కబురూ కాకరకాయ లేకుండా గాఢనిద్రలో ఉన్న కూతుర్ని తీసుకొని, రాత్రి పదిగంటలకు తానుండే పల్లెటూరికి వచ్చిన భార్య విస్మయను ఆశ్చర్యంగా చూసాడు అనంత్‌. అతనితో పాటూ ఉండే వంటమనిషి, రామస్వామి విస్తుపోయి చూస్తున్నాడు.

పాపను బెడ్‌ ‌రూమ్‌లో పడుకోబెట్టి, తానెందుకు వచ్చిందో చెప్పడం మొదలుపెట్టింది.

‘‘మరో మూడు రోజుల్లో న్యూయార్క్ ‌ప్రయాణం. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన అవకాశం ఇప్పుడొచ్చింది. అమెరికాలో టాప్‌ ‌టెన్‌లో ఉండే ఆ హాస్పిటల్లో గైనకాలజిస్ట్‌గా ఉద్యోగం తెచ్చుకోవడం నా జీవితధ్యేయం. ఆ విషయం నీకూ తెలుసు. కానీ పరిస్థితి తల్లకిందులు అయింది. మన ఆద్యకు వీసా రాలేదు. ఎందుకో ఏమిటో తెలియదు. ఆద్యను ఇక్కడ వదిలి వెళ్లక తప్పడం లేదు. ఒక్క ఏడాది పాటూ నీకు ఇబ్బంది’’ అంది, కాస్త మొహమాటపడుతూ.

‘‘నా కూతురిని నేను చూసుకోవడానికి నాకేం ఇబ్బంది? అన్నాడతను, వెంటనే తన అంగీకారాన్ని తెలుపుతూ.

 ‘‘ఈ పల్లెటూరిలో ఆద్యకు సరయిన స్కూల్‌ ఉం‌డదని నాకు తెలుసు. దానికి చదువు నువ్వే చెప్పక తప్పదు. నీకు తెలుసు, దాన్నెలా డిసిప్లిన్‌తో పెంచానో. దానిలో ఏ మార్పూ ఉండకూడదు. అందుకే ఈ ఏడాది పాటూ ఒక టైమ్‌టేబుల్‌ ‌తయారు చేసి ఉంచాను. అది ఫాలో ఆయ్యేటట్లు చూస్తే చాలు. నీకు తెలుసుగా? అదొక ‘చైల్డ్ ‌ప్రోడిగి’. ఆ వయసు పిల్లలు చేయలేని పనులెన్నో చేస్తుంది. జీకే గానీ, లెక్కలు గానీ, ఇంగ్లీష్‌ ‌స్పెల్లింగులుగానీ, సంస్కృత శ్లోకాలు గానీ … ఇలా అనేక రంగాలలో ఎన్నో రికార్డులు బద్దలుకొట్టింది. ఇప్పుడు ఆ పరంపర కొనసాగాలి. అందుకే దానికి అవసరమయిన పుస్తకాలన్నీ తెచ్చాను. ఎప్పుడెప్పుడు ఆ పోటీలు ఉన్నాయో తెలిపే షీట్స్ ‌తయారుచేసి ఉంచాను. ఆ పోటీలకు ఎలా తయారవ్వాలో దానికి తెలుసు. అది గాడి తప్పకుండా చూసుకుంటే చాలు. ప్రతి పోటీకీ తీసుకువెళ్లడం మర్చిపోకు. ఈ ఊర్లో ఇంటర్‌ ‌నెట్‌ ‌సదుపాయం ఎలా ఉందో నాకు తెలియదు. శ్రమ అనుకోకుండా ఆ సదుపాయం ఏర్పాటు చెయ్యి. నీకిలా అదనపు బాధ్యత అప్పజెప్పక, ఇబ్బంది పెట్టక తప్పడం లేదు. ఏమీ అనుకోవు కదూ?’’ అంటూ అతని చేతులు పట్టుకుంది.

‘‘ఆద్యను ఎలా పెంచావో నాకు తెలుసు. నువ్వు కోరినవన్నీ చేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నువ్వు నిశ్చింతగా వెళ్లిరా’’ అంటూ అభయం ఇచ్చాడు. దాంతో సంతృప్తి చెందిన విస్మయ తిరుగు ప్రయాణానికి సిద్ధపడింది.

‘‘ఉదయం అయితే నా చిట్టితల్లి నన్ను కదలనీయదు. ఈ రోజంతా దానికి అన్ని విషయాలూ బోధపరుస్తూ, మానసికంగా సిద్ధం చేసినా, బయల్దేరేటప్పుడు చూసిందంటే గొడవపెడుతుంది. అది నేను తట్టుకోలేను. ఇప్పుడే బయల్దేరాలి’’ అంటూ భర్తని కౌగలించుకొని,

‘‘పాప జాగ్రత్త’’ అంది తన్నుకొస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ. అచేతనంగా నిలబడిపోయి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు అనంత్‌. ‌వాళ్లిద్దరినీ అలా చూస్తున్న రామస్వామి గుండె చెరువయిపోయింది.

‘బాగా చదువుకున్న వాళ్లు కూడా ఎందుకిలాంటి పిచ్చిపనులు చేస్తారు? చినబాబు గారు ఈమెకు ఏమి తక్కువ చేశారని దూరం చేసుకుంది? బంగారం లాంటి భర్తను, పన్నెండేళ్లు కూడా నిండని బిడ్డను వదిలి, విదేశాలకు వెళ్లి ఏమి సాధిస్తుంది?’ అనుకుంటూ విలవిలలాడాడు. అతను అనంత్‌ ‌తండ్రి, దాశరథి•కి నమ్మినబంటు. పేరుకే వంటవాడు గానీ, ఆ ఇంట్లో ఒక మనిషి కిందే లెక్క.

                                                                                                   *    *     *

అనంత్‌, ‌విస్మయలు మెడిసిన్‌ ‌చదువుతున్నపుడే ప్రేమలో పడ్డారు. పీజీ కోర్స్ ‌పూర్తయ్యాక, ఇద్దరూ విశాఖపట్నంలోనే ఉద్యోగాలు సంపాదించుకొని, పెళ్లి చేసుకొని స్థిరపడ్డారు.

ఆద్యకి ఎనిమిదేళ్ల వయసప్పుడు, అనంత్‌ ‌తండ్రి ఆరోగ్యం పాడయింది. కేన్సర్‌ ‌చివరి దశలో ఉందని, ఆరునెలలకు మించి బతకడని, స్పెషలిస్టులు చెప్పారు. అప్పటికే అనంత్‌ ‌తల్లి చనిపోవడంతో ఒంటరివాడయిన దాశరథి•ని దగ్గరుండి చూసుకోవలసిన బాధ్యత అతని మీద పడింది. అవసానదశలో తండ్రి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో, సెలవు పెట్టి తమ ఊరికి వెళ్లి ఉందామని భార్యకు చెప్పి, ఒప్పించడానికి ప్రయత్నించాడు అనంత్‌. ‌కానీ విస్మయ సుతరామూ ఒప్పుకోలేదు. దానికి కారణం ఆద్యే. చాలా తెలివైన పిల్ల. ఏకసంథాగ్రాహి. అందుకే కూతురిని ఒక చైల్డ్ ‌ప్రోడిగిగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది విస్మయ. అటువంటి పిల్లను పల్లెటూరిలో పెంచడం ఆమెకు ఇష్టం లేకపోయింది. అందుకే రాలేనని చెప్పేసింది. ఎడబాటు ఆరునెలలే కాబట్టి, భరించడానికి సిద్ధపడి, విశాఖపట్నంలోనే ఉండిపోయింది.

 చేసేదేమీలేక అతనొక్కడే తండ్రి దగ్గరకు వెళ్లి ఉండసాగాడు. అతని తండ్రి ఒక ఆర్‌ ఎం‌పీ డాక్టర్‌. అతని దగ్గరకు వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడం మొదలుపెట్టాడు అనంత్‌, ఒక పక్క తండ్రిని చూసుకుంటూనే.

కొడుకు దగ్గరుండడం వల్లనో, అతను చూపే ప్రేమ వల్లనో, దాశరథి జీవితం రెండేళ్లకు పొడిగింది. ఆ రెండేళ్లలో అనంత్‌ ‌డాక్టర్‌గా ఆ ఊరి ప్రజలకే గాక, చుట్టుపక్కలున్న పది గ్రామాల ప్రజలకు వైద్యసేవలు అందించి, అందరికీ దైవసమానుడు అయ్యాడు.

                                                                                                   *    *     *

‘‘పదో రోజు కార్యక్రమం కూడా అయిపోయింది. మనం ఎప్పుడు బయల్దేరుతున్నాం?’’ అని అడిగింది విస్మయ భర్తని. అనంత్‌ ‌వెంటనే సమాధానం చెప్పకపోయేసరికి ఆమె గుండెల్లో గుబులు రేగింది.

‘‘సమాధానం చెప్పవేమిటి?’’ రెట్టించి అడిగింది, గాబరాగా.

‘‘మనం ఇక్కడే ఉందాం. ఇక్కడ డాక్టర్ల అవసరం చాలా ఉంది, ఈ ఊరి ప్రజలకే కాదు. చుట్టుపక్కల పది గ్రామాలకు కూడా…’’ అని చెపుతుండగా అడ్డుపడింది.

‘‘నాకు ముందునుంచి ఈ భయం ఉంది, నీకిలాంటి ఆలోచన వస్తుందే మోనని. కానీ మా విషయంలో అది ఎలా వీలవుతుంది? నువ్వు చిన్నప్పటినుంచీ ఇక్కడే పుట్టి, పెరిగావు. నువ్వు ఉండగలవు. కానీ నేనూ, ఆద్యా ఈ పల్లెటూరిలో ఎలా ఉండగలమని అనుకుంటున్నావు?’’ అంది కోపంగా.

‘‘ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మన సేవలు అందించడం డాక్టర్లుగా మన కర్తవ్యం. విశాఖపట్నం లాంటి పట్టణాలలో మనలాంటి డాక్టర్లు లెక్కలేనంత మంది ఉంటారు. అక్కడ మనం ఉన్నా లేకపోయినా ఒకటే. కానీ ఇక్కడ మన అవసరం చాలా ఉంది. ఇది మా నాన్నగారి అంతిమ కోరిక. ప్లీజ్‌ ‌కాదనకు. మన ఆద్య గురించి ఎక్కువగా అలోచించి బుర్ర పాడుచేసుకోకు. అది తెలివైనది. దాన్ని తీర్చిదిద్దడానికి నువ్వూ, నేనూ చాలమా? దయచేసి నా మాట విను’’ అని భార్యను బతిమాలుతున్న అనంత్‌ని చూస్తుంటే, రామస్వామికి చాలా బాధ కలిగింది.

‘చినబాబుది ఎంత గొప్ప మనసు? ఈమె ఎందుకు అర్థం చేసుకోలేక పోతుంది?’ అనుకుంటూ గింజుకున్నాడు.

అనంత్‌ ‌కోరిక నెరవేరలేదు. విస్మయ కూతుర్ని తీసుకొని వెళ్లిపోయింది. కూతురిని తన దగ్గరే ఉంచాలని అనంత్‌ ‌పట్టుబట్టలేదు. ఆద్యపై ఆకాశమంత ప్రేమ ఉన్నా గుండె దిటవు చేసుకున్నాడు.

‘‘డాడీ మనతో రారా? అయితే మనమూ ఇక్కడే ఉండిపోదాం’’ అంటూ ఏడుస్తున్న ఆద్యను చూస్తూ, బొమ్మలా నిలబడిపోయాడే గానీ, ఏ ప్రయత్నమూ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు.

అప్పటి నుంచి నెలకో రెండు నెలలకో ఒకసారి, విశాఖపట్నం వెళ్లి ఒక రోజో, రెండు రోజులో భార్యాపిల్లలతో గడపడం తప్ప, అతనికి ఏ ఆనందమూ మిగలలేదు.

                                                                                                   *    *     *

విస్మయ అమెరికా వెళ్లి, ఏడాది కావస్తుంది. అనంత్‌, ఆమె కోరినట్లు చాలా పనులు చేసినా, కొంత అసంతృప్తి, అశాంతి మిగిల్చాడామెకు. సరయిన ఇంటర్నెట్‌ ‌కనెక్షన్‌ ‌దొరక్కపోవడం వల్ల, కూతురితో వీడి•యో కాల్లో మాట్లాడలేకపోయింది. మామూలు కాల్‌ ‌మాట్లాడినపుడు, ఆద్య అప్పటిలాగే ధారాళంగా ఇంగ్లీషులో అదే ఎక్సెంట్‌తో మాట్లాడడం, చదువులో కూడా బాగా రాణించడం గమనించిన విస్మయ సంతృప్తి పడేది. కానీ ఆద్య పోటీలకు వెళ్లడానికి నిరాకరించింది అని తెలియగానే, ఆమె తీవ్ర మనస్తాపానికి గురి అయింది. ఆద్యతో మాట్లాడి ఒప్పించడానికి ఆమె చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. ‘నేను ఆ పోటీలకు వెళ్లాలంటే నాతోపాటూ నువ్వూ ఉండాలి’ అంటూ మొండి కేసింది. చైల్డ్ ‌ప్రోడిగిగా ఎంతో పేరు తెచ్చుకున్న కూతురు ఇలా మొండికేయడం ఆమెను ఎంతో బాధించింది. ఏడాది దాటకముందే కూతురి దగ్గరకు వెళ్లిపోవాలన్న కోరిక బలపడసాగింది. టికెట్‌ ‌బుక్‌ ‌చేసుకొని, ఆ తేదీ వచ్చే వరకూ ఆత్రంగా ఎదురుచూడసాగింది.

ఈలోగా ఒకరోజు ఆద్య నుంచి ఒక చిన్న మెయిల్‌ ‌వచ్చింది, చక్కటి ఇంగ్లీషులో. ఆ మెయిల్‌లో కేవలం రెండే రెండు లైన్లు ఉన్నాయి. ‘తర్వాత పంపే మెయిల్‌లో చాలా విషయాలున్నాయి. కాస్సేపటిలో ఆ మెయిల్‌ ‌నీకు అందుతుంది’ అన్నది ఆ మెయిల్‌ ‌సారాంశం. విస్మయ..విస్మయంలో పడింది. కూతురు దగ్గరినుంచి అలాంటి మెయిల్‌ ‌రావడం ఇదే మొదటిసారి. ‘ఇలా ఊరించి సస్పెన్స్‌లో పడేసిందేమిటి? ఏముంటుంది ఆ మెయిల్లో’ అనుకుంటూ సస్పెన్స్ ‌భరించకుండా ఉంది. అరగంట తర్వాత ఆద్య నుంచి వచ్చిన మెయిల్‌ ‌చూసిన విస్మయకు మతిపోయింది. చక్కని దస్తూరీతో, తెలుగులో కాగితం మీద రాసిన ఉత్తరాన్ని స్కాన్‌ ‌చేసి పంపింది, ఆద్య. ఆ చేతిరాత ఆద్యదే అయినప్పటికీ, విస్మయకు అంతా అయోమయంగా ఉంది. ఆద్యకు తెలుగు మాట్లాడడమే తప్ప, చదవడం, రాయడం రాదు. ఇంత చక్కటి తెలుగులో పెద్ద ఉత్తరం రాయడం ఆమెకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎప్పుడూ మమ్మీ అని పిలిచే అలవాటు ఉన్న ఆద్య, ఉత్తరంలో ‘అమ్మా’ అని సంబోధించడం ఆమెకు చాలా ఆశ్చర్యం అనిపించింది.

అమ్మా…

నువ్వు ఒక్కర్తివే నా బాధ్యత భుజాన వేసుకుని నన్ను అన్ని విధాలుగా తీర్చిదిద్దిడం చాలా గొప్ప విషయమే అయినప్పటికీ నాలో ఏదో అసంతృప్తి ఉండేది. దానికి కారణమేమిటో నాకు తెలిసేది కాదు. నేను ఎలా పెరగాలి? ఏమి చదవాలి? ఇలాంటివన్నీ నా ప్రమేయం లేకుండా నువ్వే నిర్ణయాలు తీసుకునే దానివి. అదే ప్రపంచం అనుకునే నేను, గుడ్డిగా నువ్వు చెప్పినట్లు చేసేదాన్ని. కానీ అక్కడ ఏమి కోల్పోయానో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది.

నా అనుభవాలు ముందుగా చెపుతాను. అవి చదివితే, నా మనసు నీకే తెలుస్తుంది.

 రామస్వామి తాత రోజూ, రాత్రి పడుకోబోయే ముందు నాకు మహాభారతం, రామాయణం, భాగవతంలోని ఏదో ఒక కథ చెపుతూ ఉండేవాడు. అవన్నీ నాకు బాగా నచ్చేవి. ఆ ఇతిహాసాల గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని తహతహలాడే దాన్ని. తాత చెప్పినవాటితో సరిపెట్టుకోలేకపోయేదాన్ని. ఆ గ్రంథాలు నేనే చదవాలని అనుకునేదాన్ని. కానీ ఎలా? నాకు తెలుగు అస్సలు రాదు కదా? అందుకే తెలుగు నేర్చుకోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. మరి దానికి సమయం ఎలా కేటాయించాలి? నువ్వు చెప్పిన పోటీలు వదిలేస్తే, బోలెడంత సమయం కలిసివస్తుంది. కానీ నీకు కోపం వస్తుందన్న విషయం తెలుసు. అయినా ఆ నిర్ణయాన్నే తీసుకున్నాను. ఎందుకంటే, బాలమేధావిగా గుర్తింపు తెచ్చుకోవడం నాకు ముందునుంచీ ఇష్టం లేదు. అవన్నీ కంఠంతా పెట్టి, గుర్తుంచుకొని వల్లెవేయడం నాకెందుకో ఇష్టం ఉండేది కాదు. దాని వల్ల నా ప్రియమైన బాల్యాన్ని కోల్పోతున్నానని నాకు అనిపించేది. కానీ నీకు ఎదురు చెప్పే ధైర్యం ఉండేది కాదు. ఈ మధ్య గణితమేధావి శకుంతలా దేవి ఆత్మకథ చదివినపుడు ఆమె కూడా తన బంగారు బాల్యాన్ని కోల్పోయినందుకు ఎంత బాధపడ్డారో చెప్పారు.

మరొక్క మాట…ఏమీ అనుకోవు కదూ? ఈ బాల మేధావులెవరూ ప్రపంచం గర్వించదగిన స్థితికి చేరుకోలేదు.వాళ్ల మేధస్సుకు అప్పుడే ఫుల్‌స్టాప్‌ ‌పడిపోయింది. ఎందుకూ పనికిరారు అనుకున్న ఐన్‌స్టీన్‌, ‌రామానుజం వంటి వారు గొప్ప మేధావులుగా గుర్తింపుపొందారు. అంతేకాదు ప్రపంచంలోని మేధావులెవరూ బాల మేధావులు కాదు. మరి నన్నెందుకు అలా తయారుచేయాలని ఆశ పడ్డావో నాకు ఇప్పటికీ అర్థం కాదు. పెద్దయ్యాక బాగా గుర్తింపు తెచ్చుకోవడానికి నా కృషి నేను చేస్తానని మాట ఇస్తున్నాను. తాత్కాలికమైన కీర్తి కాక, శాశ్వత కీర్తి తెచ్చుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. నా దారిలో నేను వెళ్తాను. ఒక వైపు చక్కగా చదువుకుంటూనే, నాకెంతో ఇష్టమయిన తెలుగులో పాండిత్యం సంపాదిస్తాను. మన ఇతిహాసాలు, గ్రంథాలు చదివి, మన చరిత్ర, సంస్కృతి, అలనాటి ఆచార వ్యవహారాలు, పద్ధతుల గురించి తెలుసుకుంటాను. నవయుగ వైతాళికులు విశ్వనాథ, కందుకూరి, చిలకమర్తి, గురజాడ, టంగుటూరి మొదలయిన మహామహుల గురించి తెలుసు కుంటాను.

బర్గర్లు, పిజ్జాలు, ఫాస్ట్ ‌ఫుడ్‌లు తిని బొద్దుగా అయిన నేను, ఇక్కడ చక్కగా మన ఆంధ్రా వంటలు, తింటూ, భరతనాట్యం నేర్చుకుంటూ సన్నబడి, నాజూకుగా తయారయ్యాను. వాట్సప్‌లో నా లేటెస్ట్ ‌ఫొటోలు పెడతాను. అన్నట్టు చెప్పడం మరిచాను. నాకిప్పుడు బోయ్‌కట్‌ ‌బదులు అందమైన జడ అల్లుకునేంత జుట్టు పెరిగింది. ఇప్పుడు చక్కగా బొట్టు పెట్టుకొని, లంగా, జాకెట్‌ ‌వేసుకుంటూ చక్కని తెలుగింటి ఆడపడుచులా ఉన్నాను. చెవులకు జూకాలు, పండగ రోజుల్లో నేను ధరించే నగలు, జడ గంటలు చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. నాన్నకు ఇష్టమైన వెండి పట్టీలు పెట్టుకొని అటూఇటూ తిరుగుతుంటే వాటి మువ్వల శబ్దం వింటూ నాన్న ఎంత మైమరిచిపోతారో చెప్తే నీకు విస్మయం కలుగుతుంది. మరోమాట, మనింట్లోలాగ ఇక్కడ మేము ఇంగ్లీషులో మాట్లాడుకోము. నాన్నతో కూడా తెలుగులోనే మాట్లాడతాను. ఇకపైన మీ ఇద్దరినీ అమ్మా, నాన్నా అనే పిలుస్తాను. ఆ పిలుపులోని మాధుర్యం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అలా అని ఇంగ్లీషుని వదిలేస్తానని అనుకోవద్దు. నా భవిష్యత్తుకి అదెంత ముఖ్యమో తెలుసు కాబట్టి, దానిలో కూడా ప్రావీణ్యత సాధిస్తాను.

చివరగా ఒక్కమాట. ఈ ఊర్లో తాతయ్యకు, నాన్నకు ఎంతో మంచి పేరు ఉంది. ఈ ఊరే కాదు, చుట్టుపక్కల ఉన్న ఏ గ్రామానికి వెళ్లినా, నాన్న నా పక్కన ఉన్నా లేకపోయినా అక్కడి ప్రజలు చూపే ఆదరణ, ప్రేమ మాటల్లో వర్ణించేది కాదు. అలాంటప్పుడు, విశాఖపట్నంలో నేను గడిపిన జీవితం ఎంత నిస్సారమయినదో నాకు అర్ధమవుతూ ఉండేది.

వీలున్నంతకాలం ఇక్కడే ఉండిపోవాలని నాకు అనిపిస్తుంది. కానీ ఏం లాభం? నువ్వు రాగానే నీ వెనుక బయల్దేరాల్సిందే కదా? కొంతకాలం అయిన తర్వాత, ఎలాగూ పైచదువులకు పట్టణాలకు వెళ్లాలి. ఓ రెండేళ్లయినా ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుంది? అనిపిస్తూ ఉంటుంది. కానీ అది సాధ్యమయ్యే పనేనా?

ఇట్లు

నీ ముద్దుల కూతురు ఆద్య

చదవడం పూర్తి కాగానే, వాట్సప్‌లో ఆద్య పంపిన ఫోటోలు చూసింది. తను చెప్పినట్లే, ఎంతో నాజూకుగా తెలుగింటి ఆడపడుచులా ఉన్న కూతురు ఫొటోలు చూసి మురిసిపోయింది. కూతురిలో వచ్చిన ఈ మార్పుని మనసు ఒక పక్క హర్షించక పోయినా, మరోపక్క అటువైపే మొగ్గు చూపుతున్నట్లు ఆమెకు అర్థమవుతోంది.

‘ఆద్య, అనంత్‌ ‌కలిసిపోయారన్న మాట. నేనే పరాయిదాన్ని అయిపోయి, ఈ ఒడ్డున ఉండిపోయానా?’ అనుకుంటూ గింజుకున్నా, ఆమెలో జ్ఞానోదయం మొలకెత్తడం మొదలయింది.

‘ఆద్య మాటల్లో నిజముంది కదా? తను చెప్పినవన్నీ వాస్తవాలే కదా? నేనెందుకు మొండిగా ఉండాలి?

ఆ తండ్రీకూతుళ్లను ఎందుకు విడదీయాలి. నేను కూడా వాళ్లతో కలసి, అక్కడే ఉంటే నష్టం ఏమిటి? అనంత్‌ ‌కోరినట్లు నా వైద్యసేవలు అక్కడే అందిస్తే, నా జన్మ సార్థ•కం అయినట్లే కదా?’ అనుకుంటూ ఆ దిశగా ఆలోచిస్తూ ఉండిపోయింది.

 – కొయిలాడ రామ్మోహన్‌రావు

భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE