భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘ఇదిగో, మీకే చెబుతున్నా, మీరు ఏమి చేస్తారో ఏమో, బొత్తిగా ఏ బాధ్యతలు పట్టించుకోవడం లేదు. ఎప్పుడు బ్యాంకు పని అని తప్పించుకుంటున్నారు’’, దెప్పి పొడిచింది సీత, కాఫీ కప్పు అందించి, పేపర్లో తల పెట్టుకొని చూస్తున్న, అంజనరావుని.
‘‘ఇప్పుడేమి కొంప మునిగిందే?’’ అడిగాడు అంజనరావు.
‘‘అమ్మాయి వయసెంతో తెలుసా? ఇరవై నాలుగేళ్లు దాటాయి. అదా..! ఎప్పుడు వచ్చినా లీవ్‌ ‌లేదంటూ..ఒకటి, రెండు రోజులుండి వెళ్తుంది. సంబంధాలు వెతకాలని ధ్యాస ఏమైనా ఉందా అంట?’’ అంది సీత.
‘‘ఏమే!..నీకు బొత్తిగా బుద్ది లేదే. అమ్మాయి.. మనమ్మాయి. ఎవరనుకుంటున్నావు? సాఫ్ట్‌వేర్‌ ఇం‌జినీర్‌. ‌బి.టెక్‌లో గోల్డ్‌మెడలిస్ట్. ‌సంబంధాలు వాటంతటికవే వెతుక్కుంటూ వస్తాయి. మనం వెతకడం దేనికి? సింపుల్‌గా మనం సెలెక్ట్ ‌చేసు కోవడమే. రోజులు మారాయి. నీలా గంగిరెద్దులా తలూపి, పెళ్లొద్దు మొర్రో.. ఇంకా జీవితములో సెటిల్‌ ‌కాలేదు అన్నా నన్ను చేసుకున్నావు. అప్పటి నుంచి నీతో వేగుతున్నాను. సర్లే, చూద్దాం’’. అన్నాడు, చదివిన పేపర్‌ ‌పక్కన పెట్టి అంజనరావు.
‘‘రేపు, అమ్మాయి రాగానే ఎలా ఒప్పిస్తారో ఏమో వచ్చిన వాటిల్లో, ఏదో ఒక సంబంధం ఒప్పించాలి’’ కోపంతో చిటపటలాడింది సీత.
‘‘అమ్మా, భాను ఇలారా! ఈ ఫోటోలో అబ్బాయిని చూడు’’, ఇంటర్నెట్‌లో తెలుగు మాట్రిమోని లింక్‌ ఓపెన్‌ ‌చేసి చూస్తున్న… అంజనరావు పిలుపు.
నాన్న, రెస్ట్ ‌తీసుకోవడానికి నెల్లూరు వస్తే ఇలా విసిగించాలా? పో నాన్న, నిద్దర వస్తూంది. సేవ్‌ ‌చేసి పెట్టండి. తర్వాత చూస్తాను’’ అంది బద్దకంగా బెడ్‌ ‌మీద పడుకొని,
కంప్యూటర్‌ ‌ముందున్న అంజనరావు వెంటనే లేచి, బెడ్రూంలో అమ్మాయి దగ్గరకు వచ్చి ‘‘అమ్మా భాను! టైమ్‌ ఎం‌తైందనుకున్నావు.. ఉదయం ఎనిమిది. లేమ్మా, మా నాన్న కదూ’’, అంటూ గోముగా బ్రతిమిలాడాడు. ‘‘ఊహూ, తర్వాత చూస్తానులే’’, అంది భాను.
తనను చేసుకొనేవాడు తనకన్నా హైటు ఉండి, క్వాలిఫికేషన్స్ ఎక్కువగా ఉండి, తనను అర్థం చేసుకొనేలా ఉండాలి. మరో ముఖ్య విషయ మేమిటంటే.. తనకు చిన్నప్పటి నుంచి కళ్లద్దాలు వేసుకున్నవారిని చూస్తే పరమ చిరాకు. ‘‘హాయిగా దేవుడిచ్చిన కళ్లకు ఆ ఆభరణములేమిటి? ముఖములో వెలితి తెలిసేలా’’ అన్న అభిప్రాయం కలది భానుకళ.
వసుంధర అవాక్కైంది, ఆ విషయము విని. ఆమె భానుకళకు స్వయానా మేనమామ భార్య. భర్తతో అంది. ‘‘ఎలా ఒప్పుకుందండి శివకుమార్‌ను క్వాలిఫికెషన్‌లోనూ, హైటులోనూ మన భాను కన్నా ఎక్కువే అనుకోండి. మరి కళ్లద్దాలు ఎలా బోల్తా కొట్టించాడు? మన భాను కళ్లద్దాల వాడిని ససేమిరా చేసుకొనని మంకుపట్టు పట్టిందాయే. పోనీలే, ఎలాగోలా వాళ్ల అమ్మానాన్నల ఆదుర్దా వది లించింది.’’ అంది.
అంతలో, అంజనరావు, సీత గుమ్మంలో ప్రత్యక్ష మైనారు. అంజనరావు, మధు చిన్ననాటి స్నేహితులు.
‘‘మధు! చివరకు అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. నా బాధ్యతను తండ్రిగా నెరవేర్చే సమయము వచ్చింది’’… వెడ్డింగు కార్డు చేతిలో పెట్టాడు, తప్పక రావాలని, దగ్గర ఉండి, పెళ్లి జరిపించాలని కోరుతూ.
‘‘అసలు ఈ శుభ సందర్భానికి కారణం నీవురా, నీకు థాంక్స్ ‌చెప్పాలి’’ అన్నాడు అంజనరావు.
ఒక వారం రోజుల క్రిందటి సంఘటన.
ఏమోరా మధు…ఈ పిల్లకు ఎలా పెళ్లవుత••ందో ఏమో ?’’, ఒక రోజు డ్యూటికి పోతూ, మార్కెట్టులో కూరగాయలు కొనుక్కొని వెళ్తున్న మధుతో అన్నాడు అంజనరావు’’.
‘‘అమ్మాయి ఊళ్లో ఉందా’’, అడిగాడు మధు.
‘‘ఆ, నిన్నే వచ్చింది. ఈ రాత్రే మళ్లీ ప్రయాణం’’, రిప్లై ఇచ్చాడు అంజనరావు.
‘‘ఒరే, అనవసరంగా కంగారూ పడకు, ఈ కాలం పిల్లలకు వాళ్ల మనస్తత్వాన్ని బట్టి నెమ్మదిగా నచ్చచెప్పాలి. సాయంత్రం ఓసారి భానుని ఇంటికి తీసుకురా. నేను మాట్లాడుతాను’’ అన్నాడు మధు.
‘‘ఏం మామయ్యా, బాగున్నారా’’ అన్న పిలుపుతో వాలుకుర్చీలో కునుకు పాటు పడుతున్న మధు, ఈ లోకంలోకి వచ్చాడు. ‘‘ఏయ్‌… ‌వసు.. ఎవరొచ్చారో చూడు’’, అన్నాడు.
వంటింట్లో ఫిల్టర్‌ ‌కాఫీ కలుపుతూన్న వసుంధర, చేతులు కొంగుతో తుడుచుకుంటూ వచ్చింది హాలులోకి .
లోపలికి వచ్చిన భాను, ‘‘హల్లో, అత్తయ్య! పోయినసారి మీరు ఇచ్చిన టమాటా పచ్చడి చాలా బాగుంది. ఫ్రెండ్స్ అం‌దరూ చాలా బాగుందని అన్నారు’’. ‘‘దానికేమీ భాగ్యం. ఈ సారి ఇంకొక బాటిల్‌ ఇస్తాను’’ అంది వసుంధర.
‘‘ఎంతకాలమైందే భాను నిన్ను చూసి’’ అన్నాడు మధు. కంపెనీ విషయాలు, ఫ్రెండ్స్ ‌సంగతులు ఏకధాటిగా చెబుతూంది భాను. కళ్లార్పకుండా వింటూంది వసు. ‘‘ఊ’’, అడగండి అని సైగ చేశాడు, అంజనరావు. వసుంధర వైపుచూశాడు మధు. తనుకూడా సైగ చేసింది.
‘‘ఏమ్మా.. ఎప్పుడు పప్పన్నము పెట్టేది?’’ అడిగాడు మధు. ఓ నవ్వు నవ్వి ‘‘ఆ, ఇంటెర్నెట్టు చూసి, చూసి, దానికి దిష్టి తగిలి, ఇంక మా వైపు చూడద్దు’’, అంటూంది మామయ్య.
‘‘ఒక్కటి, ఒక్కటంటే ఒక్క సంబంధమూ నచ్చడంలేదు, వాడికి హైటు లేదని, వీడికి క్యాలిఫికేషన్‌ ‌లేదని, ఏవేవో వంకలు, ఏమి చేస్తాం. కన్యాదాన ఫలితం ఈ జన్మకు లేదని అను కుంటాను’’ అన్నాడు అంజనరావు.
‘‘నాన్న, ఇంకొకమాటు పెళ్లి మాట మాట్లాడవద్దు. నేను చెబుతున్నానుగా.’’ అంది భానుకళ.
మధు నచ్చ చెప్పే ప్రయత్నము చేశాడు. ‘‘చూడమ్మా, భాను, నీవా, ఒంటరిగా, బెంగళూరులో జాబు చేస్తున్నావు. వీళ్లా.. ఉద్యోగ రీత్యా బదలీలు లేకుండా నెల్లూరులో ఉంటున్నారు. ప్రతిదినం మనం చూడడము లేదూ పేపర్లో, ఏవేవో పాడు కబుర్లు. ప్రతి నిమిషం నీ గురించి ఆలోచిస్తూ కుమిలి పోతున్నారు వీళ్లు. ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే, ఆ భారం అతను వేసుకొని, చక్కగా చూసుకుంటాడని వీళ్ల భావన. పోనీ, నీ మనసులో ఎవరైనా ఉన్నారో చెప్పు. వెంటనే వెళ్లి లాక్కొచ్చి మూడుముళ్లు వేయించేద్దాము. పోనీ, నీ కేమైనా కోరికలున్నాయా, చెప్పమ్మా’’, అడిగాడు మధు.
‘‘లేదు మామయ్య, మా ప్రాజెక్ట్ ఇక్కడ బెంగళూరులో అయిపోయింది. మరో ప్రాజెక్టు అమెరికాలో. కనీసం సంవత్సరం ఉంటుంది. దానికి నాకు ఛాన్స్ ఉం‌ది. ఆ అవకాశము నేను వదులు కోలేను. పెళ్లయిన తర్వాత ఆయన, ఆయన ఇంటి వాళ్లు వెళ్లవద్ద్దంటే నేను ఊరుకోను. నేను వెళ్లాలంతే’’.
రెండవ కోరిక, అతను నా కన్నా ఎక్కువ హైటు క్వాలిఫికేషన్‌ ఉం‌డాలి. మరొకటి, అతి ముఖ్యమైనది, నాకు చిన్ననాటి నుంచి కళ్లద్దాలు ఉండేవాళ్లంటే ఇష్టం ఉండదు. నేను చేసుకోబోయే వాడికి అవి ఉండ కూడదు’’, అంది చిన్నపిల్లలా.
భాను మాటలు విన్న మధు, నవ్వుకున్నాడు మనసులో.
కోపంతో, ఏదో మాట్లాడబోయిన అంజనరావును, ఏమి మాట్లాడవద్దు’’ అని సైగ చేసి, ‘‘భాను, నా దగ్గరకురా’’, అని దగ్గర కూర్చోపెట్టుకొని, ‘‘వసుం ధరతో నా పెళ్లయి ఎన్నేళ్లయిందో తెలుసా? సరిగ్గా నీవు పుట్టిన సంవత్సరలోనే. మా వివాహ జీవితం సరిగ్గా నీ వయస్సంత. మేము ఎలా హాయిగా ఉన్నామో నీవు చూస్తున్నావుగా. జీవితం వడ్డించిన విస్తరిగా ఉండదమ్మా. కోరికలు, సాధించాలని పట్టుదల ఉండటం, ఈ వయసులో సహజం. కానీ అవి మన జీవితంలో ఎంతవరకు సాధించగలం? మన కుటుంబ పరిస్థితులు ఏమిటి? చుట్టూ ఉన్న లోకం..! అన్నీ ఆలోచించాలి. కొన్నింటిలో కాంప్రమైజ్‌• ‌కావాలి. లేకపోతే కుటుంబం., జీవితం లేదు. మానవుడు ఆశాజీవి. కనుక కొన్ని కొన్నిటిలో కాంప్రమైజై సాగిపోవాలి కానీ, ఆశలు తీరలేదని ఆగిపోకూడదు. అప్పుడే జీవితం సాఫీగా సాగు తుంది. ఇప్పుడు నీ సంగతికే వద్దాం. నీ కోరికలు సహజమైనవి. ప్రతి ఆధునిక వనిత ఆశించినవే. నా ఉద్దేశం ప్రకారం, వీటిలో, ఓ రెండు విషయాల్లో కాంప్రమైజ్‌ ‌కావడానికి ఆస్కారముంది. ఒకటి ఫారిస్‌ ‌ఛాన్స్. ‌మధ్య తరగతి జీవితంలో ఫారిస్‌ ‌ఛాన్స్ అం‌దని ద్రాక్ష పండు. అందరికీ తెలిసిందే. ఛాన్సువస్తే, ఎవ్వరూ వదులుకోరు. మనకు వస్తున్న సంబంధాలు, మనం కోరుకున్న సంబంధాలు, వాళ్లందరూ మధ్య తరగతి వాళ్లే కదా అతనికి, నీకు ఆ ఛాన్స్ ‌వస్తే తప్పక పంపిస్తాం. పెళ్లయని త•ర్వాత ఇద్దరూ వెల్దురుగాని, నా మాట విను. వాళ్లు ససేమిరా అంటే మేము ఉన్నాం కదా ఒప్పించడానికి’’.
‘‘రెండవ విషయానికి వస్తే, కళ్లద్దాల సంగతి. ఈ కాలం అవి లేని వారు ఎవరమ్మా? రేపు పెళ్లయిన తర్వాత అతనికికాని, నీకుకానీ కంటి చూపు మందగిస్తే, కళ్లద్దాలు వేసుకుంటే, నీవు అతనితో కాపురము చేయవా ఏమిటి?’’, ‘‘అయినా కళ్లద్దాలు వేసుకోవడం ఏమి అనారోగ్యం, అంటువ్యాధి కాదు కదా! మా ఇంట్లో చూడు… నాకు అత్తయ్యకు, అమ్మమ్మకు అందరికి కళ్లద్దాలు ఉన్నాయి కదా! ఇంతెందుకు, మీ నాన్నకు, అమ్మకు, నాయనమ్మకు లేవా? నా మాట విను, ఈ రెండు కోరికలు అటకెక్కించి పెళ్లికి సిద్ధం కా.
మిగతా..హైటు, క్వాలిఫికేషన్‌లో నువ్వు కాంప్రమైజ్‌ అయినా… మేం ఒప్పుకోం. అతని కుటుంబం, జాతక విషయాలు, అమ్మానాన్నలకు వదిలిపెట్టి, అబ్బాయి నచ్చాడా లేదా అంతవరకు మాత్రమే నీ ఆలోచనలను పరిమితం చెయ్యి.’’ అన్నాడు మధు. ఒక్క క్షణం మౌనం ఆవరించింది. ఆలోచనల నుంచి తేరుకొని, భానుకళ, ‘‘సరే మామయ్య’’, అంది.
ఏమో, తాను నచ్చ చెప్పిన మాటలకు, కొన్ని కోరికల విషయంలో కాంప్రమైజ్‌ అయ్యిందేమో భాను. ‘‘ఏమిటో ఈ కాలము పిల్లలు’’, అనుకుంటూ ‘‘శ్రీ రామ పత్నీ జనకస్య పుత్రి, సీతాంగనా సుందర కోమలాంగి …’’ శుభలేఖ పూర్తిగా చదవడంలో లీనమైనాడు మధు.
పెళ్లిలో పెద్దల ఆశీర్వచనాలను తీసుకొంటున్నారు భానుకళ, శివకుమార్లు. కాళ్లకు నమస్కరించిన భానును భుజం పట్టుకొని లేపి ‘‘ఇప్పటి వరకు నీ అభీ•ష్టం మేరకు అమ్మానాన్నలు వ్యవహరించారు. ఇకపై, నీవు అత్త మామయ్యల అభీష్టం, వారి మనోభావాలకు అనుగుణముగా ప్రతి విషయములోను మంచి చెడులను బేరీజు వేసుకొని, అప్పుడప్పుడు, కాంప్రమైజ్‌ అవుతూ నడుచుకోవాలి. అప్పుడే నీ జీవితం ఆనందమయమవుతుంది.’’ అన్నాడు మధు చెమర్చిన కళ్లతో..
‘‘ఇదిగో మామయ్య, మళ్లీ కాంప్రమైజ్‌ అనొద్దు’’, ఓ నవ్వు నవ్వింది భానుకళ.

– ‌డి. మధుసూదనరావు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE