రెండవసారి అమెరికా అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ అక్కడ అక్రమంగా ఉంటున్న వలసదారులను వారి స్వదేశాలకు సాగనంపుతున్నారు. ఈ నేపథ్యంలో వందమందికి పైగా భారతీయులు అమెరికా యుద్ధ విమానంలో చేతులకు బేడీలు, కాళ్లకు సంకెళ్లతో 40 గంటలు ప్రయాణించి ఫిబ్రవరి 5న స్వదేశానికి చేరుకున్నారు. దీనిపై వచ్చిన విమర్శలకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంట్ సాక్షిగా స్పందించారు. అమెరికా విధివిధానాలకు లోబడి గడచిన 15 ఏళ్లుగా ఇలాగే జరుగుతూ వస్తోందని తెలిపారు. ఈ విషయమై అమెరికాకు తెలియపరిచామని, పిల్లలకు, మహిళలకు అలా చేయవద్దని కోరామని మంత్రి చెప్పారు. 2009 నుంచి ఇప్పటి వరకు 15వేల పైచిలుకు భారతీయులు స్వదేశానికి వచ్చారని తెలిపారు.
టెక్సాస్ నుంచి104 మంది భారతీయులతో భారత్‌కు బయలుదేరిన అమెరికా సైన్యానికి చెందిన సీ-17 విమానం ఫిబ్రవరి 5, బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. అక్రమ వలసదారులుగా స్వదేశానికి తిరిగి వచ్చిన వారిలో పంజాబ్ వాస్తవ్యులు 33 మంది ఉండగా, గుజరాత్, హరియాణా రాష్ట్రాలకు చెందినవారు 33 మంది చొప్పున ఉన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు చొప్పున ఉండగా, చండీగఢ్‌కు చెందిన ఇద్దరు అక్రమ వలసదారుల్లో ఉన్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన వారిలో నాలుగేళ్ల చిన్నారి సహా 12 మంది మైనర్లు, 25 మంది మహిళలు ఉన్నారు. 25 ఏళ్ల లోపు వయసున్నవారు 48 మంది ఉన్నారు. పంజాబ్‌కు చెందినవారిలో సంగ్రూర్, గురుదాస్‌పూర్, మొహాలీ, అమృత్‌సర్, పటియాలా, తర్న్‌తరణ్, సవాన్ షహర్, జలంధర్ జిల్లాలకు చెందినవారు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
మొదటగా ఈ విమానంలో 205 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. చివరకు 104 మంది మాత్రమే తిరిగి వచ్చారు. అమెరికాలో అక్రమంగా ఎంతమంది భారతీయులు ఉంటున్నారనే దానిపై ఆ దేశం నుంచి ఓ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే రానున్న రోజుల్లో భారత్‌కు అక్రమ వలసదారులతో అనేక విమానాలు వస్తాయని అమెరికా అధికారులు తెలిపారు. అక్కడి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం అమెరికాలో ఉంటున్న 20,407 మంది భారతీయుల దగ్గర సరైన పత్రాలు లేవు. వీరిలో 17,940 మందిని స్వదేశానికి తిరిగి పంపించడానికి ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
15 ఏళ్లలో 15,756 మంది తిరుగుముఖం
అమెరికా అధికారులు వారి దేశంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను స్వదేశానికి పంపించడ మనేది కొత్తగా జరుగుతున్నదేమీ కాదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఫిబ్రవరి 6న రాజ్యసభలో అన్నారు. అమెరికా గడచిన 15 సంవత్సరాలుగా అంటే 2009 నుంచి మొత్తంగా 15,756 మంది భారతీయులను స్వదేశానికి తరలించిందని తెలిపారు. ఈ దశాబ్దంన్నర కాలంలో 2019లో అత్యధికంగా 2,042 మంది భారత్‌కు తిరిగిరాగా, ఆ తర్వాతి స్థానంలో 1,889 మందితో 2020 సంవత్సరం నిలిచిందని కేంద్రమంత్రి సభకు వెల్లడిరచారు. అమెరికా అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తరలించే విధానం ఒక దేశానికి మాత్రమే పరిమితం కాదని, అది అన్ని దేశాలకు వర్తిస్తుందని తెలిపారు. భారతీయుల తరలింపు సందర్భంగా వారి పట్ల అత్యంత అమానవీయంగా అమెరికా వ్యవహరించిందంటూ వచ్చిన విమర్శలపై జైశంకర్ స్పందించారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ – ఐసీఈ అమెరికా నుంచి అక్రమ వలసదారుల ను వారి స్వదేశాలకు తరలించే కార్యక్రమాన్ని చేపడుతుందని తెలిపారు. ‘‘ఐసీఈ 2012 నుంచి కూడా అక్రమ వలసదారులను విమానంలో తరలించే ప్రామాణిక నిర్వహణా విధానాన్ని – ఎస్‌వోపీ అనుసరిస్తోంది. అప్పటి నుంచే తరలింపు సందర్భంగా వలసదారులపై నిర్బంధాలు (చేతులకు బేడీలు, కాళ్లకు గొలుసులు) కొనసాగుతూ వస్తున్నాయి.
అయితే మహిళలు, పిల్లలకు అలా చేయవద్దని ఐసీఈ కి తెలియపరిచాం. అంతేకాకుండా తరలింపునకు నోచుకుంటున్నవారికి విమానంలో ఆహారం, తదితర నిత్యావసరాలను అందించాలని, అత్యవసర సమయాల్లో వారికి వైద్య సేవలు అందేలా చూడాలని కోరాం. అయితే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం వారిపై ఎలాంటి నిర్బంధాలు విధించడంలేదు’’ అని మంత్రి వివరించారు.
కల్ల అయిన కలల లోకం
అమెరికా దేశానికి బయలుదేరే భారతీయుల్లో అనేక మంది అక్కడ ఆర్థికంగా మెరుగైన అవకాశాలను వెదుక్కుంటూ వెళతారు. స్వర్గధామం లాంటి అమెరికా తమకు ఓ మంచి జీవితాన్ని ప్రసాది స్తుందని నమ్ముతారు. ఆ దేశంలో ఓ మహానగరంలోకి అడుగుపెడితే చాలు నిలకడైన, భద్రమైన ఉద్యోగం సంపాదించుకొని జీవన స్థితిగతులను బాగు చేసుకోవచ్చుననే భావనలో వారు ఉంటారు. ట్రంప్ రెండసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీప్రమాణం చేయడానికి ముందు కూడా అంటే బైడెన్ హయాంలో అక్రమ వలసదారులుగా అమెరికాలో ముద్రవేయించు కొని భారత్‌కు తిరిగి వచ్చినవారున్నారు. అలా తిరిగి వచ్చినవారిలో ఒక్కొక్కరిని అమెరికా పంపించడానికి తాము రూ.30 లక్షలు నుంచి రూ.50 లక్షలు ఖర్చు చేసినట్టు పంజాబ్‌లో కొన్ని కుటుంబాలు తెలిపాయి.
అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళ్లి తిరిగివచ్చిన 104 మందిలో కొందరి అనుభవాలు అత్యంత దయనీయంగా ఉన్నాయి. అమెరికా వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో మృత్యువును అత్యంత దగ్గరగా చూసిన భయానక క్షణాలు, ట్రావెల్ ఏజెంట్లు చేసిన మోసాలు, పదుల లక్షల రూపాయాల్లో పెట్టిన ఖర్చులను కళ్లకు కట్టినట్టుగా చెప్పుకొచ్చారు.
యూఎస్ తరలించిన భారతీయుల సంఖ్య (సంవత్సరంవారీగా):
2009: 734
2010: 799
2011: 597
2012: 530
2013: 515
2014: 591
2015: 708
2016: 1,303
2017: 1,024
2018: 1,180
2019: 2,042
2020: 1,889
2021: 805
2022: 862
2023: 617
2024: 1,368
2025 (ఫిబ్రవరి 5నాటికి): 104
నెల రోజులకే తిరుగుటపాలో..!
దలేర్‌సింగ్ అమృత్‌సర్ జిల్లాలో సలేమ్‌పూర్ గ్రామానికి చెందినవాడు. అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భారత్‌లో ఉన్నప్పుడు బస్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అతడ్ని అమెరికా పంపించడం కోసమని అతడి కుటుంబం రూ. 30 లక్షలు ముట్టచెప్పింది. 30 రోజుల క్రితమే అమెరికాలో అడుగుపెట్టిన దలేర్ సింగ్ ఫిబ్రవరి5న అక్రమ వలసదారుగా స్వదేశానికి తిరిగివచ్చాడు.
విమానమని చెప్పి నడిపించారు
స్వస్థలానికి చేరుకున్న జస్పేల్ తనను సక్రమ మార్గంలో అమెరికా చేరుస్తానని హామీ ఇచ్చిన ట్రావెల్ ఏజెంట్ మోసగించాడని ఆరోపించాడు. సరైన వీసాతో తనను పంపించమని బతిమిలాడుకున్నా కానీ ట్రావెల్ ఏజెంట్ అతడ్ని తప్పుదారి పట్టించాడు. మొత్తానికి రూ.30 లక్షలతో అమెరికా చేర్చేందుకు ఓ ఒప్పందం కుదిరింది. జస్పాల్ గతేడాది జులైలో విమానంలో బ్రెజిల్ చేరుకున్నాడు. అమెరికా చేరే దాకా విమానంలో ప్రయాణం ఉంటుందని అక్కడివారు అతడికి మాట ఇచ్చారు. బ్రెజిల్‌లో ఆరు నెలలు ఉన్న తర్వాత జస్పాల్‌ను ఏజెంట్ మోసగించాడు. విమాన ప్రయాణానికి బదులుగా చాలావరకు నడకతో అక్రమంగా సరిహద్దులు దాటేలా ఏజెంట్ అతడిపై ఒత్తిడి తెచ్చాడు. కానీ అతడు అమెరికాలోకి అడుగు పెడుతుండగానే సరిహద్దు గస్తీ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తాను స్వదేశానికి తిరిగి రావడానికి ముందు 11 రోజులు పోలీసుల కస్టడీలో ఉన్నట్టు జస్పాల్ చెప్పాడు. తనను స్వదేశానికి తిరిగి పంపిస్తున్న సంగతి తనకేమాత్రం తెలియదని తెలిపాడు. ‘‘మా చేతులకు బేడీలు వేశారు. కాళ్లను గొలుసులతో కట్టేశారు. అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాతనే వాటిని తొలగించారు’’ అని జస్పల్ వాపోయాడు.
సముద్రంలో బోటు బోల్తా!
పంజాబ్‌లో హోషియార్‌పూర్ జిల్లా, తహ్లీ గ్రామానికి చెల్లిన హర్వీందర్ సింగ్ గతేడాది ఆగస్టులో అమెరికా పయనమయ్యాడు. ఖతార్, బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, నికరాగ్వా మీదుగా మెక్సికో చేరుకున్నాడు. ట్రావెల్ ఏజెంట్ హర్వీందర్‌తో పాటు మరికొందర్ని సరిహద్దు మీదుగా అమెరికాలోకి తీసుకెళ్లాడు. అందులో భాగంగా సముద్రంలో వారు ప్రయాణిస్తున్న బోటు దాదాపుగా మునిగిపోయినంతపనైంది. అయినా కానీ వారంతా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మెక్సికో వెళ్లే ముందు ఐరోపా తీసుకెళతానని సింగ్‌కు అతడి ట్రావెల్ ఏజెంట్ మాట ఇచ్చాడు. సింగ్ తన ప్రయాణం కోసమని రూ.42 లక్షలు ఖర్చు చేశాడు.
అమెరికా చేరడానికి 17 కొండలు దాటారు..!
పంజాబ్‌కు తిరిగొచ్చిన ఒకానొక అక్రమ వలసదారు అమెరికా చేరుకోవడానికి వాడే ‘డాంకీ రూటు’ ను వివరించాడు. దారిలో రూ.50 వేలు విలువచేసే దుస్తులు, తదితర వస్తువులు చోరీ అయ్యాయి. అతడు చెప్పినదాన్ని బట్టి ముందుగా అతడితో పాటుగా మిగిలినవారిని ఇటలీ తీసుకెళ్లారు. అక్కడి నుంచి లాటిన్ అమెరికాకు తరలించారు. ఆ ప్రయాణంలో 15 గంటలసేపు బోటులో వెళ్లారు. 40 నుంచి 45 కి.మీ.ల దూరం నడిచారు. తాము 17 నుంచి 18 కొండలు దాటినట్టు అతడు చెప్పాడు. ఎవరైనా జారిపడితే బతికి బట్టకట్టే అవకాశం లేదు. అలా పడిపోయినవారిని చాలా మందిని తాము చూసినట్టు తెలిపాడు. ఎవరైనా గాయపడితే వాళ్లను మృత్యువుకు వదిలేసి తాము ముందు వెళ్లినట్టు చెప్పాడు. దారిలో మృతదేహాలు కనిపించాయని తెలిపాడు.
డాంకీ రూటు అంటే?!
భారతీయుల్లో అనేక మంది అమెరికా కలను నిజం చేసుకోవడానికి డంకీ రూటు పడతారు. దీన్నే ఇంగ్లీషులో డాంకీ రూట్ అంటారు. ఇది డంకీ అనే పంజాబీ పదం నుంచి వచ్చింది. డంకీ అంటే ఓ చోటు నుంచి మరో చోటుకు గెంతడమని అర్థం. ఈ పద్ధతిలో అనేక దేశాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అలా ప్రయాణించేవారు తరచుగా మధ్య అమెరికా దేశాలైన పనామా, కోస్తారికా, ఎల్ సాల్వ డార్, గ్వాటెమాల లాంటి దేశాల్లో ఆగుతుంటారు. అక్కడి నుంచి వలసదారులు ఏజెంట్లు, మానవ స్మగర్ల సాయంతో అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తారు.
యూఎస్-కెనడా బోర్డర్‌లో పట్టుబడుతున్న ఇండియన్లు
ఇటీవలి సంవత్సరాల్లో అమెరికా, కెనడా సరిహద్దు గుండా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గతేడాది సెప్టెంబర్ 30 నాటికి అమెరికా సరిహద్దు గస్తీ దళం ఈ సరిహద్దు వెంబడి 14 వేల మందికిపైగా భారతీయులను అరెస్టు చేసింది. ఇది మొత్తం అరెస్టుల్లో 60 శాతంగా ఉంది.
విదేశీయుల తరలింపునకు ముహూర్తం చూస్తున్నారా?: సుప్రీంకోర్టు
విదేశీయులుగా గుర్తించినవారిని వారి స్వదేశాలకు సాగనంపడంలో అస్సాం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 4న తీవ్రంగా విమర్శించింది. ఆ పని చేయడం కోసమని మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నారా? అని ప్రశ్నించింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జ్వల్ భూయాన్ లతో కూడిన ధర్మాసనం జాతీయ పౌర పట్టిక ` ఎన్‌ఆర్‌సీ సవరణ సందర్భంగా విదేశీయులుగా గుర్తించి, ప్రస్తుతం నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన 63 మంది వ్యక్తులను వారి స్వదేశాలకు పంపించాలని అస్సాం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే నిర్బంధంలో ఉన్న వ్యక్తుల స్వదేశీ చిరునామాలు తెలియని కారణంగానే వారిని తరలించలేకపోయామని అస్సాం ప్రభుత్వం వాదించింది. కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. విదేశీయులను వారి దేశ రాజధాని నగరాలకు తరలించాలని పేర్కొంది. జస్టిస్ ఓకా వాస్తవాలను అణచివేస్తున్నారంటూ అస్సాం ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ‘‘మీకు పర్‌జ్యూరీ నోటీసు జారీ చేస్తాం. బదులుగా మీరు నిష్కళంకంగా బైటపడాలి’’ అని అన్నారు.
జస్టిస్ భూయాన్ ఒక వ్యక్తిని విదేశీయుడని ప్రకటించిన తర్వాత తీసుకున్న చర్యపై అస్సాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరినైనా నిరవధికంగా నిర్బంధంలో ఉంచడం రాజ్యాంగంలోని 21వ అధికరణం ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. ఇప్పటివరకు నిర్బంధంలో ఉన్న ఎంతమందిని వారి స్వదేశాలకు తరలించారని జస్టిస్ భూయాన్ ప్రశ్నించారు. జస్టిస్ ఓకా ఈ విషయంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రమేయం లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి చీవాట్లు వేశారు. ‘‘సాయం కోరుతూ మీరెందుకు ఓ ప్రతిపాదనను (విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు) సమర్పించలేదు?’’ అని ప్రశ్నించారు. విదేశీయులును వెంటనే వారి స్వదేశాలకు తరలించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన నివేదికను రెండు వారాల్లో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది.
భారత్‌లో అరెస్టయిన చొరబాటుదారులు
జనవరి 30, 2025
మహారాష్ట్రలో థానే అక్రమ మానవ రవాణా నిరోధక విభాగం పోలీసులు పశ్చిమ థానేలోని మనోర్ పడా ప్రాంతంలో బాంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు మహిళలను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని షాజిదా ఖటూన్ (38), రత్నా ఖటూన్(40), షలీనా ముల్లా (50), రేష్మా ధలీ(40)గా గుర్తించారు.
జనవరి 28
రాజస్థాన్‌లోని జైపూర్‌లో 500 మంది చొరబాటుదారులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో 394 మంది రొహింగ్యాలు కాగా మిగిలినవారు బాంగ్లా దేశీయులు.
జనవరి 25
గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న ఓ మొబైల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురు చైనీయులను అరెస్టు చేశారు.
జనవరి 20
ముంబైలో నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో అరెస్టయిన షారిఫుల్ ఇస్లామ్ ముహమ్మద్ రొహొల్లా అమిన్ ఫకీర్‌ను బాంగ్లాదేశీయుడిగా గుర్తించారు.
జనవరి 04
పశ్చిమ ఢల్లీిలోని ఉత్తమ్ నగర్‌లో ఐదుగురు బాంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు.