తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగింది? రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ సైలెంట్ సవారీ దేనికి సంకేతం? ఈ ఎన్నికల్లో బోర్లా పడిరదెవరు? బీఆర్‌ఎస్ కోట క్రమంగా బద్దలువుతున్నట్లేనా? ఇప్పుడీ ప్రశ్నలు రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యాయి.
రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. అధికార ప్రతిపక్షం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా సాగుతుండగా.. బీజేపీ నిశ్శబ్దంగా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త సంకేతా లిచ్చాయి. ముఖ్యంగా ఓటర్లు అన్ని పార్టీలకు స్పష్టమైన సంకేతాలు పంపించారు. మూడు స్థానాలకు గాను రెండిరటిని బీజేపీ గెలుచుకుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానం బీజేపీ వశమయ్యింది. అవే నాలుగు జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్నీ కమలం కైవసం చేసుకుంది. పట్టభద్రుల సిట్టింగ్ స్థానాన్ని అధికార కాంగ్రెస్ కోల్పోయింది. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా… కరీంనగర్‌లో ఆ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. ఇది కాంగ్రెస్‌కు ‘ప్రమాద ఘంటికలు’ లాంటి ఫలితాలనే విశ్లేషణలు సాగుతున్నాయి. మరోవైపు.. బీజేపీకి జోష్ ఇచ్చే ఫలితానే చర్చ జరుగుతోంది. ఇక, రోజు రోజుకూ బీఆర్‌ఎస్ ప్రాభవం తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నా యంటున్నారు.
కరీంనగర్ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ప్రముఖ విద్యావేత్త మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే సంచలన విజయం సాధించారు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కూడా కమలదళం వశమయ్యింది. బీజేపీ అభ్యర్ధి చిన్నమైల్ అంజిరెడ్డి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో విజయ బావుటా ఎగరేసారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలింది. సర్వత్రా ఉత్కంఠ రేపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. బీజేపీ నమోదు చేసుకున్న ఈ గెలుపుతో రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు ఖాయం అనే వాదన వినిపిస్తోంది.
ఏ ఎన్నికలు జరిగినా బీజేపీదే హవా
శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్`బీఆర్‌ఎస్ మధ్యనే పోరు నడిచింది. పార్లమెంటు ఎన్నికలనాటికి పరిస్థితి మారిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అధికార పార్టీ కాంగ్రెస్ బీజేపీ సీట్లను గెలుచుకున్నాయి. ఇటీవలి పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ‘నిశ్శబ్ద విజయా’న్ని నమోదు చేసుకొని, భవిష్యత్తులో రాష్ట్రంలో తమకు తిరుగు ఉండదన్న సంకేతాలను ఇచ్చింది. ఈ విజయంతో జోష్ మీదున్న కమలం దళాలు.. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఆ దిశగా ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. క్షేత్రస్థాయిలో బలపడటం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకోవాలని భావిస్తోంది
ఈ పరిణామాలు, ఫలితాలను బట్టి ఉత్తర తెలంగాణలో బీజేపీ క్రమంగా పాగా వేస్తుందన్న వాదనలు బలపడుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్రంలో అనుకున్నది సాధిస్తోందంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ పట్టు మరింతగా పెరిగింది. ఈ ఎన్నికలు జరిగిన 6 లోక్‌సభ స్థానాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 13 జిల్లాలు, 217 మండలాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ చాపకింద నీరులా విస్తరించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. .
పనిచేయని కాంగ్రెస్ సంక్షేమ ప్రచారం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి యేడాది గడిచింది.కొత్తగా అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చామని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కంటే భిన్నమైన రీతిలో పాలన సాగిస్తున్నామంటూ మంత్రులు, నాయకులు చెబుతూ వస్తున్నారు. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. ఉపాధ్యాయ స్థానాలను పక్కనపెడితే… పట్టభద్రుల స్థానాన్ని అది అత్యంత ప్రధానంగా తీసుకుంది. కరీంనగర్‌లో జీవన్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో జరిగిన ఎన్నిక కావడంతో.. ఆ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకుంది. ఆ ఒక్కస్థానం మీదే దృష్టి సారించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యే ప్రచారంలో పాల్గొన్నారు. అయినా ప్రయోజనం లేకపోయింది.
తాము అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని కాంగ్రెస్ చెబుతున్నా.. పట్టభద్రులు మరోలా ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తున్నామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాక, హామీ ఇవ్వని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని చెబుతున్నా.. ఈ ఎన్నికల్లో ఓటమి పాలుకావడాన్ని పార్టీ నేతలు సమీక్షించు కోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ రోజుల్లోనే ప్రతికూల ఫలితాలు రావటాన్ని పార్టీ ప్రధానంగా తీసుకోవాల్సి ఉందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని చెబతున్నారు.
బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ
శాసనసభ ఎన్నికల నాటి నుంచి చూస్తే.. బీఆర్‌ఎస్ కోటకు బీటలు పడుతున్నాయని అంటున్నారు. అయితే, ఈ ఫలితాలను ముందుగానే ఊహించి ఆ పార్టీ పోటీకి దూరంగా ఉందని,వచ్చే ఎన్నికల నాటికి అది మరింతగా ప్రజాదరణ కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లిందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్, బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేయగా ఈ స్థానంలో క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన బీఆర్‌ఎస్ మాత్రం పోటీకి దూరంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని నిత్యం ప్రకటిస్తున్న ఆ పార్టీ నేతలు.. ఈ ఎన్నికలలో కనీసం అభ్యర్థిని దింపే సాహసం చేయకపోవడం సొంత పార్టీలోనూ చర్చకు దారి తీసింది. ఈ సారి తమ పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోవడంతో వారంతా బీజేపీ వైపు మళ్లారనే చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున బీజేపీకి మళ్లినట్లు తెలుస్తోంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఆర్‌ఎస్‌కు గట్టి ఓటు బ్యాంకు ఉంది. గతంలో ఉద్యమ కాలం నుంచి ఉత్తర తెలంగాణ బీఆర్‌ఎస్‌కు కొండంత అండగా నిలబడిరది. అయినా మండలి ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది.
బీఆర్‌ఎస్ పోటీకి దూరం కావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టం కంటే ఆ పార్టీకే నష్టం ఎక్కువ అనే మాటా వినిపిస్తోంది. అది పోటీకి దూరం కావడం బీజేపీకి పూలబాటగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇకనైనా కారు పార్టీ తేరుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుందనీ ప్రచారం జరుగుతోంది.
ప్రధానమంత్రి మోదీ భావోద్వేగ ట్వీట్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వారిని గెలిపించిన ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.‘‘ఎంఎల్‌సీ ఎన్నికల్లో అద్వితీయమైన మద్దతును ఇచ్చి తెలంగాణలో బీజేపీ పార్టీని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు నా అభినందనలు. ప్రజల మధ్య చాలా శ్రద్ధగా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడు తున్నాను’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
డబుల్ ఇంజన్ సర్కారే లక్ష్యం:కిషన్ రెడ్డి
ఇది బీజేపీ సమష్టి విజయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రానున్న దనడానికి ఇది సంకేతమన్నారు. ‘రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం దాని అవసరం కంటే ఇక్కడి ప్రజల కోసం. రాష్ట్ర ప్రజల,ఉద్యమకారుల ఆకాంక్షల కోసం బీజేపీ అధికారంలోకి రావాలి. డబుల్ ఇంజిన్ సర్కారు రాకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి’ అని అన్నారు.
‘‘మేధావులు, విద్యావంతులు బీజేపీ వైపు నిలిచారన్నారు. ‘ఓటర్లు కోరిన మార్పు రాలేదు. కేవలం పాలకులు మాత్రమే మారారు. దానిని ప్రజలు గ్రహించారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదని ఈ ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. హామీలు అమలు చేయని ఆ పార్టీకి ఫలితాలు చెంపపెట్టులాంటివి. ప్రజలు ఇచ్చిన ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగింది. దానిని నెర వేర్చేందుకు పని చేస్తాం ‘సేవ్ తెలంగాణ.. సపోర్ట్ బీజేపీ’ నినాదంతో ముందుకు వెళతాం’’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్
ఈ గెలుపు ప్రధాని మోదీకి, తెలంగాణ ప్రజలకు అంకితమని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపై నమ్మకంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలతో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ భారీ విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు బడ్జెట్‌లో ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు వల్లే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులంతా ఈ తీర్పు ఇచ్చారని చెప్పు కొచ్చారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి రంజాన్ కానుక అని అన్నారు.
– సుజాత గోపగోని, సీనియర్ జర్నలిస్ట్, 6302164068