తెలుగు సాహిత్యం వరకు ‘పేరడీ’ అనగానే మొదట గుర్తుకొచ్చే వారిలో ఒకరు మాచిరాజు దేవీప్రసాద్‌. ఇది మన సాహిత్యంలో అరుదుగా కనిపించే పక్రియ. అసలు పేరడీ అంటే ఏమిటో, ఎన్ని రకాలో మాచిరాజే ఒక వ్యాసం రాసుకున్నారు. మాచిరాజుతో పాటు జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి, ఇటీవలి కాంలో శ్రీరమణ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వంటివారు ఆ పక్రియను సుసంపన్న చేసినవారనే అనాలి. ఇదొక అధిక్షేపణ పక్రియ అంటారు కొందరు. వెక్కిరించడం అంటారు ఇంకొందరు. ఎవరు ఏమన్నా, పేరడీస్టు తీసుకున్న పద్యం, వచనం ఏదైనా అది ప్రసిద్ధమైనదన్న వాస్తవం మరొకసారి రుజువు అవుతూ ఉంటుంది. అలా అందరి నోళ్లలోనూ నానిన పద్యాన్నీ, గద్య భాగాన్నీ తీసుకుని, ఒక సమకాలీన సమస్య మీద పేరడీ రాస్తారు. కాబట్టి ఇది వెక్కిరింతతోపాటు, మూలాన్ని మరింత గౌరవించడం కూడా ఉంటుంది. చమత్కారం ఇందులో తొణికిసలాడుతూ ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ‘సాంబారులో స్నానిస్తున్న ఇడ్లీ సుందరి’ అని జరుక్‌ ‌పలికినా, ‘ప్రక్కన పెట్టిన రోలర్‌ ‌కాదోయ్‌/‌దానిని గుద్దిన బండ్లెన్నీ’ అని మాచిరాజు ప్రశ్నించినా చమత్కారంతోనే.

తెలుగులో పేరడీ పక్రియను చేపట్టి సుసంపన్నం చేసిన రచయిత మాచిరాజు దేవీప్రసాద్‌. ఆయన 1922 మార్చిలో చీరాల తాలూకా సంతరావూరు గ్రామంలో జన్మించారని చెబుతారు. ఆయన విద్యార్థి దశ నుండి పేరడీలు రాసేవాడు. ఆయన పేరడీలు (1939-52) మధ్య కాలంలో తెలుగులో ప్రసిద్ధమైన భారతి, కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక వంటి వాటిలో విరివిగా ప్రచురితమయ్యాయి. పేరడీల ద్వారా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందున ప్రభుత్వోద్యోగంలో ప్రమోషన్‌ ‌రానందున ఉద్యోగం వదలి హనుమ కొండలో ‘భూమాతా ఎరువుల డిపో’ పేరుతో వ్యాపారం చేశాడు.

పేరడీస్టుకి మూలం మీద చాలా పట్టు ఉండాలని పేరడీలను చూస్తే అర్ధమవుతుంది. ఈ పక్రియను వికటకవిత్వం అనొచ్చునంటారు మాచిరాజు. అలా అని అదే సార్థక నామమన్నా ఆయనకు అంగీకారం కాలేదు. మరొక స్వతంత్ర రచనతో అన్యోన్య మైత్రి కలది అని కూడా వ్యాఖ్యానించారు. కానీ వికట కవిత్వానికి మన సంప్రదాయంలో సభా మర్యాద లేదని తేల్చారు. వెర్బల్‌ ‌పేరడీ, స్టయిల్‌ ‌పేరడీల గురించి కూడా ఆయనే వివరించారు. మరికొన్ని రకాలు కూడా ఉన్నాయి. పేరడీ పద్యానికో, గద్యానికో పరిమితం కాదు. ఇతర పక్రియలలోను ఉంది.

‘పద, పాద నియమాలతో విపరీతార్థ సాధనం చేయడం పేరడీ లక్ష్యం అని ఆయన అభిప్రాయం. విశ్వనాథ, శ్రీశ్రీ, శివశంకరశాస్త్రి, నాయని సుబ్బారావు మొదలైన వారి కవిత్వంపై పేరడీలు రాసేవాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవకతవకలపై అధిక్షే పాత్మకంగా పేరడీలు రాశాడు.

జీవితంలో వచ్చే కష్టనష్టాలు, ఒడుదుడుకులకు బెదిరిపోకుండా చిరునవ్వుతో వాటిని అధిగమించా లన్నది ఆయన సిద్ధాంతం. సాహిత్యరంగంలో, జీవితంలోనూ తనది విదూషక పాత్ర అనే వాడని దేవీప్రసాద్‌ ‌పేరడీలకు పరిచయ వాక్యాల్లో బూదరాజు రాధాకృష్ణ (1986) పేర్కొన్నాడు. జీవితంలో విషాదాన్ని చూసి భీరువుగా కుమిలిపోకుండా నవ్వుకున్నాడు. దేవీప్రసాద్‌ ఎం‌తటివాడినైనా విమర్శించేందుకు వెనుకాడలేదు. విశ్వనాథను విమర్శిస్తే, ‘‘ఎంత బాగా వెక్కిరించావురా’’ అని ఆ ధిషణాహంకారి మెచ్చుకున్నారట.

దేవీప్రసాద్‌ ‌కొంతకాలం ఓ పద్ధతిని పాటించాడట. ‘‘తనతో మాట్లాడితే నవ్వి పొట్ట పగిలి పోవచ్చనే తెలిసి మాట్లాడుతున్నానని’’ హామీని లిఖిత పూర్వకంగా ‘ససాక్షి’కంగా ఇస్తే తప్ప మాట్లాడేవారు కాదట అని పేరడీలకు పరిచయ వాక్యాలు రాసిన డా।।బూదరాజు రాధాకృష్ణ పేర్కొన్నాడు.

దేవీప్రసాద్‌ ‘‘‌పేరడీ అంటే ఒక్క ముక్కలో వికటకవిత్వంగా చెప్పవచ్చునన్నాడు. వికటకవిత్వం అనేది పేరడీకి సమానార్థకం కాదు. వికటకవిత్వానికి అర్థం విస్తృతమైంది. హాస్యం, వ్యంగ్యం, దూషణ, ఆభాస, చమత్కారం ప్రధానంగా గల ప్రతి కవిత్వం వికటకవిత్వమే. వికటకవి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఒక్కొక్క కవిని పేరడీ చేస్తున్నప్పుడు వికటకవి కూడా ఒక్కొక్కరిలా కనిపిస్తాడు. ‘‘ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడై తోచినట్లు.’’ శ్రీశ్రీ దేవీప్రసాదుకి గొప్ప అభిమాని. శ్రీశ్రీ ‘నిజంగానే’ అనే కవితలో ‘‘దానవత్వం నశించడం, మానవత్వం జయించడం నిజంగా జరుగుతుందా?’’ అంటూ సామాజిక స్థితిగతుల దృష్టితో చెప్పిన గొప్ప గేయం.

‘‘నిజంగానే నిఖిల లోకం

నిండు హర్షం వహిస్తుందా

మానవాళికి నిజంగానే

మంచి కాలం రహిస్తుందా!’’

అంటూ మంచిరోజులొస్తాయా! అనే భావాన్ని శ్రీశ్రీ ఆవేదనతో రాస్తే, దేవీప్రసాదు పేరడీ చేయడానికి ఒక సంఘటనను ఆధారం చేసుకున్నాడు. ఆయన మద్రాసులో విద్యార్తిగా ఉన్నప్పుడు అరవవాళ్లు నడిపే మెస్‌లో భోజనం చేసేవాడు. తెలుగు భోజనం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. తెలుగువాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. తెలుగువాళ్ల కోసం ‘ఆంధ్రామెస్‌’ ‌తెరుస్తారనే వార్త ఎవరో చెప్పారు. దేవీప్రసాదుకి మద్రాసులో ‘ఆంధ్రామెస్‌’ ‌తెరవడం అనేది ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే శ్రీశ్రీ ‘నిజంగానే’ కవిత గుర్తొచ్చింది. దాన్ని ‘ఆంధ్రామెస్‌’ ‌పేరుతో పేరడీ చేశాడు.

‘‘నిజంగానే నిఖిల ఆంధ్రం / నిండు హర్షం వస్తుందా / భోజనానికి నిజంగానే / భోగకాలం రహిస్తుందా! / నిజంగానే నిజంగానే / నిఖిల ఆంధ్రం హర్షిస్తుందా / తినకముందే మొహం మొత్తే / మొహన్‌దాల్‌ ‌నశిస్తుందా!’’- అన్ని చేశాడు.

శ్రీశ్రీ మహాప్రస్థానంలో దేశచరిత్రలు గొప్ప కవిత. ఇది ధనికస్వామ్య వ్యవస్థను ధిక్కరించిన గేయం.

‘‘ఏ దేశ చరిత్ర చూసినా

ఏమున్నది గర్వకారణం

నరజాతి చరిత్ర సమస్తం

పరపీడన పరాయణత్వం’’

అంటూ శ్రీశ్రీ చారిత్రక పరిణామాన్నీ, దోపిడీ వ్యవస్థలో నలిగిపోయిన బానిసల స్థితినీ ‘‘దాచేస్తే దాగని సత్యం’’ అన్నాడు. ఈ గేయానికి తేలికైన వస్తువును తీసుకొని దేవీ ప్రసాద్‌

‘‘ఏ ‌రోడ్డు చరిత్ర చూసినా

ఏమున్నది గర్వకారణం

రహదార్ల చరిత్ర సమస్తం

ధూళి, దూసర్‌ ‌పరిణ్యస్తం’’ – అని పేరడీ చేశాడు.

‘కచేరీ కథనం’ ఖండికలో మాతృభాషలో పరిపాలన జరగాలంటే ప్రభుత్వ వ్యవహారాలను ప్రభుత్వోద్యోగులు లేఖల ద్వారా ఎలా నడుపుతారో అధిక్షేపాత్మకంగా చూపించారు. లేఖలకు సకాలంలో సమాధానమివ్వక పోవడానికీ, ఆలస్యానికి గల కారణాలు తెలుపుతూ ‘‘పక్కన మావిడిపుంతలో ఉన్న కోయలే కారణం అవడం, కోయిలంటే ఎవరు? స్త్రీయా, పురుషుడా అని చిత్రపటం గీసి చూపుడు అని ఆజ్ఞ రావడం మొదలైన అంశాలు చెప్పి, కాలయాపనతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కాకుండా ఎలా ఆగిపోతాయో హాస్యస్ఫోరకంగా చిత్రించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏర్పడిన కాగితపు కరువు గురించి చెపుతూ, కాగితాల పొదుపు చేయాలనీ, అదెలా అసాధ్యమో చెప్పేందుకు పేరడీ రచన చేసి చూపించాడు.

‘‘లేవు లేవింక కాగితాల్లేవు లేవు

బిల్సుకయిన, అంటించు లేబిల్సుకైన

నోటుకైనను, ప్రాంసరీ నోటుకైన

లార్డులాంటి మా నోటీసు బోర్డుకైన

సరుకు దేశాన పూర్ణాను స్వారమయ్యె

అంటే అడుగు మన గవర్నమెంటు స్టోరు

అయ్యాయో! లేదు చిన్న ముక్కైన మంత్రి

సెలవు రాయ ప్రధాని రిజైను చేయ’’

కాగితాల కొరతను చమత్కారంగా అధిక్షేపించాడు. ‘‘నోటుకైన ప్రాంసరీ నోటుకైన’’ దొరుకుట లేదన్నాడు. మంత్రిగారి ‘సెలవు చీటి రాసేందుకు, ప్రధాని రిజైన్‌ ‌చేసేందుకు కూడా పేపరు కొరతగా ఉందనటంలో అధిక్షేపాత్మక ధోరణి హాస్యస్ఫోరకంగా ఉంది.

దేవీ ప్రసాద్‌ ‌వ్యక్తిత్వం విశిష్టమైంది. ఆయన మద్రాసులో విద్యార్థిగా ఉన్నప్పటి నుండి, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పటి నుంచీ ఒక విలక్షణత కనిపిస్తుంది. ఆ విలక్షణత కనిపిస్తుంది. ఆ విలక్షణతే ఆయనను పేరడీ కవిగా నిలబెట్టిందనిపిస్తుంది.

కొన్ని ఉదాహరణలు:

పేరడిస్టుని బాగా విసిగించిన సందర్భాలు, వస్తువులు ఉంటే వాటి మీద కూడా పేరడీ రాస్తారు. ‘మా వాహనం’ అన్న పేరడీలో ఇలా అన్నారు, ‘ఆ కనపేడి మేము కొన్నట్టి కాదు/ కాస్త పెట్రోలు అందితే కదిలిపోవు/ కడమ క్రొంగొత్త కార్త వేగాలు మించు/ కాని స్టార్టవన్‌ ఒక్కరగంట పట్టు’.‘తడాఖా’ అన్న పేరడీలో వైద్యుడిని వెక్కిరిస్తారు. ఇలా, ‘ఇంటి యేర్కన్నా సుస్తి యొక్కింత జేయ/ అసలు ఇంటికింజక్షనీయాలి అనును’. మాచిరాజు పేరడీలలో ‘రహదార్లు’ కి బాగా ఖ్యాతి ఉంది. శ్రీశ్రీ దేశచరిత్రలకు ఇది పేరడీ. అందులో మొదటి పేరడి ఏ రోడ్డు చరిత్ర చూసినా ఎక్కువ మంది చెబుతారు. కానీ ఇంకొన్ని కూడా ఆ పేరడీలో చమత్కారంతో తొణికిసలాడేవీ ఉన్నాయి. ‘పెనుదారులు కాలిబాటలను/సామంతులుగా కావించెను/ హైరోడ్డులు అశోకుళ్లై / చరిత్రమున ప్రసిద్ధికెక్కెను’ అనే పేరడీ అందులో ఒకటి. మరొకటి, ‘ఒక కారును వేరొక కారూ/ ఒక బస్సును వేరొక లారీ/ చుంబించితే ఆ క్షణమందున/ రూల్సన్నీ దాగును యెచ్చట’.

దేవీప్రసాద్‌ ‌పేరడీ కవిగా మారడం విచిత్రంగా ఉంది. ఆయన బాల్యంలో సంస్కృతం నేర్చుకుని తెలుగు పద బంధాలను ఒప్పచెప్పేవాడు. అవ్యాకృత ప్రయోగాలను, వైరి సమాసాలను, సమకాలిక సాహిత్యంలోంచి వెలికి తెస్తుండేవాడు. అతడు కలం పట్టే నాటికి తెలుగు సాహిత్యం ఒకవైపు కవితా ప్రవాహంలో కొట్టుకపోతుంటే, మరోవైపు ప్రణయ కవితోన్మాదంలో తలకిందులయిపోతుండేది. మరోవైపు శ్రీశ్రీ అభ్యుదయ కవితా ధోరణి అప్పుడే ఆరంభమైంది. దేవీప్రసాద్‌ ‌మద్రాసులో బియస్‌సి చదివే రోజుల్లో తెలుగు సాహిత్యంలో సాంబారు లాగా మిశ్రపాకంగా మారుతుందని గోలపెట్టేవాడు. రాను రాను ఆయనకు ఆశుకవిత్వమన్నా, ప్రణయకవిత్వమన్నా మొహం మొత్తింది. సమకాలిక భాకవులు ఎన్ని విధాల మిశ్ర సమాసాలు వాడేవారో, ఎవరెవరు ఎలాంటి వైరి సమాసాలు ప్రయోగించేవారో, ఎవ్వరు అడక్కుండానే పుట సంఖ్యతో సహా చెప్పేవాడు. అప్పటి మద్రాసులో ‘అరవ తెలుగు వాతావరణం’ కలుషితంగా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధ కారణంగా వచ్చిన కాగితం కరువు, నిష్కారణ యుద్ధ సన్నాహాలు ప్రమాదభరితంగా ఉన్నా, ఒక కొలిక్కిరాని ప్రభుత్వ పరిపాలనా పద్ధతులు దేవీప్రసాద్‌ను పేరడీ కవిగా చేశాయని డా।। బూదరాజు రాధాకృష్ణ పేర్కొన్నారు. మాచిరాజు దేవీప్రసాద్‌ ఆధునిక తెలుగు సాహిత్యంలో పేరడీ పక్రియను ప్రచారంలోకి తెచ్చారనేది అక్షర సత్యం.

‘ఏ గీతం ఏ కాలంలో

సాధించినదీ పరిపూర్ణం?

ఏ ‘జలసూత్రం’, ఏ ‘కలవింకం’

చూపించింది యీ వికట కవిత్వం?

ఎగతాళుల యీ ప్రతిబింబం,

ఈ భావం, ఈ కిష్కింధం,

ఈ భాష్యం ఈ బాంధవ్యం? (రహదార్లు)

పేరడీస్టుకి మూలం మీద చాలా పట్టు ఉండాలని పేరడీలను చూస్తే అర్ధమవుతుంది. ఈ పక్రియను వికటకవిత్వం అనొచ్చునంటారు మాచిరాజు. అలా అని అదే సార్థక నామమన్నా ఆయనకు అంగీకారం కాలేదు. మరొక స్వతంత్ర రచనతో అన్యోన్న మైత్రి కలది అని కూడా వ్యాఖ్యానించారు. కానీ వికట కవిత్వానికి మన సంప్రదాయంలో సభా మర్యాద లేదని తేల్చారు. వెర్బల్‌ ‌పేరడీ, స్టయిల్‌ ‌పేరడీల గురించి కూడా ఆయనే వివరించారు. మరికొన్ని రకాలు కూడా ఉన్నాయి. పేరడీ పద్యానికో, గద్యానికో పరిమితం కాదు. ఇతర పక్రియలలోను ఉంది.

డా।।పి.వి.సుబ్బారావు

9849177594, రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE