దేశ విభజన ఒకనాటి ఘటన కావచ్చు. అది జరిగి 77 ఏళ్లు పూర్తయింది కూడా. కానీ దాని ప్రభావం వర్తమాన కాలం మీద కూడా ఉంది. చరిత్రలో జరిగిన పెద్ద ఘటన ప్రభావం అక్కడితో ఆగిపోదు. విభజన ఆటుపోట్లు నేటి తరం కూడా చవి చూడవలసి వస్తున్నది. లియాఖత్‌ అలీ`నెహ్రూ ఒప్పందం ప్రకారం ఇక్కడి ముస్లింలను అక్కడికి, అక్కడి హిందువులను ఇక్కడికి తరలించాలి. అక్కడి హిందువులు చాలావరకు ఇక్కడికి వచ్చారు. ఇక్కడి ముస్లింలు వెళ్లలేదు. కానీ పాక్‌ వెళ్లిపోయిన వారి ఆస్తులు ఒక పెద్ద సమస్యగా మిగిలాయి. ‘శత్రువు ఆస్తి’ వివాదం ఇదే. బాలివుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఆస్తుల స్వాధీనంపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు స్టే ఎత్తివేసిన తరువాత, దాదాపు రూ. 15,000 కోట్ల విలువైన ఆస్తులు సైఫ్‌ చేతి నుంచి జారిపోతాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఇదే ఎనిమీ ప్రాపర్టీ వివాదం.  ఎనిమీ ప్రాపర్టీ చట్టం 1968 అందుకు సంబంధించినదే. ఈ చట్టమే దేశ విభజనానంతర పరిణామం ఎనిమీ ప్రాపర్టీ గురించి చాలా విషయాలు చెబుతుంది.

ఇటీవలే కత్తిపోట్లకు కూడా గురై వార్తలకు ఎక్కిన సైఫ్‌ ఆస్తులు విశేషంగా ఉన్నాయని, అవన్నీ ఇప్పుడు ప్రభుత్వపరం కానున్నాయని వార్తలు వెలువడడంతో దేశంలో దీని మీద చర్చకు అవకాశం ఏర్పడిరది. నిజానికి ఇవన్నీ భోపాల్‌ నవాబునకు సంబంధించినవి. భారత్‌ సమాఖ్యలో చేరడానికి నిరాకరించిన, మొండికేసిన సంస్థానాధీశులలో భోపాల్‌ నవాబు కూడా ఉన్నాడు. వాయిదాలు వేసి, మడత పేచీలు పెట్టినా చివరికి తన సంస్థానాన్ని అప్పగించక తప్పలేదు.

భోపాల్‌ నవాబు ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ విభాగం కింద స్వాధీనం చేసుకోవడం గురించి ఇచ్చిన ఆదేశాల గురించి సంప్రతించడానికి ఆ ఆస్తులకు రక్షకునిగా (కస్టోడియన్‌) ఉన్న నటుడు సైఫ్‌ అలీఖాన్‌ అధికారులను కలుసుకోవాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించింది. నవాబు పటౌడీ ఆస్తులు ‘శత్రువు ఆస్తులు’గా భారత ప్రభుత్వం పరిగణిస్తున్నదని ఆ కుటుంబానికి ఆదేశాలు అందాయి. ఈ ఆదేశాల మీదనే సైఫ్‌, ఆయన తల్లి, సినీ నటి షర్మిలా టాగోర్‌ (పటౌడీ) హైకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం జారీ ఆదేశానికి మూలం ఏమిటి? భోపాల్‌ నవాబు మహమ్మద్‌ హమీదుల్లా ఖాన్‌ పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్‌ బేగం విభజన తరువాత పాకిస్తాన్‌ వెళ్లిపోయారు. కాబట్టి ఆమెవిగా చెప్పే ఆస్తులన్నీ శత్రువు ఆస్తులుగానే పరిగణిస్తారని తన ఆదేశాలలో ప్రభుత్వం పేర్కొన్నది.

కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చేరిన తరుణంలోనే సైఫ్‌ అలీకి చెందిన వేలాది కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వ పరం కానున్నదన్న వార్తలు కూడా వచ్చాయి. దీనితో ఈ తాజా పరిణామం మీద, గతానికి సంబంధించిన అంశం మీద కూడా మరింత చర్చ జరిగింది. శత్రువు ఆస్తి అన్న అంశం సైఫ్‌తోనే ఆరంభమైనది కాదు. దీనికీ, స్వరాజ్యానికీ, సంస్థానాల విలీనానికీ అవినాభావ సంబంధం ఉంది. కచ్చితంగా చెప్పాలంటే దేశ విభజనే దీనికి మూలం. ఇందుకు సంబంధించిన ఎనిమీ ప్రాపర్టీ చట్టం తరువాత ఎన్నో మార్పులకు కూడా లోనైంది. స్వతంత్రం వచ్చిన తరువాత భోపాల్‌ నవాబు ఆస్తులకు వారసులుగా ఉన్న సైఫ్‌ కుటుంబం ఇప్పుడు దాదాపు రూ. 15,000 కోట్ల రూపాయల ఆస్తులను వదలుకోవలసి ఉంటుందని అంచనా.  వీటిని లెక్కించడానికే దాదాపు ఎనిమిదేళ్లు పట్టింది. 1968 నాటి శత్రువు ఆస్తుల చట్టం మేరకు ఈ ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకోకుండా మధ్యప్రదేశ్‌ హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. 1947 తరువాత దేశం విడిచిపోయిన వారి ఆస్తులను, 1962, 1965 యుద్ధాల తరువాత పాకిస్తాన్‌, చైనాలకు వెళ్లిపోయిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు కేంద్రానికి దఖలు పరించింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని భావిస్తున్న వాటిలో సైఫ్‌ బాల్యమంతా గడిచిన ఫ్లాగ్‌ స్టాఫ్‌ హౌస్‌ కూడా ఉంది. ఇంకా నూర్‌ ఆజ్‌ సభా భవనం, దారుస్‌ సలామ్‌, అహమ్మదాబాద్‌ భవనం, కోహెఫిజా, మరికొన్ని ఆస్తులు ఉన్నాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ పదవి స్వీకరించిన కొద్దికాలంలోనే శత్రు ఆస్తుల సంగతి తీవ్రమైన అంశంగా పరిగణించారు. యథాప్రకారం బుజ్జగింపు కోసం కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. దేశంలో ఎన్నో ఉన్నప్పటికి 2018లో దాదాపు 9,400 శత్రు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.

పాకిస్తాన్‌, చైనాలతో శత్రుత్వం తారస్థాయిలో ఉన్న సమయంలో ఈ చట్టం వచ్చింది కాబట్టి, దీనికి ఎనిమీ ప్రోపర్టీ చట్టం అని పేరు వచ్చి ఉంటుంది. ఒకప్పుడు భారతదేశవాసులైనప్పటికీ యుద్ధాల తరువాత, ఇతర కారణాలతో పాకిస్తాన్‌, చైనాల పౌరసత్వం తీసుకున్నవారికి ఇక్కడ మిగిలిన ఆస్తులనే ఎనిమీ ప్రాపర్టీ అని చెబుతారు. 1965 నాటి పాకిస్తాన్‌ యుద్ధం తరువాత ఈ చట్టం అమలులోకి వచ్చింది. చైనా యుద్ధం (అక్టోబర్‌ 20,1962) తరువాత ఆ దేశం వెళ్లి పౌరసత్వం తీసుకున్న వారి ఇక్కడి ఆస్తులకు కూడా దీనిని వర్తింపచేశారు. దీని ప్రకారం ఇలాంటి ఆస్తులన్నీ కస్టోడియన్‌ ఫర్‌ ఎనిమీ ప్రాపర్టీ ఇన్‌ ఇండియా అనే కేంద్ర ప్రభుత్వ స్వాధీనంలో ఉంటాయి. 2017లో ఈ చట్టానికి కొన్ని సవరణలు చేశారు. ఈ సవరణ ప్రకారం విభజన తరువాత యుద్ధాల తరువాత దేశం విడిచి చైనా పాకిస్తాన్‌లలో స్థిరపడిన వారి ఆస్తులు వారి వారసులకు చెందవు. శత్రువుకు చెందిన వారి సంస్థ, ఆస్తి స్వాధీనంలో ఉంచుకోవడం, నిర్వహించడం కుదరదు. ఆ హక్కు ఇక్కడ వారసులుగా ఉన్నవారమని చెప్పుకునే వారికి ఉండదు. ఇలాంటి శత్రువు ఆస్తులు దేశంలో వేలల్లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ. లక్ష కోట్లు. వీటి విక్రయం లేదా వేలం మొదలయింది. దేశం వీడి వెళ్లిన వారి ఆస్తులను వారి వారసులు లేదా సంబంధీకుల నుంచి స్వాధీనం చేసుకునే హక్కు భారత్‌కు ఎక్కడిదని వాదించే అవకాశం లేకుండా చేసినది పాకిస్తాన్‌. ఎందుకంటే 1971 యుద్ధం తరువాత అక్కడ మిగిలిన హిందువుల ఆస్తులను వారి వారసుల నుంచి తప్పించి దాయాది దేశం పాకిస్తాన్‌ అమ్మేసింది.

భారత ప్రభుత్వం ప్రకటించిన మేరకు దేశంలో శత్రువు స్థిరాస్తులు దాదాపు 12,426. వీటి విలువ లక్ష కోట్ల రూపాయలు. వారికే చెందిన 302 సంస్థలు కూడా ప్రస్తుతం కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీ స్వాధీనంలో ఉన్నాయి. అత్యధికంగా శత్రువు ఆస్తులు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ (5,936). తరువాతి స్థానాలలో పశ్చిమ బెంగాల్‌ (4301), ఢల్లీి (659), గోవా (295) ఉన్నాయి. ఇంకా త్రిపుర (500), మహారాష్ట్ర (430), తెలంగాణ (234), మధ్యప్రదేశ్‌ (148), గుజరాత్‌ (127), బిహార్‌ (94), ఇతరత్రా (531) ఆస్తులు కూడా దేశంలో ఉన్నాయి. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆ ఆస్తులు విస్తరించి ఉన్నాయి. 2018లో వెల్లడైన వివరాల ప్రకారం భారత్‌ విడిచి పాకిస్తాన్‌ వెళ్లి స్థిరపడిన వారి మొత్తం ఆస్తుల సంఖ్య 9,280. చైనా వెళ్లిన వారి ఆస్తులు 126.

సంపాదించిన ఆస్తులన్నీ ఒక దేశంలో మదుపు చేసుకోవడం, చివరికి దేశం విడిచి వెళ్లిపోవడం వంటి పరిణామాల వెనుక ఆసక్తికరమైన కథలు చాలా ఉన్నాయి. ఈ పరిణామాలలో నష్టపోయిన వారు తీవ్రమైన క్షోభనే అనుభవించి ఉండాలి కూడా. తరువాతి పరిణామాలకు, కస్టోడియన్‌ వ్యవస్థకు, చట్టాలకు భారత్‌ పాక్‌ యుద్ధం 1965, గోవా విమోచనోద్యమం 1962 కూడా నేపథ్యంగా ఉన్నాయి.

 సాధారణ శకం 1800 నాటికే బ్రిటిష్‌ జాతి కన్ను కరాచీ మీద పడిరది. ఈ రేవు పట్టణాన్ని అతి పెద్ద వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలని ఊహించారు. ఫలితంగా చాలా మంది గోవా వారు ఇక్కడికి చేరుకున్నారు. అక్కడ పోర్చుగీసు వారి నియంతృత్వం కూడా ఇందుకు ప్రోత్సాహం కల్పించి ఉండవచ్చు. కరాచీ చేరిన గోవా వారు ఆఫ్రికా, ఆసియాలలోని పలు దేశాలకు వాణిజ్యం కోసం యాత్రలు చేసేవారు. సంపాదించినందతా పట్టుకు వచ్చి భావి జీవితం కోసం కరాచీలో పెట్టుబడుల రూపంలో లేదా మదుపు పెట్టేవారు. ఈ దేశాన్ని ముస్లింలీగ్‌, ఆంగ్లేయులు కలసి చీలుస్తారని వారు ఊహించలేదు పాపం. ప్రపంచ పరిణామాలలో భాగంగా పాకిస్తాన్‌ 1965లో పశ్చిమ సరిహద్దుల నుంచి భారత్‌ను ఎదుర్కొనవలసి వచ్చింది. 1962లో చైనాతో యుద్ధం తరువాత భారత్‌ బలహీన పడిరదన్న పిచ్చి ఊహతో పాకిస్తాన్‌ భారత్‌ మీద దాడి చేసిన ఫలితం మాత్రమే అది. యుద్ధంలో భారత్‌ గెలిచినా ఐక్య రాజ్యసమితిలో శాంతి ఒప్పందం జరిగింది. భారత్‌కు ఒరిగిందేమీ లేదు. ఆ తరువాత కొందరు భారత్‌లోని తమ స్థిరచరాస్తులు సహా శాశ్వతంగా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని అనుకున్నారు. అప్పటిదాకా అవి ఎవాక్యూ ప్రాపర్టీ చట్టం 1950 మేరకు కస్టోడియన్‌ చేతిలో ఉండేవి. వీరిని భారత ప్రభుత్వమే నియమించేది. వీటినే ఎవాక్యూ ప్రాపర్టీ అనేవారు. గోవాకు చెందిన ఇలాంటి వారి ఆస్తులు గోవా, డామన్‌ డయ్యూ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఎవాక్యూ ప్రాపర్టీ చట్టం 1964 కింద ఉండేవి. అయితే భారత్‌ నుంచి పాకిస్తాన్‌ వెళ్లి, అక్కడి పౌరసత్వం స్వీకరించిన వారికి 1965లో చేదు అనుభవం ఎదురైంది. కారణం ఎనిమీ ప్రాపర్టీ విధానం. చైనాతో యుద్ధం సమయంలోను డిఫెన్స్‌ ఆఫ్‌ ఇండియా రూల్స్‌ 1962 ప్రకారం చైనా పౌరసత్వం స్వీకరించిన ఒకనాటి భారతీయుల ఆస్తులు ప్రభుత్వం అధీనంలోకి వచ్చాయి. 1968 చట్టాన్ని మరింత భారతీయ అనుకూలం చేస్తూ 2015, 2018,2019, 2020లలో కేంద్ర ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం శత్రు దేశానికి వెళ్లిపోయిన వారి ఆస్తి మీద ప్రభుత్వానిదే అజమాయిషీ. నిరుడు సెప్టెంబర్‌లో ఇందుకు సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని కోటానా బంగార్‌ అనే గ్రామంలో 13 బిఘాల భూమిని శత్రువు ఆస్తి కింద వేలానికి పెట్టింది. ఈ గ్రామం బాగ్‌పట్‌ జిల్లాలో ఉన్నది. ఆ ఆస్తి పాకిస్తాన్‌ సర్వసైన్యాధ్యక్షునిగా, తరువాత దేశాధ్యక్షునిగా పనిచేసిన పర్వేజ్‌ ముషార్రఫ్‌దే. అదే సమయంలో దేశంలోని 55 శత్రు ఆస్తులను (ఒక్కొక్కటి రూ కోటి విలువ చేస్తుంది) కూడా వేలానికి పెట్టారు.

ఇలాంటి వేలానికి, లేదా ఈ ఆస్తులను దేశంలోని వారికే చెందే విధంగా చేయాలనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.

ఇందులో భద్రత కోణం ప్రధానంగా చూస్తున్నారు. ఇక్కడ ఆస్తులు ఉన్నాయన్న పేరుతో శత్రుదేశం ప్రవేశించి, కార్యకలాపాలు చేపట్టకుండా ఇదొక చర్య.

వీటిని అమ్మడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుంది. ఆర్ధిక వ్యవస్థ పురోగతికి అవి వినియోగంలోకి వస్తాయి.

శత్రుదేశంలో ఉన్నవాళ్లు ఈ దేశంలో ఆస్తులు కలిగి ఉండడం దౌత్య సంబంధాలకు ఇబ్బందికర పరిస్థితులను కల్పిస్తాయి. ప్రధానంగా ఇరుగు పొరుగు దేశాలతో ఈ సమస్య ఎక్కువ.

  • జాగృతి డెస్క్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE