథాన్ని మార్చుకున్నదా? ఏప్రిల్‌లో తమిళనాడు మధురైలో జరిగే 24వ పార్టీ కాంగ్రెస్ కోసం తయారు చేసిన రాజకీయ ముసాయిదా తీర్మానంలో ఈ మార్పును స్పష్టం చేసిందనే చెప్పాలి. ఈ ముసాయిదా తీర్మానం ప్రకారం మోదీ ప్రభుత్వం మీద ‘ఫాసిస్ట్’ ముద్ర వేయలేమని పార్టీ భావించింది. అయితే నియో ఫాసిస్టు ధోరణులు మాత్రం ఉన్నాయని సన్నాయి నొక్కులు నొక్కింది. ఈ తీర్మానంలోని అంచనాలనే రాష్ట్రాల పార్టీల శాఖలకు పంపించింది.
‘ప్రస్తుతం బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ఆధిపత్యంలో ఉన్న రాజకీయ వ్యవస్థ హిందుత్వ` కార్పొరేట్, అథారిటేరియన్ వ్యవస్థ అని, ఇది నియోఫాసిస్ట్ లక్షణాలు కలిగి ఉందని మేం ప్రకటిస్తున్నాం. మేం మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ పాలన అని కాకుండా, నియోఫాసిస్టు పాలనగానే భావిస్తున్నామని చెబుతున్నాం. భారతదేశాన్ని మాత్రం నియోఫాసిస్టు వ్యవస్థ అనడం లేదు.’ అని తీర్మానంలో పేర్కొన్నారు.
సీపీఎం దాయాది పక్షం సీపీఐ మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ ప్రభుత్వంగానే పరిగణిస్తున్నది. ఇక సీపీఐ(ఎంఎల్) ఇంకొక అడుగు ముందుకు వేసి, భారత్‌లోకి ఫాసిజం ఏనాడో అడుగుపెట్టిందని వ్యాఖ్యానించింది. ఈ రెండు అంచనాలను కూడా సీపీఎం త్రోసిపుచ్చింది. ఆ పార్టీల అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని కూడా వెల్లడిరచింది. హిట్లర్, ముస్సోలినీల నాటి ఫాసిజం క్లాసికల్ ఫాసిజమ్ అని కూడా వివరణ ఇచ్చింది. తరువాత వచ్చినవన్నీ నియో ఫాసిజాలేనని తెలియచేసింది. ఇంతకీ క్లాసికల్ ఫాసిజం అంటే ఏమిటి? ఇది సామ్రాజ్యవాద తత్వాల సంఘర్షణ మధ్య నుంచి ఉద్భవించిందట. ఇక నియో ఫాసిజం అంటే నియో లిబరలిజం సంక్షోభం నుంచి పుట్టిందని కూడా తెలియ చేసింది. ఈ ఏప్రిల్‌లో మధురైలో పార్టీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఈ రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని వెలువరించారు. అయితే సీపీఎం బీజేపీ, మోదీల పట్ల మెతక ధోరణిని అవలంబిస్తున్నదంటూ ఇటీవలి కాలంలో కాంగ్రెస్
విమర్శకు ఈ తీర్మానంలోని అంశాలు అద్దం పడుతున్నాయని విమర్శకుల అభిప్రాయం. అయినా, ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్ ప్రభుత్వమేనని కేరళ సీపీఐ కార్యదర్శి బినొయ్ విశ్వం చెప్పడం విశేషం. ‘ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలోని మోదీ ప్రభుత్వం ముమ్మాటికీ ఫాసిస్ట్ ప్రభుత్వమే. ఆర్‌ఎస్‌ఎస్ పూర్తిగా ఫాసిస్ట్ సంస్థ. కాబట్టి బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం కూడా ఫాసిస్ట్ ప్రభుత్వమే. సీపీఎం తన విధానాన్ని మార్చు కోవలసి ఉంటుంది’ అన్నాడు బినొయ్ విశ్వం.
సాధారణంగా కమ్యూనిస్టు పార్టీల నిర్ణయాలు అంతర్జా తీయ కమ్యూనిస్టు వేదికల దిశానిర్దేశాలను బట్టే ఉంటాయి. ఆ మేరకు చూస్తూ సీపీఎం తన వైఖరిని ఈ విధంగా మలుచుకోవడం, మోదీ పట్ల మెత్తటి వైఖరిని ప్రదర్శించడం కాస్త వింతగానే ఉంది. ఇటీవల తెలుగు వెబ్‌సైట్లలో మాట్లాడిన ఇద్దరు తెలుగు మార్క్సిస్టు మేధావులు కూడా కుంభమేళ నేపథ్యంలో బీజేపీ మీద వస్తున్న విమర్శలను వ్యర్థ ప్రయత్నాలుగానే వర్ణించారు. ఒక మేధావి కుంభమేళా ఇవాళ్టి హిందుత్వ పార్టీ రూపకల్పన కాదు కాబట్టి దాని జోలికి వామపక్ష మేధావులు వెళ్లడం అనవసరమనే అన్నారు. మరొక మేధావి కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. అదంతా ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంగా మాత్రమే చూస్తే మంచిదని అన్నారు. ఇలాంటి మాటలు ఇదివరకు వీరి నోటి నుంచి రాలేదన్నది నిజం.
– ‘స్టేట్స్‌మన్’ సౌజన్యంతో
మతం మత్తుమందు అంటూనే….
రెడ్-గ్రీన్ బంధం 1990 ప్రాంతంలో అంకురించి, 2000 సంవత్సరంలో ఒక రాజకీయ ఉద్యమంగా ప్రపంచం దృష్టికి వచ్చిందని అంటారు. కానీ వాటి బంధం అంతకంటే పాతదే. కచ్చితంగా చెప్పాలంటే వందేళ్ల నాటిది. అంటే ఆదిలోనే మార్క్సిస్టులు మతం మత్తుమందు అన్న మార్క్స్ సూత్రానికి నీళ్లు వదిలేశారు. వామపక్షం, రాజకీయ ఇస్లాంల మధ్య బంధం సోవియెట్ యూనియన్ ఆవిర్భావంలోనే కనిపిస్తాయి. రష్యా అంతర్యుద్ధం వేళ పాశ్చాత్య శ్వేతజాతీయుల మద్దతు ఉన్న అక్కడి శిబిరాల మీద లేదా బోల్షివిక్ వ్యతిరేకుల మీద కాకాసెస్, మధ్య ఆసియాలో ఉన్న ముస్లింలను సోవియెట్ రష్యా నాయకులు ప్రయోగించారు. ఇందుకోసం ఆ ప్రాంతంలోని సాయుధ ముస్లిం వర్గాలతో రెడ్ ఆర్మీ (యూఎస్‌ఎస్‌ఆర్ సైన్యం) ఒప్పందాలు చేసుకుంది. పాశ్యాత్య సామ్రాజ్య వాదంతో పోరాడేందుకు 1920 నాటి పీపుల్స్ ఆఫ్ ది ఈస్ట్ వారి కాంగ్రెస్‌లో పిలుపునిచ్చారు. ఈ సమావేశం రష్యాలోనే బకు అనే చోట జరిగింది. బందిపోట్లకు, అణచివేత దారులకు, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పవిత్రయుద్ధం ఆరంభించాలని బకు సభలలో కీలకంగా వ్యవహరించిన గ్రెగరి జినోవివ్ పిలుపునిచ్చాడు. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇది లెనిన్ మరణం తరువాత మారి పోయింది. స్టాలిన్ ఈ ఆలోచనను వ్యర్థమైనదిగా భావించాడు.
స్టాలిన్ యుగం తరువాత అమెరికాను నిరోధించడానికి, ముఖ్యంగా మధ్య ఆసియాలో నిలువరించడానికి ఇస్లామిజాన్ని ఆశ్రయించారు. అంటే ప్రచ్ఛన్న యుద్ధంలో సోవియెట్ రష్యా రాజకీయ ఇస్లాం సేవలను తీసుకున్నది. తమ ప్రయోజనాల కోసం ముస్లిం నేతలు కూడా సోవియెట్ ఆధిపత్యానికి తలొగ్గారు. విదేశీ సామ్రాజ్య వాదంతో పోరాడేందుకు అవసరమైన ఒక రాజకీయ సిద్ధాంతాన్ని సృష్టించడానికి ఇదొక అవకాశంగానే ముస్లిం నాయకులు భావించారు. ఇది ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో సరిగ్గా సోవియెట్ రష్యా రాజకీయ అవసరాలకు అనువుగా కూడా ఉంది. ఆ క్రమంలోనే సోవియెట్ రష్యా పాన్ అరబిస్ట్ ఉద్యమానికి, పాలస్తీనా గెరిల్లాలకు మద్దతుగా నిలిచింది. అరబిస్ట్ ఉద్యమం, పాలస్తీనా గెరిల్లాల లక్ష్యం ఒక్కటే. అది మధ్య ఆసియాలో ఇజ్రాయెల్, అమెరికాల ప్రాబల్యం సడలిపోవడం. గమాల్ అబ్దుల్ నసీర్ (ఈజిప్ట్), హఫీజ్ అల్ అసాద్ (సిరియా), యాసిర్ అరాఫత్, మహమ్మద్ అబ్బాస్ (పాలస్తీనా విమోచనా సంస్థ నేతలు) సోవియెట్ రష్యాకు అత్యంత సన్నిహితం కావడం అందుకే. ఇరాన్ విప్లవం సమయంలో షా (పాలకుడు) పాశ్చాత్య దేశాల కీలుబొమ్మ అంటూ ప్రచారం చేయడంలో రష్యాదే కీలక పాత్ర. అప్పుడు కూడా జాతీయవాదులు (భారతదేశంలో జాతీయ వాదుల వంటివారు కాదు వీరు. నేషనలిస్టులు అని పిలుస్తారు. ఆ ఇంగ్లిష్ పదానికి అర్ధం మాత్రమే ఇక్కడ రాశాం); మార్క్సిస్టులు, ఇస్లామిస్టులు కూటములుగా షా వ్యతిరేక ఉద్యమం నిర్వహించారు. ఇందులో మార్క్సిస్టులు, ఇస్లామిస్టులు బలమైన వర్గంగా నిలిచారు. అయితే అక్కడ ముస్లింల తమ నిజ స్వరూపం బయటపెట్టారు. షాను తొలగించి అధికారంలోకి వచ్చిన గ్రీన్ వర్గం నాయకుడే అయితుల్లా రుహోల్లా ఖోమేని. ఇతడు నిర్మొహ మాటంగా రెడ్ వర్గాన్ని పక్కన పెట్టాడు. ఏప్రిల్ 1979లో ఇరాన్‌ను ఇస్లామిక్ రిపబ్లిక్ అని ప్రకటించాడు. కాబట్టి ఇరాన్ మత రాజ్య స్థాపనలో కమ్యూనిస్టులది కీలక పాత్రేనని మరువరాదు. కానీ 66 మంది అమెరికన్‌లను బందీలుగా పట్టుకుని తాము మార్క్సిస్టుల కంటే పెద్ద ‘సామ్రాజ్య వ్యతిరేక వాదుల’మని చాటడానికి ఇరాన్ ఉద్యమకారులు ప్రయత్నించారు. అధికారంలో ఉన్న కూటమిలో ముజాహుదీన్ ఇ ఖాల్క్ (వామపక్ష భావాలు ఉన్న వర్గం) కూడా క్రమంగా అంతర్ధానమైంది.
కొత్త ప్రపంచ నిర్మాతలు మోదీ, ట్రంప్
నరేంద్ర మోదీ (భారత్), డొనాల్డ్ ట్రంప్ (అమెరికా), జేవియర్ మీలీ (అర్జెంటీనా) వంటి ప్రపంచ నేతలు సరికొత్త ప్రపంచ కన్సర్వేటివ్ ఉద్యమాన్ని నిర్మిస్తున్నారని ఇటలీ ప్రధాని జార్జియో మెలోని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులది ఆది నుంచి ద్వంద్వ వైఖరేనని, ఇకపై ప్రపంచం వారి మాటలు నమ్మబోదని కూడా ఆమె స్పష్టం చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌కు ఆమె వీడియో లింక్ ద్వారా సందేశం అందచేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ విజయంతో కమ్యూనిస్టుల అశాంతి కాస్తా మానసికోన్మాదంగా మారిపోయిందని మెలోని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులు మా మీద ఏ పేరుతో ఎంత బురద జల్లినా జనం మమ్మల్ని ఎన్నుకుంటున్నారని చెబుతూ ఆమె, అందుకు కారణం తాము స్వేచ్ఛను రక్షిస్తున్నామని, సరిహద్దులు భద్రంగా ఉండాలని భావిస్తున్నామని, వాణిజ్య వ్యాపారాలకు, పౌరులకు రక్షణ ఇస్తున్నామని, ఓకిజానికి వ్యతిరేకంగా పోరాడు తున్నామని, మన పవిత్ర హక్కులకు రక్షణ కల్పిస్తున్నామని, భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షిస్తున్నా మని ఆమె అన్నారు. నాగరికతల విధ్వంసానికి జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు కాబట్టి అఫ్గానిస్తాన్‌లో గత పరిస్థితులు పునరావృతం కావని ప్రగాఢంగా నమ్ముతున్నానని, భద్రతా చర్యలను పెంపొందించడం ద్వారా ఐరోపాలో మృగ్యమైపోయిన శాంతిని పునఃస్థాపించాలని ఆమె పిలుపునిచ్చారు.
– జాగృతి డెస్