– గన్నవరపు నరసింహమూర్తి

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

రానురాను అమెరికా జీవితానికి నేను అలవాటుపడ్డాను. ఇక్కడ యూనివర్సిటీలో చదువుకు మాత్రం రెండు నెలల దాకా ఎడ్జస్ట్‌ కాలేకపోయాను. ఇక్కడ బోధించే పద్ధతులు మన దేశ చదువులు ఛిన్నాభిన్నంగా ఉండటమే దీనికి కారణం… మొదట్లో పాఠాలు అర్థం కాక ఇండియాకు వచ్చేద్దామనుకున్నాను… కానీ మా ఫ్రెండ్స్‌ ప్రోత్సాహంతో ఆ సమస్యని అధిగ మించాను.

నేనిక్కడ చేరిన ఆరేడు నెలల తరువాత మా నాన్నగారు నాకు పెళ్లి సంబంధం చూసారు. ఆ అబ్బాయి పేరు శ్రీధర్‌. ఇక్కడే సిలికాన్‌ వేలీలో పనిచేస్తున్నాడు. అతను ఇక్కడే ఎమ్మెఎస్‌ చదివి ఉద్యోగంలో చేరాడట. వాళ్లది హైదరాబాదు. అతని తండ్రి రాష్ట్రప్రభుత్వ ఉద్యోగిట. ఎమ్మెస్‌ అయితే గానీ పెళ్లి చేసుకోననీ నేను మా నాన్నతో చెప్పడంతో ఊరుకున్నారు. కానీ నా చదువు ఇంకో ఆరు నెలల్లో పూర్తవుతుందనగా మళ్లీ నాన్నగారు ఆ సంబంధం గురించి చెప్పి ఆ అబ్బాయి వివరాలు పంపించారు.

నాన్నగారు ఆ వివరాలు పంపిన రెండు రోజుల తరువాత ఆ అబ్బాయి నన్ను కలవడానికి మా ఆఫీసుకి వచ్చాడు. అతని పేరు రవితేజ. అతను వర్జీనియాలో ఎమ్మెస్‌ చదివానని, సిలికాన్‌ వేలిలో పనిచేస్తున్నానని వివరాలన్నీ చెప్పాడు. మా స్టాఫ్‌ అందరి ముందు అతనితో మాట్లాడటం నాకు ఇబ్బంది అనిపించింది.. అందుకే అతన్ని ఇదే కాంటీన్‌కు తీసుకువచ్చాను.

అతను టిఫిన్‌ తింటూ నా వివరాలన్నీ అడగటం మొదలు పెట్టాడు. నాకు ఎవరైనా బోయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నారా? అనీ అడిగాడు. నేను లేరనీ చెబితే ఉన్నా తనకేమీ అభ్యంతరంలేదనీ చెప్పాడు. ఈ కాలంలో బోయ్‌ఫ్రెండ్స్‌, గర్‌ఫ్రెండ్స్‌ కామన్‌ అనీ చెప్పాడు. ఇక్కడ మనుషులు కేరేపిన్‌గా ఉంటారనీ, జీవితాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తారనీ, తను కూడా జీవితాన్ని ఎంజాయ్‌ చెయ్యడానికే ప్రాధాన్యత ఇస్తాననీ చెప్పాడు. పెళ్లి చేసుకున్న తరువాత ఇండియా తిరిగి వెళ్లటం జరగదనీ, ఇక్కడే తాను సెటిలవుతాననీ తనకు సెంటిమెంట్లు తక్కువనీ చెప్పాడు. మా ఇంటి వివరాలు, ఆస్తుల వివరాలు అడిగితే నేను ముక్తసరిగా సమాధానాలు చెప్పాను. ఆ తరువాత అమెరికా గురించి చాలా విషయాలు చెప్పి వెళ్లిపోయాడు.

రెండు రోజుల తరువాత అతను మళ్లీ ఆఫీసుకి వచ్చాడు. తన కార్డు ఇచ్చి అవసరం అయితే తన ఆఫీసుకి రమ్మన్నాడు. నేను మళ్లీ అతన్ని కాంటిన్‌కు తీసుకొచ్చి, తరచూ ఆఫీసుకి రావడం బాగుండదనీ, కొలీగ్స్‌ రకరకాలుగా చెప్పుకుంటారనీ, అర్థం చేసుకొమ్మనీ అతనికి చెప్పాను.

అతను పెళ్లి విషయం మళ్లీ కదిపి తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా?అనీ అడిగాడు. నేను నాకు కొంత సమయం కావాలనీ చెప్పి తప్పించుకున్నాను. రెండు రోజుల తరువాత మళ్లీ నాకు ఫోన్‌ చేసి నా ఇంటి అడ్రస్‌ అడిగాడు. నేను ఇంటికి రావద్దనీ, అక్కడ తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్నారనీ, వాళ్లేమైనా అనుకుంటారనీ చెప్పాను.

కానీ ఆశ్చర్యంగా రెండు రోజుల తరువాత నా ఎడ్రస్‌ ఎవరి ద్వారానో కనుక్కోని రాత్రి సమయంలో నా ఫ్లాట్‌కు వచ్చాడు. నేను అతన్ని లోపలికి రానీయకుండా రేపు ఆఫీసులో కలుస్తాననీ చెప్పాను. ఆ మర్నాడు అతను మళ్లీ నా ఆఫీసుకి వచ్చినపుడు ఆఫీసుకి రావద్దనీ, పెళ్లి విషయంలో నా నిర్ణయం త్వరలో చెబుతాననీ చెప్పి అతన్ని పంపించి వేసాను.

ఆరోజు నుంచి ఫోన్లో మాట్లాడటం మొదలు పెట్టాడు. నేను ముక్తసరిగా నాలుగు మాటలు మాట్లాడి ఫోన్‌ పెట్టేసినా వెంట వెంటనే ఫోన్‌ చేస్తూ ఇబ్బంది పెట్టసాగాడు. మాట్లాడినప్పుడు కూడా ద్వంద్వార్థాల మాటలు, సెక్స్‌ జోకులు చెబుతుండటంతో నేను ఎంబరాసింగ్‌గా ఫీలై ఫోన్‌ ఎత్తడం మానివేసాను. ఆ మర్నాడు మళ్లీ ఆఫీసుకి వచ్చి సారీ చెప్పి మళ్లీ ఆఫీసుకి రావడం మొదలు పెట్టాడు.

నాన్నగారికి అతను నా ఆఫీసుకి తరచు వస్తూ ఇబ్బంది పెడుతున్నాడనీ చెబితే త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఆఫీసుకి వస్తే తప్పేమిటనీ ప్రశ్నించడంతో ఇంక అతనికి చెప్పడం మానేసేను. వాడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఒకరోజు అతను ఆఫీసుకి వస్తే ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదని, కాబట్టి ఆఫీసుకి రావద్దని చెప్పేసాను. అయినా సరే తన కోసం ఆగుతాననీ, ఆరు నెలల తరువాత పెళ్లి చేసుకుందామనీ చెప్పి వెంటబడుతున్నాడు.’’ చెబుతూ సమీర కొద్దిసేపు మౌనం వహించింది.

‘‘ఇదీ నా సమస్య వంశీ… ఏం చెయ్యాలో అర్థం కాక నీకు ఫోన్‌ చేద్దామనీ అనుకున్నా నువ్వు ఇండియాలో ఉండి ఏం చెయ్యగలవనీ ఊరుకున్నాను. కానీ అదృష్టవశాత్తూ మొన్న శ్రీరామ్‌ ఫోన్‌ చేసి నువ్వు ఏదో సెమినార్‌ పనిమీద మిసెచూస్సెట్‌కు వచ్చావనీ చెప్పడంతో నీకు ఫోను చేసాను. నిజంగా నువ్విక్కడికి రావడం నా అదృష్టం. నా సమస్యని ఎవ్వరికీ చెప్పుకోలేక రోజూ నాలో నేనే కుమిలిపోతున్నాను. మా నాన్నకి చెబితే వినడు. పైగా వాళ్లది మంచి కుటుంబమనీ, ఆ అబ్బాయి మంచివాడని, మంచి ఉద్యోగం చేస్తున్నాడనీ చెబుతూ నన్ను ఒప్పించటానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకే సమస్య వచ్చినా మనస్ఫూర్తిగా నీకే చెప్పగలను. అది చిన్నప్పట్నుంచి మనం కలిసి పెరగడంవల్లో, నువ్విచ్చిన చనువువల్లో తెలియదు’’…  అనీ తన సమస్య చెప్పింది సమీర.

‘‘ఆ అబ్బాయి ప్రవర్తించిన తీరుని మీ నాన్నగారికి చెప్పలేకపోయావా? అన్నింటికి భయపడితే ఎలా సమీరా? నువ్వేం చిన్నదానివి కాదు. చిన్నప్పుడు అంటే తల్లితండ్రుల మాట వినక తప్పదు కానీ పెళ్లి వంటి విషయంలో మనమే నిర్ణయం తీసుకోవాలి. ఇందులో ఎవ్వరి ప్రమేయం ఉండరాదు. ఆ అబ్బాయిని నువ్వు నిశితంగా గమనించావు కాబట్టి అతని ప్రవర్తన మీద నీకొక అంచనా ఉండే ఉంటుంది. నా కిష్టంలేదనీ కచ్చితంగా చెప్పెయ్‌. ఇంక నీ వెంట పడడు. పడితే పోలీసులకి కంప్లైంట్‌ చేస్తానని బెదిరించు’’ అనీ చెప్పాను…

‘‘ఇది చాలా సెన్సిటివ్‌ ఇస్యూ వంశీ… నాన్నగారు వినరు. అతను మంచివాడు కాదనీ తన ప్రవర్తన చూస్తే తెలుస్తోంది. తన గురించి తెలుసుకుంటే అప్పుడు నాన్నగారికి చెప్పవచ్చు. అందుకనీ నేను వివరాలు నీకిస్తాను. నువ్వు హైదరాబాద్‌ వెళ్లినపుడు తనగురించి కనుక్కో.. తనను పెళ్లి చేసుకోవడం అయితే జరగని పని కానీ మా నాన్న బాధ పడకుండా చెప్పాలి…’’ అంటూ అతని వివరాలున్న కాగితాన్ని నాకిచ్చింది.

‘‘సమీరా! నువ్విక్కడే ఉండిపోతావా?’’ ఆమెను అడిగాను..

‘‘ఈ దేశం, ప్రజలూ, నాగరికత, అభివృద్ధి, డబ్బు అన్నీ బాగున్నాయి. కానీ మన జన్మభూమికి వేల మైళ్ల దూరంలో, మన కావలసిన వాళ్లకి దూరంగా ఉండటం నాకెందుకో ఇష్టం లేదు. కొన్ని రోజుల తరువాత వచ్చేస్తాను. నాకు నువ్వు ఈ సహాయం చెయ్యి’’ అనీ చెప్పింది.

‘‘తప్పకుండా సమీరా! నిన్న శ్రీరామ్‌ వచ్చి.. అతని భార్య గృహహింస కేసు పెట్టిందనీ చెప్పాడు. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు బాగుంటాయి కానీ చాలా మంది పెళ్లి విషయంలో ఫెయిలవుతున్నారు. అమెరికాలో ఉండాలన్న కోరికతో తమకు అనుకూలమైన సంబంధాలు కాకుండా ఇక్కడ ఉండేందుకు అనువైన వాళ్లని పెళ్లి చేసుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికి తోడు ఈ తరం తల్లితండ్రులు కూడా పిల్లలకు నైతిక విలువలు నేర్పటం లేదు. పెళ్లి అయిన తరువాత అత్త మామలు శత్రుత్వం నూరిపోస్తున్నారు. తమ కొడుకు తమతో ఉండొచ్చు కానీ కూతురి అత్తమామలు ఆమెతో ఉండకూడదనీ చెబుతునారు. భర్త ఎదురు తిరిగితే గృహహింస కేసులు పెట్టమనీ తల్లితండ్రులే ఆడపిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి గృహహింస కేసు పెడితే అది విడాకులకు దారి తీస్తుంది. 30 ఏళ్లకు విడాకులు తీసుకుంటే ఇంక భావి జీవితం ఎలా అన్న వివేకం ఆడపిల్లలు కోల్పోతున్నారు. స్త్రీకి స్వేచ్ఛ ముఖ్యమైనా దాన్ని తెగే దాకా లాగకూడదన్న స్పృహ కోల్పోతునారు’’

 ‘‘ఒకవేళ అబ్బాయి చెడ్డవాడైతే విడాకులు తప్పు కాదు. కానీ సర్దుబాటు చేసుకునేటంతటి చిన్న సమస్యలకు కూడా విడాకులే పరిష్కారం అన్న ఆలోచన మంచిది కాదు…’’ అనీ చెప్పాను.

‘‘శ్రీరామ్‌ నాకు కూడా ఫోన్‌ చేసి జరిగిన విషయాలన్నీ చెప్పాడు. అతని భార్య పెళ్లయిన సంవత్సరానికే అతని మీద గృహహింస కేసు పెట్టిందని, తన తల్లితండ్రులు ఆ కేసువల్ల చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పాడు’’ అంది సమీర.

(సశేషం)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE