మన మాతృభాష తెలుగు ప్రాకృతం నుంచి పురుడు పోసుకుంటే, మన లిపి మూలాలు బ్రాహ్మి లిపిలో ఉన్నాయి. మన చరిత్రతో పాటుగా భారత చరిత్ర దేశంలో జనపదాలు ఆవిర్భవించిన చారిత్రక యుగం తొలినాళ్లలో అంటే దాదాపు సాధారణ శకం పూర్వం 7, 8 శతాబ్దాల్లో మొదలైంది. తెలుగు చరిత్ర అస్మక, ఆంధ్ర జనపదాల ఆవిర్భావం నుంచి ఆరంభమైంది. ఈ జనపదాల తర్వాత నంద, మౌర్య సామ్రాజ్యాల రాజులు పరిపాలించారు. మౌర్య సామ్రాజ్య పతనానంతరం శాతవాహన రాజులకు ముందు కోటిలింగాల నుంచి గోబద, నారన, కంవయస, సిరివయస, సామగోప రాజులు పరిపాలించారు. కోటిలింగాల నుంచి సామగోప రాజుల పాలన దాదాపు సా.శ. 230లో ముగిసింది. ఉజ్వలమైన శాతవాహన చక్రవర్తుల పాలన సా.శ.పూ.1వ శతాబ్దంలో మొదలైంది. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకు, విష్ణుకుండిన, బాదామి చాళుక్య, రాష్ట్రకూట, కల్యాణ చాళుక్య, చివరిగా కాకతీయ రాజులు, తదితరులు విజయవంతంగా పరిపాలించారు.
మౌర్యుల శాసనాలు
మన ప్రాంతంలో తొలి శాసనాలు మౌర్యుల కాలంలో జారీ అయ్యాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
1. 1928లో కర్నూలు జిల్లాలోని ఎర్రగుడిలో అశోకుని అతి పెద్ద రాతి శాసనాన్ని ఘోష్‌ ‌కనుగొన్నారు (ఫొటో.1). రాతి శాసనం బ్రాహ్మి లిపిలో ప్రాకృత భాషలో ఉంది. సిర్కార్‌ ‌దీని గురించిన వివరాలను ఎపిగ్రాఫియా యిండికా 1957-1958 సంచికలో ముద్రించింది. ఈ రాతి శాసనం సా.శ.పూ. 244-245 మధ్య కాలంలో రూపొందింది.
మన ప్రాంతంలో ఇదే తరహా లిపి, భాషలో మరో రెండు చిన్న శాసనాలు ఉన్నాయి. అవి:
2.కర్నూలు జిల్లా, పత్తికొండ సమీపంలో రాజులమందగిరిలో శాసనం.
3. గుంటూరులోని పురావస్తు ప్రదర్శనశాలలో అమరావతి స్తంభంపై శాసనం.
మౌర్యుల బాటలో శాతవాహనుల శాసనాలు
1. శాతకర్ణి కుమారుడు యువరాజు హకుశ్రీ శాసనం కరీంనగర్‌ ‌జిల్లా, కోటిలింగాల సమీపంలో ముక్కట్రావుపేటలో బైటపడింది. (ఫొటో.2)
2. యువరాజు హకుశ్రీ శాసనం పెద్దపల్లి జిల్లా, గట్టుసింగారంలో వెలుగులోకి వచ్చింది.(ఫొటో:3)
3. ఫణిగిరిలో వశిష్టపుత్ర శాతకర్ణి శాసనం.
4. నాగార్జునకొండలో విజయశాతకర్ణి శాసనం, శాతవాహన కాలంనాటి రాజుల పేర్లు లేని రెండు శాసనాలు చేబ్రోలు, ఘంటసాలలో బైటపడ్డాయి.
ఈ శాసనాలన్నీ కూడా బ్రాహ్మి లిపిలో, ప్రాకృత భాషలో ఉన్నాయి.
అశోకుని కాలం నాటి చిన్న, పెద్ద, స్తంభంపై వాటితో కలుపుకొని దాదాపు అన్ని శాసనాలు బ్రాహ్మి లిపిలో, ప్రాకృత భాషలో ఉన్నాయి. కానీ వాయవ్య భారత్‌లో కొన్ని శాసనాలు ఖరోస్టి లిపిలో ఉన్నాయి.
కోటిలింగాలో లభించిన మొదటి శాతవాహనులు, శాతవాహన కాలం నాటి నాణేలు ప్రాకృత భాషలో ఉన్నాయి. సిరి, రానో, పుతస, గోతమి, వసిటి లాంటి పదాలు అందుకు తార్కాణంగా నిలిచాయి. వాటికి సరిసమానమైన సంస్కృత పదాలుగా శ్రీ, రాజ్నో, పుత్రస్య, గౌతమి, వశిష్టి ఉన్నాయి. వీటిలో కొన్ని పదాలు కింద ఉన్న ఫొటోలోని నాణేలపై ముద్రించి ఉన్నాయి:
ఆఖరికి శాతవాహన రాజుల పేర్లు సైతం ప్రాకృత భాషలో ఉండటం ఆశ్చర్యకరం. ఉదాహరణకు గోతమి అంటే గౌతమి, కోసిక అంటే కౌశిక, రుద అంటే రుద్ర, ఖద అంటే స్కంధ.
పుడమవి రాజులందరి పేర్లు పుడమవి అయితే శాతవాహన సామ్రాజ్యంలో చివరి రాజు మాత్రం పులమవి అనే తెలుగు పేరుతో ప్రాచుర్యం పొందాడు.
అన్ని భారతీయ లిపులకు మూలాధారమైన బ్రాహ్మి లిపిలో అచ్చులు, హల్లులను కలుపుకొని 40 అక్షరాలు ఉన్నాయి. 56 అక్షరాలతో తెలుగు / కన్నడ లిపి అభివృద్ధి చెందింది. కాకతీయుల పాలన వచ్చేంతవరకు కూడా తెలుగు, కన్నడ భాషలకు ఓ ఉమ్మడి లిపి ఉండేది. ఆ తర్వాత తెలుగు భాష అక్షరాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. నాణేలు, శాసనాలపై చిత్రాలతో కూడిన వ్యాఖ్యానాపై జరిపిన అధ్యయనంతో కొత్త అక్షరాలను జోడించిన వైనం వెలుగులోకి వచ్చింది. కల్యాణ చాళుక్యుల నాటికి ఆ జోడింపు పక్రియ పూర్తయ్యింది. ఉదాహరణకు దిగువన కల్యాణ చాళుక్య సామ్రాజ్యానికి చెందిన సత్యాశ్రయ రాజు గురించి ఓ శాసనం ఉంది. ఆయన ఎరివ బెడంగ బిరుదాంకితులు. దిగువ శాసనం, నాణెంపై ఎరివ అనే పదం ఎలా ముద్రితమై ఉన్నదీ గమనించగలరు:

శాతవాహనుల నాటికి మొగ్గగా ఉన్న తెలుగు భాష చాళుక్యలనాటికి నిండుదనాన్ని సంతరించుకుంది. ఈ సంధి కాలంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వేర్వేరు చోట్లు తెలుగు చోడుల ఏలుబడిలో ఉన్నాయి. తెలుగు చోడుల్లో నెల్లూరు, రేనాటి అని పేరొందిన అనేక శాఖలు ఉన్నాయి.
తెలుగు చోడులకు తమిళ ప్రాంతపు చక్రవర్తులైన చోళులకు ఏ మాత్రం సంబంధం లేదు. తెలుగు చోడుల శాసనాలు అనేక చోట్ల లభించాయి. తెలుగు భాష పరిణామాన్ని ప్రాకృతం నుంచి చూడవచ్చు. మనదేశంలో కనీవినీ ఎరుగని రీతిలో 1913లో నెల్లూరులో 16,586 బంగారునాణేలు బయట పడ్డాయి. వాటిని కృష్ణశాస్త్రి 1917లో అధ్యయనం చేశారు. ఆ నాణేలు తెలుగు చోడులకు చెందినవిగా శాస్త్రి నిగ్గు తేల్చారు. భుజబల, భుజబలవర లాంటి బిరుదాంకితులైన తెలుగు చోడు రాజులు శైలీకృత సింహాన్ని రాచరిక చిహ్నంగా చేసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన అలాంటి ఓ నాణెం కుందూరు చోడులకు చెందినది. కుందూరు చోడులు తొలుత కాకతీయులకు యుద్ధం చేశారు. ఆ తర్వాత వారికి సామంతులైనారు. ఈ బంగారు నాణెం కాకతీయుల బంగారు నాణేలను పోలి ఉంటుంది. కానీ నాణెంపై వ్యాఖ్యానం మాత్రం వేరుగా ఉంటుంది. తెలుగు చోడుల బంగారు నాణెంపై రెండు శ్రీలు, నాలుగు పద్మాలు, రెండు కదురుల్లో సూర్య, చంద్రుల చిహ్నాలు ఉంటాయి. వీటితో పాటుగా నాణెంపై భుజబలభవ అని ముద్రించి ఉంచింది. భవ అనేది సంస్కృత పదం. అది మన భాషలోకి సంస్కృత పదాలను ఎంత విరివిగా చేర్చుకున్నదీ ఎత్తి చూపుతున్నది.

  • డాక్టర్‌ ‌దామె రాజారెడ్డి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE