అమరావతి నిర్మాణానికి కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. అమరావతి రాజధానితో పాటు చుట్టూ అవుటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్) ను నిర్మించేందుకు ముందుకు రావడం విశేషం. 190 కి.మీ పొడవు, 70 మీటర్ల వెడల్పుతో 6 వరసలుగా మణిహారంగా నిర్మించే దీని టెండర్ల ప్రక్రియను ఏడు నెలల్లో పూర్తి చేసి ఏడాదిలోపు పనులు ప్రారంభించటానికి చర్యలు తీసుకుంటున్నారు. ఓఆర్‌ఆర్ కారణంగా అంతర్జాతీయంగా, జాతీయంగా చాలా నగరాలు స్వల్ప వ్యవధిలోనే ఎంతో అభివృద్ధి చెందాయి. ఆ స్ఫూర్తితో అమరావతితో పాటు ఓఆర్‌ఆర్‌ను ఏకకాలంలో నిర్మించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి నయాపైసా ఖర్చు లేకుండా అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణ వ్యయం మొత్తాన్ని తానే భరించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. ఇందుకు కోసం భూసేకరణ ప్రక్రియను సత్వరమే ప్రారంభించి ఏడు మాసాలలోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తుంది. ఆపై నాలుగైదు నెలల్లో నిర్మాణ పనులను మొదలెట్టాలనిలక్ష్యంగా పెట్టుకుంది. ఓఆర్‌ఆర్ నిర్మాణానికి సుమారు 4, 205 ఎకరాలు అవసరమని ప్రాథమిక అంచనా కాగా,అందులో సుమారు 306 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయి. దీంతో 3,899 ఎకరాలను సేకరిస్తే సరిపోతుందని భావిస్తున్నారు.
కృష్ణా డెల్టాకు మహర్దశ
అమరావతి ఓఆర్‌ఆర్‌తోపాటు అనుసంధానంగా మరో రెండు రోడ్లను నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ ప్రతిపాదించింది. చినకాకాని వద్ద ఎన్‌హెచ్-16లో కలుస్తున్న విజయవాడ పశ్చిమ బైపాస్‌ను తూర్పుదిశగా సుమారు 17 కి.మీ. పొడిగిస్తూ నందివెలుగు వరకు ఆరు వరుసల రహదారిని నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది. దీంతో విజయవాడ తూర్పు బైపాస్ రహదారి అవసరం ఉండదని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. చినకాకాని వద్ద ఎన్‌హెచ్-16తో పశ్చిమ బైపాస్ కలిసే చోట ప్లవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజ్‌ను నిర్మిస్తారు. ఇక్కడ మొదలయ్యే అనుసంధాన రహదారి నంబూరుకు ఉత్తరంగా పెనుమూలి, మంచికలపూడి, కంఠంరాజు కొండూరు, దుగ్గిరాల, చింతలపూడికి ఆవలివైపుగా వెళ్లి నందివెలుగు వద్ద ఓఆర్‌ఆర్‌తో కలుస్తుంది. మంగళగిరి-తెనాలి-నారా కోడూరు మధ్య ప్రస్తుత రెండు వరుసల రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయబోతున్నట్టు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇక రెండో లింకురోడ్డు విషయానికొస్తే.. బుడంపాడు వద్ద గుంటూరు హైవే జంక్షన్ నుంచి నారాకోడూరు వరకు సుమారు ఆరున్నర కిలోమీటర్ల పొడవున ఆరు వరుసలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మూడు అలైన్‌మెంట్లను పరిశీ లిస్తున్నారు.
11 ప్యాకేజీలు… 3 దశలు..
ఓఆర్‌ఆర్‌ను 11 ప్యాకేజీలుగా విభజించి మూడు దశలుగా నిర్మించాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ జిల్ల్లా కంచికచర్ల నుంచి గుంటూరు జిల్లా పొత్తూరు వరకు 63 కి.మీ. రహదారిని మొదటి దశలో చేపడతారు. ఇందులో భాగంగా కృష్ణానదిపై పల్నాడు జిల్లా బలుసుపాడు-కృష్ణాజిల్లా మున్నలూరు మధ్య 3.15 కి.మీ.ల పొడవున వంతెన నిర్మిస్తారు. రెండో దశలో గుంటూరు జిల్లా పొత్తూరు ` కృష్ణాజిల్లా పొట్టిపాడు మధ్య 65 కి.మీ. రహదారి నిర్మిస్తారు. కృష్ణానదిపై గుంటూరు జిల్లా మున్నంగి- కృష్ణాజిల్లా వల్లూరుపాలెం మధ్య 4.8 కి.మీ.వంతెన నిర్మిస్తారు. మూడో దశలో కృష్ణా జిల్లా పొట్టిపాడు నుంచి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వరకు 62 కి.మీ. ఓఆర్‌ఆర్‌ను చేపడతారు. ఈ దశలోనే జి.కొండూరు సమీపంలో 4.4 కిలోమీటర్ల పొడవున టన్నెల్ నిర్మాణం చేపడతారు.
ఓఆర్‌ఆర్ వెళ్లే జిల్లాలు, మండలాలు ఎన్టీఆర్ జిల్లాలో..
కంచికచర్ల మండలంలోని కంచికచర్ల, పెరెకలపాడు, గొట్టుముక్కల, మున్నలూరు, మొగులూరు, కునికినపాడు;వీరులపాడు మండలంలోని పొన్నవరం, జగన్నాథపురం, జుజ్జూరు, చెన్నారావుపాలెం; తిమ్మాపురం, గూడెం మాధవరం, అల్లూరు, నరసింహారావుపాలెం; జి.కొండూరు మండలం జి.కొండూరు, కుంటముక్కల, దుగ్గిరాలపాడు, పెట్రంపాడు, గంగినేనిపాలెం, నందిగామ, కోడూరు; మైలవరం మండలంలోని మైలవరం, పొందుగల, గణపవరం.
ఏలూరు జిల్లాలో..
ఆగిరిపల్లి మండలంలోని బొడ్డనపల్లె, గరికపాటివారి కండ్రిక, పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లి, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, నరసింగపాలెం, సగ్గూరు, కృష్ణవరం, సురవరం, కల్లటూరు.
కృష్ణా జిల్లాలో..
బాపులపాడు మండలంలోని బండారుగూడెం, అంపాపురం; గన్నవరం మండలం సగ్గురు ఆమని, బల్లిపర్రు, బుతుమిల్లిపాడు; ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, తేలప్రోలు, వెలినూతల, వెల్దిపాడు, తరిగొప్పుల, వేంపాడు, బొకినాల, మానికొండ; కంకిపాడు మండలం మారేడుమాక, కోలవెన్ను, ప్రొద్దుటూరు, కొణతనపాడు, దావులూరు, చలివేంద్రపాలెం, నెప్పల్లె, కుందేరుÑ తోట్లవల్లూరు మండలం రొయ్యూరు, చినపులిపాక, బొడ్డపాడు, ఉత్తర వల్లూరు,దక్షిణ వల్లూరు.
గుంటూరు జిల్లాలో..
`మంగళగిరి మండలంలోని కాజ, చినకాకాని; తాడికొండ మండలంలోని పాములపాడు, రావెల; మేడికొండూరు మండలం సిరిపురం, వరగాని, మందపాడు, మంగళగిరిపాడు, డోకిపర్రు, విశదల, పేరేచర్ల, వెలవర్తిపాడు, మేడికొండూరు; పెదకాకాని మండలం నంబూరు, దేవరాయబొట్లపాలెం, అనుమర్లపూడి; దుగ్గిరాల మండలం చిలువూరు, కంఠంరాజు కొండూరు, ఈమని, చింతలపూడి, పెనుమూలి; కొల్లిపర మండలం వల్లభాపురం, మున్నంగి, దంతలూరు, కుంచవరం, అత్తోట; తెనాలి మండలంలోని కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు, కఠేవరం, సంగం జాగర్లమూడి; చేబ్రోలు మండలం గొడవర్రు, నారాకోడూరు, వేజెండ్ల, సుద్దపల్లి, శేకూరు; వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు, అనంతవరప్పాడు, చమళ్లమూడి, కుర్నూతల; గుంటూరు తూర్పు మండలం ఏటుకూరు, గుంటూరు, బుడంపాడు, గుంటూరు పశ్చిమ మండలంలోని పొత్తూరు, అంకిరెడ్డిపాలెం.
పల్నాడు జిల్లాలో..
అమరావతి మండలంలోని లింగాపురం, ధరణికోట, దిడుగు, నెమలికల్లు; పెదకూరపాడు మండలం ముస్సాపురం, పాటిబండ్ల, జలాల్పురం, కంభంపాడు, తాళ్లూరు, లింగంగుంట్ల, కాశిపాడు గ్రామాలు.
అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు పిలుపు
శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏపీ సీఆర్డీఏ) పనులకు ప్రణాళికలు రూపొందించింది. రూ.768 కోట్ల అంచనాతో శాసనసభ, రూ.1,048 కోట్లతో హైకోర్టు భవనాలు నిర్మించేందుకు మార్చి 1న టెండర్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యమైంది.
