‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

‘పెళ్లి విషయంలో నేను బాగా మోసపోయానురా… అయినా ఈ సాఫ్ట్వేర్‌ చదువు, అమెరికా ఉద్యోగాలు దూరపు కొండల నునుపు.. ఇక్కడికంతా డబ్బు కోసమే వస్తారు. అన్ని బంధాలను డబ్బుతోనే కొలుస్తారు. ఇదొక ఊబి. ఇందులో దిగితే బయటకు రావడం కష్టం. ఈ ఊబిలో నేను పీకలోతు దాకా కూరుకుపోయాను. బయటపడే మార్గం కనిపించటం లేదు. నాకిక్కడ క్షణం కూడా ఉండ బుద్ధి కావటం లేదు. త్వరగా ఇండియా వెళ్లిపోవాలనిపిస్తోంది’ అన్నాడు శ్రీరామ్‌.

‘శ్రీరామ్‌.. అందరూ అలా ఉంటారనీ చెప్పలేము. కాకపోతే ఎక్కువ మంది నీ భార్యలాగే ప్రవర్తిస్తున్నారు. వాళ్లకి భావి జీవితం, నైతిక విలువల మీద నమ్మకం లేదు. కేవలం జీవితాన్ని అనుభవించడానికి డబ్బులు కావాలి… దానికోసం ఏదైనా చేస్తారు. విడాకులంటే పూర్వం భయపడేవారు. రెండో పెళ్లికి ఇష్టపడేవారు కాదు. ఇప్పుడవేమి లేవు. చిన్న చిన్న కారణాలకు విడాకులు తీసుకుంటున్నారు. పైగా ఆడపిల్లల తల్లితండ్రులు కూడా విడాకులను ప్రోత్సహిస్తున్నారు. దానివల్ల తమ కూతురు జీవితం ఏమవుతుందోననే ఆలోచన లేదు. సమాజంలో గ్లోబలైజేషన్‌ తెచ్చిన మార్పులివి. ప్రపంచీకరణ వల్ల డబ్బుకి విలువ పెరిగి నైతికతకు విలువ తగ్గింది. ఇటువంటి వారు మన రాష్ట్రంలోనూ ఉన్నారు. కేవలం అమెరికాలో ఉన్న వాళ్లనే అనక్కర్లేదు. నీ భార్య లాంటి వారు అమెరికా వచ్చి మహా అయితే ఐదారేళ్లయి ఉంటుంది. ఇది మన వాళ్ల తప్పు కానీ అమెరికాది కాదు. ప్రపంచీకరణ వల్ల ఇప్పుడన్నీ ఒకలాగే ఉన్నాయి. ప్రపంచంలోని అవలక్షణాలన్నీ మనకి వచ్చేసాయి. మంచి అబ్బదు కానీ చెడెంత సేపు చెప్పు? అమెరికా వచ్చిన వారు ఇక్కడి మంచిని నేర్చుకోవాలి. కానీ చెడునే అలవాటు చేసుకుంటున్నారు. నేను మన దేశం వెళ్లిన తరువాత మీ అమ్మనాన్నల్ని కలుస్తాను. నువ్వు వివరాలిస్తే మీ లాయర్ని కలసి ఎలా ముందుకెళ్లాలో అతనితో మాట్లాడతాను. ఇదేం పెద్ద కేసేం కాదు. 90 శాతం గృహహింస కేసులన్నీ ఆవేశంతోనో, అనాలోచితంగానో పెడుతున్నవే. సరియైన విచారణ చేయకుండా అరెస్టులు చెయ్యొద్దనీ సుప్రీమ్‌ కోర్టు పోలీసులకు విస్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు ఇచ్చింది. కాబట్టి పూర్వంలా గృహ హింస కేసులంటే భయపడక్కర్లేదు. ఒకసారి పోలీసు స్టేషన్‌కు వెళ్లామంటే విడాకులే శరణ్యం. ఆ అమ్మాయి ఇవన్నీ ఆలోచించినట్లు లేదు. ఒకసారి విడాకులు తీసుకుంటే పెళ్లిళ్లు కావడం కష్టం. మరీ ముఖ్యంగా స్త్రీవాదులందరూ మగవాళ్లదే తప్పనీ, స్త్రీకి స్వేచ్ఛ ముఖ్యం అంటారు గానీ విడాకుల తదనంతర పరిణామాలు గురించి ఆలోచించరు. కొందరు మొగవాళ్లు వారు అలాంటి వారు కావచ్చు.. కాదనలేము. అలా అనీ అందరినీ ఆ గాటన కట్టేయలేం. విడాకులు తీసుకున్న తరువాత చాలా మంది జీవితాలు ఎలా చితికి పోయాయో నాకు తెలుసు. ముఖ్యంగా పిల్లలు బాధపడుతున్నారు. విడాకులు తీసుకున్న తల్లితండ్రుల పిల్లల జీవితాలు చాలా ఒడుదొడుకులకు లోనవుతాయి. 45 ఏళ్ల దాకా బాగానే ఉంటుంది. తరువాత తోడు లేకపోతే జీవితం నరకం అవుతుంది’’ అనీ వాడికి చెప్పాను…

శ్రీరాంతో ఎంతో సరదాగా ఆనందంగా గడపాలనీ అనుకున్నాను గానీ వాడి కథ విన్న తరువాత నా మనసు వికలమైంది. ఆ బాధతో అన్నం తినబుద్ధి కాలేదు. శ్రీరామ్‌ ఆ మర్నాడంతా నాతో ఉండి కేంబ్రిడ్జి నగరం అంతా చూపించాడు… ఆ రాత్రి సియాటెల్‌ వెళ్లిపోయాడు.

ఆ మర్నాడు నేను కాలేజీలో ఉన్నప్పుడు సమీర నుంచి నాకు ఒక మెసేజ్‌ వచ్చింది. తాను కాల్ఫోర్నియాలో ఉన్నాననీ, వెంటనే వచ్చి తనను కలవమనీ అందులో ఉంది. ఆ మెసేజ్‌ చూసి ఆశ్చర్యపోయాను. నేను అమెరికా వచ్చినట్లు సమీర కెలా తెలిసింది? శ్రీరామ్‌గానీ, మధుగానీ చెప్పారా? అయినా అంత అర్జెంటుగా ఎందుకు రమ్మంది? ఏదైనా సమస్య ఎదురైందా? నా మస్తిష్కంలో ఎన్నో ప్రశ్నలు.

ఏం చెయ్యాలో అర్థం కాలేదు.. ఇక్కడ కొచ్చినా సమీరను కలవకూడదనుకున్నాను కానీ సమీర మెసేజీ చూసిన తరువాత ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు.

అప్పటికే సెమినార్‌ ప్రారంభమైపోయింది. ఈ రోజు నేను పేపర్‌ ప్రెజెంట్‌ చెయ్యబోతున్నాను. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే దాన్ని సరిగ్గా ప్రెజెంట్‌ చెయ్యలేకపోవచ్చు. ప్రొఫెసర్‌ గారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని తన బదులు నన్ను ఇక్కడికి పంపించారు. అటువంటి దాన్ని నేను సరిగ్గా ప్రెజెంట్‌ చెయ్యకపోతే ఆయనకు చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎక్కువగా ఆలోచించకూడదు అనుకొని సెమినార్‌ హాలుకు వెళ్లాను. ఈ రోజుతో ఈ సెషన్‌ పూర్తవుతుంది. నా పేపరు తరువాత వెలిడక్టరీ ఫంక్షన్‌ ఉంటుంది. అందరికీ వైస్‌ ఛాన్సలర్‌ సర్టిఫికేట్స్‌ ఇస్తారు. ఈ సెమినార్‌ ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు సత్య నాదెళ్ల వస్తారనీ నిర్వాహకులు చెప్పారు. ఆ వార్త నాకు చాలా ఆనందం కలిగింది. ఒక భారతీయుడు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సాఫ్ట్వేర్‌ కంపెనీకి సీఈఓగా ఎదిగిన ప్రస్థానం సత్యనాదెళ్లది. ఆయన చూడాలన్న చాలా రోజుల కోరిక ఈ రోజు నెవవేరబోతున్నందుకు చాలా ఆనందం కలిగింది. పేపర్‌ పవర్‌ పాయింట్‌  ప్రెజెంటేషన్‌ ద్వారా ఒక్కొక్క స్లైడ్‌ వేస్తూ ప్రారంభిం చాను. నల్లరేగడి నేలల్లో వంతెనలు, భవనాల పునాదులను ఏ విధంగా నిర్మిస్తే మంచిదో తెలిపే పేపరు అది. మనదేశంలో చాలా ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో నల్లరేగడి నేలలు అధికం. అక్కడ భవనాలుగాని, బ్రిడ్జిలుగాని నిర్మిస్తే ఆ నేలల కుండే ఒక ప్రత్యేక సాగే గుణంవల్ల పునాదులకు బీటలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. వాటికి విరుగుడుగా కొన్ని పద్ధతులు పాటిస్తే వాటి పునాదులను పటిష్టంగా నిర్మించవచ్చనీ ఉదాహరణలు, ఫొటోలతో సహా ఆ పేపరులో పొందుపరిచాను. ఇది నేను ఎంటెక్‌లో చేసిన ప్రాజెక్టే కాబట్టి ఈ నేలల మీద నేను చాలా పరిశోధన చేసాను. ప్రెజెంటేషన్‌ పూర్తైన తరువాత మిస్సెచూసెట్స్‌ ప్రొఫెసర్‌ దాన్ని బాగా మెచ్చుకున్నారు. ఆ మెప్పుకోలుతో నాలో టెన్షన్‌ తగ్గింది. మా ప్రొఫెసర్‌ గారు కూడా ఫోన్‌ చేసి పేపరు బాగా ప్రెజెంట్‌ చేసినందుకు నన్ను అభినందించారు. మర్నాడు కాలి ఫోర్నియా వస్తున్నట్లు సమీరకు మెసేజ్‌ పెట్టేను. ఆమె కూడా నా కోసం ఎదురు చూస్తున్నట్లు రిప్లై పెట్టింది.

ఆ మర్నాడుదయాన్న లోకల్‌ ఫ్లైట్‌లో కాల్ఫోర్నియా చేరాను. ఆమె అక్కడికి దగ్గర్లోనే ఉన్న సిలికాన్‌ వేలీలో పనిచేస్తోంది. అక్కడికి బయలు దేరాను. సిలికాన్‌ వేలీ. ఉత్తర కాలిఫోర్నియా రాష్ట్రంలోని సాన్‌ ఫ్రానిస్కో హై టెక్నాలజీ గ్లోబల్‌ సెంటర్‌. ఇది సాఫ్టవేర్‌ టెక్నాలజీకి ఇన్నోవేషన్‌ వేలీ అని చెప్పవచ్చు. ఈ వాలీలో అతి పెద్ద సిటీ సేన్‌ జోస్‌… ఈ నగరమే కాకుండా సన్నీ వేల్‌, శాంతా క్లారా, రెడ్‌ ఉడ్‌ సిటీ, మాంటెన్‌ వ్యూ, పాలో ఆల్టో, మేన్లో పార్క్‌ లాంటి నగరాలున్నాయి. వీటన్నింటినీ కలిపే సిలికాన్‌ వేలీ అంటారు. సేన్‌ జోస్‌ మెట్రోపాలి టన్‌ నగరపు జీడీపీ ప్రపంచంలో మూడవ పెద్దది. మొదటి రెండూ జూరిచ్‌ స్విట్జర్లాండ్‌, ఓస్లో నార్వేలు.

ఈ వేలిలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ముప్పై కంపెనీల ముఖ్య కార్యాలయాలున్నాయి. ఈ వేలి అభివృద్ధికి కారణం అక్కడి దగ్గర్లోని స్టాన్ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం అని చెప్పవచ్చును. ఆ వేలీని చూడగానే నాకు చాలా ఆనందంగా ఉంది. చుట్టూ పచ్చని చెట్ల మధ్య విశాలమైన రోడ్లు, భవనాలు… ప్రపంచాన్ని శాసిస్తున్న సాఫ్ట్వేర్‌ కంపెనీలన్నీ ఇక్కడే ఉన్నాయన్న సంగతి గుర్తు కొచ్చి నాకు ఒళ్లు గగుర్పాటు కలిగింది.

ఫ్రెడరిక్‌ టెర్మాన్‌ అనే స్టాన్ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ డీన్‌ తమ విద్యార్థులను స్వంత కంపెనీలను పెట్టమనీ ప్రోత్సహించడం వల్ల 1946 నుంచి ఈ వేలీ అభివృద్ధి చెందింది అనీ చెబుతారు.

సమీర ఇచ్చిన చిరునామా ప్రకారం పదకొండు గంటలకు ఆమె ఆఫీసుకి చేరాను. అతి పెద్ద భవనంలోని రెండవ అంతస్తులో ఉంది ఆ ఆఫీసు. నన్ను చూసి తాను చాలా ఆనందించింది. పది నిమిషాల తరువాత ఇద్దరం కిందకు దిగి చెట్ల మధ్య ఉన్న రెస్టారెంటుకు వెళ్లాం. అది ఆఫీసు సమయం కాబట్టి పెద్దగా జనాలు లేరు. మేమిద్దరం దూరంగా ఉన్న చెట్టుకింద ఉన్న టేబిల్‌ దగ్గర కూర్చున్నాం. వెయిటర్‌ రాగానే కాఫీలు తెమ్మని చెప్పింది సమీర. ఆ తరువాత మా మధ్య మౌనం. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. సమీర అమెరికా చదువుకునేందుకు వచ్చినప్పట్నుంచీ నేను ఆమెతో మాట్లాడటం తగ్గించేశాను. కానీ ఈ రోజు అనుకోకుండా రావలసి వచ్చింది. కాఫీలు రాగానే సమీర పాట్‌లోని కాఫీని కప్పులో పోసి ఇచ్చి తను కూడా ఓ కప్పులో పోసుకుంది…

కాఫీ తాగుతూ తన గురించి చెప్పటం మొదలు పెట్టింది.. అలా నేను అమెరికాలో సమీరని కలియడం నా జీవితంలో పెద్ద మార్పుకి కారణమౌతుందనీ నేనూహించలేదు…

   *  *  *

‘‘మనం కాలేజీ వదిలిన తరువాత నువ్వు నన్ను కలియడం తగ్గించేసావు. నిన్ను కలిసి మాట్లాడాలనీ చాలాసార్లు ఎంతో ప్రయత్నించాను కానీ కుదరలేదు. నేను అమెరికా వెళుతున్నందుకు కోపంతో నువ్వు మాట్లాడటం లేదనీ చాలా బాధపడ్డాను. పరీక్ష దగ్గర్నుంచి అమెరికా వెళ్లేదాక మా అన్నయ్యే అన్ని ఏర్పాట్లను చేశాడు. నేను అమెరికా బయలుదేరే రోజు దగ్గర పడిరది. నిన్ను కలవాలనీ మా రైతు శివుడు చేత కబురు పంపిస్తే నువ్వు చదువుకునేందుకు విశాఖపట్నం వెళ్లిపోయావని తెలిసింది. అప్పుడు నేను ఫోన్‌ చేస్తే అవుటాఫ్‌ కవరేజి అనీ వచ్చింది. విమానాశ్రయంలో కలవమనీ కోరుతూ మెసేజ్‌ పెట్టాను. కానీ మా అమ్మానాన్నలు అక్కడికి వస్తారు కాబట్టి నువ్వు రావనీ అనుకున్నాను. నేను అనుకున్నట్లే నువ్వు రాలేదు.

ఆ తరువాత అమెరికా వచ్చిన తరువాత రెండు, మూడు సార్లు నీతో మాట్లాడేను కానీ నీ మాటల్లో పూర్వపు ఉత్సాహం కనిపించలేదు సరికదా నిర్లిప్తతని గమనించాను… ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్లు ఉన్నాయి… అందుకే నేను ఆ తరువాత మాట్లాడటం తగ్గించేసేను..

(సశేషం)

– గన్నవరపు నరసింహమూర్తి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE