తకథిమి తకథిమి తోలుబొమ్మా!
తాథిమి తాథిమి తకథిమి తకథిమి తోలుబొమ్మా, కీలుబొమ్మా!
మాయబొమ్మా! ఆటమ్మా, పాటమ్మా, బొమ్మల ఆటమ్మా!
తకతై తకతై మాయబొమ్మా! తళాంగు తకథిమి తోలుబొమ్మా!
అంతా- తోలు బొమ్మల ఆట. ఈ మాటే మారు మోగింది – ఒకప్పుడు. మరి ఇప్పుడూ. ఎక్కడో తెలుసా? సాక్షాత్తు మన దేశ రాజధాని నగరంలో.
అంతకుముందు ఏర్పాటైన చేతి కళల అంతర్జాతీయ పోటీలో వందలమంది కళాకారుల పక్రియల నుంచి కొందరిని ఎంపిక చేశారు. వారిలో ప్రథమంగా నిలిచిన శివమ్మ గురించీ ఈ వారం.
ఆమెది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రాంతంలోని నిమ్మలకుంట. మళ్లీ ఆ గ్రామం నుంచి ఏకంగా ఢిల్లీ మహానగరానికి వెళ్లిన ఆమె కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష పురస్కారం, ఘన సత్కారం అందుకోవడం ఎంతో విశేషం. ఇంకా విశిష్టం – తను రూపొందించిన తోలుబొమ్మలు ఎందరెందరో సుప్రసిద్ధుల ప్రశంసలు పొందడం. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా తెలుగునాట ఇంతటి విలక్షణత. ఈ అంశాన్నే ప్రస్తావిస్తే… నోరారా నవ్వుతారు దళవాయి శివమ్మ. ‘నేను చేసిందేముందీ. అంతా ఆ కళామతల్లి దయ’ అంటారు ఒద్దిక నిండిన గొంతుతో. అదీ తన సహజ స్వభావం.
అప్పుడు గుర్తుకొస్తుంది మనకు –
ఆంగిక వాచికాద్యభినయంబు లొనర్చుచు, హావభావముల్
భంగిమముల్ వెలార్చుచున్, పాత్రలు వచ్చెడు నిష్క్రమించెడున్
రంగము వెంటనె మరొకరంగము సాగుచుండె, దృశ్యముల్
రంగులు మార్చుచున్నవి, తెరల్ పడుచున్నవి, లేచుచున్నవిన్!
కవిత్వం, సంగీతం, చిత్రణం, శిల్ప విన్యాసం.
దేనికి అదే శాస్త్రం, కళ. అన్నీ లలితమైనవే, అనుబంధ పక్రియలు కలిగి ఉన్నవే. అన్నీ కలగలిసిన వేదిక ఒకటుంది. అక్కడే తోలుబొమ్మలాట. మనముందుకొస్తున్నాయి. కదులుతాయి. నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, ఆశ్చర్యపరుస్తాయి. విభ్రమం కలిగిస్తాయి. ఎన్నో చేస్తాయి తోలుబొమ్మలు.
ముందుకు తెచ్చేదీ, కదిలించేదీ, నవ్వింపచేసేదీ, ఏడుపుతెప్పించేదీ, నివ్వెరపరిచేదీ, భ్రమో విభ్రమో పెంచేదీ… ఆ ఆటలాడించే వ్యక్తి.
శివమ్మ ఉండేది ధర్మవరం పరిసర గ్రామంలో.
నిమ్మలకుంట అనేది చిన్నగ్రామం. ఊరు చిన్నదే అయినా, జానపద కళారంగాన పెద్దది. ప్రధానంగా రామాయణ, భారత, భాగవత కథల తోలు బొమ్మల ఆటలకు ప్రసిద్ధి.
‘భారతాది కథల జీరమరిగి, నారంగ బొమ్మల నాడించువారు
కడు అద్భుతముగ కంబ సూత్రంబు లడరంగ ఆడించువారు’ ఎందరో ఉన్నారక్కడ. భౌగోళికంగా మారుమూల అయినా, హస్తకళా ప్రతిభ కారణంగా ఎంతెంతో పేరూ ప్రఖ్యాతీ నిండిన ఊరు.
అక్కడి కళాకారుల కుటుంబంలోని శివమ్మకు తొలి నుంచీ మనవైన పురాణ కథలు, ఇతిహాస విశేషాలంటే మక్కువ ఎంతో ఎక్కువ. సంప్రదాయం, కాపాడుకోవటం గురించిన శ్రద్ధ అధికం.
కళాకార నేపథ్యమున్న ఆమె ఇంటిల్లిపాదీ తోలుబొమ్మలాట గురించిన పనులతో ఉంటుంటారు. అప్పటి నుంచీ వస్తున్న ఆ జానపద కళాపక్రియను ఇప్పటి తరానికి అనువుగా మలచడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడో ఉదాహరణ.
రామ, రావణ యుద్ధ కథ మనందరికీ తెలిసిందే. ఆ బొమ్మలను తోలుమీద చిత్రీకరించాలని ముందుకొచ్చారు శివమ్మ. నెలల తరబడి పరిశ్రమించి, మంచి కళాఖండాన్ని తయారుచేశారు. ఎన్ని గంటలు కేటాయించారో, ఎంత శక్తిని వెచ్చించారో మాటల్లో చెప్పలేం – ఇప్పటికీ.
అదిగో ఆ తోలు చిత్రకదంబానికే జాతీయస్థాయి పురస్కారం లభించింది. క్రమానుగతంగా మండలం, జిల్లా, రాష్ట్రం, ఇతర ప్రాంతాలనీ దాటి ప్రతిపాదన కేంద్ర ప్రభుతకు చేరింది.
ఇప్పటి మాట కాదు. ఇదివరకటి సంగతే ఇదంతా. హస్తకళల అభివృద్ధి సంస్థ కేంద్ర కార్యాలయం నుంచి ఆ గ్రామానికి సమాచారం అందింది. ఇలా తన నాలుగున్నర దశాబ్దాల కళానుభవంతో అఖండ కీర్తిని సంపాదించారామె. ఇంత సాధించినా పత్రికలవారితో చెప్పింది మాత్రం ‘ఈ గౌరవమంతా నాది కాదు; గ్రామానిది’ అని. బొమ్మలు చిత్రించినా ఆడించి పాడించినా మొదటి నుంచి చివరివరకు అంతా అంకితభావమే!
తోలు బొమ్మలాట కుటుంబ కళ. ఆడుతూ, పాడుతూ అనుభూతిని పంచి, పెంచి, పోషించే రీతి. బొమ్మలు వేస్తారు. తయారీ చేస్తారు. రంగులూ హంగులూ రంగస్థలం మాదిరిగానే! పురుష, స్త్రీ పాత్రలను కుటుంబంలోనివారే బాధ్యతగా రూపుదిద్దుతారు. ఎవరి పాత్రకు తగినట్లు వారు మాట, పాట, ఆట. పెద్దలకు పెద్దల, పిన్నలకు పిన్నల వాచకం. సూత్రధారులతో చాకచక్యంగా పాత్రాభినయం చేయించడం అన్నమాట. ఇటువంటి ‘ఆటలు’ ఇప్పటివా? కావు? తెలుగు నేలకే పరిమితమా? కాదు. ఎప్పటి నుంచో ఎన్నిచోట్లనో ఉన్నాయవి. మనకైతే తోలుబొమ్మలాట కానీ- ఇతర రాష్ట్రేతర ప్రాంతాల్లో కొయ్య బొమ్మలతో, కీలుగుర్రాలతో, మరికొన్ని విభిన్న బొమ్మలతో ఆటలే ఆటలు.
పర్వదిన ఉత్సవాల్లో తోలుబొమ్మలాటల ప్రదర్శన ఓ రివాజు. దేవస్థాన వాడుక వేడుకల్లో నాడు తప్పనిసరిగా ఉంటుండేవి. ఇదంతా చూస్తుంటే జీవన నాటకం అనేదే స్ఫురిస్తుంది.
తెలవారుగట్ల తలవంచిన తెలి కలువ పువ్వు జీవితం
భగవంతుడు మానవునికిచ్చిన పరీక్షా పత్రం జీవితం
పగలు సైతం దీపం వెలిగే పల్లెటూరి సత్రం జీవితం
గట్టుమీది గడ్డిపరక చెప్పిన కన్నీటి కరుణగాథ జీవితం
ఏ శ్రుతి కలుస్తుందో తెలియని వింతపాట
గతుకులలో గడ్డలలో కాలుసాగని చిక్కుబాట!
వగరూ తీపీ చేదూ కలిపిన ఉగాది పచ్చడి బతుకు
యుగయుగాలుగా తెగ చిక్కుబడి బిగిసిన పీటముడి బతుకు.
ఇన్ని విధాల స్థితిగతులున్నా, కళాచరణకు అవరోధాలు ఎదురవుతున్నా లోలోపలి సంకల్పబలమే తోలుబొమ్మల కళాకారుల, ప్రముఖంగా కళాకారిణుల జీవనవనిని కళాభరితం చేస్తోంది.
సంప్రదాయ కళకు పట్టం కట్టే కుటుంబాలు ఒక్క అనంతపురం ప్రాంతంలోనే కాదు – కర్నూలు, నెల్లూరు, విశాఖ, గోదావరి ప్రాంతాల్లో సైతం ఉంటుండేవి. ఇంకా చెప్పాలంటే కర్ణాటక పరిసర ప్రదేశాల్లోనూ తోలుబొమ్మల నిర్మాణ, ప్రదర్శన కళాంశాలకు పేరుండేది.
బొమ్మల నిర్మాణ నిర్వహణల్లో శివమ్మది కీలక భూమిక. పలు విధాల పురాణ పాత్రలకు జంతు చర్మాన్ని వినియోగిస్తుంటారు ఎవరైనా. ఆ విధానంలో మార్పు చేర్పులు తేవడం, బొమ్మ తయారీకి అనువైన తీరున తీర్చిదిద్ది రంగులద్దడంలో ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారామె. పాత్ర లక్షణాలను రంగుల్లో అభివ్యక్తం చేసేందుకు సృజనశక్తిని ఉపయోగిస్తుంటారు.
కథా విధానాన్నిబట్టి, సన్నివేశాల వరుసను అనుసరించి పాత్రను వివిధ రీతుల్లో చిత్రిస్తారు. ఇతరత్రా పరికరాల అమరికనూ చిత్రాల ద్వారా సాధ్యం చేసుకుంటారు. తెరమీదికి ముందు ఒక బొమ్మ. ఆ తర్వాత మరొకటి. దృశ్యాలు సైతం వరసక్రమంలో ఉంటాయి కాబట్టి, ఆ అన్నింటినీ ఆధారం చేసుకుని చిత్రాలు నిర్మిస్తారు. ఇది రోజువారీ పని.
ఇందులో ఎన్నో కష్టనష్టాలుంటాయి. ధన, శ్రమ, ప్రయాసలూ ఉంటుంటాయి. విడివిడిగా ఉండే ముక్కలను సమీకరించి, పాత్రోచితంగా విభజించి, సమయ సందర్భాల క్రమంలో సిద్ధపరుచుకోవడం ఎంతో ప్రత్యేక కళానిర్వహణం. బొమ్మలను తెరమీదికి చేరుస్తుంటేనే కదా కథ సాగేది! దీపాల వెలుగులో అవి ప్రదర్శితమవుతుంటే ఆ వైభవాన్ని చూసి తీరాల్సిందే ప్రతీ ఒక్కరూ. మధ్యలో వచ్చే అవాంతరాలను నిర్మాణకళతో అధిగమించడం ఆమెకి తెలిసినంతగా మరి ఏ ఇతర కళాకారుడు / కళాకారిణికి తెలియదసలు. బొమ్మ ఆకారం, పొడవు, వెడల్పు, ఎత్తు, పరిమాణంబట్టి ఏ ప్రదర్శనకు ఆ తోలుబొమ్మల పెట్టె ముందుగానే సంసిద్ధమై ఉంటుంది. అంతా ప్రణాళిక ప్రకారమే.
తోలుపైన విభిన్నంగా చిత్రాలు వేసే శివమ్మ గతంలోనే ‘శిల్పగురు’ పురస్కృతిని స్వీకరించారు. చిత్రం / పెయింటింగ్ వేయడంలో ఆధునిక పద్ధతులను అనుసరిస్తూనే ఉన్నారు ఇప్పటికీ. ‘మీరు రూపుదిద్దిన వాటిల్లో ముఖ్యంగా ఏ బొమ్మలు ఇష్టం’ అని అడిగితే, ముందుగా తను చెప్పేది ‘శ్రీకృష్ణ చరిత్ర’ గురించే. అదేవిధంగా రామాయణ సంబంధంగా ‘విశ్వరూప హనుమ’ చిత్రీకరణను ఉదాహరిస్తుంటారు.
కన్నతల్లి కాళ్లకు ప్రణమిల్లి
‘అమ్మా! ఆశీర్వదించు’ అన్నాడొక చిన్నవాడు.
అతడి పేరు హనుమంతుడు.
అమ్మ అంజనాదేవి అప్పుడన్నట్లు…
మండే మార్తాండ మండలం అతడికొక మధురఫలం
కొండలు నరికిన ఆఖండలుని వజప్రహారం
అతడి గండస్థలికొక పూల హారం!
అపార పారావారం అతడికొక పిల్లకాలువ
అమోఘ బ్రహ్మాస్త్రం అతడికి ఒక పట్టుశాలువా!
ఇటువంటి వర్ణనలను, కథాసంవిధాన రూపురేఖలను గమనించి తయారుచేయడంవల్లనే తోలుబొమ్మలాట రాణిస్తుంది ఎంతగానో. ఎలా / ఎంతగా రాణింపచేయాలన్నది ఆ చిత్రకళాకారిణి మనసుకే తెలుసు.
ఆటకు తగిన పాట, దానికి అనువైన మోత. గాయకులు, వాద్యకారులు, ఇతర సహాయకులంతా ఉంటుంటారు. ప్రదర్శనను ఎంత బాగా రక్తికట్టించాలో అంతగానూ చేస్తారు బృంద సభ్యులందరూ. వీరందరికీ పెద్ద దిక్కు దళవాయి శివమ్మ. సూత్రధార శ్లోకాలు, పద్యాలు, గీతాలు; పాత్రల ప్రవేశంతో తోలుబొమ్మలాట… రసరమ్యమవుతుంది.
తాతల కాలం నాటి నుంచీ పారంపర్యంగా వస్తున్న నైపుణ్యం, తన భర్త అందించిన ప్రోత్సాహమే జీవితాన్ని పూలబాటలో నడిపిస్తోందన్నారు ఆమె. సుందరకాండ, మరికొన్ని పురాణ కథనాల గురించిన అవగాహన తన ప్రతిభకు సానపెట్టిందనీ ఎన్నోమార్లు అన్నారు. అందుకే ఆ తోలుబొమ్మలు దేశ విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి.
శివమ్మ స్ఫూర్తితో ఆ కుటుంబంలోని కొందరు యువకులూ జాతీయస్థాయి బహుమతులు అందుకుని ఖ్యాతిని పెంచుతున్నారు. ఆదరణ సమాజంలో తగ్గుతున్నా, అనుకోని పరిస్థితులు ఎదురవుతున్నా ‘కళతోనే ఉన్నతి’ అని గట్టి నమ్మిక. సంప్రదాయ కళకు మళ్లీ మంచిరోజులు వస్తాయని, ఇందుకు ముందస్తు సందర్భం తాజాగా ‘పరంపరాగత్’ అవార్డు లభించడమేనని ఆమె ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. ఈ ఆనందకర ప్రకటన వెనక శివమ్మ ఆత్మవిశ్వాసం ఉంది. సంప్రదాయమే నిలుస్తుందనీ గెలుస్తుందనీ అంటున్న ఆ కళానిపుణ – తరతరాల నాటి తోలుబొమ్మలాట చిత్ర రూప నిర్మాణానికి నిఖార్సయిన ఆలంబన.
ఆటమ్మా, పాటమ్మా, బొమ్మల ఆటమ్మా!
దళవాయి శివమ్మ కళావృక్షానికి పట్టుగొమ్మ!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్