ప్రయాగరాజ్‌లో జరుగుతున్న కుంభమేళా సరికొత్త చరిత్ర సృష్టించింది. శతాబ్దాలనాటి కులాల అడ్డుగోడలను తుత్తునియలు చేస్తున్నట్టుగా ఈ సారి కుంభమేళాలో కొత్తగా నాగ సాధువులుగా అవతరించినవారిలో దళితులు, జన్‌జాతి వర్గాలకు చెందినవారు 20 శాతానికి పైగా ఉన్నారు. ఈ రూపాంతరం భారతదేశపు అత్యంత పవిత్రమైన వేడుకలో ఆధ్యాత్మిక ఏకత్వానికి, సమానత్వానికి ఓ సరికొత్త శకానికి సంకేతమైంది. మహిళలు, పురుషులను కలుపుకొని ఈసారి మొత్తంగా 8,715 మంది ప్రాపంచిక విషయాలను త్యజించి సనాతన ధర్మం కోసం నాగ సాధువులు, సాధ్వీలుగా అవతరించారు. వారిలో ఎస్సీ నేపథ్యం కలిగినవారు 1,850 మంది ఉన్నారు. మహిళలు దాదాపు 250 మంది ఉన్నారు. ఆ లెక్కన ఈసారి కుంభమేళాలో సనాతన ధర్మానికి కట్టుబడినవారు నాగ సాధువులు, సాధ్వీలుగా రూపాంతరం చెందే పక్రియ లింగ, కులాల అడ్డుగోడలను పగులగొట్టింది. వీరంతా కూడా చత్తీస్‌గఢ్ చిట్టడవుల నుంచి, బెంగాల్‌లో నదీ తీర గ్రామాల నుంచి, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మంచు కప్పుకున్న పర్వత ప్రాంతాల నుంచి, మధ్యప్రదేశ్‌లో కీలకమైన ప్రాంతాల నుంచి వచ్చినవారు. కుటుంబాలను వదిలేశారు. గతకాలపు గుర్తింపులను త్యజించారు. స్వయంగా గుండు చేసుకున్నారు. భౌతిక ప్రపంచానికి స్వస్తి పలుకుతూ స్వయంగా పిండ ప్రదానం చేసుకున్నారు. కులానికి, సామాజిక హోదాకు మంగళం పాడారు. నాగ సాధువులు, స్వాధీల రూపంలో సరికొత్త ఆధ్యాత్మిక ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.
అఖాడాలు ఈసారి దళితులు, మహిళలు గణనీయంగా నాగ సాధువులు, స్వాధీలుగా రూపాంతరం చెందడంలో గతకాలపు ఆచార వ్యవహారాలకు భిన్నంగా వ్యవహరించారు. బడుగు, బలహీన వర్గాలకు తలుపులు తెరవడం ప్రారంభిం చారు.
ఇదే విషయమై అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్రపురి మాట్లాడుతూ కొత్తగా నాగ సాధువులు, సాధ్వీలుగా మారినవారిలో ఎక్కువ మంది సామాజిక సమానత్వం, సర్వ సంగపరిత్యాగంపై దృష్టి పెట్టి సనాతన ధర్మానికి తమ జీవితాలను అంకితం చేయడానికి నిశ్చయించుకున్నారని తెలిపారు.
దళితులైన జగద్గురు మహేంద్రానంద్ గిరి, మహామండలేశ్వర్ కైలాసానంద్ గిరి లాంటి వారు అఖాడాల్లో అత్యున్నత స్థానాల్లో చేరుకోవడం నాగా సాధువులుగా మారడంలో దళిత, జన్‌జాతి వర్గాలవారిని ప్రోత్సహించింది. వారికున్న పలుకుబడి కులం, మతం, వర్గం మధ్య అంతరాన్ని తొల గించింది. ఐక్యతా సందేశాన్ని ప్రపంచానికి అందించింది.
జునా అఖాజా అధికార ప్రతినిధి శ్రీమహంత్ నారాయణ్ గిరి మాట్లాడుతూ ‘‘మత మార్పిడులను అరికట్టాలంటే కులం, మతం, వర్గం మధ్య అంతరాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. ఈ ధోరణి ఎస్సీలు, గిరిజనులు పెద్ద సంఖ్యలో కుంభమేళా వద్ద సన్యా శ్రమం స్వీకరించి ఆధ్యాత్మిక జాగృతి పొందడానికి దారి తీసింది.
`జాగృతి డెస్క్