అమరావతి రాజధాని పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు ద్వారా ఇప్పటికే రుణం లభించింది. కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ రూ.3.22 లక్షల కోట్లలో రాజధాని నిర్మాణానికి రూ.6 వేల కోట్లు కేటాయించింది.
42 ఎకరాల్లో హైకోర్టు
హైకోర్టు శాశ్వత భవనాన్ని 42 ఎకరాలలో 20.32 లక్షల చదరపు అడుగులలో 55 మీటర్ల ఎత్తున నిర్మించనున్నారు.బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఏడు అంతస్తులతో భవనాన్ని డిజైన్ చేశారు. ఏడో అంతస్తులో పూర్తిస్థాయి కోర్టు సమావేశ మందిరం, డైనింగ్ హాల్, సువిశాల గ్రంథాలయం ఏర్పాటు చేస్తారు. ఫిబ్రవరి 3, 2019న సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దీనికి భూమి పూజ చేశారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో పనులు మందగించాయి. కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో నిర్మాణంపై దృష్టి పెట్టింది. నిర్మాణ వ్యయం అప్పటిలో అంచనా వ్యయం రూ.860 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.1,048 కోట్లకు చేరింది.
103 ఎకరాల్లో అసెంబ్లీ భవనాలు
శాసనసభ భవన సముదాయాన్ని 103.76 ఎకరాల్లో 11.21లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మూడు అంతస్తులతో విభిన్నంగా డిజైన్లు రూపొందించారు. ఇందుకోసం లండన్‌కు చెందిన ఫోస్టర్స్ సంస్థ డిజైన్ చేసింది. టెండర్ల సంస్థల కోరిక మేరకు ఫోస్టర్స్ సంస్థతో సీఆర్డీఏ ఇటీవల వర్క్‌షాప్ నిర్వహించి, బిల్డింగ్ ఆకృతులు, నిర్మాణ శైలిపై అవగాహన కల్పించింది. అమరావతి ప్రభుత్వ భవన సముదాయంలోని సూపర్ బ్లాక్`ఈ దీనిని నిర్మిస్తారు. మొదటి అంతస్తులో మంత్రుల ఛాంబర్లు, అసెంబ్లీ హాల్, కౌన్సిల్ హాలు, క్యాంటీన్లు, సెంట్రల్ హాలు, లైబ్రరీ ఉంటాయి. రెండో అంతస్తులో కమిటీల ఛాంబర్లు, సభ్యుల లాంజ్, అసెంబ్లీ, కౌన్సిళ్ల హాళ్లు, శిక్షణ కేంద్రం తదితరాలు ఏర్పాటు చేస్తారు. మూడో అంతస్తును నగరాన్ని చూసేందుకు ఉద్దేశించారు. అసెంబ్లీ పైభాగంలో ఎత్తయిన శిఖరం ఆకారంలో ఆకృతి ఉండగా, అందులో పైకి వెళ్లి అమరావతి నగరాన్ని చూసేలా ప్రణాళిక రూపొందించారు. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.555 కోట్లతో శాసనసభ భవనినిర్మాణానికి అంచనా వేసింది. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడం వల్ల ప్రస్తుత అంచనా వ్యయం రూ.768 కోట్లకు చేరింది.
సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా రాజధాని
రాజధాని అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు విధానంలో రూపొందిస్తారు. ఇప్పటివరకు రూ.48 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు ప్రభుత్వం వెల్లడిరచింది. ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.4,382 కేటాయించారు. మంత్రులు, న్యాయ మూర్తుల బంగ్లాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.10,042 కేటాయించారు. ఎల్పీఎస్ మౌలిక సదుపాయాల్లో భాగంగా నాలుగు ప్రధాన రహదారులు, ఇతర సౌకర్యాల కోసం 579.5 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి రూ.9,699 కోట్లు మంజూరు అయ్యాయి. ట్రంకు రోడ్లను రూ.7,794 కోట్లతో, ఎస్టీపీ పనులను రూ.318 కోట్లతో చేపడతారు.
అమరావతి నగరం నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారం తీసుకుంటోంది. మొత్తం రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి వచ్చే ఆర్థిక సాయం పొందేందుకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌కు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బ్యాంకుల నుంచి వచ్చే నిధుల కోసం ప్రత్యేకంగా ఖాతా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ.13,600 కోట్లు ఇస్తుండగా, రూ. 1,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోనుంది. మొత్తం రూ.15 వేల కోట్ల నిధులు రాగానే అమరావతి పనులు వేగవంతమవుతాయి.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్