‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘ఎం‌త దారుణం…!? ఎంత అన్యాయం…!? ఇంకెంత అక్రమం…!? వారి అక్రమాలకూ కండకావరానికి అడ్డే లేదా…? ఇంకా ఎన్నాళ్లు ఈ అజ్ఞాతవాసం! మా స్థానంలోకి వచ్చి మా మీదే పెత్తనం చెలాయిస్తుంటే…, ఇంకా ఎన్నాళ్లిలా చేతులు ముడుచుకొని చేతకానివాళ్లలా…? ఆ తెల్లదొరల పీచమణిచే రోజు ఎప్పుడొస్తుంది?’ ఆమె మస్తిష్కంలో ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. అవి ప్రశ్నలు కాదు ఆక్రోశం… వేయితలల ఆదిశేషునిలా బుసలు కొడుతోంది.

 ఒక చిన్న గదిలో అస్తిమితంగా పచార్లు చేస్తోంది మహారాణి నాచియార్‌. ఆమె అంతరంగం అల్లకల్లోలంగా ఉంది. హృదయం భగభగ మండుతోంది. అంతకంతకు ఆమెలో ప్రతీకార

జ్వాల దావానలంలా ఎగిసిపడుతోంది.

 ఆ మధ్యాహ్నం తన అనుయాయులు చెప్పిన వార్త చెవుల్లో గింగురుమంటోంది. కళ్లు క్రోధంతో ఎరుపెక్కి అగ్ని గోళాలను తలపిస్తున్నాయి. కనులు మూసుకుంటే ఆ వార్త దృశ్యంగా కళ్లల్లో కదులుతోంది.

                                                                                              *     *    *

‘‘మహారాణి… మహారాణి…’’

‘‘ఏం సమాచారం… ఎందు కంత ఆదుర్దాగా ఉన్నారు?’’ అడిగింది నాచియారు రాణి.

‘‘మహారాణి ఒక దుర్వార్త…’’

‘‘హు…! మనమున్న పరిస్థితిలో శుభవార్తలెక్కడివి… అన్నీ దుర్వార్తలే కదా… చెప్పండి. విషయమేంటి?’’ గంభీరంగా వచ్చింది నాచియార్‌ ‌స్వరం.

 ‘‘మహారాణి! మన… ఉడైయాళ్‌ ఆర్కాట్‌ ‌నవాబు సైన్యానికి చిక్కిపోయింది కదా…! ఎన్ని చిత్రహింసలు పెట్టినా మీ జాడ బయటపెట్టలేదని ఉక్రోషంతో ఈ రోజు…’’

‘‘ఊ… ఏమయింది? ఈ రోజు…’’

‘‘ఈ రోజు… ఉడైయాళ్‌ ‌శిరస్సు ఖండించి ప్రదర్శనకు పెట్టాడు నవాబు’’ గద్గదస్వరంతో చెప్పాడు చారుడు.

‘భగవాన్‌!’ ‌కళ్లు మూసుకుంది నాచియార్‌. ‘‌నమ్మినబంటు ఉడైయాళ్‌ ‌నవాబు సైన్యానికి చిక్కి ఎంత నరకయాతన పడిందో, అజ్ఞాతంలో ఉన్న తన ఆచూకీ కోసం ఆమెను ఎన్ని చిత్రహింసలకు గురిచేసారో తను ఊహించగలదు. శత్రు సైన్యానికి చిక్కినవారి పరిస్థితి ఎంత హింసాత్మకంగా ఉంటుందో ఒక రాణిగా తనకు తెలియనిది కాదు. అంత హింసను భరించింది గాని తన ఉనికిని బయటపెట్టలేదు ఉడైయాళ్‌. ఆమె నుంచి ఏ రహస్యాలు రాబట్టలేమని తెలుసుకొని, విసిగిపోయిన నవాబు ఉక్రోషంతో ఆమె ప్రాణాలే తీసేసాడు’.

వార్త తెచ్చిన చారుడు వెళ్లిపోయినా ఆ ప్రభావం నుంచి బయటపడలేకపోతోంది నాచియార్‌. ఆమె మానసం ఎగిసిపడుతోంది. ప్రతీకారేచ్ఛతో ప్రజ్వరిల్లుతోంది.

‘ఎంత కండకావరం! ఎక్కడో సముద్రాలకు ఆవలి తీరం నుంచి వర్తకం కోసమని వచ్చి ఇక్కడున్న కొందరు స్వార్థ్ధపరుల సాయంతో, నా దేశాన్నే కబలించి స్వాధీనం చేసుకొని, మా మీదే పెత్తనం చేస్తున్న ఈ తెల్లదొరలను ఏం చేయాలి!?

అవును స్వార్థంతో, అసూయతో ఉన్న కొందరు స్వదేశీ రాజులు ఆ విదేశీయులకు సాయపడి తమవారినే మట్టికరిపించే ప్రయత్నం చేస్తుంటే ఏమవుతుంది!? తన పరిస్థితి కూడా అదే కదా! తమిళ దేశంలో ఒక రాజ్యమైన శివగంగైకి రాజు తన భర్త ముత్తువడగనాథ పెరియ ఉదయ తేవర్‌. ఎప్పటి నుంచో తమ రాజ్యం మీద కన్నేసిన ఆర్కాట్‌ ‌నవాబు స్వంతంగా తమ రాజ్యాన్ని చేజిక్కించుకునే సత్తాలేక, ఇప్పటికే ఇక్కడ స్థానం బలపరచుకున్న ఆంగ్లేయులతో చేతులు కలిపి, తమ రాజ్యంపై దండెత్తి మోసంతో తన భర్త ముత్తువడగనాథ పెరియ ఉదయ తేవర్‌ ‌దైవదర్శనానికి నిరాయుధుడుగా వెళ్లిన సందర్భం కనిపెట్టి అతడిని మట్టుపెట్టి శివగంగై రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 ప్రమాదాన్ని గుర్తించిన తాను తమకు నమ్మకస్తులైన, మురుదు సోదరులుగా పేరు పడిన వెల్లై మురుదు, చిన్న మురుదుల సహాయంతో తన కూతురితో పాటు ఈ దిండిగల్‌ అడవుల్లోకి వచ్చి తలదాచుకుంది. తనతో పాటు తమ రాజ్యానికి నమ్మిన బంట్లు కూడా కొందరు వచ్చారు. అలా వస్తున్నపుడు… అప్పుడు…మళ్లీ ఎలాగైనా ఈ ముష్కరులను ఓడించి తమ రాజ్యాన్ని దక్కించుకొని తీరుతానన్న తన పౌరుష ప్రతిజ్ఞ తెలుసుకొని ఆ దుర్మార్గులు ఎంత అపహాస్యం చేసారు…! ఒక ఆడది ఏం చేస్తుందన్న వారి ఎగతాళి గుర్తుకొస్తే ఇప్పటికి కూడా ఒళ్లు కుతకుతలాడిపోతుంది.

 ఇక ఉపేక్షించి లాభంలేదు. త్వరపడాలి. ఆ మోసకారులకు, దుర్మార్గులకు, దోపిడీదారులకు తగిన బుద్ధి చెప్పాలి’ దృఢ నిశ్చయంతో ముందుకు కదిలింది వేలు నాచ్చియార్‌.  ‌ప్రణాళిక సిద్ధం చేసింది.

                                                                                              *     *    *

తనకు, తన రాజ్యానికి నమ్మినబంట్లయిన కొందరి సహాయంతో సైన్యాన్ని కూడగట్టుకుంది నాచ్చియార్‌. ‌కాని ఫిరంగులు, తుపాకులతో యుద్ధం చేసే ఆంగ్లేయులతో పోరాటానికి ఇవి సరిపోవు. ఇంకా బలమైన సైన్యాన్ని కూడగట్టాలి. అందుకే ఒక నిర్ణయానికి వచ్చింది.

‘‘చూడండి ఆ ముష్కరులతో యుద్ధానికి మన ఆయుధాలు, బలగం సరిపోదు. అందుకే నేను హైదర్‌ అలీని కలిసి మాట్లాడి, వారి సాయం కోరాలను కుంటున్నాను’’ అంటూ అనుచరుల ముందు తన మనసులో మాట బయటపెట్టింది,

ఈ మాటలకు తెల్లబోయారు అనుచరులంతా.

‘‘మహారాణీ! ఏం చెప్తున్నారు!? ఈ పరిస్థితిలో మీరు హైదర్‌ ఆలీని కలుసుకోవడం ఎంత ప్రమాదమో తెలుసా! కార్యం సఫలం చేసుకునే ఆత్రంలో మనం అజ్ఞాతంలో ఉన్నామన్న విషయం మరచిపోతున్నారా మీరు?’’ ఆందోళనగా ప్రశ్నించారు అనుచరులు.

‘‘లేదు. పరిస్థితులన్నీ అంచనావేసే చెబు తున్నాను… ఇప్పుడు ఇంతకంటే మరో మార్గం లేదు’’

‘‘కావచ్చు మహారాణీ! కానీ, అజ్ఞాతంలో ఉన్న మిమ్మల్ని ఎలా బయటకు రప్పించాలా! ఎలా బంధించాలా! అని చూసే శత్రువుల గురించి కూడా లోచించాలి మనం. ఇదెంత ప్రమాదకరమైన పనో ఆలోచించండి!’’

‘‘మీ భయం నాకర్థమయింది. ఇలాంటప్పుడే మనం చాకచక్యంగా, ఒడుపుగా మన పని చక్కబెట్టుకోవాలి. లేదంటే మనం ఇలా ఎంతకాలం అజ్ఞాతంలో ఉన్నా ఏమీ సాధించలేం. విజయమో వీరస్వర్గమో అంటారు. కాని మనం మాత్రం విజయమే అని ముందుకు సాగిపోదాం. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత నిజమో… మనం మన రాజ్యాన్ని సాధించడం అంతే నిజం. అన్నీ కోల్పోయినా మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పో కూడదు. అదొక్కటి ఉంటే మనం కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి దక్కించుకోవచ్చు’’ దృఢ•ంగా చెప్పింది రాణి నాచ్చియార్‌.

‘‘‌మహారాణీ ఇప్పటికే ఎనిమిదేళ్ల అజ్ఞాతవాసం గడిపాం. ఇప్పుడు ఏమాత్రం తప్పటడుగు వేసినా చిక్కుల్లో పడతాం. పైగా మరోసారి ఆంగ్లేయుల ముందు తలవంచాల్సిన పరిస్థితి వస్తుంది. కాస్త యోచించండి’’.

‘‘మీరందరూ నా మంచి కోరేవారు. నాకు హితులు. నమ్మకస్తులు. మీ భయం నాకర్థమైంది. కాని ఒక్కసారి ఆలోచించండి. ఈ పరిస్థితిలో మనముందున్న ఒకే ఒక్క అవకాశం ఇది. నిజమే! మీరన్నట్టు ఇది కాస్త ప్రమాదకరమైనదే. కాని పోరాటం లేకపోతే పురోగతి లేదు. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్లీ ప్రయత్నించకపోవడమే ఓటమి. ప్రమాదానికి భయపడితే మనం పురోగమించలేం. మనం ప్రయత్నం మనం చేద్దాం. ఆ ప్రయత్నంలో అప్రమత్తంగా ఉందాం…’’

ఆమె దృఢ నిర్ణ యానికి అందరూ ఆమోద ముద్ర వేసారు. దిండిగల్‌లో ఆమె హైదర్‌ అలీని కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసారు.

                                                                                              *     *    *

‘‘సలాం హైదర్‌ అలీ సాబ్‌’’ ‌గౌరవ సూచకంగా అభివాదం చేసింది వేలు నాచ్చియార్‌.

‘‘‌సలాం… మహారాణీ! నన్ను కలుసుకోవాలనుకున్న కారణం?’’ అడిగాడు హైదర్‌ ఆలీ.

ఏ విషయమైనా పూర్తిగా, వివరంగా తెలుసుకోవాలంటే మాతృభాషలో వింటేనే అది సాధ్యమవు తుంది. హైదర్‌ అలీ మాతృభాష ఉర్దూ. అందుకే వేలు నాచ్చియార్‌ ‌తన సంభాషణ అంతా ఉర్దూ భాషలోనే కొనసాగిస్తోంది.

 భారతదేశంలో ప్రస్తుతం ఆంగ్లేయులు సాగిస్తున్న అరాచకం పూర్తిగా వివరించింది. తమపై జరిగిన అన్యాయపు దాడి వివరించింది. ఆంగ్లేయుల అరాచకానికి అడ్డుకట్ట వెయ్యాలంటే దేశంలోని రాజులంతా ఏకం కావలసిన అవసరం నొక్కి చెప్పింది. తన రాజ్యాన్ని తను దక్కించుకోవాలంటే తగినంత సైన్యం, ఆయుధాలు లేని మాకు మీ సాయం అవసరమని చెప్పింది.

సంభ్రమంగా వింటున్నాడు హైదర్‌ అలీ. ఒక దక్షిణాది వనిత ఇంత చక్కగా ఉర్దూ భాషలో ఎలా మాట్లాడగలుగుతోంది! అంతకంటే ముఖ్యంగా ఇంత ధైర్యంగా అంత పెద్ద రాజ్యానికి వ్యతిరేకంగా ఎలా పోరాటానికి సిద్ధమవుతోంది!? అని ఆశ్చర్య పోయాడు.

ఆ అనుమానానికి సమాధానం వేగుల ద్వారా దొరికింది హైదర్‌ అలీకి.

తమిళనాడులోని రామనాథపురం రాజు చెల్లముత్తు విజయ రఘునాథ సేతుపతి కుమార్తె ఈ నాచ్చియార్‌. ‌రఘునాథ సేతుపతి, కూతురిని కొడుకులాగే పెంచాడు. యుద్ధవిద్యలతో పాటు తమిళ, ఇంగ్లీషు,ఫ్రెంచ్‌,ఉర్దూ భాషల్లో తర్ఫీదు ఇప్పించారు. అందుకే ఇప్పుడు హైదర్‌ అలీతో ఉర్దూలో ఇంత అనర్గళంగా మాట్లాడగలిగింది.

వేలునాచ్చియార్‌ ‌మాటలతో హైదర్‌ అలీ ఆలోచనలో పడ్డాడు. ‘నాచియార్‌ ‌రాణికి సాయం చెయ్యడం ఆమెకే కాదు ఒక రకంగా తనకూ ఉపయోగకరమే. ఇప్పటికే ఉత్తరాదిలో గట్టి పునాది వేసి దక్షిణాదిలో కూడా ప్రాబల్యం సంపాదించే ప్రయత్నంలో ఉన్న ఆంగ్లేయులను దక్షిణాదిలో కట్టడి చెయ్యాలంటే ఇలాంటి ఐకమత్యం అవసరమే. పైగా ఆర్కాట్‌ ‌నవాబు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు. అతడికి బుద్ధి చెప్పాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు తను. ఇప్పుడు సమయం వచ్చింది. అందుకే వేలునాచ్చియార్‌ ‌రాణికి సహాయం చెయ్యడానికి సుముఖుడయ్యాడు.

‘‘మహారాణీ! మీ ధైర్యసాహసాలు మాకు నచ్చాయి. మీకు సహాయం చెయ్యడానికి మేము సుముఖంగా ఉన్నాము. మీకు 5000 మంది సైనికులను సహాయంగా ఇస్తాము. మీరు మీ రాజ్యాన్ని దక్కించుకునే ప్రయత్నం చెయ్యండి. అన్నాడు.

‘‘సంతోషం… ధన్యవాదాలు’ చెప్పింది నాచ్చియార్‌ ‌రాణి.

                                                                                              *     *    *

దళాలను విభజించి ఎవరు ఏ పని చెయ్యాలో… ఏవిధంగా కోటను ముట్టడించి ఆంగ్లేయులను మట్టికరిపించి కోటను స్వాధీనం చేసుకోవాలో పథ•క రచన చేస్తోంది నాచ్చియార్‌ ‌రాణి. ఆమె చెబుతున్న ప్రతి అక్షరం శ్రద్ధగా వింటూ ఆకళింపు చేసుకుం టున్నది ఆమె అనుచరగణం.

‘‘మన మహిళా దళానికి, రాజభక్తితో శత్రు రాజులు పెట్లే చిత్రహింసలకు కూడా వెనుకాడక రాజ్యం కోసం, తన రాణి కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టిన ఉడైయాల్‌ ‌పేరు పెడుతున్నాను. కుయిలీ! దానికి నువ్వు అధ్యక్షురాలిగా వ్యవహరించాలి’’ చెప్పింది నాచ్చియార్‌.

‘‘‌మహారాణీ! ఉడైయాల్‌ ‌పేరు పెట్టడం వరకు సరైనదే. కాని…నన్ను అంత పెద్ద స్థానానికి…’’ మాట పూర్తి చేయలేక ఆగిపోయింది దళిత నాయకురాలు కుయిలీ.

‘‘అవును కుయిలీ! ఈ స్థానానికి నువ్వు అర్హురాలివే. ఎన్నో క్లిష్ట సమయాల్లో నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డం వేశావు. నీ స్వామిభక్తి, నిజాయతీ, అన్నిటినీ మించి నీ తెగువ, తెగింపు, వేగంగా పథ•క రచన చెయ్యగల సామర్థ్యం.. ఇవన్నీ నువ్వే దీనికి సరైన వ్యక్తివి అని చెబుతున్నాయి. రేపే మన దాడికి ముహూర్తం. అందరూ సిద్ధంగా ఉండండి. ఆంగ్లేయుల తుపాకులు, బాంబుల ముందు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈసారి ఎట్టి స్థితిలోనైనా మన కోటను మనం వశపరచుకోవాలి. అందరూ సిద్ధంగా ఉండండి. కోటలో రక్షణ కోసం చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారని మన చారులు చెప్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రేపే మన దండయాత్రకు ప్రారంభం. హైదర్‌ అలీ ప్రభువు ఇచ్చిన సైనిక సహాయంతో మనం చురుగ్గా ముందుకు వెళ్లగలం. సిద్ధంగా ఉండండి’’ చెప్పింది నాచ్చియార్‌ ‌రాణి.

                                                                                              *     *    *

నాయకురాలు ఇచ్చిన స్పూర్తితో, ఓవైపు నాచ్చియార్‌ ‌నమ్మకస్తులైన సైనికులు,మరోవైపు హైదర్‌ అలీ పంపిన సైనికులు రెట్టించిన ఉత్సాహంతో శివగంగై కోట మీదకు వెళ్లారు. వీరవిహారం చేసింది నాచ్చియార్‌ ‌రాణి.

ఓ వైపు ఆర్కాట్‌ ‌సైనికులు, మరోవైపు ఆంగ్లేయసేనలు తమ ప్రతాపాన్ని చూపడం మొదలెట్టారు. అయినా ఎక్కడా అదరక బెదరక తన బలగంతో శత్రుసైన్యాన్ని ఊచకోత కొయ్యడం మొదలుపెట్టింది నాచ్చియార్‌. ‌శివగంగైలో చాలా ప్రాంతాలను వశపరచుకుంది. చివరికి ఆంగ్లేయుల అధీనంలోని తిరుచురాపల్లి కోటమీదకు కూడా వెళ్లింది. కాని దురదృష్టం…అపార ఆంగ్లేయ సైన్యం, ఆయుధసంపత్తి ముందు, ఆమె సైన్యం, హైదర్‌ అలీ ఇచ్చిన సైన్యం కూడా నిలవలేని పరిస్థితి.

అందరూ తర్జన భర్జనలలో పడ్డారు. ఎందుకంటే కోటలో ఆంగ్లేయులకు ప్రత్యేకమైన ఆయుధాగారమే ఉంది. అంత ఆయుధ సంపత్తితో ఉన్న వారిని తమ పరిమిత ఆయుధాలతో, సైన్యంతో ఎదుర్కోవడం అసాధ్యం.

ఆలోచనలో పడింది నాచ్చియార్‌ ‌దళం.

‘‘మహారాణీ! ఈ పరిస్థితిని దాటాలంటే ఒక్కటే మార్గం…’’ చెప్పింది కుయిలీ.

‘‘ఏంటది…?’’

‘‘మనం ఒక పథ•కంతో వెళితే కోటను స్వాధీనం చేసుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో దసరా పండుగ రాబోతోంది. స్త్రీలందరూ కోటలోపల ఉన్న దేవిని దర్శించుకోడానికి అనుమతి ఉంటుంది. అందరూ వెళతారు. వాళ్లతో పాటు మా దళం కూడా పండ్లు, పూలబుట్టలతో, ఆ పండ్లుల, పూల మాటున ఆయుధాలు పెట్టుకొని లోపలికెళతాం. మేం లోపలికి వెళ్లిన తరువాత వారి ఆయుధాగారాన్ని స్వాధీనపరచుకుని లోపలి నుంచి కోట తలుపులు తెరుస్తాం. అప్పుడు మీరు కోటలోనికి ప్రవేశించి కోటను స్వాధీనపరుచుకోవచ్చు.

‘‘సెభాష్‌ ‌కుయిలీ… క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు చెయ్యడంలో నీకు నువ్వే సాటి. సరే! వెళ్లండి! మీరు కోట తలుపులు తెరిచిన కబురు కోసం ఎదురుచూస్తుంటాము’’.

                                                                                              *     *    *

నెమ్మదిగా పూలు, పండ్ల బుట్టలతో అమ్మవారి దర్శనం కోసం కోటలోకి సాగిపోతున్నారు మహిళలు. వారి మధ్యలో వారితో కలిసిపోయి చేతిలో పూల బుట్టలతో, తమ డేగ చూపులతో దారంతా జల్లెడ పడుతూ సాగుతోంది కుయిలీ సేన. ఒక దగ్గర పెద్దఎత్తున మందుగుండు సామగ్రితో ఆయుధాగారం కనిపించింది. మామూలు స్త్రీలలాగా ఒక దగ్గర చేరింది కుయిలీ సైన్యం.

‘‘కుయిలీ…! అదిగో చూడు…! ఆయుధాగారం. మందుగుండు సామగ్రితో నిండిన ఖజానా…’’ ఏదో మామూలు మాటలు చెప్పుకుంటున్నట్టుగా కనబడుతూ చాలా నెమ్మదిగా చెప్పిందొక సైనికురాలు.

‘ఆ… అవును. కాని, ఇంతమంది ఉండగా ఇంతపెద్ద మొత్తంలో ఉన్న ఈ మందుగుండును, ఆయుధాలను ఎలా స్వాధీనం చేసుకోవాలి?’’ స్వాధీనం చేసుకోలేకపోయినా కనీసం ఈ ఆయుధాలు, మందుగుండు శత్రువులకు అందకుండా చెయ్యగలిగితే చాలు. సగం సాధించినట్టే. కాని ఎలా…?’ ఆలోచనలో పడింది కుయిలీ. అంతలోనే ఆమె బుర్రలో మెరుపు మెరిసింది.

‘అవును… అదే సరైన పని. అలాగే చెయ్యాలి’ వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టే ప్రయత్నంలో పడింది. చుట్టుపక్కల అంతా పరిశీలించింది. గబగబా వెళ్లి అక్కడ దివిటీలు వెలిగించడం కోసం ఒక పెద్ద డబ్బాతో పెట్టిన నూనెను తనమీద దిమ్మరించుకుంది. బట్టలతో సహా తనువంతా నూనెతో తడిసిపోయింది. పక్కనే వెలిగించి ఉన్న దివిటీ తీసుకుంది ఒక్క ఉదుటున మందుగుండు సామగ్రి ఉన్న భవనంలోనికి పరుగుతీసింది. కనురెప్పపాటులో కాగడాను అంటించుకుంది. కుయిలీతో పాటు మందుగుండు సామగ్రి అంతా భగ్గుమంది. మందు గుండు శత్రువులకు అందకుండా ఆత్మార్పణ చేసుకుంది. నిశ్చేష్టులయి నిలబడి పోయింది కుయిలీ మహిళాదళం.

సుశిక్షితులైన ఆ మహిళాదళం వెంటనే తేరుకుంది. వెంటనే వెళ్లి కోట తలుపులు తెరిచింది. అదను కోసం చూస్తున్న నాచ్చియార్‌ ‌రాణి సైన్యంతో కోట లోపలి ప్రవేశించింది. వచ్చీరాగానే తన నమ్మినబంటు కుయిలీ కోసం వెతికాయి ఆమె కళ్లు. ఎక్కడా కనబడలేదు కుయిలీ.

అది గమనించిన దళ నాయకులు కుయిలీ తెగింపు, త్యాగం ఆమె ముందు పెట్టారు.

హతాశురాలైంది నాచ్చియార్‌. ‌నోట మాట రాలేదు. అడుగు కదపలేకపోయింది. పరిస్థితిని గ•మనించిన నాయకులు,

‘‘మహారాణీ త్వరపడండి… కుయిలీ ప్రాణ త్యాగం వృథపోనివ్వకండి. గుండె దిటవు చేసుకోండి. ధైర్యంగా ముందుకు నడవండి’’ అని హెచ్చరించ డంతో, అతి కష్టం మీద ముందుకు కదిలింది. సైన్యంతో కోటను ముట్టడించింది.

అంగ్లేయసైన్యం ఎదురుదాడికి దిగింది. అయితే ఆయుధాలన్నీ నాశనమైపోవడంతో ఇక నాచియార్‌ ‌సైన్యాన్ని నిలువరించలేక, వారి ముందు తలవంచక తప్పలేదు.

                                                                                              *     *    *

ఓవైపు పండితుల మంత్రోచ్చరణలు, మరోవైపు జయహో.. వీరమంగై వేలు నాచ్చియార్‌ అం‌టూ ప్రజల జయజయధ్వానాలు….ఇంకోవైపు మంగళవాయిద్య ధ్వనులు మిన్నంటుతున్నాయి. విజయదశమితో విజయం సాధించిన సైనికుల ఆనందానికి అవధుల్లేవు. ఎనిమిదేళ్ల అజ్ఞాతవాసం తరువాత స్వంత రాజ్యంలో స్వేచ్ఛావాయువులు పీల్చిన ఉత్సాహంతో రాజ్యమంతా కేరింతలు కొడుతోంది. ఇలా కోలాహలం నడుమ సింహాసనం అధిష్టించింది మహారాణి వీరమంగై నాచియార్‌.

– మావూరు విజయలక్ష్మీ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE