పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమా చార్య పదార్చనకు అంకితమై ఆ మహా వాగ్గేయకారుడి కీర్తనలకు పట్టం కట్టిన స్వరం మూగవోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం గాయకుడిగా, ఆస్థాన విద్వాంసుడిగా సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా.. వేలకొద్దీ కృతులకు స్వరాలంకరణ చేసి, పండిత పామరులను భక్తి పారవశ్యంలో మునకలేయించిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ‘అంతర్యామి అలసితి….’ అన్నట్లు సంగీత ప్రస్థానాన్ని ముగించి మార్చి 9న మహాప్రస్థానానికి చేరుకున్నారు. పద్యాల ఆలాపనకు ఘంటసాల, త్యాగయ్య-రామదాసు కృతులకు బాల మురళిలా.. అన్నమయ్య కృతులకు గరిమెళ్ల చిరునామా అనడంలో అతిశయం ఉండబోదు. రాజమహేంద్ర వరంలో సంగీత నేపథ్యం కుటుంబంలో నవంబర్ 9, 1948న జన్మించిన గరిమెళ్ల కర్ణాటక సంగీతంలో డిప్లమాచేసి, సంగీత కళానిధులు నేదునూరి కృష్ణ మూర్తి, మంగళంపల్లి బాలమురళి, పశుపతి వద్ద శిష్యరికం చేశారు. చిన్నయసులోనే త్యాగరాజు కృతులకు, జయ దేవుడి అష్టపదులకు, నారాయణ తీర్థుల తరంగాలకు, అనేక లలిత, జానపద గీతాలకు బాణీలు కట్టారు. ఆకాశవాణిలో ఏ గ్రేడ్ గాయ కుడిగా రాణించారు. అన్నమయ్య సంకీర్తన యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహించారు. సిలికానాంధ్ర ఆధ్యర్యంలో ‘లక్ష గళార్చన’ చేశారు. లెక్కకు మిక్కిలి లలిత, జానపద గీతాలతో పాటు దాదాపు వెయ్యి సంకీర్తనలు గానం చేసిన ఏకైక కళాకారుడు.
‘అన్నమాచార్య ప్రాజెక్టు’లో గాత్ర కళాకారుడుగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి తిరుమలేశుని ఆస్థాన విద్వాంసుని హోదాకు ఎదిగారు. కంచి కామకోటి పీఠం, అహోబిల మఠం ఆస్థాన గాయకుడిగా సేవలు అందించారు. దేశవిదేశాలలో వేలాది సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారంతో పాటు రాజాలక్ష్మి తదితర పలు సాంస్కృతిక సంస్థల సన్మానాలు అందుకున్నారు. అన్నమయ్య సంకీర్తన మహతి, హరి సంకీర్తనాచార్య, అన్నమయ్య నాదజ్యోతి, అన్నమయ్య నాద సమ్రాట్.. ఆయన అందుకొన్న బిరుదులలో కొన్ని.
కొన్నేళ్ల క్రితం భాగ్యనగరి రవీంద్రభారతిలో సంగీత ప్రదర్శన సందర్భంగా ఒక ముఖాముఖీలో గరిమెళ్ల ఈ వ్యాసకర్తతో తమ అనుభవాలు పంచు కుంటూ…‘నా ‘సంగీత జీవనయాత్ర’లో ఆరంభానికి ప్రణాళిక అంటూ ఏమీ లేదు. బతుకుతెరువు కోసం చిన్నాచితక ఉద్యోగాలుచేస్తూ, తిరుపతి క్షేత్రం, అన్నమాచార్య అంటే ఏ మాత్రం అవగాహనలేని నేను- శ్రీనివాసుని కొలువులో చేరి, అన్నమాచార్య పదార్చన చేస్తానన్నది ఊహకు అందనది. 1970 దశకంలో హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో సంగీత విభాగాధిపతి పాలగుమ్మి విశ్వనాథం భక్తిరంజనిలో పాడించారు.అన్నమయ్య కీర్తనల ప్రచారానికి తితిదే ప్రత్యేక విభాగాన్ని ప్రారంభిస్తూ, అందుకు అభ్యర్థులను ఎంపిక చేసి, శిక్షణ కార్యక్రమం చేపడుతున్నట్లు గురువు నేదునూరి ద్వారా తెలిసి దరఖాస్తు చేశాను. పరమగురువు (నేదునూరికి గురువు) పినాకపాణి ఎంపిక చేశారు. అన్నమయ్య పట్ల అవగాహన కలిగిన తరువాత గురువు గారి నేతృత్వంలో నా నోట పలికిన తొలి కీర్తన ‘భావము లోన…’ సెమీ క్లాసికల్ చేసిన తొలికీర్తన ‘వినరో భాగ్యము విష్ణుకథ..’ అది బహుళ ప్రాచుర్యం పొందింది.
ఇక అన్నమయ్య కీర్తనలకు బాణీల విషయంలో భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. శాస్త్రీయ సంగీత బాణీతో పాటు పదాలుగా పాడే పద్ధతిలో నేదునూరి, మంగళంపల్లి స్వరపరిచారు. తొలుత రాళ్లపల్లి అనంత కృష్ణశర్మగారు చేసిన కీర్తనలు లలిత సంగీత స్థాయిలోనే ఉన్నాయి. మంత్రాల జగన్నాథరావు సెమీ క్లాసికల్‌లో 450 కీర్తనల దాకా చేశారు.
స్వరకర్తగా, గాయకుడిగా నచ్చినవేవి అని అడగడం సహజం.అన్నీ నచ్చినవే. మరీ మనసుకు పట్టిన వాటి గురించి చెప్పాలంటే…‘అంతయు నీవే హరి పుండరీకాక్ష.., జయజయ నృసింహ సర్వేశా…, వచ్చెను అలమేలు మంగా…, నారాయణ నీ నామమే గతి ఇక.. తిరువీధుల మెరసేనీ దేవదేవుడు.., చూడ రమ్మ సతులాల…అదివో అల్లదివో.., కొండలలో నెలకొన్న…, చూడరమ్మ సతులాల… పొడగంటి మయ్యా… లాంటివి ఉన్నాయి.
అన్నమాచార్య ప్రాజెక్టు ఉద్యోగిగా ‘అన్నమయ్య’ చిత్రంలో పాడలేకపోవడాన్ని ఆయన కొరతగానే భావించారనవచ్చు. ఆ అంశం ప్రస్తావనకు రాగా, ‘సినిమాల్లో పాడాలని ఉన్నా అంత గట్టిగా ప్రయత్నించలేదు. ఇక్కడైతే నా పద్ధతిలో నచ్చినట్లు పాడుకోవచ్చు. అక్కడ అలా కుదరదు కదా? ఒకవేళ వెళ్లినా ఆ రంగంలో రాణించలేమోననిపించింది. అయినా వేంకటేశ్వరుడు నా జీవితానికి ఇలా దిశానిర్దేశం చేశాడేమోనని నా భావన. జీవితమంతా ఆయన సేవలోనే గడుస్తోంది.అపురూపమైన తితిదే ఆస్థాన హోదా కంటే భాగ్యం ఏముంటుంది?’ అని మృదువుగా దాటవేశారు.
‘గురువుల ఆశీస్సులు. శ్రీనివాసుడి దయ నడిపిస్తున్నాయి. నేను బాణీలు కట్టిన కీర్తనలు, గీతాలు నా స్వరంతోనే రికార్డు చేయాలన్నది అభిలాష. వేంకటేశ్వరుని కృప ఎలా ఉంటుందో’ అని ముగించారు. పద కవితాపితామహుడి ఆర్తి, భక్తిని తన గళంలో ఇమిడ్చి యువతను ఆధ్యాత్మికత వైపు మళ్లించిన గరిమెళ్ల వారికి అక్షరాంజలి.
ఆర్‌ఎస్‌ఎస్ ఉత్సవాలలో గరిమెళ్ల పాల్గొని అన్నమయ్య కీర్తనలతో పాటు దేశభక్తి గీతాలను ఆలపించేవారు. తిరుపతిలో పూజ్య గురూజీ శతజయంతిని పురస్కరించుకొని గరిమెళ్ల ఆలపించిన గీతం స్వయంసేవకులకు శ్రీ గురూజీ జీవితాన్ని దర్శింప చేసింది. ఆయన ఆలాపనతో సమానంగా స్థానిక చిత్రకారుడు సత్యనారాయణ గురూజీ చిత్రాన్ని గీశారు. సోమసుందరం తిరుపతి నగర ప్రచారక్ (1986-87)గా ఉన్నప్పుడు బాలకృష్ణ ప్రసాద్‌గారి ఇంటికి వెళ్లి అన్నమయ్య కీర్తనలు విని తన్మయులయ్యేవారు. గరిమెళ్ల కోరిక మేరకు సంఘ పాటలను పాడి ఆనందపరిచేవారు.
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్