మహాకుంభమేళాలో పర్యావరణ పరిరక్షణ నిమిత్తం చేపట్టిన కంచాలు, సంచుల సేకరణ కార్యక్రమంలో 14 లక్షల 17 వేల కంచాలు, 13 లక్షల 46 వేల సంచులు, 2 లక్షల 63 వేల లోటాలు పోగయ్యాయి. అలా సేకరించిన వాటిని కుంభ మేళాలో అవసరమైన వారికి పంచిపెట్టారు. ఈ సేకరణ కార్యక్రమం దేశంలో 43 రాష్ట్రాల్లోని 7,258 చోట్ల జరిగింది. 2,241 సంస్థలు ఇందులో పాలు పంచుకున్నాయి. ఇలా సేకరించినవాటిని పంచిపెట్టిన కారణంగా కుంభమేళాలో పర్యావరణానికి చేటు చేసే వాటితో తయారు చేసిన కంచాలు, గిన్నెల వాడకం 80 నుంచి 85 శాతానికి తగ్గిపోయింది. కోట్లాది జనం కారణంగా 40 వేల టన్నుల వ్యర్థాలు పోగుపడతాయని అంచనా వేస్తే ఇప్పటిదాకా చేరిన వ్యర్థాల పరిణామం 11 వేల టన్నులు మాత్రమే ఉంది. దానర్థం 29 వేల టన్నుల వ్యర్థాన్ని నివారించి నట్టు. పారిశుద్ధ్య కార్మికులు, నగర వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలపై భారం తగ్గింది. సంప్రదాయ కంచాలు, లోటాలు, సంచుల పంపిణీ కారణంగా పర్యా వరణానికి చేటు చేసే వాటితో తయారైన వాటి వాడకం పడిపోయింది. దీంతో రోజుకు రూ.3.5 కోట్లు ఆదా అయ్యింది.
ఆ లెక్కన కుంభమేళా జరిగే 40 రోజులకు మొత్తంగా రూ.140 కోట్లు ఆదా అవుతుంది. అదే సమయంలో ఆహార వృధా 70 శాతం తగ్గిపోయింది. సామాజిక వంటశాలలు, భండారాలు, అఖాడాలు లబ్ధి పొందాయి. అవసరమైన వారికి పంచిపెట్టిన స్టీలు కంచాలను ఏళ్ల తరబడి వాడుకోవచ్చు.
కంచాలు, సంచుల సేకరణ కార్యక్రమం భవిష్యత్తులో పర్యావరణ హితం దిశగా కుంభమేళా తరహా ఆధ్యాత్మిక వేడుకల కోసం కంచాలు, సంచుల, లోటాల నిధులను ఏర్పాటుకు ఊతమివ్వడం ద్వారా సాంస్కృతికంగా ఓ సానుకూల మార్పునకు దారి తీస్తుంది. ఇది ఎలాంటి పిలుపు లేదా ప్రచారంతో పనిలేకుండానే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పైన పేర్కొన్న వస్తువులను అందించే ఓ సత్ సంప్రదాయానికి చేయూతనిస్తుంది. ఇంతటి గొప్ప పరిణామానికి కారణమైన ఈ కార్యక్రమానికి ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం గమనార్హం. అంతే కాకుండా ఈ కార్యక్రమం సాధించిన విజయం స్వచ్ఛమైన, పర్యావరణ హిత భవిష్యత్తు కోసం సామాజిక భాగస్వామ్యం, పర్యావరణం పట్ల బాధ్యత, నిరంతరాయ కార్యాచరణ మధ్య సమన్వయానికి తార్కాణంగా నిలిచింది.
-జాగృతి డెస్క్