అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌కుర్చీ ఎక్కిన కొద్ది రోజులకే దేశ ఖజానా మీద ఖర్చు తగ్గించడం కోసం అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ- యూఎస్‌ఎయిడ్‌-‌తో పాటుగా ఇక అమెరికాలో ఏ ప్రభుత్వ సంస్థ కూడా విదేశాలకు ఎలాంటి ఆర్థికసాయాన్ని చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఈ రకమైన కార్యకలాపాలను సమీక్షించడానికి 90 రోజుల వరకు వాటికి ఉద్దేశించిన నిధులను ఎటూ పోకుండా నిలిపివేస్తూ, కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. దీంతో యూఎస్‌ఎయిడ్‌ అభివృద్ధి పేరు చెప్పుకొని తాను నియమించుకున్న 10 వేల మంది ఉద్యోగులకు తోడు భారత్‌ ‌వ్యతిరేక శక్తులతో మనదేశంలో దశాబ్దాలుగా సాగిస్తున్న అరాచకాలకు సొమ్ముల్లేకుండా పోయాయి. యూఎస్‌ఎయిడ్‌ ఆక్టోపస్‌లా దేశాన్ని కమ్ముకుని అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా కుయుక్తులు పన్నింది. అందులో భాగంగా వాట్సప్‌లో ఒకరి ఖాతా నుంచి గంపగుత్తగా పంపించే సందేశాల సంఖ్యకు పరిమితి విధించి తద్వారా సోషల్‌ ‌మీడియాలో అప్రతిహతంగా సాగిపోతున్న బీజేపీ ప్రచార ప్రస్థానానికి మోకాలడ్డు పెట్టేందుకు ప్రయత్నించింది. అయినా కానీ యూఎస్‌ఎయిడ్‌ ‌పథకం పారలేదు. మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి రెండోసారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. సిగ్గుశరం లేని యూఎస్‌ఎయిడ్‌ ‌దేశమంటే ఏ మాత్రం భక్తి లేని కొందరు భారత పాత్రికేయులతో చేతులు కలిపింది. అలాంటి పాత్రికేయులు అండగా తాను రూపొందించిన భారత్‌ ‌వ్యతిరేక ప్రణాళిక అమలుకు ఒడిగట్టింది. ప్రధాని మోదీ హయంలో కశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి దాకా దేశ ప్రజలకు అందుతున్న అభివృద్ధి ఫలాలు యూఎస్‌ఎయిడ్‌కు, దాని అడుగులకు మడుగులు వొత్తుతూ లౌకికవాదుమంటూ చెప్పుకునే గుప్పెడంత మంది భారతీయులకు కంటగింపుగా మారాయి. యూఎస్‌ఎయిడ్‌ ‌భారత్‌లో ఫ్యాక్ట్‌శాల అనే దుకాణం తెరిచింది. అమెరికాలో కాలిఫోర్నియా కేంద్రంగా స్వచ్ఛంద సేవా సంస్థ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న ఇంటర్‌న్యూస్‌తో చేతులు కలిపింది. అటు అమెరికాలో ఇంటర్‌న్యూస్‌, ఇటు భారత్‌లో ఫ్యాక్ట్‌శాల ఈ రెండింటి సాయంతో మన దేశంలో మీడియాపై పెత్తనం చెలాయించడానికి మిలియన్ల కొద్దీ అమెరికన్‌ ‌డాలర్లు కుమ్మరించింది. అక్క,డితో ఆగితే అది యూఎస్‌ఎయిడ్‌ ఎం‌దుకవుతుంది? భారత్‌లో అస్థిరత సృష్టించడానికి ముస్లిం మతోన్మాద ఉగ్రమూకలతో యూఎస్‌ఎయిడ్‌ ‌చేతులు కలిపింది. ప్రజలపై దాడులు చేయడానికి, అన్నెంపున్నెం ఎరుగని యువకుల్లో మతోన్మాద బీజం నాటి, వారిని మూర్ఖత్వం తలకెక్కిన జిహాదీలుగా మార్చి అఘాయిత్యాలు చేయడం కోసమని వారికి నిధులను సమకూరుస్తోంది యూఎస్‌ఎయిడ్‌. ఇలా చెప్పుకుంటే పోతే అది చేసే అరాచకాలు కోకొల్లలు.

డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌సర్కారు యూఎస్‌ఎయిడ్‌కు కళ్లెం వేస్తూ జారీ చేసిన ఉత్తర్వు భారత్‌ ‌లాంటి దేశాల నెత్తిన పాలు పోసినట్టయింది. మొదట్నుంచి కూడా ట్రంప్‌కు పన్నుల రూపంలో అమెరికాలో ఉంటున్న వారి నుంచి సేకరించిన సొమ్మును విదేశాలకు మానవీయ సాయం పేరిట ఖర్చు చేయడం ఏ మాత్రం ఇష్టం లేదు. అలా చేయడం వల్ల అమెరికా ఫస్ట్ అం‌టూ తాను అధికారంలోకి రావడానికి చేపట్టిన అభివృద్ధి నినాదం ఎందుకూ కొరగాకుండా పోతుందనేది ఆయన అభిప్రాయం. ట్రంప్‌ ‌దృష్టి అందుకే, మరీ ముఖ్యంగా యూఎస్‌ ఎయిడ్‌ ‌మీద పడింది. ప్రభుత్వ గణాంకాలకు లోబడి అమెరికా 2023లో అంతర్జాతీయ సాయం కోసమని 68 బిలియన్‌ ‌డాలర్లు ఖర్చు చేసింది. అయితే ఈ మొత్తం వేర్వేరు డిపార్ట్‌మెంట్లు, ఏజెన్సీల ద్వారా ఖర్చవుతాయి. కానీ అందులో సింహభాగం యూఎస్‌ఎయిడ్‌దే. దానర్థం ఈ ఏజెన్సీ బడ్డెట్‌ 40 ‌బిలియన్‌ ‌డాలర్ల పైమాటే. మరో మాటలో చెప్పాలంటే అమెరికా ప్రభుత్వం సంవత్సరానికి పెట్టే మొత్తం ఖర్చు 6.75 ట్రిలియన్‌ ‌డాలర్లు ఐతే అందులో యూఎస్‌ఎయిడ్‌ ‌వాటా 0.6 శాతం.

ఇదంతా చూసిన ట్రంప్‌కు చిర్రెత్తుకొచ్చింది. శ్వేతసౌధం రంగంలోకి దిగింది. యూఎస్‌ఎయిడ్‌ ‌నిధులను వృధా చేయడమే కాకుండా, దుర్వినియోగం చేస్తోందని ప్రకటించింది. ఈ మేరకు ఓ జాబితాను ప్రచురించింది. ఆ జాబితాలో యూఎస్‌ఎయిడ్‌ ‌సెర్బియాలో ఎల్‌జీబీటీక్యూ మూకకు గ్రాంటు రూపేణా ఇచ్చిన 1.5 మిలియన్‌ ‌డాలర్లు, వియ త్నాంలో ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు రూ.2.5 మిలియన్‌ ‌డాలర్లు, ఈజిప్టులో పర్యాటకానికి 6 మిలియన్‌ ‌డాలర్లు లాంటి ఖర్చులు చాలా కనిపించాయి. టెక్నాలజీతో బిలియన్లకు పడగెత్తిన అమెరికా ప్రభుత్వ ప్రత్యేక ఉద్యోగి ఎలాన్‌ ‌మస్క్ అయితే యూఎస్‌ ఎయిడ్‌ను ఇరుకునపడేయడంలో ఓ అడుగు ముందుకు వేశారు. యూఎస్‌ఎయిడ్‌ ‌హాలీవుడ్‌ ‌తారల ఉక్రెయిన్‌ ‌పర్యటనకు ఖర్చు పెట్టిందంటూ ఓ విడియోను సోషల్‌ ‌మీడియాలోకి వదిలారు. అంతకుమునుపు అది ఓ నేరపూరితమైన సంస్థ అని మస్క్ అం‌టే అందుకు బదులుగా యూఎస్‌ఎయిడ్‌ ‌తలుపులకు తాళాలు వేసేందుకు ట్రంప్‌ ‌సరేనన్నారు. ట్రంప్‌కు ఈ మధ్యనైతే ఆ ఏజెన్సీపైన కోపం తారస్థా యికి చేరుకుంది. ఆ ఆగ్రహాన్ని వెళ్లగక్కడానికి తనదే ‘ట్రూత్‌ ‌సోషల్‌’ ‌పేజీలో ఓ పోస్ట్ ‌పెట్టారు. యూఎస్‌ ఎయిడ్‌ ‌పెడుతున్న ఖర్చు మాటల్లో చెప్పలేనంతగా ఉందని మండి పడ్డారు. దాన్ని మూసివేయండి అంటూ హుకుం జారీ చేయడం దాని ఫలితమే.

అయితే ఇదంతా అమెరికా వ్యవహారం కదా, ఇందులో భారత్‌కు వచ్చేదేముంది పోయేదేముంది అని అనుకుంటే పొరపాటే. అన్ని అనుకున్నట్టుగా జరిగితే నేడో రేపో దుకాణం మూత వేసుకునే దుస్థితిలో ఉన్న యూఎస్‌ఎయిడ్‌ ‌భారత్‌లో ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన అఘాయిత్యాలను తెలుసుకుంటే గుండెను బండగా చేసుకున్న ఎంతటి వారికైనా మనస్సు చివుక్కుమనకమానదు. అదే సమయంలో యూఎస్‌ఎయిడ్‌ ‌పట్ల పెల్లుబికే కోపానికి కట్టలు కట్టడం అంత తేలిగ్గాదు. ముందుగా ఇప్పటికీ తలచుకుంటే ప్రతి ఒక్క భారతీయుడికి ఎంతో వేదన కలిగించే ముంబై ఉగ్రదాడులతో మొదలెడదాం.

ముంబై ఉగ్రదాడికి ఆర్థిక సాయం

నవంబర్‌ 26, 2008, ‌రాత్రి ముంబై నగరంపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్‌ ‌ప్రపంచాన్ని వణికించింది. పాకిస్తాన్‌ ‌కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా(ఎల్‌యీటీ) ఉగ్రమూకలో సాయుధులైన 10 మంది ఉగ్రవాదులు నగరంలోకి చొరబడ్డారు. 170 మందికిపైగా అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. మదమెక్కినట్టుగా వరుసగా దాడులు జరిపి 300 మందికి పైగా ప్రజలను తీవ్రంగా గాయపరిచారు. అమానవీయమైన ఆ దాడులు భారత్‌ ‌సమష్టి స్మృతిపై ఓ చెరిగిపోని మరకను మిగులుస్తున్నట్టుగా తాజ్‌ ‌మహల్‌, ఒబెరాయ్‌ ‌ట్రైడెంట్‌ ‌లాంటి పేరున్న హోటళ్లు, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌, ఓ ఆస్పత్రి, యూదులకు చెందిన ఓ కేంద్రం లక్ష్యంగా జరిగాయి.

అయితే ఈ ఘాతుకానికి పాల్పడిన ఎల్‌యీటీ, తదితర ఉగ్రమూకలకు ఆర్థిక సాయం అందించడం వెనుక పలు దాతృత్వ సంస్థలు ఉన్నాయన్న విషయం వెలుగులోకి రావడం అత్యంత దిగ్భ్రాంతికరం. వాటి వివరాల్లోకి వెళితే ఫలా హ్‌-ఎ-ఇన్సానియత్‌ (ఎఫ్‌యీఐ) ఫౌండేషన్‌ ‌ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ ‌సయీద్‌ ‌స్థాపించినదే. అమెరికా ప్రభుత్వం దీనిని చాలా కాలం క్రితమే ఓ ఉగ్రవాద సంస్థ అని ప్రకటించింది. సయీద్‌ ఓ ‌వైపు ఉగ్రవాద కార్యకలా పాలకు ఊతమిస్తూనే మరోవైపు అమెరికాలో మిచిగాన్‌ ‌కేంద్రంగా పనిచేస్తున్న హెల్పింగ్‌ ‌హ్యాండ్‌ ‌ఫర్‌ ‌రిలీఫ్‌ అం‌డ్‌ ‌డెవలప్‌మెంట్‌ (‌హెచ్‌హెచ్‌ఆర్‌డీ) అనే దాతృత్వ సంస్థ లాంటి సంస్థలతో మానవ కల్యాణానికి పాటుపడుతున్నాననే ముసుగు కప్పుకున్నాడు. అయితే పాకిస్తాన్‌లో హెచ్‌హెచ్‌ఆర్‌డీ జరిపిన అనేక మానవీయ కార్యక్రమాల వెనుక సయీద్‌కు చెందిన ఫలాహ్‌-ఎ-ఇన్‌సానియత్‌ ఉం‌దనే వార్తలు బాగానే వచ్చాయి. అణగారిన వర్గాలకు సాయం అందిస్తున్నట్టు చెప్పుకునే హెచ్‌హెచ్‌ఆర్‌డీకి అనేక మార్గాల్లో నిధులు అందుతుండేవి. అలాంటి హెచ్‌హెచ్‌ ఆర్‌డీకి యూఎస్‌ఎయిడ్‌ ‌నుంచి 1,10,000 డాలర్ల ఆర్థిక సాయం అందింది. అది కూడా ముంబైలో ఉగ్రదాడులు మరికొద్ది సంవత్సరాల్లో జరుగుతాయనగా అందింది. ఇదే కాకుండా జార్జ్ ‌సొరోస్‌ ‌భారత్‌, ‌బాంగ్లాదేశ్‌ ‌దేశాల్లో ప్రభుత్వాలను అస్థిర పరచడానికి యూఎస్‌ఎయిడ్‌ను వాడుకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. సొరెస్‌, అతడి మనుషులు భారత్‌ను అస్థిర పరచాలని ఎప్పటినుంచో కలల కంటున్నారు. యూఎస్‌ఎయిడ్‌ ఎల్‌యీటీకి ఆర్థిక విభాగమైన ఎఫ్‌యీఐకి దగ్గర కావడంతో ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎల్‌యీటీకి మొట్టమొదటి ఆర్థిక విభాగంగా జమాత్‌-ఉద్‌-‌దవా ఉండేది. అయితే అమెరికా దానిపై ఉగ్రవాద సంస్థ అనే ఓ ముద్ర వేయడంతో ఎఫ్‌యీఐ స్వచ్ఛంద సేవా సంస్థ పేరిట కొత్త ముసుగు కప్పుకు వచ్చింది. అయితే ఎఫ్‌యీఐ నేటికి కూడా దాతృత్వం, మాన వ సేవ పేరుతో నిధులు సేకరిస్తునే ఉంది. అలా సేకరించిన నిధుల్లో అధికభాగం లష్కరే తోయిబా జమ్మూ కశ్మీర్‌లో దాడులను కొనసాగించడానికి ఖర్చవు తున్నది. ఇందులో దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే అమెరికా ప్రభుత్వం ఎఫ్‌ఈఐ, ‌దాని మాతృసంస్థ లష్కరే తోయిబాపై నిషేధం విధించి నప్పటికీ యూఎస్‌ఎయిడ్‌ ఎఫ్‌ఈఐకి నిధులు అందిస్తూనే ఉంది. ముందుగా చెప్పుకున్నట్టు మిచిగాన్‌ ‌కేంద్రంగా పనిచేస్తున్న హెచ్‌హెచ్‌ఆర్‌డీ అనే ముస్లిం దాతృత్వ సంస్థకు దక్షిణాసియాలో జిహాదీ మూకలతో చాలా దగ్గర సంబంధాలున్నాయి. 2019లో ఉగ్రమూకలకు సాయం అందిస్తున్నదనే అభియోగాలు హెచ్‌హెచ్‌ఆర్‌డీపై వచ్చాయి. అయినా కానీ యూఎస్‌ఎయిడ్‌ ‌నుంచి హెచ్‌హెచ్‌ఆర్‌డీకి 1,10,000 డాలర్లు ముట్టాయి. విదేశీ వ్యవహారాల హౌస్‌ ‌కమిటీ ఛైర్మన్‌ ‌టి మెక్‌ ‌కౌల్‌ ఇదే విషయాన్ని 2023లో లేవనెత్తారు. యూఎస్‌ఎయిడ్‌ అడ్మినిస్ట్రేటర్‌ ‌సమంతా పవర్‌కు ఓ లేఖ రాశారు. ‘‘2021, అక్టోబర్‌లో సాగర రవాణా సరుకు సుంకం తిరిగి చెల్లించే కార్యక్రమం కింద యూఎస్‌ఎయిడ్‌ ‌హెచ్‌హెచ్‌ఆర్‌డీకి 1,10,000 డాలర్లు మంజూరు చేసింది. హెచ్‌హెచ్‌ఆర్‌డీకి చాలా కాలంగా ప్రకటిత ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులకు ఆర్ధిక సాయం చేసేవారితో, వేర్పాటువాదు మూకలతో సంబంధా లున్నాయంటూ అభియోగాలున్నప్పటికీ ఈ మొత్తాన్ని మంజూరు చేశారు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ముగ్గురు కాంగ్రెస్‌ ‌సభ్యులు ఇదే విషయమై దర్యాప్తు చేయాలని స్టేట్‌ ‌డిపార్ట్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశారు. మెక్‌ ‌కౌల్‌ అయితే ఈ అభియోగాలపై దర్యాప్తు అయ్యేంతవరకు హెచ్‌హెచ్‌ఆర్‌డీకి నిధులు విడుదల చేయవద్దని కోరారు. యూఎస్‌ఎయిడ్‌ ఇన్ని అభియోగాల మధ్య జో బైడెన్‌ ‌హయాంలో 2023లో హెచ్‌హెచ్‌ఆర్‌డీకి 73,000 డాలర్లు విడుదల చేసింది. ఇప్పటి డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌ప్రభుత్వం యూఎస్‌ ఎయిడ్‌కు ఊపిరాడకుండా చేయడంతో హెచ్‌హెచ్‌ ఆర్‌డీ లాంటి ఉగ్రమూకలకు ఆర్థిక సాయం అందించే సంస్థలకు ఇకపై అమెరికా నుంచి చిల్లి గవ్వ కూడా రాదు. దానర్థం జిహాదీ అనుకూల సంస్థ మునుపటిలాగా ఎఫ్‌ఈఐకు నిధులు సమకూర్చి పెట్టలేదు.

ఫ్యాక్ట్‌శాల కాదు ఫేక్‌శాల

అమెరికాలో ఇంటర్‌న్యూస్‌ ‌నెట్‌వర్క్ అనే అంతర్జాతీయ మీడియా ఎన్జీవో ఉంది. దీని పనల్లా వేర్వేరు దేశాల్లో మీడియాను తన గుప్పిట్లో పెట్టుకోవడం, తనకు నచ్చని సమాచారానికి తప్పుడు సమాచారం అని ముద్ర వేసి ఆ తర్వాత అలాంటి సమాచారాన్ని అడ్డుకోవడానికి తన కత్తెరకు పని చెప్పడం. ఇంటర్‌న్యూస్‌ 2023‌లో 9,000 మందికి పైగా పాత్రికేయులకు తన ధోరణికి తగ్గట్టుగా శిక్షణ ఇచ్చింది. అదే సమయంలో సోషల్‌ ‌మీడియాలో సెన్సార్‌ ‌షిప్‌కు కూడా మద్దతు ఇచ్చింది. ఒక డేటా ప్రకారం ఇంటర్‌న్యూస్‌ 17 ఏళ్లలో అందుకున్న ఆర్థిక సాయంలో 87 శాతాన్ని అంటే దాదాపు 415 మిలియన్‌ ‌డాలర్లను యూఎస్‌ఎయిడ్‌ ‌సమకూర్చింది. ఇలాంటి ఇంటర్‌న్యూస్‌కు భారత్‌లో ఫ్యాక్ట్‌శాల పేరిట పాత్రికేయులకు శిక్షణను ఇచ్చే కార్యక్రమంతో సంబంధం ఉంది. పాత్రికేయుడు సయీద్‌ ‌నజాకత్‌ ‌స్థాపించిన డేటాలీడ్స్ ‌ఫ్యాక్ట్‌శాలను నడుపుతోంది. ఫ్యాక్ట్‌శాల ద్వారా 75,000 మంది మీడియా వ్యక్తులకు శిక్షణ ఇచ్చినట్టు డేటాలీడ్స్ ‌చెప్పుకుంది. తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా గూగుల్‌ ‌న్యూస్‌ ఇనీషియేటివ్‌ ‌కార్యక్రమం ఫ్యాక్ట్‌న్యూస్‌కు వెన్ను దన్నుగా ఉంది. అయితే అమెరికా నుంచి భారత్‌కు విస్తరించిన ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ప్రధాన లంకె ఇంటర్‌న్యూస్‌తో ముడిపడి ఉంది. ఇంటర్‌న్యూస్‌కు అండగా యూఎస్‌ఎయిడ్‌ ఉం‌ది. ఇదంతా చూస్తుంటే యూఎస్‌ఎయిడ్‌ ‌పరోక్షంగా భారత్‌లో పాత్రికేయ విద్యకు తనదైన రూపకల్పన చేస్తోందని స్పష్టమౌతోంది. ఫ్యాక్ట్‌న్యూస్‌ ‌వెనకాల ది ప్రింట్‌కు చెందిన శేఖర్‌ ‌గుప్తా, బీట్‌రూట్‌ ‌న్యూస్‌కు చెందిన ఫయే డిసౌజా, ది క్వింట్‌కు చెందిన రీతూ కపూర్‌ ఉన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తిని నెమ్మదింపజేసే లక్ష్యంతో తాము పనిచేస్తున్నట్టు ఫ్యాక్ట్‌శాల వర్గాలు నమ్మబలకవచ్చు. అయితే అది ఓ భావజాలంతో అంటకాగుతున్న కారణంగా మీడియా వ్యక్తులకు అది నిర్వహించే శిక్షణా కార్యక్ర మాలు తటస్థంగా ఉంటాయని చెప్పలేము. మరీ ముఖ్యంగా నక్సల్‌ ‌సానుభూతిపరులుగా ముద్ర వేయించుకున్న హర్ష మందేర్‌, ‌కవితా కృష్ణన్‌, ‌సొరి సొరి చెప్పుచేతుల్లో ఈ శిక్షణ సాగుతున్నది.

యూఎస్‌ఎయిడ్‌కు తెర వెనుక పాత్రికేయులు

కేరళకు చెందిన ఆథిరా పరించేరి అనే పర్యావరణ పాత్రికేయురాలు ది హిందూ, ది వైర్‌, ‌మొంగబే-ఇండియా అనే పేరున్న మీడియా సంస్థలకు కథనాలు రాస్తుంటుంది. ఆమె ప్రధానంగా వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణం మీద దృష్టి పెట్టి రాస్తుంటుంది. అయితే యూఎస్‌ఎయిడ్‌తో సంబంధమున్న సంస్థల నుంచి ఆమెకు నిధులు వస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆమె పర్యావరణ రాతల వెనుక ఇంకేదైనా విస్తృతమైన రాజకీయ అజెండా ఉందా అనే సందేహానికి దారి తీస్తోంది. లక్నోకు చెందిన పాత్రికేయురాలు ఐశ్వర్యా త్రిపాఠి 2021లో నేషనల్‌ ‌ఫౌండేషన్‌ ‌ఫర్‌ ఇం‌డియా – ఎన్‌ఎఫ్‌ఐ ‌నుంచి ఫెలోగా ఎంపికైంది. ఇదే ఎన్‌ఎఫ్‌ఐ ‌యూఎస్‌ఎయిడ్‌ ‌నుంచి నిధులు అందు కుంటోంది. ఎన్‌ఎఫ్‌ఐ ‌వామపక్ష భావజాలంతో కూడుకున్న ది వైర్‌, అల్‌ ‌జజీరా లాంటి మీడియా సంస్థలకు రాస్తున్న పాత్రికేయులకు మద్దతు నివ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంటుంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన వాహిద్‌ ‌భట్‌ అనే పర్యావరణ పాత్రికేయుడు యుఎస్‌ఎయిడ్‌తో అంటకాగుతున్న ఎన్‌ఎఫ్‌ఐ, ‌థామ్సన్‌ ‌రాయిటర్స్ ‌ఫౌండేషన్‌ ‌లాంటి సంస్థల నుంచి అవార్డులు అందుకున్నాడు. అతడు పర్యావరణంపై జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలకు రాసే కథనాలన్నీ కూడా విదేశీ ప్రయోజనా లకు పనికొచ్చే రాజకీయ వ్యాఖ్యానాలతో రంగరించి ఉంటాయి. స్వతంత్ర పాత్రికేయుడైన సిబి అరసు భారత్‌లో హిందుత్వకు, ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతి రేకంగా బలమైన అభిప్రాయాలను వెలిబుచ్చాడు. అతడు నేషనల్‌ ‌జాగ్రఫిక్‌, ‌బీబీసీ, ది న్యూ ఇంటర్నేషన లిస్ట్, ‌ది వైర్‌, ‌మొంగాబే లాంటి అనేక అంతర్జాతీయ, జాతీయ మీడియా సంస్థలకు కథనాలు రాస్తుంటాడు.


ఆజాద్‌ ‌కశ్మీర్‌కు నిధులు

‌పాకిస్తాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ – ‌పీవోకే అనేది ఓ వివాదాస్పద ప్రాంతమనే సంగతి యావత్‌ ‌ప్రపంచానికీ తెలిసిందే. అమెరికా భారత్‌ అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ అదే పనిగా కశ్మీర్‌ ‌విషయంలో తలదూరుస్తునే ఉంటుంది. పీవోకే పట్ల దాని వైఖరి విడ్డూరంగా ఉంటుంది. ఆజాద్‌ ‌కశ్మీర్‌ అం‌టూ పాకిస్తాన్‌ ‌పాడుతున్న పాటకు అమెరికా వంత పాడుతోంది. దీనికి అద్దం పడుతున్నట్టుగా యుఎస్‌ఎయిడ్‌ ‘ఆజాద్‌ ‌జమ్మూ కశ్మీర్‌లో 150 మంది టీచర్లకు అమెరికా శిక్షణ’ పేరుతో ఓ పత్రికా ప్రకటన జారీ చేసింది. అందులో ఆజాద్‌ ‌జమ్మూ కశ్మీర్‌లో విద్యా మంత్రిగా అబ్దుల్‌ ‌వహీద్‌ను ప్రస్తావించింది. వేలాదిగా పాకిస్తానీయుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా చేపట్టిన ఉపకార వేతన కార్యక్రమానికి వనరులు సమకూర్చిన అమెరికా ప్రజలకు వహీద్‌ ‌ధన్యవాదాలు తెలిపారని పేర్కొంది.

భారత ప్రభుత్వం పాక్‌ ఆ‌క్రమిత జమ్మూ కశ్మీర్‌-‌పీవోజేకే భారత్‌ అం‌తర్భాగమని పదే పదే చెబుతున్నప్పటికీ నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట పడలేదు.

ఇదే విషయమై విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్‌ ఎస్‌. ‌జైశంకర్‌ ‌పార్లమెంట్‌లో మాట్లాడుతూ ‘‘భారత ప్రభుత్వం ఓ సమష్టి వైఖరికి కట్టుబడి ఉంది. దేశంలో ప్రతీ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆ వైఖరికి మద్దతుగా నిలిచాయి. పీవోజేకే భారత్‌లో భాగం కాదనే మాటను మేం ఒక్కనాటికీ ఒప్పుకునేది లేదు. ఇది ఓ సమష్టి వైఖరి. ఇది మా అందరి వైఖరిగా కలకాలం నిలిచి ఉంటుంది ’’ అని అన్నారు.


ఒత్తిడిలో వాట్సప్‌… ‌మోదీ ప్రచారానికి మోకాలడ్డు!

యూఎస్‌ఎయిడ్‌ ‌మతోన్మాద ఉగ్రవాద మూకలకు మాత్రమే అన్ని రకాలుగా సాయ పడటంతో సరిపుచ్చుకోలేదు. అది 2019లో భారత్‌లో లోక్‌సభకు ఎన్నికలు జరిగినప్పుడు కూడా తలదూర్చింది. మోదీకి అనుకూలంగా వచ్చే సమా చారంపై వేటు వేయాలని ఫేస్‌బుక్‌, ‌యూట్యూబ్‌, ‌వాట్సప్‌, ‌ట్విటర్‌ (‌ప్రస్తుతం ఎక్స్) ‌లాంటి సోషల్‌ ‌మీడియా వేదికలపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చింది. అయినా కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అప్పట్లో యూఎస్‌ఎయిడ్‌ ఒత్తిడి వాట్సప్‌పై బాగా పనిచేసింది. భారత్‌లో రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకోవడానికి ఓ అనువైన సోషల్‌ ‌మీడియా వేదికగా వాట్సప్‌కు ఎంతో పేరుంది. అంతకుమునుపు వాట్సప్‌ ‌వినియోగ దారులకు ఒక మెస్సేజ్‌ను ఎంతమందికైనా ఫార్వార్డ్ ‌చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ వాట్సప్‌ ‌సరిగ్గా లోక్‌సభకు ఎన్నికలు జరగడానికి కొద్ది నెలల ముందు అంటే 2019, జనవరిలో ఫార్వర్డ్ ‌మెస్సేజ్‌ల సంఖ్యపై పరిమితులు విధించింది. ఇది సోషల్‌ ‌మీడియాలో ఎక్కువ మంది ఓటర్లను చేరుకోవడంలో బీజేపీ సామర్థ్యాన్ని తక్కువ చేయడానికి పన్నిన ఓ కపటోపాయం తప్ప మరొకటి కాదు. బీజేపీ మద్దతుదారులు జనసమీకరణ కోసమని ఈ సోషల్‌ ‌మీడియా వేదికను ఎంతగానో నమ్ముకున్నారు. కానీ మెస్సేజ్‌ ‌ఫార్వార్డింగ్‌పై పరిమితులతో వారు ఎన్నో ఆంక్షలకు లోనయ్యారు. ఇదే విషయమై అమెరికా స్టేట్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ‌మాజీ అధికారి మైక్‌ ‌బెంజ్‌ ‌మాట్లాడుతూ ఈ విషయంలో యూఎస్‌ఎయిడ్‌ ‌ప్రమేయం ఉందని చెప్పడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. 2019లో లోక్‌సభకు ఎన్నికలు మరికొద్ది నెలల్లో ముంచుకొస్తాయనగా యుఎస్‌ ఎయిడ్‌ ‌ప్రముఖ టెక్నాలజీ కంపెనీతో జట్టు కట్టింది. భారత్‌ ‌రాజకీయాలపై వక్రభాష్యాలు వినిపించడం మొదలుపెట్టింది. ఎన్నికకంటూ ఓ ప్రత్యేక కథనాన్ని వండి వార్చి మరీ వడ్డించింది. నరేంద్రమోదీపై దుష్ప్రచారానికి పూనుకుంది. మోదీ ప్రజ మెదళ్లలోకి తప్పుడు సమాచారాన్ని చొప్పించిన కారణం గానే రాజకీయ విజేతగా నిలిచారంటూ సోషల్‌ ‌మీడియాలో విపరీతంగా ప్రచారం చేసింది. ఇదొక పక్షపాత ధోరణిని సృష్టించింది. సోషల్‌ ‌మీడియాలో సమాచారానికి పెద్ద ఎత్తున కత్తెర వేయడానికి దారి తీసింది. యూఎస్‌ ఎయిడ్‌, ‌దాని తోక సంస్థలు అక్కడితో ఆగిపోలేదు. మోదీ మద్దతుదారులు ఆన్‌లైన్‌లో నకిలీ వార్తలను వ్యాపింపజేస్తున్న కారణంగానే భారత్‌ ‌సోషల్‌ ‌మీడియాలోకి తాను తలదూర్చాల్సి వచ్చిందంటూ యూఎస్‌ఎయిడ్‌ ‌తన చర్యను సమర్థించుకుంది. అది ఎయిర్‌ ఇం‌టర్నేషనల్‌ ‌మీడియా, డిజిటల్‌ ‌ఫోరెన్సిక్‌ ‌గ్రూప్‌లతో లోపాయికారిగా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఇంద్రజాలికుడు ఖాళీ టోపీలో నుంచి ఓ కుందేలును చెవులు పట్టి మరీ బైటకు తీసుకొచ్చిన చందంగా భారత్‌ ఓ ‌తీవ్రమైన తప్పుడు సమాచారపు సంక్షోభంలో చిక్కుకున్నదనే నివేదికను యూఎస్‌ ఎయిడ్‌ ‌సృష్టించిందని మైక్‌ ‌బెంజ్‌ ‌వెల్లడించారు. దీంతో సోషల్‌ ‌మీడియా వేదికలపై మోడీ అనుకూల సమాచారాన్ని అణగదొక్కడానికి ఆ నివేదిక ఓ ఆయుధంగా మారింది. ఆ కారణంగా మోదీ అనుకూల సమాచారాన్ని తొలగించాలంటూ ఇతర ప్రధానమైన సోషల్‌ ‌మీడియా వేదికలపైన కూడా ఒత్తిడి పెరిగిందని, దానికి అవి తలొగ్గక తప్పలేదని బెంజ్‌ ‌చెప్పారు. యూఎస్‌ ఎయిడ్‌ ‌రాజకీయ వక్రభాష్యం చెప్పడానికని అనేక సంస్థలకు ఆర్థిక సాయం చేసింది. వాటి పనల్లా 2019 ఎన్నికలకు ముందు సోషల్‌ ‌మీడియాలో బీజేపీ హవాకు అడ్డుకట్ట వేయడమే.

– జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE