చైనా, బ్రెజిల్‌, ఇండియా వంటి దేశాలపై పరస్పర సుంకాల విధింపు ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మార్చి 4న ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో, సమస్య పరిష్కారానికి భారత్‌ రంగంలోకి దిగింది. అమెరికా, మనదేశ అధికారుల మధ్య ఈ పరస్పర సుంకాల విషయంలో తెరవెనుక చర్చలు మొదలయ్యాయి. మనదేశ వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వాణిజ్యపరమైన చర్చలకోసం మార్చి 3 నుంచి 8వ తేదీ వరకు పర్యటనకోసం అమెరికా వెళ్లిన తరుణంలోనే ట్రంప్‌ జాయింట్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఈ పరస్పర సుంకాల విషయాన్ని ప్రకటించడం గమనార్హం.

అయితే ట్రంప్‌ ఇండియాను ప్రత్యేకంగా పేర్కొన్నప్పటికీ బ్రెజిల్‌, మెక్సికో,  కెనడా, చైనా, ఐరోపా యూనియన్‌ – ఈయూలతో పాటు మనదేశం పేరును ప్రస్తావించారు. ఈ సందర్భంగా పీయూష్‌ గోయల్‌ అక్కడి వాణిజ్య మంత్రితో సహా వివిధ కీలక వాణిజ్య ప్రతినిధులతో చర్చలు జరిపారు. అంతేకాదు రెండు దేశాల అధికారులు సుంకాల విధింపు వల్ల పరస్పరం ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిర్మొహమాటంగా చర్చించినట్టు తెలుస్తోంది. రహస్యంగా జరుగుతున్న ఈ చర్చలకు మనవైపు వాణిజ్యశాఖ మంత్రి నేతృత్వం వహించారు. సుదీర్ఘమైన ఈ చర్చలవల్ల ట్రంప్‌ హెచ్చరించిన కొన్ని రకాల వస్తువులపై సుంకాల విధింపు నుంచి మనదేశానికి మినహాయింపులు లభించవచ్చునన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అంతేకాదు తొలివిడత చర్చలు ముగిసేసరికి ఇరుదేశాల మధ్య పరస్పర లాభదాయక ద్వైపాక్షిక ఒప్పందం`2025 కుదిరే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్రమోదీ, యుఎస్‌ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ల ఉమ్మడి ప్రకటన ఆధారంగానే ఈ చర్చలు కొనసాగినట్టు తెలుస్తోంది.

ఆటోమొబైల్‌ రంగంపై ప్రభావం

కెనడా, మెక్సికోలపై విధించిన సుంకాలపై వెనక్కి తగ్గే అవకాశముందని యు.ఎస్‌. వాణిజ్యశాఖ మంత్రి హావర్డ్‌ లుట్‌నిక్‌ చేసిన ప్రకటనతో ఫిబ్రవరి 5న ఆసియా మార్కెట్లు కోలుకొని, లాభాల దిశగా పయనించాయి. ఇదే పరిస్థితి భారత్‌లో కూడా కనిపించింది. ఒకవేళ అమెరికా పరస్పర సుంకాలు విధిస్తే మన ఆటోమొబైల్‌ రంగం తీవ్రమైన పోటీని ఎదుర్కొనక తప్పదు. ప్రస్తుతం మనదేశం ఈయూ, యు.కె. దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతుండటం తాజా పరిణామం. ఆటోమొబైల్‌ రంగంలో మనదేశం గట్టి పోటీదారుగా నిలుస్తున్న నేపథ్యంలో, అమెరికా సహా ఈయూ దేశాలు తమ ఆటోమొబైల్‌ ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇందుకు ప్రతిగా భారత్‌నుంచి నిపుణులు స్వేచ్ఛగా రావడానికి, ఇతరత్రా రాయితీలు ఇస్తామని అమెరికా చెబుతోంది. ఈ నేపథ్యంలో మనదేశం ఈ సుంకాలు తగ్గించే అంశాన్ని పరిశీలించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ట్రంప్‌ మొదట్నుంచీ అమెరికా ఆటో ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలనేది తమ ప్రథమ డిమాండ్‌గా చెబుతూ వస్తుండటం గమనార్హం. ముఖ్యంగా తమ ఆటో ఉత్పత్తులపై భారత్‌ 100%కి పైగా సుంకం విధిస్తోందని, అదేవిధంగా చైనా తమ ఉత్పత్తులపై తాము విధించేదానికంటే రెండిరతలు సుంకాలు వసూలు చేస్తున్నదని ట్రంప్‌ యుఎస్‌ కాంగ్రెస్‌లో ప్రసంగిస్తూ వెల్లడిరచారు.

మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల్లో ముత్యాలు, రంగురాళ్లు, ఔషధాలు, ఆహార ఉత్పత్తులు ప్రధానంగా ఉండగా, మనదేశానికి దిగుమతి అయ్యేవాటిల్లో విద్యుత్‌`మెషినరీ పరికరాలు, అణు రియాక్టర్లు`యంత్రాలు, ఖనిజ ఇంధనాలు `చమురు, లెన్స్‌లు, మైక్రోస్కోప్‌లు, వైద్య పరికరాలు ఉన్నాయి. మనదేశం నుంచి విదేశాలకు చేసే మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 17.7%. ఇక మనదేశం విదేశాల నుంచి చేసుకునే దిగుమతుల్లో యు.ఎస్‌. నుంచి దిగుమతి చేసుకునేవి 2.7% మాత్రమే. ట్రంప్‌ మొదటిసారి అమెరికా అధ్యక్షుడయ్యాక భారత్‌ నుంచి 761మిలియన్‌ డాలర్ల ఉక్కు, 382 మిలియన్‌ డాలర్ల అల్యూమినియం దిగుమతులపై వరుసగా 25%, 10% చొప్పున సుంకాలు విధించారు. దీనికి ప్రతిగా భారత్‌ 28 అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించింది. నిజానికి 2018లో అమెరికా ఉత్పత్తులపై భారత్‌ విధించే సగటు సుంకాల విలువ 11.59% కాగా అమెరికా మన ఉత్పత్తులపై విధించిన సుంకాలు 2.72%. ఇది 2022 నాటికి సగటున 15.3%, 3.83%గా ఉన్నాయి.

ఏడు బిలియన్‌ డాలర్ల వరకు నష్టం?

డచ్‌ బ్యాంకు అంచనా ప్రకారం భారత్‌ ఉత్పత్తులపై అమెరికా విధించే సుంకాలకంటే, భారత్‌ విధించే సుంకాలు సగటున 10 పాయింట్లకంటే ఎక్కువ ఉన్నాయి. ట్రంప్‌ ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి తెస్తానంటున్న సుంకాల ప్రభావం ముఖ్యంగా ఆటోమొబైల్‌, ఆభరణాలు, రసాయనాల ఎగుమతు లపై పడనుంది. సిటీ రీసెర్చ్‌ అంచనా ప్రకారం సుంకాల విధింపువల్ల భారత్‌ వార్షికంగా ఏడు బిలియన్‌ డాలర్ల మేర నష్టపోవచ్చు. రసాయనాలు, లోహపరిశ్రమ, ఆభరణాలు, ఆటోమొబైల్‌, ఔషధాలు, ఆహార ఉత్పత్తులపై ఈ సుంకాల ప్రభావం పడనుంది. 2023లో దిగుమతులపై భారత్‌ సగటున 11% సుంకాలు విధించింది. ఇది అమెరికా మన దిగుమతులపై విధించిన సుంకాలకంటే 8.2% ఎక్కువ. శ్వేతసౌధం విడుదల చేసిన వాస్తవ నివేదిక ప్రకారం ఆహార ఉత్పత్తులపై అమెరికా 5% టారిఫ్‌ విధిస్తుండగా, భారత్‌ 39% వరకు సుంకాలు విధిస్తోంది. అమెరికా కొత్త సుంకాలను అమలు చేస్తే 2025-26లో భారత్‌ ఎగుమతులు 2 బిలియన్‌ డాలర్ల నుంచి 7 బిలియన్‌ డాలర్ల వరకు తగ్గిపోయే అవకాశముందని రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ హెచ్చరించింది. అంతేకాదు ఇది భారత్‌ జీడీపీ వృద్ధిపై ప్రభావం చూపుతుందని ప్రముఖ ఆర్థికవేత్త దేవేంద్రకుమార్‌ పంత్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌ జీడీపీ అంచనా 6.6% ఉండగా, ఇందులో 5-10 బేస్‌ పాయింట్లు తగ్గిపోయే అవకాశముందని అంచనా వేశారు. ఈ వాణిజ్య ఉద్రిక్తల నేపథ్యంలో భారత్‌ ఇప్పటికే కొన్నింటిపై సుంకాలు తగ్గించింది. హై ఎండ్‌ మోటారు వాహనాలపై ప్రస్తుతమున్న 50% నుంచి 30%కు, బోర్బన్‌ విస్కీపై 150% నుంచి 100%కు దిగుమతి సుంకాలను తగ్గించింది. అంతేకాదు చర్చల్లో భాగంగా అమెరికా నుంచి చమురు, రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు అంగీకరించడం గమనార్హం.

ట్రంప్‌ మూర్ఖపు నిర్ణయం

భారత్‌ ఉత్పత్తులపై దిగుమతుల సుంకాలను విధించడం ట్రంప్‌ తీసుకున్న మూర్ఖపు నిర్ణయమని విదేశీ వ్యవహారాల నిపుణులు అన్నారు. ట్రంప్‌ నిర్ణయం భారత్‌పై ప్రభావం పడటమే కాదు, మొత్తం ప్రపంచ వాణిజ్య వ్యవస్థను దెబ్బతీస్తుందని మాజీ దౌత్యవేత్త కె.బి. ఫాబియన్‌ అభిప్రాయపడ్డారు. అమెరికా చర్యకు విదేశాలు కూడా ప్రతిచర్యలు తీసుకోవడం మొదలుపెట్టాయి. ఈవిధంగా పెరిగిన సుంకాల ప్రభావంతో ప్రపంచ వాణిజ్యం తగ్గిపోయే ప్రమాదముంది. ఇప్పటికే అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్‌మార్కెట్‌లు పడిపోవడం వంటి పరిణామాలను గమనిస్తే ట్రంప్‌ ‘ఎగైన్‌ అమెరికా గ్రేట్‌’ నినాదం ఎంతవరకు విజయంతమౌతుందో తెలియడంలేదన్నారు. విదేశాల ఉత్పత్తులపై ప్రతీకారంగా సుంకాలను పెంచడం సరైందిగా కనిపిస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఈ విధానంవల్ల ఆశించిన సానుకూల ఫలితాలు కనిపించవని రవీందర్‌ సచ్‌దేవ్‌ అనే మరో నిపుణుడు అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం వల్ల భారత్‌నుంచి ఆమెరికాకు ఎగుమతి అయ్యే అల్యూమినియం, ఉక్కుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. సుంకాలు పెంచితే వీటి ఎగుమతులు 35% నుంచి 40% వరకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు. యు.ఎస్‌.లో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ట్రంప్‌ చమురు ధరలను, రవాణా చార్జీలను తగ్గించే వ్యూహాన్ని అమలుచేసే అవకాశముందన్నారు.

చైనాతోనే వాణిజ్యలోటు ఎక్కువ

విచిత్రమేమంటే ట్రంప్‌ ఇన్నివిధాలుగా వాదిస్తున్నప్పటికీ 2024 ఆర్థిక సంవత్సరంలో చైనా(295.4 బిలియన్‌ డాలర్లు), మెక్సికో (171.8 బిలియన్‌ డాలర్లు), జపాన్‌(68.5 బిలియన్‌ డాలర్లు), కెనడా(63.3 బిలియన్‌ డాలర్లు) దేశాలతో జరిపిన వాణిజ్యంలో పెద్ద ఎత్తున వాణిజ్యలోటు నమోదైంది. మరి ఇదే ఏడాది భారత్‌తో వాణిజ్య లోటు 45.7బిలియన్‌ డాలర్లు మాత్రమే.

పై దేశాలతో పోలిస్తే మనదేశ వాణిజ్యలోటు చాలా తక్కువ. అమెరికా వాణిజ్య ప్రతినిధి వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం 2024లో భారత్‌, అమెరికాల మధ్య జరిగిన మొత్తం వాణిజ్యం 129.2 బిలియన్‌ డాలర్లు. ఇందులో భారత్‌కు యు.ఎస్‌. ఎగుమతుల విలువ 41.8 బిలియన్‌ డాలర్లు. ఇదే సమయంలో భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్న వాటి విలువ 87.4 బిలియన్‌ డాలర్లు. ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించినప్పుడు ‘‘పారదర్శకత, జాతీయ భద్రత, ఉద్యోగాల కల్పన’’ అనే అంశాల ప్రాతిపదికన ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగించాలన్న అంగీకారానికి వచ్చారు. అంతేకాదు 2030 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం 500 బిలియన్‌ డాలర్లకు పెంచాలని ఇరుదేశాధినేతలు నిర్దేశించారు. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల మధ్య చర్చలు వస్తు, సేవల రంగంలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి. ప్రస్తుతం ట్రంప్‌ ప్రభుత్వం విధించే సుంకాల బారిన పడకుండా, అమెరికాతో వాణిజ్యం దెబ్బతినని రీతిలో మన ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే చెప్పాలి.

అధిక సుంకాల విధింపు సమస్యలకు పరిష్కారం కాదు

కెనడా, మెక్సికోలపై అధిక సుంకాలు విధిస్తూ ఇచ్చిన ఆదేశాలపై 48 గంటలకు కాకముందే రెండోసారి ట్రంప్‌ వెనక్కి తగ్గడం సుంకాల విధింపును అమలు చేయడం వల్ల కలిగే నష్టాలను వెల్లడిస్తోంది. ఈ రెండు దేశాలనుంచి దిగుమతి అయ్యే కార్లపై 25% సుంకం విధింపును మరో నెల పాటు వాయిదా వేస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాలపై ట్రంప్‌ మార్చి 5న సంతకాలు చేశారు. గతంలో ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా కుదిరిన యు.ఎస్‌`మెక్సికో`కెనడా వాణిజ్య ఒప్పందం (యుఎస్‌ఎంసీఏ) అమెరికాకు సుంకాల విధింపు లేకుండా దిగుమతి అయ్యే వస్తువులన్నింటికీ వర్తిస్తుంది. పరిస్థితిని గమనిస్తే రానున్న కాలంలో సుంకాల విధింపు విషయంలో ట్రంప్‌ తన దూకుడుకు కళ్లెం వేయక తప్పదు. నిజం చెప్పాలంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యు.ఎస్‌. ఆర్థిక వ్యవస్థ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతూ వచ్చింది.

దేశీయంగా పూర్తిస్థాయి ఉద్యోగాల కల్పన ద్వారా తగినంతమేర ఉత్పత్తుల ఉత్పాదకత లేకపోవడంతో దిగుమతులపై ఆధారపడక తప్పని పరిస్థితి! ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కంటే వినియోగమే అధికం! ఇదే అధిక దిగుమతులకు, వాణిజ్యలోటుకు ప్రధాన కారణం. అంతేకాదు అమెరికాలో శ్రామిక ఖర్చులు అధికం. ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేస్తూ ఉత్పత్తి చేసేకంటే చౌకగా లభించే దిగుమతులే ఉత్తమం! ఇదీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం తీరు! యు.ఎస్‌.తో పోల్చినప్పుడు శ్రామిక, ఉత్పత్తి, ముడిసరుకుల లభ్యత తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నదేశాలు చాలా తక్కువ ధరలకే అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతున్నాయి. అధిక దిగుమతుల కారణంగా తమదేశ తయారీరంగంలో ఉద్యోగావకాశాలు పడిపోతున్నాయని ట్రంప్‌ చేస్తున్న వాదనలో అర్థం లేదు.

అంతేకాదు, ఈ సుంకాల పెంపునకు ఈ ఉద్యోగాలు కోల్పోవడానికి సంబంధమేలేదు. అందువల్ల అధిక సుంకాల విధింపు అక్కడి ఉద్యోగ సమస్యను పరిష్కరించదు. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యు.ఎస్‌.డాలర్‌ ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీగా రూపొందింది. ఫలితంగా దేశీయంగా దిగుమతి వస్తువుల వినియోగం బాగా పెరగడానికి ఇది దోహదం చేసింది. ఈ సానుకూలత ప్రపంచంలోని మరే ఇతర దేశానికీ లేదు. అటువంటప్పుడు వాణిజ్యలోటును ప్రధాన సమస్యగా చూపడం ట్రంప్‌ ప్రభుత్వానికి ఎంతమాత్రం తగదు. ఎందుకంటే యు.ఎస్‌.కు డాలర్‌ వల్ల కలుగుతున్న అపరిమితమైన ప్రయోజనం నేపథ్యంలో, ఇతర దేశాలు ఈ అంశాన్ని ప్రశ్నించే హక్కును కలిగి ఉంటాయి.

వినియోగ ఆర్థికవ్యవస్థ

మొత్తంమీద అమెరికాది వినియోగ ఆర్థిక వ్యవస్థ కావడంతో దిగుమతులు ఎలాగూ తప్పవు! అటువంటప్పుడు ఎంత మొత్తంలో సుంకాలు విధించినా అమెరికా కంపెనీలు దిగుమతులు చేసుకోకుండా ఉండలేవు. మరి ఈ అధిక సుంకాలు చెల్లించేది ఈ కంపెనీలే! ఈమొత్తం ప్రభుత్వ ఖజానాకే వెళుతుంది. ఈ కంపెనీలు ఇవే వస్తువులను రిటైల్‌ అమ్మకాలు జరిపినప్పుడు ఈ సుంకాల భారమంతా మళ్లీ వినియోగదారుల నెత్తినే రుద్దుతాయి. అంటే ఈ సుంకాల వల్ల ధరలు పెరిగి, ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సుంకాలు పెంచడం వల్ల విదేశాలు, చివరిగా దేశీయ వినియోగదారులు నష్టపోతారు. అంటే నష్టం ఒక్కరికే పరిమితం కాదు. ఇరువైపులా ఉంటుంది. ఇక సుంకాల విధింపు వల్ల నష్టపోయిన దేశాలు చూస్తూ ఊరికే కూర్చోవు.

ఉదాహరణకు కెనడా, మెక్సికో దేశాలు అమెరికా ఉత్పత్తులపై ప్రతీకారంగా సుంకాలు పెంచేశాయి. యు.కె., జపాన్‌, ఫ్రాన్స్‌, చైనాల మొత్తం మార్కెట్‌ కంటే కెనడా మార్కెట్‌ ఎక్కువ. ఈయూ దేశాలు, చైనా ప్రతీకారంగా యు.ఎస్‌. వస్తువులపై సుంకాలు పెంచాయి.

యు.ఎస్‌. ప్రజల నెత్తిన భారం

ట్రంప్‌ తొలి హయాంలో ఇతర దేశాల దిగుమతులపై విధించిన సుంకాల వల్ల, దేశంలో ఉద్యోగావకాశాలు తగ్గడం లేదా పెరగడం జరగలేదని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ జ్యూరిచ్‌, ప్రపంచ బ్యాంకుకు చెందిన ఆర్థికవేత్తలు జరిపిన అధ్యయనంలో స్పష్టమైంది. 2018లో ఉక్కు దిగుమతులపై ట్రంప్‌ సుంకాలు విధించినప్పుడు, అక్కడి ఉక్కు పరిశ్రమలపై దీని ప్రభావం పడలేదు. కానీ ఇందుకు ప్రతిగా చైనా, ఇతరదేశాలు యు.ఎస్‌. ఉత్పత్తులపై సుంకాలు పెంచిన ప్రభావం ఉద్యోగ రంగంలో ప్రతికూల ప్రభావాలను చూపింది. కార్ల తయారీలో కెనడా, మెక్సికో, యు.ఎస్‌.ల మధ్య సంక్లిష్టమైన సరఫరా శృంఖలాలున్నాయి. ఫలితంగా వీటిపై అధిక సుంకాల విధింపు ఈ మూడు దేశాలకూ నష్టమే! ఎందుకంటే అధిక సుంకాల వల్ల కార్ల ధరలు పెరుగుతాయి. ఈ భారం మళ్లీ అమెరికా వినియోగదారులకే బదిలీ అవుతుంది.

ఈ విధంగా వాణిజ్య యుద్ధంలో భాగంగా విధించే అధిక సుంకాలు, అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడానికే దోహదం చేస్తుంది. వరుసగా కొనసాగుతున్న లోటు, సంస్థాగత స్వేచ్ఛ తగ్గిపోతున్న తరుణంలో యు.ఎస్‌. ట్రెజరీలో అపరిమితంగా డిపాజిట్లు చేస్తున్న ఇతర దేశాలు ఇకముందు వెనకాముందూ ఆలోచిస్తాయి. ఉదాహరణకు 2022లో విదేశాల్లోని రష్యా ఆస్తులను, నిధులను స్తంభింపజేసిన తర్వాత ప్రపంచ దేశాల ఆలోచనా సరళిలో మార్పు వచ్చింది. ఆర్బీఐతో సహా వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు ఇప్పుడు డాలర్‌ మార్పిడి కంటే బంగారాన్ని కొనుగోలు చేయడమే సముచితమన్న నిర్ణయానికి వచ్చాయి. ఇప్పుడు ట్రంప్‌ దేశీయంగా పన్నుల్లో కోత, విదేశీ దిగుమతులపై సుంకాల పెంపు అమలు చేస్తున్న నేపథ్యంలో దేశంలో తాత్కాలికంగా నైనా ద్రవ్యోల్బణం పెరగవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ఫెడరల్‌ రిజర్వ్‌ ఇక ముందు రేట్ల కోతను ఇప్పటిమాదిరిగా విధించడం సాధ్యంకాదు.

మొత్తంమీద చెప్పాలంటే సుంకాలపై ట్రంప్‌ తీసుకునే నిర్ణయాలు, చివరకు అమెరికా ప్రజలకే భారంగా మారుతాయి తప్ప మరో ప్రయోజనం ఉండదు. ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా పెద్దలు ఈ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న!

–  జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE