ఒడిశాలోని ఆరు ప్రధాన నదులలో ఒకటైన బై•(వై)తరణిలో ఏటా ఫాల్గుణ బహుళ త్రయోదశి (ఈ ఏడాది మార్చి 27న) పుణ్యస్నానాలు చేస్తారు. కావేరి తులాస్నానం, ప్రయాగరాజ్ త్రివేణి మాఘ స్నానం, రథ సప్తమి నాడు కోణార్క్‌లో, రామేశ్వరంలో సముద్రస్నానం, చొల్లంగి అమావాస్య నాటి సముద్రస్నానం, పుష్కరాల్లో నదీ స్నానం కోవకు చెందినదే ఈ బారుణీ స్నానం. జాజీపూర్‌లోని వైతరణీ నది దశాశ్వమేధ ఘాట్ (బారుణీ ఘాట్)లో స్నానం చేయడం గొప్ప సదావకాశంగా ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తారు. ‘వైతరణి’ అంటే గరుడ పురాణంలో వివరించినట్లుగా నరకంలో దాటాల్సిన నదిగా భయపడనవసరంలేదు. సాక్షాత్తు గంగ భూమి మీద వైతరణిగా ఏర్పడిందన్న ఐతిహ్యమే ఇందుకు తార్కాణం. పైగా ఈ నదిలో స్నానమాచరించడం వల్ల నరకలోకంలోని వైతరణీ నది దాటాల్సిన పనిలేదని కూడా అంటారు.
ఈ నదీ ప్రాంతం ఆ రాష్ట్ర సనాతన సంస్కృతితో విలసిల్లుతున్న పుణ్య ప్రదేశం. ఈ నది ప్రవహించే జాజీపూర్ ఒడిశాకు ఆధ్యాత్మిక రాజధాని లాంటిది. వైతరణి ఆవిర్భావం వెనుక ఆసక్తికరైన గాథ ఉంది. ఒకసారి బ్రహ్మ అక్కడ యజ్ఞం తలపెట్టి గంగను ఆహ్వానించగా, ఏ సమయానికి చేరుకోవచ్చని గంగ ప్రశ్నించింది. ‘డప్పు వాయిద్యాల మోత వినినంతనే నీవు రా’ అని బ్రహ్మ సూచించాడు. కొంతసేపటికి జ్యూంగ్ జాతికి చెందిన కొందరు ఆటవికులు నృత్యం చేస్తూ, డప్పు వాయిద్యాలతో వెళుతుండగా, ఆ శబ్దం ఆలకించిన గంగ అది యజ్ఞవాటిక నుండి వినిపిస్తున్నద భావించి నేటి కేంజొర్ జిల్లాలో గోనాసిక అనే చోట భూమి మీదకు దిగింది. ఆ సమాచారం తెలిసిన బ్రహ్మ హుటాహుటిన అక్కడికి చేరి శివలింగం (బ్రహ్మశ్వర్) స్థాపించి అక్కడ నుండి గంగను జాజీపూర్ మీదుగా ప్రయాణింపజేశాడు. ఇలా గంగ ఈ ప్రయాణంలో వైతరణిగా వ్యవహారం లోకి వచ్చింది. గోనాసిక నుంచి తూర్పున 360 కి.మీ. ప్రయాణించి బ్రహ్మణి నదిలో కలిసి,దానితో ధర్మా అనేచోట బంగాళాఖాతంలో సంగమించింది.
వైతరణీ నదిలో తీరంలోని అనేక తీర్థ ఘట్టాల్లో గోనాసిక దగ్గరి బ్రహ్మకుండం, జాజీపూర్ వద్ద దశాశ్వమేధ ఘాట్, ఘాశీపుర వద్ద జడేశ్వర్ మందిర్ మొదలైన ప్రదేశాలు బారుణీ స్నానానికి ప్రసిద్ధమైనవి. జాజీపూర్ వద్ద జరిగే స్నానయాత్రను ‘ఒడిశా కుంభమేళా’ అంటారు.
వైతరణీ నది ఇక్కడ పుట్టిందని చెప్పుకున్నాం కదా!. కొండలోని గోనాసికి రూపంలోని ఒక రాతినుండి ఈ నదీ జలధార ప్రవహిస్తూ ఉంటుంది. గంగోత్రి వద్ద గోముఖం ద్వారా గంగ, బ్రహ్మగిరి వద్ద గోముఖం నుంచి గోదావరి, జాజీపూర్ జిల్లాలో గోనాసిక ద్వారా వైతరణి ఉద్భవించడం వంటివి దైవలీలలకు తార్కాణంగా ఆస్తికులు భావిస్తారు.
గోనాసిక ఇంకో విశేషమేమంటే.. గంగ ఇక్కడ ఉద్భవించినపుడు ఇంకా 9 జలధారలు (జి రిపానీ, డోలా కట్ట, జమునా పానీ, కాదరరామిముండు, కీయడాలక, తెలాఝర్నా, కరటకట, కైంఝరి, చంపాఝరి) పుట్టాయట. అవి ప్రస్తుతం ఎండిపోయి నందున కనబడవు. దశాశ్వమేధ ఘాట్ భారతదేశం లోని ప్రసిద్ధ నదులలో ఉన్న స్నాన ఘట్టాలలో ఒకటి. అక్కడ దగ్గర సాధారణ శకం 11వ శతాబ్దంలో యయాతి కేసరి అనే రాజు అశ్వమేధ యాగం చేసినట్లు చరిత్ర చెప్తోంది. గో నాసికకు సుమారు 170 కి.మీ. దూరంలోని జాజీపూర్‌లోని బిరజాదేవి శక్తిపీఠం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. దేశంలో అనేక ప్రాంతాల భక్తులు పీఠాన్ని దర్శించడానికి, వైతరణీ నదిలో స్నానం చేయడానికి వస్తారు.
గో నాసిక గల కేంజొర్ జిల్లాలో యావత్ ప్రపంచంలోనే అతి పురాతనమైన రాయి (rock) సుమారు 38 మిలియన్ సంవత్సరాల పూర్వం సుమారు 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని సమాచారం.
తీర్థశబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. రుషులు, భక్తులు సేవించే జలాశయాలు, రేవు, గురువు మొదలైనవి ముఖ్యమైనవి. ‘తరంతి అనేన ఇతి తీర్థం’ (మానవులను తరింప చేసేది తీర్థం). హిందూ సనాతన సంప్రదాయలలో తీర్థ్ధ దర్శనానికి, తీర్థ సేవనానికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. ప్రాచీనకాలం రుషులు తపస్సు కోసం నదులు, జలాశయాల దగ్గరగా స్థావరాలను ఏర్పరచుకునే వారు. జపం, దైవ దర్శనం, పూజ చేసుకునేముందు స్నానంతో పరిశుద్ధుడు కావాలన్నది దాని భావం. హిందూ మత సంప్రదాయంలో పితృకార్యాలకు తీర్థ ప్రాంతాలను అత్యంత శ్రేష్ఠంగా పరిగణిస్తారు. తీర్థం అంటే ఏదైనా ఒక నది కానీ, నదీ స్నాన ఘట్టం,కోనేరు, సరస్సు, బావి, జలపాతం, నీటి గుండం…ఇలా ఏదైనా ఒక గుడి దగ్గర గాని విడిగా కానీ ఉండేది. ‘పోయి సేవింపలేకున్నను పుణ్య తీర్థ మహిమ వినుటయునఖిల కల్మష హరంబు’ అను పండిత వాక్యాలననుసరించి తీర్థ గురించి చదవడం, వినడం దర్శన సమాన ఫలం ఇస్తుందని విశ్వసిస్తారు.
మహావాది రామకృష్ణ