ఛైత్ర శుద్ధ పాడ్యమి (మార్చి 30, ఉగాది) డాక్టర్‌జీ జయంతి
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ వ్యవస్థాపకులు పూజనీయ డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ వ్యక్తిత్వం విరాట్ స్వరూపాన్ని గురించి చెప్పుకున్నప్పుడు వారిని 20వ శతాబ్దపు అనేక మంది మహాపురుషుల్లో ఒకరిగా పేర్కొనడంతో సరిపోదు. ఇలా అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. డాక్టర్‌జీకి సమష్టి అనే భావన పుట్టుకతోనే వచ్చింది. వారికి ఉన్న ప్రత్యేకతల్లో పరిస్థితిని నిశితంగా పరిశీలించడం, జరుగుతున్న పరిణామాలను విశ్లేషించడం, వాటిని సామాజిక దృష్టికోణంతో నిశ్చయించి అందుకు తగిన కార్యాచరణకు రూపకల్పన చేయడమనేవి ప్రధానమైనవి.
అప్పట్లో ‘మహారాష్ట్ర’ పేరిట నాగపూర్ నుంచి వెలువడే ఓ వార్తాపత్రిక లో ఓ సభకు సంబంధించిన వార్త ప్రచురితమైంది. ‘సభలో కొందరు వ్యక్తులు ఉన్నట్టుండి లేచి నిలబడ్డారు. అలా చూస్తూ ఉండగానే ఐదు సెకండ్లలో ఏదో విద్యుదాఘాతానికి గురైనట్టుగా లేకుంటే ఏదో ఓ సింహం వారిపై దాడి చేస్తున్నట్టుగా సభలో ఉన్నవారందరూ వాకర్ రోడ్డు పక్కకు వచ్చి నిలబడ్డారు. వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మరీ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ నిలబడ్డారు. ఈ హడావుడిలో జనం ధాటికి దీపాలు కిందపడి ఆరిపోయాయి. జనాలు పరిగెత్తుతూ పరిగెత్తుతూ వెంకటేశ్ థియేటర్ గోడను డీకొని పడిపోయారు. జనం ఉన్నట్టుండి పరిగెత్తడంతో వారిలో కొందరు తమ చేతికర్రలు పోగొట్టుకున్నారు. ఇంకొందరు వారి చెప్పులు, టోపీలను పోగొట్టుకున్నారు. 4,000 మంది ప్రజలు క్షణకాల భయంతో వారి ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయారు. ఈ మొత్తం ఘటనకు దారితీసిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే సభికుల మధ్యలో కూర్చొని ఉన్న ఓ వ్యక్తి కాళ్ల కిందకు ఓ చిన్న కప్ప పిల్ల ఎక్కడ్నుంచో వచ్చింది. అతడు లేచి నిలబడి తలవంచి దాన్ని చూడసాగాడు. ఇది చూసి అతడి చుట్టుపక్కల ఉన్న మరో 5 నుంచి 10 మంది సభికులు లేచి నిలబడ్డారు. వారిలో ఒకతను హఠాత్తుగా పెద్దగా పాము.. పాము అని అరవడం మొదలుపెట్టాడు. అది వినగానే సభలో ఉన్న జనం ఒకర్ని చూసి మరొకరు అన్నట్టుగా పారిపోసాగారు. వారిలో నూటికి 99 మందికి తామెందుకు పారిపోతున్నదీ తెలియనే తెలియదు. కానీ అలాంటి వారు కేవలం భయంతోనే పరుగు లంకించుకున్న వారితో జత కట్టారు’ ఇదీ వార్త.
మనం కూడా అక్కడే ఉండి ఉంటే ఆ వార్తకు మరికాస్త మసాలా దట్టించి మిగిలినవారికి కథలు కథలుగా చెప్పుకొని ఉండేవారం. ఆ కాసేపు దాన్నొక వినోదంగా అనుభవించేవారం. జరిగిందేమిటసలు? ఓ కప్పపిల్ల ప్రతాపమా? అది 4,000 మందితో కూడిన ఓ సభను భగ్నం చేసింది. ఎవరైతే ఆ సభలో లేరో వారు ఈ వార్తను చదివి నవ్వుకొని ఉంటారు. చాలా మందైతే ‘జనం తెలిసీ తెలిసీ ఎలాంటి తుంటరి పనులు చేస్తుంటారో కదా’ అని అనుకొని ఉంటారు.
డాక్టర్ హెడ్గేవార్ ఆ రోజున నాగపూర్‌లో లేరు. వారు ఆ తర్వాత ‘మహారాష్ట్ర’ పత్రికలో సభకు సంబంధించిన వార్తను, అందులోని వర్ణన చదివి చింతాక్రాంతులైనారు. వారు సభా నిర్వాహకులను నేరుగా కలుసుకున్నారు. డాక్టర్‌జీ ఈ సందర్భంగా నిర్వాహకులతో మాట్లాడుతూ ‘‘క్షేత్రస్థాయిలో సంగతి వదిలిపెట్టండి. మీరైనా వెంటనే ముందుకు వచ్చి సభికులను ఎందుకని నియంత్రించలేకపోయారు?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బదులుగా వారంతా ముక్తకంఠంతో ‘నేనొక్కడినే ఏం చేయగలను’ అని ఒకే మాటన్నారు.
ఒక్కడినే అనే మాట సరికాదు
డాక్టర్‌జీ నేనొక్కడినే ఏం చేయగలను అనే మాట అనేకసార్లు వినాల్సి వస్తున్నదే అన్న ఆలోచనలో పడ్డారు. వారికి ఒక హిందువు ఓ సభలో ఉన్నా కానీ, యాత్ర చేస్తున్నాకానీ, కుంభమేళాలో పాల్గొన్నప్పటికీ అతడు ఒంటరిగానే ఉంటాడు అని అనిపించింది. ఈ ఒంటరిగా ఉండటమనే భావన హిందూ సమాజాన్ని ఆత్మ వినాశం వైపునకు తీసుకువెళుతుంది. దీనికి విరుగుడు అన్నట్టుగా మనం ‘నేను ఒంటరిని కాను.. నా చుట్టూ ఉన్న సమాజం నాది.. అది నాతోనే ఉంటుంది’ అని. హిందూ సమాజం నరనరాల్లో ‘నేను కాదు మనం’ అనే భావన ఇంకి పోవాలి. డాక్టర్‌జీ ఇలా ఆలోచిస్తూ ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ’ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంఘ అంటే అర్థం రోజూ ఓ గంటసేపు జరిగే సంఘ శాఖ అని. శాఖ అంటే ఓ సామూహిక అనుభవం. మనం ప్రతి రోజూ ఏకమై ఒంటరిగా ఉండిపోకుండా అనేకుల్లో ఒకరిగా ఉండిపోవడం. ఇంకా వివరంగా చెప్పాలంటే ‘సింధువులో ఓ బిందువు’ అనే భావన అంతరాల్లోకి చేరుకొని ఆత్మగతమైన పక్షంలో ఒంటరితనం నుంచి ఉత్పన్నమయ్యే భయాందోళన దూరమైపోతుంది.
సంఘ శాఖ అంటే దానర్థం వ్యక్తిలో నేను అనే భావన నుంచి మనం అనే భావనకు చేరుకోవడం. ‘నేను’ ను నేలమట్టం చేసి ‘మనం’ అనే భావనను నలుదిక్కులకు విస్తరింపజేయాలి. సంఘ శాఖలో ఆలపించే పాటలు అత్యంత సరళంగా ఉంటూ ‘మనం’ అనే భావనను బలోపేతం చేస్తుంటాయి. ఉదాహరణకు ‘నేను మాత్రమే కాదు మనమంతా శిఖరాగ్రంపై ఉందాం.. శివాజీ అనుచరులమై జీవిద్దాం’ లాంటివి. ‘సమాజం సంఘానిది.. సంఘం సమాజానిది’ అనే పీఠిక మొదటిరోజు నుంచీ ఉంది. శాఖ గ్రామానిది.. శాఖ పట్టణానిది కూడా. శాఖను నడిపే స్వయంసేవకులు ఏ కులానికి చెందినవారైనప్పటికీ ఆలోచన యావత్ గ్రామానిదీ, యావత్ పట్టణానిదీ అయి ఉంటుంది.
సంఘ ఎప్పుడూ కూడా ఏ ఒక్క వ్యక్తినీ నెత్తిన పెట్టుకోలేదు సరికదా నాయకుడిని చేసే ఎలాంటి కార్యక్రమాన్నీ చేపట్టింది లేదు. సంఘ శాఖకు సామూహికత అనే భావన మూలాధారము. శాఖా స్వరూపంలో సామూహిక క్రీడ, సామూహిక సమానత్వం, సామూహిక నిర్వహణ, సామూహిక గానం, సామూహిక ప్రార్థన ఇమిడి ఉన్నాయి. దీని వెనుక ఉద్దేశమేదైతే ఉందో అది సంఘ శాఖలో మిళితమై ఉన్న బాల, యువ, ప్రౌఢ స్వయంసేవకుల్లో ‘మనం’ అనే భావాన్ని పాదుగొల్పడం. ‘మనం’ అన్న మాటే ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. 1926లో శాఖ పద్ధతి ఆరంభమైంది.
నాగపూర్‌కు చెందిన కొందరు యువకుల్లో మనం అనే భావన నిర్మితమైంది. ఆ కారణంగానే 1927లో నాగపూర్‌లో అల్లర్లు జరిగినప్పుడు హిందువులు భద్రంగా ఉన్నారు. మనం అనే దానికి ఓ కొలమానం అంటూ ఉండదు. నేడు 80 వేలకు పైగా శాఖలు ఇదే భావనను పెంపొందించే పనిలో ఉన్నాయి. అది అరుణాచల్ లేదా గుజరాత్ కావొచ్చు, అది ఉత్తరాఖండ్ లేదా కేరళ కావొచ్చు ఇలా అన్ని చోట్లా ఆ ప్రయత్నం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. మనం అన్న మాటలో ఆత్మీయత ఉట్టిపడుతుంది. భూకంపం, వరదలు, తుఫాను లాంటి అకాల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు సాయం చేయడానికి ముందుకు ఉరికే లక్షణం సహజసిద్ధంగా అలవడుతుంది. మనం అంటే సహ అనుభూతి. శాఖల్లో సహ అనుభూతిని కలిగించే పాటలను అత్యంత ఉత్సాహంతో ఆలపిస్తారు. పది ఉపన్యాసాల ద్వారా కాని పని ఒక్క పాటతో అయిపోతుందనేది సంఘ శాఖ ద్వారా అనుభవంలోకి వస్తున్నది. ప్రస్తుతం స్వయంసేవకుల ద్వారా మనం అనే భావనతో 1,60,000 సేవా కార్యక్రమాలు జరుగు తున్నాయి.
సమాజంలో కర్తవ్యభావనను జాగృతం చేయడమే సంఘ శాఖ పని. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా బంధువులు అనే వాక్యంతో రాజ్యాంగంలో ప్రతిజ్జ మొదలవుతుంది. ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదాన్ని సంఘం తొలి రోజు నుంచే స్వీకరించింది. శాఖలోని స్వయం సేవకులందరూ సామూహికంగా ఈ నినాదం చేస్తారు. సమూహం ఎంత పెద్దదైనప్పటికీ, అందులో వేర్వేరు భాషలు మాట్లాడేవారు, వేర్వేరు సంప్ర దాయాలు పాటించేవారు, వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు ఉన్నప్పటికీ వారంతా కూడా ముక్త కంఠంతో ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తారు. తద్వారా ‘భారత్ నా దేశం’ అనే భావన బలపడు తుంది. ఒక తల్లికి బిడ్డలం అని చెప్పడం ద్వారా ఎక్కువ, తక్కువ భేదం, అంటరానితనం, భాషాభేదం, ప్రాంత భేదం, ఉత్తర`దక్షిణం లేదా తూర్పు-పశ్చిమం లాంటి భేదాలు అంతరించి పోతాయి. అందరినీ ఒకే విధంగా ప్రేమించడం, నియమాలు పాటించడం స్వభావ సిద్ధంగా అలవడుతుంది. అధికార బోధ కాకుండా కర్తవ్య బోధ జాగృతమౌతుంది.
సంఘం తన కార్యకలాపాలను ప్రారంభించుకొని 99 సంవత్సరాలు పూర్త్తయ్యింది. సంఘం మనం అనే భావనను సమాజంలో పాదుగొల్పడంలో తగినంత ఫలితాన్నే రాబట్టింది. శతాబ్ది సంవ త్సరంలో మనం అనే పరిధిని మరింత విస్తృత పరచడమే సంఘ ఆలోచన. సమాజం మేలు కోసం చిన్నా పెద్ద పనులు చేసేవారు, చేయాలనే ఆకాంక్ష ఉన్నవారితో పాటుగా అదే భావ సారూపత్య కలిగిన సంస్థలు చాలా ఉన్నాయి. వీరందరిలో మనం అనే భావన కలిగించడమే సంఘ ఆలోచన. ఆ దిశగా ప్రణాళికలు తయారవుతున్నాయి. భారతదేశపు ఈ మహారథాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తరతమ భేదాల్లేకుండా ఎవరైనా సరే కలిసికట్టుగా నడుం బిగించవచ్చు. అభిప్రాయభేదం లేదా ఆలోచనల్లో భేదం ఉత్పన్నమయ్యే ప్రసక్తి లేదు. అవన్నీ కూడా సమాజంలో మనం అనే భావన చేసే అద్భుతాన్ని చూడటం కోసమని ఏకమైపోతాయి. సంఘ శతాబ్ది సందర్భాన్ని పురస్కరించుకొని అత్యంత కీలకమైన ఐదు అంశాలను ఎంపిక చేయడం జరిగింది. అవేమిటంటే..
- వ్యక్తిగత, కుటుంబ, సామాజిక వ్యవహారాలు సామరస్యపూర్వకంగా జరగాలి. ఏ విధమైన భేదభావానికి చోటు ఉండరాదు. అంటరా నితనం అనే భావనను మొగ్గలోనే తుంచి వెయ్యాలి. మన కుటుంబంలో సంస్కారం మరింతగా పెరగాలి.
- ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ పట్ల శ్రద్ధ పెట్టాలి. ఇల్లు, పనిచేసే చోటు, పంట పొలాల్లో అవసరమైనంత మేరకు మాత్రమే నీటిని వినియోగించాలి. పుట్టినరోజును ఒక మొక్కను నాటడం ద్వారా కూడా జరుపుకోవచ్చు. నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగించవద్దు. చెత్తను, వ్యర్థ పదార్ధాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా సరైన పద్ధతిలో ఒకచోట వేయాలి.
- దైనందిన జీవితంలో పౌరులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి తోడు ఎన్నిక లప్పుడు సరైన అభ్యర్థిని ఎంచుకోవడంలో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవడం వరకు అనేక విషయాలు వస్తాయి. ఈ విషయా లన్నింటిని స్వంతంగా ఆలోచించాలి.
- స్వదేశీ భావన ఆచరించడానికి తోడు స్వాభి మానంతో జీవనం సాగించాలి. స్వదేశీ భావనను మనదిగా చేసుకోవడం వలన ఉపాధి, ఉద్యోగావకాశాలు కలుగుతాయి. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కటైనా ఖద్దరు వస్త్రాన్ని ధరించిన పక్షంలో చాలా మందికి పని దొరుకుతుంది. భజన, భోజనం, భవనం, భాష, భూషణం.. ఇలా ఎన్ని విషయాల్లో మనం స్వదేశీ వస్తువు లను వినియోగించగలం అనే దానిపై ఆలోచించి, ఆచరణలో పెట్టాలి.
- మన దేశం, పర్వతాలు, నదులు, రుషులు, మునులు, సాధు సంతులు, శాస్త్రవేత్తలు, కళాకారులు, వీర పరాక్రమ పురుషులు, వీరనారీమణులు, అన్ని దేశ భాషల పట్ల స్వాభిమానాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి. మనం ఈ స్వాభిమానాన్ని రానున్న తరాలకు సైతం ఓ వారసత్వంగా అందించాలి. మనం అనే భావన ఎంత ఎక్కువ మందికి చేరితే అంతే శరవేగంతో భారత్ ప్రగతి పథంలో ముందంజలో నిలుస్తుంది. డాక్టర్ హెడ్గేవార్ నాగపూర్‌లో జరిగిన ఓ సంఘటనను ఆధారంగా చేసుకొని ఎంతో దూరం ఆలోచిం చారు. వారి లోతైన ఆలోచన, దూరదృష్టి నుంచే దేశానికి ఒంటరితనం అనే దోషాన్ని తొలగించి, మనం అనే భావనను వృద్ధి చేసే సంఘ శాఖ లభించింది. ఇది ఒక వ్యక్తిలో, సమాజంలో సమూలమైన పరివర్తన తీసుకొనివచ్చే ఆలోచన కాదంటారా?
– ‘పాంచజన్య’ నుంచి
– మధుభాయి కులకర్ణి, వరిష్ఠ్ ప్రచారక్, ఆర్.ఎస్.ఎస్.