‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో
ద్వితీయ బహుమతి పొందిన రచన
‘‘నేను ఇండియా వెళ్లగానే వాళ్ల అమ్మ నాన్నలను కలిసి ఓ మంచి లాయర్ తో మాట్లాడి ఆ కేసుని పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఇంక వాడికి విడాకులు తప్ప మరో మార్గం లేదు. మనిషికి ముప్పై ఏళ్లు వచ్చేసరికి ఉద్యోగం, పెళ్లి, విడాకులు లాంటి సమస్యలొస్తే ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంది… అమెరికా ఒక విధంగా మంచి చేస్తుంటే ఇంకొక విధంగా చెడు చేస్తోందనిపిస్తోంది.. అమెరికా కల్చర్ మనకు నప్పదు. మనకు ఇక్కడి చదువు, ఉద్యోగాలు బాగుంటాయి కానీ మిగతా విషయాలు మనకు నప్పవు. మన ఆంత్రోపోలజీ వేరు, వాళ్లది వేరు… మనకి కావలసినదే తీసుకోవాలి. మనవాళ్లు మొత్తం అమెరికా కల్చర్నే ఎడాప్ట్ చేసుకుంటూ సమస్యలు కొని తెచ్చుకుంటునారు. అయినా నాణేనికి ఎప్పుడూ రెండవ వైపు ఉంటుంది. మంచి ఒక వైపుంటే చెడు ఇంకొక పక్క ఉండక తప్పదు’’. అన్నాను…
‘‘మరి మధుని కలుస్తావా?’’ అనీ అడిగింది సమీర..
‘‘రేపు వెళ్లి కలుద్దామనీ అనుకుంటున్నాను’’
‘‘నువ్వు ఎప్పుడు ఇండియాకి వెళుతునావు?’’
‘‘ఎల్లుండి! నేను తిన్నగా ఇంటికి వెళ్లకుండా హైదరాబాద్లో దిగి శ్రీరామ్ వాళ్ల అమ్మ నాన్నల్ని కలిసి వాళ్ల మీద పెట్టిన గృహ హింస కేసు గురించి మాట్లాడతాను.’’ అనీ చెప్పాను.
‘‘వంశీ! నువ్వు వెళ్లిన తరువాత ఎంత త్వరగా వాడి వివరాలు పంపిస్తే ఆ తరువాత నేను ఒక నిర్ణయం తీసుకొని నాన్నకు నా నిర్ణయం చెప్పి ఇండియా వచ్చేస్తాను’’ అనీ చెప్పింది సమీర.
‘‘తప్పకుండా! నే వెళ్లగానే ఆ పని మీదే ఉంటాను. మరి నేను బయలు దేరతాను’’ అంటూ లేచాను…
‘‘అదేమిటి? అమెరికా వచ్చి నన్ను కలిసి రెండు గంటల్లో మళ్లీ తిరిగి వెళ్లి పోతావా? లంచ్ చేసి వెళ్లు’’ అనీ చెప్పింది.
ఆ తరువాత నాకు సిలికాన్ వేలీ అంతా తిప్పి పెద్ద పెద్ద సాఫ్టవేర్ కంపెనీల ముఖ్య కార్యాలయాలన్ని చూపించింది.. ఇద్దరం అక్కడ ఉన్న సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ చేసి ఆమె ఆఫీసుకి వచ్చాము…
‘‘వంశీ! ఎందుకో నువ్వు వెళ్లిపోతూ ఉంటే బాధ వేస్తోంది. నువ్విక్కడ ఉంటే నాకెంతో ధైర్యంగా ఉంది… నువ్వెళ్లిపోతే మళ్లీ ఒంటరితనం ఆవ హిస్తుంది’’ అంది చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ…
‘‘చాలా మంది అమెరికా వచ్చిన వాళ్లు ఈ దేశానికి ఎడిక్ట్ అయి మనదేశాన్ని తిట్టుకుంటూ ఇక్కడ ఆనందంగా గడిపేస్తుండటం నేను చాలా మందిలో చూసాను. నిన్ను చూస్తుంటే ఇక్కడి వాతావరణానికి ఎడ్జస్ట్ అయినట్లు లేదు.. నువ్వు ఇక్కడ ఉండలేవు అనిపిస్తోంది’’… అనీ చెప్పాను. ఆ తరువాత సమీరకు వీడుకోలు చెప్పి మధు దగ్గరకు బయలు దేరాను;
* * *
మధు ఎయిర్ పోర్టు కొచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు… న్యూయార్క్ నగరం చాలా సుంద రంగా ఉంది… ఎక్కడ చూసినా ఆకాశ హార్య్మాలు తమ గొప్పతనాన్ని ప్రదర్శిస్తున్నాయి. న్యూయార్క్ నగరం అమెరికాకు మణిహారమే కాక మనీ హారం కూడా.అంటే ఆర్థిక రాజధాని. మన దేశానికి ముంబాయి లాగ అన్నమాట. పేరుకే వాష్టింగన్ డీసీ రాజధాని కానీ అక్కడ అధ్యక్ష భవనం, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు తప్ప ఆ నగరానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కానీ అమెరికాని శాసిస్తున్నది మాత్రం న్యూయర్క్ మహానగరం. రెండున్నర కోట్ల జనాభాతో ఎప్పుడూ చాలా రద్దీగా, మనుషలంతా బిజీగా ఉంటారు. దానికి ఎంత ప్రాధాన్యత లేకపోతే బిన్ లాడెన్ ఈ నగరంలోని ట్విన్ టవర్స్ని కూల్చడానికి ఎన్నుకున్నాడు!? ఆ నగర శివార్లలో కొత్త్రగా కట్టిన సొసైటీలో మధు ఉంటునాడు. అతను పనిచేసే సాఫ్ట్‌వేర్ కార్యాలయం అక్కడికి దగ్గర్లోనే ఉందట. ఆ సొసైటీని చూస్తుంటే నాకు మనరాష్ట్రంలో ప్రతీ పట్నంలో ఊరికి దూరంగా కట్టే హౌసింగ్ బోర్డు కోలనీలు గుర్తుకువచ్చాయి.చుట్టూ కనుచూపు మేర అంతా నిర్జన ప్రదేశం.ఎదురుగా పచ్చటి కొండలు. అప్పుడప్పుడూ రహదారి మీద కనిపిస్తున్న కార్లు. అక్కడ ఎవ్వరూ పెద్దగా బయటకు రావటం లేదు. ఆన్‌లైన్ వ్యాపారాలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్‌లు, టీవీలు మనుషుల్ని సమాజా నికి దూరం చేస్తున్నాయని పించింది.
నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నపుడు సాంఘిక శాస్త్రంలోని ‘మాన వుడు సంఘ జీవి’ అన్న వాక్యం నన్ను బాగా ఆకర్షించేది. కానీ ఇప్పుడది తప్పనిపిస్తోంది. మాన వుడు తన స్వార్థంతో సంఘానికి దూరం అవుతూ ఒంటరి వాడవు తునాడు.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ కోలనీలోని ఇళ్ల నిర్మాణం మనదేశంలోలాగ కాంక్రీటు స్లాబులు కనిపించటం లేదు.అన్నీ పర్యావర ణానికి మేలు చేసే మట్టి పెంకులు, రేకులతోనూ నిర్మించిన ఇళ్లు. గోడలన్నీ కలపతో నిర్మించారు. కేవలం పునాదుల వరకే కాంక్రీటు. మిగతాదంతా ప్రకృతి ప్రసాదించిన వెదురు, పెంకులు. ఈ విషయంలో అమెరికాని చూసి చాలా నేర్చుకోవాలి.
మధు ఇల్లు చాలా సింపుల్గా ఉంది. లోపల నుంచి మెట్లు. పై అంతస్తులో ఒక బెడ్ రూము, హాలు, డూప్లెక్స్ నిర్మాణం. అంటే లోనుంచి మెట్లు.
స్నానం చేసిన తరువాత మధు ఉప్మా చేసాడు.
అమెరికాలో తెలుగు ఉప్మాని చూసి నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగింది. చాలా రోజుల నుంచి తెలుగు వంటకాలకి దూరం కావడంతో ఈ రోజు ఉప్మా వేడిగా రుచిగా నోటికి తగిలింది. దానికి తోడు ఇంటి నుంచి పంపించిన ఆవకాయ. ఆ రెండింటి కాంబినేషన్ అద్భుతంగా ఉంది.
తిన్న తరువాత వేడి టీ మరింత రుచి అనిపిం చింది. తాగుతూ తన వివరాలు చెప్పాడు మధు.
‘‘చదువుకునేటప్పుడు ఫీజు కోసం చాలా ఇబ్బందులు పడ్డాను. సాయంత్రం పూట లైబ్రరీలో, మరికొన్నాళ్లు పెట్రోల్ బంకులో పనిచేసాను. చదువు పూర్తైన వెంటనే ఈ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడే పరిచయం అయింది నీహారిక. ఆమె కూడా నాలాగే ఇక్కడికి ఎమ్మెస్ చేయడానికి వచ్చి సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరింది.తానా సభలప్పుడు ఆమె నాకు పరిచయమై, కొన్నాళ్లకు స్నేహంగా మారింది. నీహారిక ఆఫీసు మా ఆఫీసుకి దగ్గర్లోనే ఉండటం వల్ల తరచు మా ఆఫీసుకొచ్చి కలుస్తుండేది. ఇద్దరం సినిమాలకు, పార్కులకు వెళ్లేవాళ్లం. మొదట్లో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని భయపడ్డా ఇది అమెరికా కాబట్టి ధైర్యంగా ముందుకెళ్లాను…
ఆ పరిచయంలో ఆమె గురించిన కొన్ని ఆసక్తికర మైన విషయాలు తెలిసాయి.
‘‘నీహారిక ఎనిమిది చదువుతున్నప్పుడు ఆమె తల్లితండ్రులు విడాకులు తీసుకున్నారట. అప్పట్నుంచీ ప్రభుత్వోద్యోగం చేస్తున్న ఆమె తల్లే పెంచి, చదివిం చింది.అందుకే ఆమె పెద్దగా హైదరాబాదు వెళ్లదు. నా కన్నా ఆమె ఒక సంవత్సరం సీనియర్. ఎమ్మెస్ చదువుతున్నప్పుడు ఆమెకు ఒక అమెరికన్ ఇండియన్ ఛార్లెస్ పరిచయమయ్యాడు. కొన్నాళ్ల పాటు అతనితో సహజీవనం అంటే లివ్ ఇన్‌రిలేషన్ షిప్పు చేసిందట. రెండేళ్ల తరువాత ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారట.ఆ తరువాత నాతో పరిచయాన్ని కొనసాగిం చింది’’…
‘‘లివ్ ఇన్ రిలేషన్ షిప్పు అంటే సహజీవనంలో రిస్కు ఉంది కదా… దాన్ని ఎందుకు ఎంచుకున్నావు’’ అనీ ఆమెనడిగాను… దానికి ఆమె‘‘ పెళ్లి కాకుండానే ఆడమగ పరస్పర అంగీకారంతో ఇద్దరూ కలిసి ఉండటాన్ని సహజీవనం అంటారు. సహజీవనంలో ఇద్దరికీ స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ప్రేమ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. బంధుత్వాలు, కట్టుబాట్లు అడ్డురావు కాబట్టి ఇద్దరూ తమ కిష్టమైన రీతిలో ఉండొచ్చు. అందుకే దీన్ని ఎంచుకున్నాను’’ అనీ చెప్పింది…
‘‘మరి మీ ఇద్దరూ ఎందుకు విడిపోయారు’’ అని అడిగాను.
‘‘రెండు సంవత్సరాల సహజీవనంలో అతని మనస్తత్వం నాకు సరిపోదనిపించింది… అందుకే విడిపోయాము… సహజీవనంలో అదే లాభం. అదే మేమిద్దరం పెళ్లి చేసుకుంటే విడిపోవడం కష్టం అయ్యేది. విడాకుల ప్రహసనం నడిచేది. కానీ మేము ఒక్కరోజులో నిర్ణయానికొచ్చి విడిపోయాము. ఇప్పుడు మేమిద్దరం స్నేహితులం’’ అని చెప్పింది నీహారిక.
– గన్నవరపు నరసింహమూర్తి