సమాజ్‌వాదీ పార్టీ భారతదేశాన్ని గౌర విస్తుందా? పాకిస్తాన్, ముస్లింల కోసం మాత్రమే పనిచేస్తుందా? మన చరిత్రను, పురాణాలను అవమానిస్తూ, పాకిస్తాన్ అభిమానించే, ముస్లిం మతోన్మాదులు పూజించే దురాక్రమణదారులను కొలుస్తుందా? అది భారత చరిత్రపురుషులను, పురాణాలను గౌరవించదు. ముస్లిం ఓట్ల కోసం ఏమైనా చేస్తుంది. మహారాష్ట్ర ఎమ్మెల్యే అబు అసీమ్ ఆజామ్‌ను ఈ బడ్జెట్ సమావేశాల వరకు బహిష్కరించారు. మార్చి 5వ తేదీన జరిగిన ఈ పరిణామానికి కారణం, అతడు భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదుడు, మతోన్మాదం తలకెక్కిన వాడిగా ప్రసిద్ధి చెందినవాడు ఔరంగజేబును నోరారా శ్లాఘించడమే. మార్చి 26న సమావేశాలు ముగుస్తాయి. మార్చి 5న మంత్రి చంద్రకాంత్ పాటిల్ ఆజామ్ సస్పెన్షన్‌కు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టారు.
ఔరంగజేబును శ్లాఘించడం అంటే ఛత్రపతి శివాజీని, ఆయన కుమారుడు శంభాజీని అవమానించడమేనని అధికార పక్ష సభ్యులు ఆరోపించారు. దీనితో సభ మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా ఆ తీర్మానాన్ని ఆమోదించింది. మన్‌ఖుర్డ్ శివాజీ నగర్ నియోజకవర్గం (ముంబై) నుంచి శాసనసభకు వచ్చిన ఆజామ్ సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు. పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆజామ్, ‘ఔరంగజేబు పాలనాకాలంలో భారత సరిహద్దులు అఫ్ఘానిస్తాన్, బర్మా వరకు విస్తరించాయి. ప్రపంచ జీడీపీలో మన జీడీపీ వాటా 24 శాతానికి చేరుకున్నది కూడా అప్పుడే. భారత్‌ను బంగారు పిచ్చుక అని పిలిచిన కాలం కూడా అదే’ అన్నాడు. ఔరంగజేబు, మరాఠాల వైరం గురించి ప్రశ్నిస్తే, అదంతా రాజకీయమేనని అన్నారు. దీనితో మహారాష్ట్ర శాసనసభ తీవ్ర ఆగ్రహం వెలుబుచ్చింది. ఇతడిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలని, దేశద్రోహం కేసు పెట్టాలని అధికార పక్ష సభ్యులు కోరారు. తరువాత షరతులతో తన ప్రకటనను వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని ఆజామ్ ప్రకటించాడు. తన ప్రకటనను వక్రీకరించా రని, చరిత్రకారులు ఏం చెప్పారో అదే తాను చెప్పానని, శివాజీ, శంభాజీలను తాను ఏమీ అనలేదని, ఒకవేళ తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే వెనక్కి తీసుకుంటానని అన్నాడు ఆజామ్.
అబూ ఆజామ్ వ్యవహారం ఉత్తరప్రదేశ్ శాసనసభకు కూడా పాకింది. ఆజామ్‌ను మా రాష్ట్రానికి పంపిస్తే సరైన చర్యలు తీసుకుని పంపిస్తా మని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచించారు. నిజానికి ఆజామ్ ఉత్తరప్రదేశ్ కేంద్రంగా పనిచేసే సమాజ్‌వాదీ పార్టీకి చెందినవారు. బడ్జెట్ సమావేశాల చివరి రోజు మార్చి 6న ముఖ్యమంత్రి యోగి ఈ విషయం లేవనెత్తారు. మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆజామ్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. అదే సమయంలో అతడిని ఉత్తరప్రదేశ్ పంపించండి, ఎలా చూసుకో వాలో మాకు తెలుసు అన్నారాయన. డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా సిద్ధాంతాలతో పనిచేసే రాజకీయ పక్షంగా చెప్పుకునే సమాజ్‌వాదీ భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడం లేదని ఆరోపించారు. లోహియా త్రిమూర్తులను భారతీయ ఐక్యతకు మూల స్తంభాలుగా భావిస్తే సమాజ్‌వాదీ ఔరంగజేబును కొలుస్తున్నదని యోగి విమర్శించారు.