అరిస్టాటిల్‌ ‌చెప్పినట్లు మానవుడు సంఘజీవి. కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఒకే వర్గానికి చెందినవారందరూ ఒకచోట చేరడం సహజం. అలా చేరినప్పుడు ముఖ్యంగా పండుగలు, పబ్బాలప్పుడు ఆనందోత్సాహాలతో ఆటలు ఆడతారు. పాటలు పాడుకుంటారు. ఆయా సందర్భాల నుంచి పుట్టినవే నృత్యం, సంగీతం, సాహిత్యం, నాట్యం లాంటి కళలు. ఆదిమ మానవుని ఆటపాటల నుంచే (బాలే డ్యాన్స్) అన్ని కళలూ ఉత్పన్నమయ్యాయని ఆర్‌.‌జి.మౌల్టన్‌ ‌సిద్ధాంతీకరించాడు. ‘‘పెళ్లి, కొడుకు పుట్టడం, ఆనందం, అభ్యుదయం, తదితర సందర్భాల్లో వినోదం కోసమని నృత్యం ఉద్భవించింది’’ అని భరతముని చెప్పాడు. పతంజలి మహాభాష్యంలో నటులు సకుటుంబంగా ప్రదర్శన ఇచ్చినట్టు తెలుస్తోంది. కాళిదాసు ‘మాళవికాగ్నిమిత్రం’ నాటకంలో ‘‘నాట్య’’ పదాన్ని ప్రయోగించాడు. నాట్యం ప్రదర్శన ప్రధానమైంది. కళాప్రియులు రసాస్వాదన చేస్తారు. కానీ పగటివేషం, బుడబుక్కలు, ఇతర ప్రదర్శన కళలు నానాటికీ చీకటి తెరలోకి వెళ్లిపోతున్నాయి. దీనిని అంతా గుర్తించాలి.

భారత-భాగవత-రామాయణ తదితర కావ్యాల్లోని ఘట్టాలను స్వీకరించి, వాటికి సంగీతాన్ని, నృత్యాన్ని జోడించి, నాటకంగా ప్రదర్శించే వారిని ‘‘నాట్యమేళ’’ అంటారు. భగవంతుని లీలలతో భగవదారాధనమే ప్రధానంగా ఉండేవి ‘‘భాగవతములు’’. వీటిని ప్రదర్శించేవారిని భాగవతులు అంటారు. అలాగే నాలుగు వీధుల కూడలిలో ప్రదర్శించిన వారిని వీధి భాగవతులు అని పిలుస్తారు. అలాంటివారిలో కూచిపూడి భాగవతులు ప్రసిద్ధులు. కూచిపూడి వారంతా బ్రాహ్మణులే కాని అర్వాచీన కాలంలో పిచ్చుక కుంట్లు, ఏనాదులు, గొల్లలు, మాలలు, తదితర సామాజిక వర్గాల వారు కూడా వీటిని ప్రదర్శించేవారు.

భామా కలాపం రచనకు మోక్షదృష్టో మరేదో ప్రేరేపించినప్పటికీ అది ఒక అపూర్వ కళాసృష్టి. ఆద్యంతమూ ప్రణయ కలహమాడే భర్తకు దూరమైన సత్యభామ ఆ విరహంతో చేసిన అభినయమే భామాకలాపం. ఒకరోజు సత్యభామ, శ్రీకృష్ణుడు మాట్లాడుకుంటూ ఉండగా ఇద్దరిలో ఎవరు ఎక్కువ అందంగా ఉంటారు అనే ప్రశ్న పుట్టుకొచ్చింది. ఆ సందర్భంగా సత్యభామ ముందూ వెనకా ఆలోచించకుండా నేనే ఎక్కువ అందగత్తెను అని గర్వంతో చెప్పింది. దాంతో కృష్ణుడికి కోపమొచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. తన తప్పు తెలుసుకున్న సత్యభామ విరహంతో విలపించింది. విరహం భరించలేక దూతను స్వామి సన్నిధికి రాయబారం పంపింది. అయితే దూత మాటతో కృష్ణుడు రాధా సమేతుడై రావడం సత్యభామలో మరోసారి అసూయకు దారి తీస్తుంది. ఇరువురు భామల కయ్యం మధ్య చివరకు కృష్ణుడు సత్యభామను మన్నించి, ఇద్దరితో సుఖంగా ఉంటాడు. ఇది భామా కలాపం కథ. భామా కలాపం ఆడిన స్త్రీలలో పెండ్యాల సత్యభామ, చిత్తజల్లు వైదేహి, పురుషుల్లో రావూరి కామయ్య, కొల్లూరి వెంకయ్య, పుల్లా పంతుల చలమన్న, తదితరులు సుప్రసిద్దులు.

పొతకమూరు అన్నలు ఆరుగురు. వీరినే పొతకమూరు భాగవతులు అంటారు. వీరు నారాయణయ్య, ఔబళయ్య, అచ్యుతయ్య, అనంతయ్య, లక్ష్మయ్య, శ్రీచెన్నయ్య. వీరు నాట్యవినోదులు. ఈ ఆరుగురు అహోబిల క్షేత్రాన శ్రీయౌబలేశ్వరుని పటం చాటున నాట్యమాడేవారట. వీరిది కేవలం పూజా నృత్యం. సింహాచల క్షేత్రంలో సంకీర్తనాచార్యుడైన కృష్ణమాచార్యుల ఎదుట సింహాచలేశ్వరుడు బాలుడై ఆడేవాడట. పొతకమూరు అన్నలు అది విని సింహాచలానికి వచ్చి కృష్ణమాచార్యులను కలుసుకున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి అన్నమయ్యతో ‘‘ఆడుచు పోతకమూరన్నలు జోల పాడగా నాడెల్ల పసిబిడ్డనైతి’’ అని అన్నమాచార్యుల చరిత్రలో ఉంది.

చైత్రమాసంలో జరిగే మరో దైవోత్సవం వసంతోత్సవం. వీటినే చైత్ర మాసోత్సవాలని కూడా అంటారు. ఇవి భారతదేశంలో చాలా కాలంగా ప్రచారంలో ఉన్నప్పటికీ రెడ్డి రాజుల కాలానికి వచ్చేసరికి వీటికి చాలా పేరు వచ్చింది. ముఖ్యంగా కుమారగిరిరెడ్డి కాలంలో చైత్ర మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరిగేవి. ఇలా నిత్య వసంతోత్సవ ప్రియుడైన కారణంగా కుమారగిరి రెడ్డిని ‘‘వసంతరాయలు’’ అని పిలిచేవారు. ఆ ఉత్సవాల్లో వాడే కర్పూరాన్ని బట్టి ఈయనే కర్పూర వసంతరాయగా పేరొందారు.

సోమదేవుడు కథాసరిత్సాగరంలో (1063-1082) వసంతోత్సవాలను వివరించాడు. ఎక్కువగా తీగలు, పూలు, చెట్ల శోభను వర్ణించాడు. ఇక వసంతోత్సవ సమయంలో తోటల్లో విహారాలు, మధుపానం సేవించినవారు చేసే సరససల్లాపాలు ప్రధానమైనవి. అందుకనే కాలక్రమంలో వసంతోత్సవం కాస్త మదనోత్సవమైంది. వాత్సాయన కామసూత్రాల్లో ‘‘సువసంతక’’ అనే దేశీయ క్రీడ ప్రస్తావన ఉంది. ఇది జనసమూహానికి చెందిన ఉత్సవం అన్నమాట. దీన్ని చైత్ర శుద్ధ త్రయోదశినాడు మన్మథుడు తిరిగి ప్రాణం పోసుకున్న రోజున జరుపుకుంటారు. ఇదే విషయాన్ని హేమాద్రి తన ‘‘వ్రతఖండ’’ లో పేర్కొన్నాడు.

వసంతోత్సవంలో నీరు పోతలాట, నృత్యాలు, పాటలు, పుష్పాపచయం, మధుపానం, చల్లుపోరు (జలకేళి) ఉండేవి. కుమారగిరి రెడ్డి వసంతోత్సవ కేళిలో ‘‘కస్తూరి కారేణు సమూహమే మేఘములు, హిమాంబులే వర్షాధారలును, కర్పూర ఖండములే వడగండ్లు’’ను అయ్యేవట. ప్రతీ సంవత్సరం వసంతోత్సవానికని తగినంత కస్తూరి, కుంకుమ, ఘనసార, సంకుమద, హిమాంబు, కాలాగురు, గంధసార మొదలైన వాటిని ద్రవ్య భాండాగారాధ్యక్షుడు అవచి తిప్పయ్యసెట్టి సరఫరా చేసేవాడని హరవిలాసంలో ఉంది. పారిజాతాపహరణాన్ని బట్టి కృష్ణదేవరాయలకు కూడా వసంతోత్సవం అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది.

వసంతోత్సవం క్రీడ ప్రధానంగా జరుపుకునే వేడుక ఐనప్పటికీ అది లలిత కళాభివృద్ధికి కూడా తోడ్పడింది. ఈ ఉత్సవంలో నర్తకులు నృత్యం చేసేవారు. నటులు నాటకాలు ప్రదర్శించేవారు. గాయకులు పాటలు పాడేవారు. కళాకారులు ఏడాది పాటు చేసిన కృషికి వసంతోత్సవం ఒక ప్రముఖ వేదికగా అవతరించేది.

తంజావూరు నాయకరాజులతో రఘునాథ నాయకుని కాలంలో అనేక నాటకశాలలు ఉన్నాయని ‘విజయ విలాసం’ (చేమకూర వేంకటకవి) ద్వారా తెలుస్తోంది. పేరి సూరి అనే నటుడు వసుచరిత్రను ‘‘వసు మంగళ నాటకము’’ పేరిట మధుర మీనాక్షి ఉత్సవ సమయంలో ప్రదర్శించాడుట. విజయ రాఘవుడు అనేక యక్షగాన నాటకాలను రచించి, ప్రదర్శించిన వాగ్గేయకారుడు. క్షేత్రయ్య, విజయరాఘవుని ఆస్థానాన్ని దర్శించుకొని, అతడిపై పదములు చెప్పడం గమనార్హం. బొమ్మలాటను గురించి పండితారాధ్య చరిత్రలో

‘‘భారతాది కథల జీరమరుగుల

నా రంగ బొమ్మల నాడించువారు;

కడునద్భుతంబుగ గంబ సూత్రంబు

లడరంగ బొమ్మల నాడించువారు’’ అని ఉంది.

చీర మరుగులతో భారతం, తదితర కథలను ప్రదర్శించే ఆట తోలు బొమ్మలాట. కంబ సూత్రాల ఆట కర్ర బొమ్మలాట. ఈ రెండింటిని ప్రదర్శించడంలో తెలుగువారే సుప్రసిద్ధులు. ఒక శాసనం ప్రకారం కడప మండలంలో కమలాపురానికి దగ్గర్లో ఉన్న చిడిపిరాల గ్రామవాసి చంద్రమయ్య, పెద్ద చిట్టయ్య మొదలైనవారు వీటిని ప్రదర్శించడంలో ప్రసిద్ధులు. రంగనాథ రామాయణం లాంటి ద్విపద రచనలను బొమ్మలాటకు ఉపయోగిస్తారు.

ఛాయా నాటక ప్రదర్శనం అనే మరో పక్రియ ప్రచారంలోకి వచ్చింది. తోలు బొమ్మలాట(షేడో ప్లే)లో తోలుబొమ్మలు తెరను అంటిపెట్టుకొని ఉంటాయి. కాని దీంట్లో వ్యక్తులు కాని, జంతువులు కాని దీపానికీ తెల్లటి, సన్నటి తెరకు మధ్య తోలు బొమ్మలను నిలబెట్టి, వాటి నీడలు తెరపై పడేటట్లు చేస్తారు. కేవలం చేతి వేళ్లతో పెద్ద ఆకారాలను సృష్టించవచ్చు. హస్తాభినయం తెలిసిన వారికి ఇది చాలా సులభం.

కొరవంజి (సోది చెప్పడం) అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడిన తెలుగుకవి అయ్యలరాజు రామభద్రుడు. చెంగల్వరాయ రచించిన ‘‘ఎరుకల కథలు’’లో వారి ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు లాంటి వాటికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.

కథానాయకుడు ఎరుకల వేషంలో కథానాయికను కలుసుకుంటాడు. ఆమె చేతి గీతలు పరీక్షిస్తాడు. త్వరలో ఆమెకు అనుకూలుడైన భర్త దొరుకుతాడని చెప్తాడు. ఇలాంటి వర్ణనలతో కూడిన ఈ కథలు సుఖాంతం అవుతాయి.

పాల్కురికి సోమనాథుడు పగటి వేషాలను గురించి వర్ణించాడు. పగటివేషగాళ్లు గంధర్వ, యక్ష, విద్యాధర, తదితరుల వేషాలు కట్టి, పాటలు పాడుతూ, ఆటలాడుతూ ఉండేవారని వివరించాడు. గుర్తు పట్టని విధంగా వేషాలు వెయ్యడం, చివరికి పట్టపగలు కూడా గుర్తుపట్ట వీలులేని విధంగా వేషం కట్టడం పగటివేషగాళ్ల ప్రత్యేకత. వీళ్లతో కొందరైతే పగటి వేషాలను ఓ వృత్తిగా చేపట్టారు. కృష్ణాజిల్లా వీరంకిలాకు దగ్గర ఉన్న గడ్డిపాడు పగటివేషగాళ్లకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి వీళ్లను గడ్డిపాడు భాగవతులని పిలుస్తారు.

గడ్డిపాడు భాగవతులు దాదాపు 64 పగటి వేషాలు వేసేవారు. వాటిలో దొర వేషం, బుడబుక్కల వేషం, పేకముక్కలతో గారడీ, ఇంద్రజాలం, గారడీ, అర్థనారీశ్వరుడు లాంటివి ఉన్నాయి. ప్రస్తుతం పగటివేషగాళ్లు వేషం కట్టడాన్ని పూర్తిగా మానుకున్నారు. ఇలాంటి ఎన్నో కళలు కనుమరుగైపోతున్నాయి, అంతరించపోతున్నాయి.

డా. కాశింశెట్టి సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE