దేవభూమిగా పేరు తెచ్చుకున్న కేరళలో దెయ్యాలను మించిన మతోన్మాద ఉగ్రమూకల నేతలను కొలిచే ధోరణి శ్రుతి మించుతున్నది. ఇటీవల పాలక్కాడ్‌ ‌జిల్లాలో జరిగిన ఊరేగింపులో హమాస్‌ ఉ‌గ్రమూక నేతలు యహ్యా సిన్‌వర్‌, ఇస్మాయిల్‌ ‌హనియే ఫొటోలతో కూడిన బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ బ్యానర్లకు మలయాళంలో ‘‘తరవాదీస్‌, ‌తెక్కెభాగమ్‌’’ అని పేరు పెట్టారు. దానర్థం హమాస్‌ ఉ‌గ్రమూకకు చెందిన ఆ ఇద్దరు నేతలు ‘దక్షిణాదికి పూర్వీకులు’ అని.

కేరళలో టెర్రరిస్టులను, వారి మతోన్మాద సంస్థలను నెత్తిన పెట్టుకోవడమనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. అక్కడ ఆ జాడ్యం ఎప్పట్నుంచో ఉంది. గతంలో ఓ వర్గానికి చెందినవారు ఒసామా బిన్‌ ‌లాడెన్‌, అజ్మల్‌ ‌కసబ్‌లను బహిరంగంగా కీర్తించిన ఉదంతాలు ఉన్నాయి. అలాగే కేరళలో పాలస్తీనా అనుకూల వైఖరి కూడా కొత్తగా వచ్చిందేమీ కాదు. 2024లో కేరళ విశ్వవిద్యాలయంలో ‘ఇంతిఫదా’ పేరిట జరిగిన వార్షిక యువజన ఉత్సవం పెను దుమారం రేపింది. వేడుకకు పెట్టిన పేరు అందుకు కారణమైంది. ఆ పేరుకు పాలస్తీనా- ఇజ్రాయెల్‌ ‌ఘర్షణతో సంబంధం ఉంది. హమాస్‌ ‌నేతలు ఆ పేరును ఎక్కువగా వాడుతుంటారు. అనంతరం విశ్వవిద్యాలయం వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌మోహనన్‌ ‌కున్నుమ్మాల్‌ ‌వేడుక ప్రచార సామాగ్రి నుంచి ఆ పేరును తొలగించాలని ఆదేశించారు.

హమాస్‌ ‌మాజీ అధినేత ఖలేద్‌ ‌మషాల్‌ అక్టోబర్‌ ‌నెల, 2023 సంవత్సరంలో మల్లప్పురంలో ఓ సభను ఉద్దేశించి ప్రసంగించాడు. సాలిడారిటీ యూత్‌ ‌మూవ్‌మెంట్‌ అనే సంస్థ ఆ సభను నిర్వహించింది. ఈ సంస్థ జమాతే ఇస్లామీకి విద్యార్థి విభాగంగా పనిచేస్తోంది. అది ‘హిందూత్వను కూకటివేళ్లతో పెకలించివేయాలి’ అనే ఓ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.

లాడెన్‌ ‌చావు.. పోలీసుల్లో వణుకు

ఒసామా బిన్‌ ‌లాడెన్‌ ‌పాకిస్తాన్‌లో అమెరికా బలగాల చేతిలో హతమైపోయినప్పుడు అత్యంత ప్రాణాంతకమైన ఓ ఉగ్రవాది పీడ విరగడైందని యావత్‌ ‌ప్రపంచం సంబరాలు చేసుకున్న సందర్భ మది. అయితే కేరళ పోలీసులు మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని శంకించారు. లాడెన్‌ ‌మే నెల, 2012 సంవత్సరంలో హతమై పోయినప్పుడు కేరళలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేరళలో పేరున్న స్టూడెంట్స్ ఇస్లామిక్‌ ‌మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇం‌డియా – సిమి లాంటి ఉగ్రవాద సంస్థలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు, వాటి చర్యలకు అద్దం పడతాయని పోలీసులు అన్నారు. అందుకనే లాడెన్‌ ‌హతమైపోయినప్పుడు ఈ మూకలు అల్లర్లకు దిగుతాయని అనుమానించి కేరళ అంతటా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో లాడెన్‌ ‌చావుకు సంతాపం తెలుపుతూ రాష్ట్రంలో పలు చోట్ల పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.

మే నెల 2019 సంవత్సరంలో అయితే బీకామ్‌ ‌చివరి సంవత్సరం విద్యార్థి ఒకడు తన కారుకు ఒసామా బిన్‌ ‌లాడెన్‌ ‌స్టిక్కరు అంటించుకొని తిరుగుతూ దొరికిపోయాడు. అతడిని కుల్లం జిల్లాలోని ముందకల్‌లో ఛావరలో ఎంఎస్‌ఎన్‌ ‌కాలేజీలో చదువుతున్న ముహమ్మద్‌ ‌హమీద్‌గా గుర్తించారు. ఆ కారుకు పశ్చిమ బెంగాల్‌లో రిజిస్టర్‌ ‌చేసిన నంబరు ఉంది.

కసబ్‌ ‌కోసం ప్రార్థనలు

ముంబైలో నవంబరు నెల, 2008 సంవత్సరంలో జరిగిన దారుణాతి దారుణమైన ఉగ్రదాడిలో 166 మంది అమాయకులు మరణించారు. లష్కరే తోయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ఆ ఘాతుకానికి ఒడిగట్టారు. అజ్మల్‌ ‌కసబ్‌ ఆ 10 ‌మందిలో ఒకడు. 10 మందిలో కసబ్‌ ‌మాత్రమే ప్రాణాలతో దొరికిపోయాడు. పాకిస్తాన్‌కు ఉగ్రదాడితో ఉన్న లంకె బైటపడింది. కసబ్‌కు విచారణ అనంతరం ముంబై హైకోర్టు మరణశిక్ష విధించింది. కసబ్‌ ‌శిక్ష తగ్గింపు కోసం సుప్రీంకోర్టుకు, క్షమాభిక్ష కోసం భారత రాష్ట్రపతికి పెట్టుకున్న పిటిషన్‌ ‌తిరస్కరణ పొందాయి.  కసబ్‌ను చివరకు పుణే దగ్గరి ఎరవాడ జైల్లో ఉరి తీశారు. నిజానికి ఆ రోజు దేశమంతటా పండుగ చేసుకోవాల్సిన రోజు. కానీ కేరళలో ఓ మసీదు అధికారి కసబ్‌ ఆత్మకు శాంతి కోసం ప్రార్థనలు చేయాలని నిర్ణయించాడు. పలువురు మృతులతో పాటుగా కసబ్‌ ‌కోసం ప్రార్థనలు చేసిన ఖతీబ్‌ అబ్దుల్‌ ‌రవూఫ్‌పై జమాత్‌ ‌మసీదు నిర్వహణా కమిటీ క్రమ శిక్షణ చర్యలు తీసుకుంది. ఖతీబ్‌ ఈ ‌సంఘటన దేశమంతటా సంచలనం సృష్టించడంతో తన పదవికి రాజీనామా చేశాడు.

పిల్లలూ పావులే!

కేరళ పోలీసులు మే నెల, 2022 సంవత్సరంలో ఓ రాజకీయ సభలో విద్వేషపూరితమైన నినాదాలు చేసిన ఓ ముస్లిం బాలుడిపై కేసు పెట్టారు. పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా – పీఎఫ్‌ఐ ఆ ‌సభను నిర్వహించింది. అప్పటికి పీఎఫ్‌ఐ ‌పై నిషేధం విధించలేదు. అదే ఏడాది సెప్టెంబరు నుంచి నిషేధం అమల్లోకొచ్చింది. ఆ ఘటనకు సంబంధించి బాగా వైరల్‌ అయిన ఓ వీడియోలో ఓ పిల్లవాడు ఒక వ్యక్తి భుజాలపైన కూర్చొని ఉంటాడు. ఆ వీడియోలో అతడు ‘సంఘీలు సరిగ్గా బతకడం నేర్చుకోవాలి, లేకుంటే వారు వారి అంతిమ సంస్కారాలకు సిద్ధం కావాలి!’ అని అంటుంటాడు. ఆ పిల్లవాడు క్రైస్తవులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశాడు.

పైన పేర్కొన్న సంఘటనలన్నీ కూడా కేరళలో అనేక మంది మెదళ్లలో ఇంకిపోయిన రోగగ్రస్తమైన భావజాలానికి అద్దం పడుతున్నాయి. ఈ భావజాలం రాష్ట్రంలోకి లోతుగా చొచ్చుకొనివచ్చిన వహాబీ సంస్కృతి నుంచి పుట్టుకొచ్చింది. సౌదీ అరేబియా దేశస్తులు భారత్‌లో షియా వర్గీయులకు సున్ని వర్గీయులతో ముప్పు ఉంటుందని భావించారు. దాంతో వారు అనేక సంవత్సరాల క్రితమే భారత్‌లో వహాబీ కేంద్రాలను నెలకొల్పారు. అప్పటి నుంచి వేలాదిగా వహాబీ బోధకులను మనదేశానికి పంపించసాగారు. కనీసం 25 వేల మంది వహాబీ బోధకులు 2011 నుంచి 2013 సంవత్సరాల మధ్య కాలంలో కేరళపై ప్రధానంగా దృష్టి పెడుతూ భారత్‌ ‌చేరుకున్నారు. వారు రూ.1,700 కోట్లను వాయిదాల పద్ధతిలో తమతో పాటుగా ఇక్కడకు తీసుకొనివచ్చారు. కేరళలో అత్యధికులు ఉపాధి కోసం సౌదీ వెళుతుంటారు కాబట్టి కేరళ ఓ సులువైన లక్ష్యంగా మారింది. ఫలితంగా వహాబీలు 75 మసీదులను తమ అధీనంలోకి తీసుకున్నారు. కేరళలో సౌదీ తరహాలో కొత్తగా మసీదుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చిపడ్డాయి. వహాబీలు వారి తరహా బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలనే ఆలోచన చేశారు. దీని కోసం దాదాపు రూ.800 కోట్లు కేటాయించారు. కేరళలో వహాబిజమ్‌ ‌విజయవంతంగా వేళ్లూనుకోవడం వెనుక అక్కడ పీఎఫ్‌ఐ అత్యంత బలంగా ఉండటం ఓ కారణమైంది. పెద్ద సంఖ్యలో ముస్లిం యువతను నియమించుకున్నారు. హింసాత్మక బాట పట్టేలా యువత మెదళ్లు మలిచారు. ఇది బాహాటంగా ఉగ్రవాదులను కథానాయకులుగా కొలిచే విపరీతానికి దారి తీసింది. అక్కడి పాలనా యంత్రాంగం ఇంత జరుగుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఈ ధోరణి రాష్ట్రంలో హిందువులపై దాడికి కూడా దారి తీస్తోంది. మతోన్మాది జకీర్‌ ‌నాయక్‌ ‌నేతృత్వంలోని పీస్‌ ‌ఫౌండేషన్‌కు కేరళలో ఈ అరాచక శక్తులకు వెన్నుదన్నుగా నిలిచే సంస్థల్లో ఒకటిగా బాగా పేరుంది. ఇదంతా చూసిన తర్వాత ఎవరికైనా కేరళలో హమాస్‌ ‌నేతలు, ఒసామా బిన్‌ ‌లాడెన్‌ ‌లేదా అజ్మల్‌ ‌కసబ్‌లను గొప్పవాళ్లుగా చూపించడం అంతగా ఆశ్చర్యమనిపించదు.

జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE