‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

చాలా రోజులుగా సమీర నుంచి మెయిల్స్‌ రావటం లేదు. బహుశా ఆమె బిజీగా ఉందేమోననీ నేను కూడా ఆమెకు మెయిల్స్‌ పంపటం లేదు. శ్రీరామ్‌ చదువు పూర్తైఏదో కంపెనీలో చేరి సియాటెల్లో పనిచేస్తున్నడట. మధు అయితే తాత్కాలికంగా ఎక్కడో చేరాడట… ఇండియా వచ్చేద్దామనుకుంటున్నాడట. మొదటిసారి నేను సివిల్స్‌ రాద్దామనుకుంటున్న సమయంలో నాన్నగారికి ఒంట్లో బాగా లేకపోవడంతో రాయలేకపోయాను. ఈ సంవత్సరం ఎంటెక్‌లో ప్రాజెక్ట్‌ వల్ల రాయలేకపోయాను. రాను రాను నాకు సివిల్స్‌ మీద ఆసక్తి తగ్గిపోతోంది. సివిల్స్‌ రాయాలంటే మెదడు ప్రశాంతంగా ఉండాలి. సమస్యలేమీ ఉండకూడదు.

ఒకరోజు భోజనం చేస్తున్న సమయంలో సమీరకు పెళ్లి కుదిరిందనీ ఆ అబ్బాయి అమెరికాలోనే పని చేస్తున్నాడనీ, మా మావ మాకెవ్వరికీ తెలియకుండా పెళ్లిఇ చేద్దామనీ అనుకుంటున్నాడనీ ఒకరోజు భోజనం చేస్తున్న సమయంలో మా అమ్మ చెప్పింది.

బహుశా అందుకే సమీర మెయిల్స్‌ చెయ్యటం లేదేమో అనిపించింది. అయినా సమీరను ఆమె తండ్రి అమెరికాకు ఎమ్‌ఎస్‌ చదువు కోసం పంపిస్తున్నప్పుడే ఆమెకు అక్కడే ఎవరితోనో పెళ్లి చేస్తాడనిపించింది. ఇక్కడుంటే సమీర నాతో తిరిగి తన మాట వినకుండా నన్ను చేసుకుంటుందేమోననీ మా మావ భయం. మా నాన్న గారు చనిపోయినపుడు పరామర్శకు వచ్చాడు మా మావ. ఆ తరువాత వాళెవ్వరూ రాలేదు. కొడుకు హైదరాబాద్‌లో ఉంటున్నాడు కాబట్టి అక్కడికి కుటుంబంతో వెళ్లిపోదామన్న ఆలోచనలో ఉన్నాడు మా మావ.

అందుకే పొలాన్ని రైతుకు అమర్చేసాడు. మావకి కూడా ఈ మధ్యన ఒంట్లో బాగుండటం లేదనీ, ప్రతీవారం డాక్టరు దగ్గరకు వెళ్లే అవసరం ఉందనీ, అందుకు హైదరాబాద్‌ వెళ్లిపోతున్నారనీ మా రైతు చెప్పాడు.

నేను అమెరికా వస్తున్నట్లు శ్రీరామ్‌కు పంపాను. ఫోన్‌ కూడా చేసాను. సమీరకు పెళ్లి కుదిరింది కాబట్టి ఆమెకు నేను అమెరికా వస్తున్నట్లు చెప్పలేదు.. ఆ విషయం మామావకి తెలిస్తే గొడవలు జరిగే ప్రమాదం ఉంది… అందుకే చెప్పలేదు.

వారం రోజుల తరువాత నాకు వీసా వచ్చింది. మా యూనివర్సిటీ లెటర్‌ ఉండటంతో నాకు వీసా త్వరగా మంజూరైంది. అమ్మని జాగ్రత్తగా చూసుకొమ్మని మా రైతు సన్యాసికి చెప్పాను. నాది 20 రోజుల షెడ్యూల్‌. సెమినార్‌ వారం రోజులే.. కాకపోతే అది అమెరికాలో ప్రసిద్ధి చెందిన విశ్వ విద్యాలయం కాబట్టి ఆ సెమినార్‌కు అంతటి ప్రాధాన్యత. స్టాన్ఫోర్డు, మెస్సా చూసెట్స్‌ విశ్వవిద్యా లయాల్ని చూడాలన్న కోర్కె ఎప్పట్నుంచో ఉండటం వల్ల అమెరికా వెళ్లడానికి సిద్ధపడ్డాను.

రెండు రోజుల తరువాత నేను విశాఖపట్నం నుంచి ముంబయి ఫ్లైట్‌లో చేరుకొని అక్కడ నుంచి అమెరికా బయలుదేరాను. బొంబాయి నుంచి 20 గంటల ప్రయాణం. మధ్యలో సాదీ అరేబియాలో నాలుగు గంటల హాల్టు.

ఎలాగైతేనేం రెండు రోజుల తరువాత అమెరికాలో కాలు మోపాను.

అమెరికా… ప్రపంచంలో చాలా గొప్ప అభివృద్ధి చెందిన దేశం… ఇది విస్తీర్ణంలో ప్రపంచ దేశాల్లో రష్యా, కెనడాల తరువాత మూడవ స్థానం. ఆ తరువాత చైనాది. వైశాల్యంలో మనదేశం కన్నా సుమారు మూడు రెట్లు పెద్దది.. జనాభాలో మనకంటె మూడు రెట్లు చిన్నది.

ఇది నార్త్‌ అమెరికా ఖండంలో ఉంది. దీంతో పాటు అదే ఖండంలో కెనడా కూడా ఉంది. ఇందులో 50 రాష్ట్రాలున్నాయి. మనలా కాకుండా రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కలిగినవి. దీనికి ఉత్తరంలో కెనడా, దక్షిణంలో బ్రెజిల్‌ ఉన్నాయి. జనాభా 34 కోట్లు. దీని ముఖ్యపట్నం వాషింగ్టన్‌ డీసీ అయినా జనాభాపరంగా పెద్దది, ఆర్థిక రాజధాని మాత్రం న్యూయార్క్‌ సిటీ. ఇక్కడ 61 శాతం తెల్లవారు, 12 శాతం బ్లాక్స్‌ అంటే నల్లజాతీయులు, 6 శాతం ఆసియా వారు ఉన్నారు. నేటివ్‌ అమెరికన్స్‌ మాత్రం ఒక్క శాతమే ఉన్నారు. 1776లో ఈ దేశానికి బ్రిటిష్‌ దేశం నుంచి స్వాతంత్య్రం వచ్చింది. 1900 సంవత్సరం నుంచి ప్రపంచంలో ఆర్థికంగా పెద్ద దేశంగా తయారైంది.

ప్రపంచ జీడీపీలో పావు శాతం దీనిదే… ప్రస్తుతం 45 లక్షల భారతీయులు అమెరికాలో ఉంటున్నారనీ ఒక అంచనా.

1990 ప్రాంతం నుంచీ అమెరి కాకి వలసలు బాగా పెరిగాయి. సాఫ్ట్‌వేర్‌ రంగం అమెరికాలో బాగా అభివృద్ధి చెందటంతో ఇక్కడికి మనదేశం నుంచి చాలా మంది ఉద్యోగాల నిమిత్తం వస్తున్నారు.

అటువంటి అమెరికాలో నేను మొదటి సారిగా అడుగు పెట్టాను. నేను వెళ్లబోయే మెస్స చూసెట్స్‌ విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జిలో ఉంది కాబట్టి నేను మరో విమానంలో కేంబ్రిడ్జి చేరాను. అక్కడ యూనివర్సిటీ గెస్ట్‌ హౌస్‌లో నాకు ఎకామడేషన్‌ ఇచ్చారు.

యూనివర్సిటీ కాంపస్‌ 161 ఎకరాల్లో విశాలంగా వ్యాపించి ఉంది.. దీని 1861లో స్థాపించారు. అమెరికాలోని మూడు ప్రైవేట్‌ లేండ్‌ గ్రాంట్‌ యూనివర్సి టీల్లో ఒకటి. ఈ విశ్వవిద్యాలయం ఛార్లెస్‌ నది ఒడ్డున ఉంది. ఈ విశ్వవిద్యాలయం నుంచి ఇప్పటి దాకా 98 మంది నోబెల్‌ బహుమతి గ్రహీతలున్నారు.

కాంపస్‌ అంతా పచ్చటి చెట్లతో అందంగా ఉంది. చాలా మంది అక్కడ సైకిల్‌ వాడటం నాకు ఆశ్చర్యం కలిగించింది. గెస్ట్‌హౌస్‌లో దిగి ఆ రోజంతా కేంబ్రిడ్జి నగరంలో తిరిగాను. ఆ మహానగరాన్ని చూస్తుంటే మన నగరాలకు దానికి తేడా బాగా తెలిసింది. విశాలమైన వీధులు, పరిశుభ్రమైన పరిసరాలతో, ఆకాశ హర్మ్యాలతో నగరం చాలా బాగుంది.

ఆ మర్నాడు మా సెమినార్‌ ప్రారంభమైంది. పెద్ద సెమినార్‌ హాల్‌. రెండు వేలమంది ప్రతినిధులు అన్ని దేశాల నుంచీ వచ్చారు. ఆ రోజంతా పరిచయాలు, ప్రసంగాలతో గడిచి పోయింది.

మధ్యాహ్నం ఇద్దరు ప్రొఫెసర్లు భూకంపాలు, ప్రాజెక్టులపై వాటి ప్రభావం అన్న పేపరుని ప్రవేశపెట్టి, వాటి గురించి వివరంగా చెప్పారు. ఆ పేపరు ప్రెజెంటేషన్‌ చాలా అద్భుతంగా ఉంది.

ఆ రాత్రి నాతో మధు మాట్లాడేడు. తను న్యూయార్కులో పనిచేస్తున్నట్లు, పెళ్లి కుదిరినట్లు చెప్పాడు. ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఎమ్మెఎస్‌ చదివి ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పాడు. ఆ మర్నాడు నన్ను చూడటానికి శ్రీరామ్‌ సియాటెల్‌ నుంచి వచ్చాడు. అతనికి క్రితం సంవత్స రమే హైదరాబాద్‌లో పెళ్లైంది. ఆ సమయంలో నాన్నగారు చనిపోవడంతో నేను వాడి పెళ్లికి వెళ్లలేకపోయాను. ఆ అమ్మాయిది హైదరాబాద్‌. ఇద్దరూ అమెరికాలో ఒకే యూనివర్సిటీలో ఎమ్మెస్‌ చదువుతున్నప్పుడు పరిచయం అయి పెళ్లికి దారి తీసిందనీ చెప్పాడు..

ఆ రాత్రి మేము డిన్నర్‌కు వెళ్లినపుడు నాకు వాడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు.

‘వంశీ! ఇక్కడ నేను ఎంఎస్‌లో చేరిన తరువాత నాకు సులోచన అనే అమ్మాయి పరిచయం అయింది. ఆమె కూడా నాతో పాటే ఎమ్మెస్‌ చేసేది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. వాళ్ల నాన్నగారు హైదరాబాదులో సెక్రెటేరియట్లో పనిచేస్తుంటాడు. అతనికి సులోచన ఒక్కర్తే కూతురు. మా అమ్మానాన్నలను చూడవలసిన బాధ్యత నా మీద ఉందనీ పెళ్లికి ముందే ఆమెకు, ఆమె తల్లితండ్రులకు చెబితే ఒప్పుకున్నారు. అలా మా పెళ్లి హైదరా బాదులో జరిగింది. పెళ్లికి 20 తులాల బంగారం పెట్టమనీ వాళ్లు చెప్పడంతో అప్పు చేసి పెట్టాము. పెళ్లైన ఆరునెలల దాకా ఆమె బాగానే ఉంది. ఆ తరువాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. సంక్రాంతి పండుగకు నేను మా ఊరు వెళదామనీ చెబితే ఆమె రాలేదు. హైదరాబాదులో దిగి పుట్టింటికి వెళ్లిపోయింది.

తరువాత నుంచి మా ఇంటికి నన్ను వెళ్లకుండా ఆంక్షలు పెట్టింది. మా పొలం అమ్మి అమెరికాలో ఇల్లు కొనమనీ చెప్పింది. నేను దానికి ఒప్పుకోక పోవడంతో ప్రతీ నెలా మా నాన్నకు డబ్బు పంపించడానికి వీల్లేదనీ గొడవ పెట్టింది. అలా మా ఇద్దరికీ గొడవలు పెద్దవై అమెరికాలో పోలీస్‌ స్టేషన్ల దాకా వెళ్లింది. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేశారు. ఆమె హైదరాబాద్‌ వెళ్లి నా మీద గృహ హింస కేసు పెట్టింది. పోలీసులు మా అమ్మా నాన్నల్ని స్టేషన్‌కు తీసికెళ్లి నానా హింసలు పెట్టారు. ఇప్పుడు నేను ఇండియా వెళితే అరెస్ట్‌ చేస్తారట. అందుకోసం నేను లాయర్తో మాట్లాడితే అతను నా తరపున పిటిషన్‌ వేసి ముందస్తు బెయిల్‌ తీసుకున్నాడు. అమ్మ నాన్నలు అమెరికాలో మా దగ్గర లేకపోవడంతో మా అమ్మ నాన్నల్ని వదిలేసారు.

(సశేషం)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE