ఒక డ్రోన్ అయోధ్యలో రామ మందిరంపై ఉన్నట్టుండి ప్రత్యక్షం కావడం భక్తుల్లో భయాం దోళనలు రేకెత్తించింది. అయితే అక్కడి భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి ఆ డ్రోన్‌ను కూల్చి వేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. మందిరంపై డ్రోన్ ఎగురడం వెనుక గురుగ్రామ్‌కు చెందిన ఓ యూట్యూబర్ పాత్రను దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
అయోధ్యలోని శ్రీరామజన్మభూమి మందిర సముదాయంలో ఇటీవల భద్రతకు సంబంధించిన ఉల్లంఘన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 17 సాయంత్రం ఓ డ్రోన్ రామ మందిర ప్రాంగణంపై ఎగురుతూ కనిపించడంతో తీవ్రమైన ఆందోళన నెలకొంది. దానిపై అధికారులు వెంటనే స్పందించారు. మహాకుంభమేళాను పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు రామ మందిరానికి తరలి వస్తున్నారు. అలా వచ్చిన భక్తులు బాల రాముని దర్శనం కోసం వేచి చూస్తుండగా మూడవ నంబరు గేటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రోన్ అకస్మాత్తుగా కనిపించడంతో భద్రతా సిబ్బందిలో, మందిరం నుంచి వెలుపలకు వస్తున్న భక్తుల్లో భయాందోళన నెలకొంది.
ప్రాంత అధికారి అశుతోష్ తివారీ చెప్పినదాన్ని బట్టి సాయంత్రం దాదాపు 7 గంటలకు డ్రోన్ కనిపించింది. మందిరం భద్రత చర్యల్లో భాగంగా నెలకొల్పిన యాంటీ డ్రోన్ సిస్టమ్ వెంటనే స్పందించింది. ఆ సిస్టమ్ డ్రోన్ నుంచి ఎలాంటి ముప్పు ముంచుకురాకమునుపే దానిని నేలకూల్చింది.
ఇదే విషయమై అశుతోష్ తివారీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన ‘‘మమ్మల్ని వైర్‌లెస్ సిస్టమ్ అప్రమత్తం చేసిన మరుక్షణం మేం చర్యలకు ఉపక్రమించాం. తీవ్రవాద వ్యతిరేక బృందం – ఏటీఎస్‌తో పాటుగా భద్రతా ఏజెన్సీలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. భక్తుల భద్రతకు భరోసా ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నాం’’ అని తెలిపారు.
పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్న సమయంలో జరిగిన సంఘటన అదుపులోకి రాని పక్షంలో అది మరింత గందరగోళానికి, భారీ ముప్పుకు దారి తీసి ఉండేది. భద్రతా బలగాలు వెం•నే స్పందించి మున్ముందు దర్యాప్తు కోసమని నేలరాలిన డ్రోన్‌ను తమ అధీనంలోకి తీసుకున్నాయి. జన్మభూమి పోలీస్ స్టేషన్ అధికారులు సబ్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఓ అగంతకుడు ఉద్దేశపూర్వకంగానే మందిరం సమీపంలోని నిషేధిత గగన ప్రాంతంలో డ్రోన్ ఎగురవేశాడని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. ఆ ఘటన భక్తుల మధ్య తొక్కిసలాటకు దారితీసి ఉండేదని అది తెలిపింది.
ఇదే విషయమై తివారీ మాట్లాడుతూ యాంటీ డ్రోన్ సిస్టమ్ మందిరం చుట్టుపక్కల 2.5 కిలోమీటర్ల ప్రాంతాన్ని కాపు కాస్తుందని, అలాంటి సిస్టమ్ డ్రోన్‌ను అడ్డగించి, దానిని నేలకూల్చిందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘‘మా యాంటీ డ్రోన్ సిస్టమ్ అత్యంత సమర్థమంతంగా పనిచేస్తోంది. అది ఓ పెను సంక్షోభాన్ని నివారించింది’’ అని చెప్పారు.
పోలీసులు వారి దర్యాప్తులో డ్రోన్ వెనుక గురు గ్రామ్‌కు చెందిన ఓ యూట్యూబర్‌ను అనుమానిస్తు న్నారు. స్థానిక అధికారులు ఘటనకు కారకులైన వారిని కనిపెట్టే పనిలో ఉన్నారు. దర్యాప్తులో ఆగంతకులు రామ మందిరానికి సంబంధించిన కంటెంట్ కోసం లేదా వీడియో తీయడం కోసమని డ్రోన్‌ను ప్రయోగించడానికి ప్రయత్నించినట్టుగా వెల్లడైంది.
అయితే ఇది తేలాల్సి ఉంది. ఇదే విషయమై సంఘటన జరిగినప్పుడు అక్కడున్న భక్తుల్లో కొందరు మాట్లాడుతూ ‘‘డ్రోన్ నేలకూలినప్పుడు అక్కడున్న వారందరూ కాసేపు భయపడ్డారు. అదృష్టవశాత్తూ పరిస్థితి వెంటనే చక్కబడింది. దాని వల్ల ఎవరికి ఎలాంటి జరగలేదని తెలుసుకొని మేమంతా ఊపిరి పీల్చుకున్నాం’’ అని తెలిపారు.
అధికారులు డ్రోన్ ఆపరేటర్‌కు, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
– ‘ఆర్గనైజర్’ నుంచి