సాఫ్ట్‌వేర్ కోర్సులు చదివిన నిరుద్యోగుల సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతోంది. కుటుంబాల్లో ఏర్పడిన ఈ అశాంతి కల్లోలంగా మారి చివరికి ప్రభుత్వాల ఉనికికే పెను ప్రమాదంగా మారనుంది. దేశంలో ఇప్పటికే 2 కోట్ల మందికిపైగా సాఫ్ట్‌వేర్ చదివిన నిరుద్యోగులుండగా వారికి అదనంగా ప్రతి ఏడాది 25 లక్షల మంది జతకలుస్తున్నారు. వీరిలో 5 శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదు. పైగా కొన్ని కంపెనీలు ప్రాజెక్టులు లేవని, సరైన నైపుణ్యం లేదని చెబుతూ వేల సంఖ్యలో సిబ్బందిని తొలగిస్తున్నాయి. ఇక ఉద్యోగాలకు ఏర్పడిన డిమాండ్‌ను ఆసరాగా తీసుకుని స్టార్టప్‌లు ఫ్రెషర్లకు జీతాలు తగ్గించి దోచుకుంటున్నాయి. ఉద్యోగం కోసం పెద్ద నగరాల్లో నెలల తరబడి ఉండి నైపుణ్యం కోసం వేలకొద్దీ ఖర్చుచేసి చివరికి ఉద్యోగం రాక నిరాశతో ఇంటికొచ్చేస్తున్న యువత ఎంతో మంది ఉన్నారు. ఏళ్లు గడచిపోయి ఉద్యోగం రాక ఏం చేయాలో తెలీక నిశ్చేష్టులైపోతున్నారు. ఇలా వయసు పెరిగిన యువతకు పెళ్లిళ్లు కావడం లేదు. ఉద్యోగం చేసి ఉద్దరిస్తారనుకున్న పిల్లలు తమ కళ్ల ముందు ఖాళీగా తిరుగుతుంటే తల్లిదండ్రులు ఖిన్నులై తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం కోల్పోతే ఏం జరుగుతుందో అని బెంగతో అల్లాడి పోతున్నారు. బీటెక్ కంప్యూటర్ కోర్సులు దండగే అని సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఈ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకుంటే ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల ఖాళీలు – అభ్యర్థుల మధ్య చాలా తేడా కనిపిస్తోంది. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఎంఎన్‌సీలు, స్టార్టప్‌లున్నా వాటిలో స్టార్టప్‌లే 70 శాతానికి పైగా ఖాళీలను భర్తీచేస్తాయి. దేశంలో 50 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులున్నట్లు నాస్కామ్ 2023లో అంచనా వేసిన నివేదిక చెబుతోంది. ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు 2 కోట్ల మంది ఉన్నారు. వీరు కాక ఏటా 25 లక్షల మంది అదనంగా వీరికి తోడవుతున్నారు. కొత్త ఉద్యోగాలు రావడం లేదు సరికదా ఉన్నవి పోతున్నాయి. ఉదాహరణకు రెండు తెలుగురాష్ట్రాల్లో 2.50 లక్షల మంది అన్ని బ్రాంచీలలో కలిపి ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇందులో సీఎస్‌సీ చదివినవారే 2 లక్షల మంది ఉంటారు. 50 వేల మంది ఇతర బ్రాంచ్‌ల వారుంటారు. వీరు కాక ఎంసీఏ, డిగ్రీ బీఎస్‌సీ చదివినవారు రెండు రాష్ట్రాల్లో 2 క్షల మంది ఉంటారు. బీటెక్ సిఎస్‌సీతో పాటు ఇతర బ్రాంచ్‌లు, ఎంసీఏ, బీఎస్‌సీ చదివినవారు కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకోసం పోటీపడుతున్నారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏటా 4.50 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. ఆంధప్రదేశ్‌లో సాఫ్ట్‌వేర్ రంగం వేళ్లూనుకోలేదు కాబట్టి అక్కడి అభ్యర్థులు హైదరాబాద్ మీదే ఆధారపడుతున్నారు. ఇటీవల విజయవాడకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ స్థానిక సాఫ్ట్‌వేర్ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఇంటర్వూలు నిర్వహిస్తే, వాటిల్లో 100 మందికి పైగా పాల్గొంటే, ఒక్కరినే సెలెక్ట్ చేసుకున్నారు.
ఫ్రెషర్స్ సమస్య
ఈ సమస్యను దాదాపు అందరు అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు. సాఫ్ట్‌వేర్ చదివిన అభ్యర్థులను కుంగదీసే సమస్య ఫ్రెషర్స్ గడువు ముగిసిపోవడం. కళాశాల నుంచి బయటకు వచ్చిన అభ్యర్థులను రెండేళ్లపాటు ఫ్రెషర్స్‌గా సాఫ్ట్‌వేర్ కంపెనీలు పరిగణిస్తాయి. రెండేళ్లు దాటిపోతే వారు ఫ్రెషర్స్‌గా దరఖాస్తుచేసేందుకు అనర్హులవుతారు. అంటే వారి ఉద్యోగ అవకాశాలు కోల్పోయినట్లే. హైదరాబాదుకు వెళ్లి ఏదోక కోర్సు నేర్చుకుని కనిపించిన ఇంటర్వూలకు హాజరై రెండేళ్లు గడచిపోగా చేసేది లేక ఇళ్లకు వచ్చేసినవారు లక్షల్లో ఉన్నారు. చాలా మంది అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు ఈ అంశం గురించి అసలు తెలియదు. తెలుసుకునేసరికి రెండేళ్లు లేదా మూడేళ్లు గడచిపోతాయి.
బాధ్యతలేని కళాశాలలు
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు సాఫ్ట్‌వేర్ కోర్సుల కళాశాలలుగా మారిపోయాయి. ఈ కళాశాలల్లో 80 శాతం సీట్లు సీఎస్‌సీ•, దాని అనుబంధ బ్రాంచిలైన ఐటీ, ఎఐ, ఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి బ్రాంచీలే ఉన్నాయి. కోర్ బ్రాంచిలైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ వంటి బ్రాంచీల సీట్లు అన్ని కలిపి 20 శాతం మాత్రమే ఉన్నాయి. కళాశాలలు లక్షల్లో ఉద్యోగాలు వస్తున్నాయని మీడియాలో ప్రచారం చేసుకుని తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నాయి. దాంతో పదేళ్ల నుంచి ఇంజనీరింగ్‌లో సీఎస్‌సీ•కే డిమాండ్ పెరిగింది. మిగతా కోర్ బ్రాంచిలకు ఆదరణ బాగా తగ్గిపోయింది. గత అయిదేళ్లుగా కళాశాలలు కోర్ బ్రాంచీల సీట్లు పూర్తిగా తగ్గించి సీఎస్‌సీ• దాని అనుబంధ బ్రాంచీలకు అనుమతులు తెచ్చుకుని నిర్వహిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 300 వరకు ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా అన్నిటిలో ఇదే పరిస్థితి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా ఆర్టస్, కామర్స్ తప్పించి మిగతా ఏ డిగ్రీ చదివినవారైనా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు అర్హులే అంటున్నాయి. దాంతో బీఎస్‌సిలో కూడా కంప్యూటర్ కోర్సులు వచ్చాయి. ఇంజనీరింగ్ సీఎస్‌సీ•తో పాటు మిగతా బ్రాంచీలు, బీఎస్‌సీ వారు, ఎంసీఏ వారు అందరూ కలిపి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకే ఎగబడుతున్నారు.
అబద్ధాల అప్పాయింట్‌మెంట్‌లు
కంపెనీలు నిర్వహించే సాఫ్ట్‌వేర్ ఆన్‌క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా అన్నీ అవాస్తవాలే. కళాశాలలు కొన్ని కంపెనీలను తెచ్చి, వాటితో ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూలు చేయించి, ఎంపికైన విద్యార్థులకు ఆఫర్ లెటర్లు ఇప్పిస్తున్నాయి. కాని ఆఫర్ లెటర్లు అందుకున్న విద్యార్థులను ఆ కంపెనీలు ఉద్యోగాలకు పిలుస్తున్న దాఖలాలు లేవు. అయితే ఆ కళాశాలలు, తమ కళాశాలలో చదివిన వందలాది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినట్లు ఫొటోలతో సహా ప్రకటిస్తాయి. కాని ఆ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూనే ఉంటున్నది వాస్తవం.
కోచింగ్ సెంటర్ల ప్రచారం
తమ వద్ద కోచింగ్ తీసుకుంటే ఉద్యోగాలు వచ్చేస్తాయని కోచింగ్ సెంటర్లు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లలో 100 రోజుల పాటు కోచింగ్ ఇస్తారు. ఈ బ్యాచ్‌లలో కనీసం పదివేల మంది చదువుతారు. కాని ఒక్కో సెంటరు నుంచి నాలుగైదు కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎంపికయ్యేది అయిదారుగురు మాత్రమే. ఒక ఇనిస్టిట్యూట్‌లో ఒక కంపెనీ చేసిన ఎంపిక పరీక్షకు 500 మంది హాజరైతే చివరి రౌండ్‌లో సెలెక్ట్ అయ్యేది ఒకరిద్దరే. ఇవే సంస్థలు జాబ్ గ్యారెంటీ స్కీముల పేరుతో వేలకు వేలు వసూలు చేసినా అక్కడా ఇదే పరిస్థితి.
ప్రభుత్వం పరిష్కరించాలి
సాఫ్ట్‌వేర్ అభ్యర్థుల సమస్యను ప్రభుత్వం అర్ధం చేసుకుని పరిష్కరించాలి. ప్రభుత్వోద్యోగాలకే ఖాళీల భర్తీలో కాలపరిమితి లేదు. అలాంటిది కంపెనీలు ఫ్రెషర్స్ పేరుతో కాలపరిమితి పెట్టి రెండేళ్ల క్రితం చదువు పూర్తి చేసిన వారిని ఉద్యోగాలకు అనర్హులుగా మార్చేస్తున్నాయి. ఈ అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని కంపెనీలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. నాలుగేళ్ల పాటు బీటెక్ సీఎస్‌సీ చదివి, 42 సబ్జెక్టులు పూర్తిచేసినా రాని ఉద్యోగం మూడు నెలల్లో రావడం అంటే లోపం ఎక్కడుందో గ్రహించాలి. విద్యార్థుల్లో సామర్థ్యం ఉంది కాబట్టే 42 సబ్జెక్టులు పూర్తిచేయగలరు. అందువల్ల విద్యార్థుల ఉపాధికి కళాశాలలే బాధ్యత వహించాలి. కళాశాలలే కోచింగ్ సెంటర్లు ఇచ్చే శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు నిర్వహించాలి. ప్రభుత్వం సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వాటిలో ఏర్పడే ఖాళీలపై వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. విచ్చలవిడిగా జరుగుతున్న సాఫ్ట్‌వేర్ కోర్సుల ప్రవేశాలకు అడ్డుకట్టవేయాలి. లేనిపక్షంలో ఇంటికి ఒకరిద్దరు నిరుద్యోగులున్న కుటుంబాలు కుంగు బాటుకు గురై సమాజం అశాంతికి లోనవుతుంది.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్