పద్మ పురస్కారాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి జనవరి 27న ఒక ప్రకటన చేసి ప్రకంపనలు సృష్టించారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఏటా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో విశిష్ట సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రకటించడం నెహ్రూ కాలం నుండి వస్తున్నది. ఈ సంవత్సరం తెలంగాణకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి ఆరోపణ. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెసు ప్రభుత్వం ఉన్నది. రాష్ట్రం సిఫారసు చేసిన గద్దర్‌, అం‌దెశ్రీ, గోరటి వెంకన్న, చుక్కా రామయ్య, జయధీర్‌ ‌తిరుమలరావు వంటివారు వామపక్ష భావజాలం కలవారు, కనుకనే వీరికి పురస్కారాలు తిరస్కరించారు అని పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌గౌడ్‌ ఆరోపించారు. ‘కరసేవకులను కాల్చి చంపిన ములాయం సింగ్‌కు పద్మ విభూషణ్‌ ఎలా ఇచ్చారు?’ అని కూడా గౌడ్‌ ‌ప్రశ్నించారు. బీజేపీ నాయకుడు బండి సంజయ్‌ ‌వీటికి స్పందిస్తూ, ‘గద్దర్‌ అర్బన్‌ ‌నక్సల్‌ – ‌బరాబర్‌ అతనికి అవార్డులు ఇవ్వం. అతని పేరు మీద అవార్డులు పెడితే తీసుకోం’ అన్నారు. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావజాలం కలిగినవారికే కేంద్ర పురస్కారాలు ఇస్తారా?’ అంటూ మహేశ్‌గౌడ్‌, ‌గద్దర్‌ ‌కుమార్తె వెన్నెల ప్రశ్నించడంతో ఈ వివాదం కాస్త ముదిరింది.

ఇంతకూ వాస్తవాలేమిటి? పద్మ పురస్కారాలు, సంగీత, నాటక, సాహిత్య అకాడమీ పురస్కారాలు గత అరవై సంవత్సరాలు కాంగ్రెసు పాలనలో కమ్యూనిష్టులే స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్‌గా మంజుశ్రీ ఉన్నప్పుడు కామ్రేడ్‌ ‌కేతు విశ్వనాథ రెడ్డి, వోల్గా వంటి వారు ఆయనపై చేసిన దాడికి మంజుశ్రీ కంటతడి పెట్టుకున్నాడు. ప్రస్తుతం (2024-25) కేంద్రంలో అధికారంలో బీజేపీయే ఉన్నా పెనుగొండ లక్ష్మీనారాయణ అనే కామ్రేడ్‌ ‌కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందడం దేనిని సూచిస్తుంది? కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడు అంబేడ్కర్‌, ‌పీవీల వంటివారికి భారతరత్న పురస్కారాలు రాలేదు. ఎందుకని? అంజలి, జమున, ఎస్‌.‌వి. రంగారావు, సావిత్రి, వాణిశ్రీ, సిఎస్‌ఆర్‌, ‌జి.వరలక్ష్మి, ఎస్‌. ‌వరలక్ష్మి, విజయనిర్మల వంటి అగశ్రేణి నటీనటులను నిర్లక్ష్యానికి గురయ్యారు. ఇందిరాగాంధీ వంటివారు అధికారంలో ఉన్నప్పుడు సెల్ఫ్ ‌గోల్‌ ‌చేసుకొని భారతరత్నాలు పొందారు. నెహ్రూ తనను భారతరత్న అని ప్రకటించుకున్నాడు.

రాజకీయ లబ్ధికోసం ఎంజీఆర్‌కు భారతరత్న ఇచ్చారు. మహారాష్ట్ర మాకియవిల్లీ శరద్‌ ‌పవార్‌కు బీజేపీ ప్రభుత్వమే పద్మ విభూషణ్‌ ఇచ్చింది. స్వతంత్ర వీరసావర్కర్‌ ‌ముఖం కాంగ్రెసు, బీజేపీ కూడా చూడలేదు. టంగుటూరి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, స్వామి దయానంద, నేతాజీ సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌వంటి మహనీయులకు ఎవరూ భారతరత్న ఇవ్వలేదు. ఎందుకని? ఇండియాలో ఉన్నవారికి దిక్కులేదు. గద్దర్‌ ‌మీద కాంగ్రెసుకు ప్రేమ ఉంటే తన పరిపాలనా కాలంలో ఎందుకు పురస్కారం ఇవ్వలేదు? ఇలాంటి యక్షప్రశ్నలు ఎన్నో! కర్ర ఉన్నవాడిదే బర్రె. కేంద్ర రాష్ట్ర పురస్కారాలలో నిజాయతీ ఎంత?

దేశంలో ప్రధానంగా మూడు భావజాలాలు కొనసాగుతున్నాయి. మొదటిది సావర్కర్‌ ‌ప్రతిపా దించిన హిందూత్వ – రెండవది కమ్యూనిష్టుల రష్యా-చైనా నమూనా, మూడవది అధికారదాహంతో సెమిటిక్‌ ‌మతాల సంతుష్టీకరణతో సాగే కాంగ్రెసు అవకాశవాద భావజాలం. ప్రస్తుతం కాంగ్రెసు ఉభయ కమ్యూనిష్టు పార్టీలు చతికిలపడ్డాయి. సావర్కర్‌, ‌వివేకానంద, గోల్వాల్కర్‌ ‌ప్రతిపాదించిన జాతీయవాదం బలపడింది. అందుకని చైనా తన అనుయాయులను వ్యూహాత్మకంగా అర్బన్‌ ‌నక్సల్స్‌గా మారండి అని చెప్పింది. భారత హోంమంత్రి అమిత్‌ ‌షా జంగిల్‌ ‌టెర్రరిజాన్ని 2026 నాటికి నిర్మూలిస్తామని చెప్పారు. కాని రంగు మార్చుకున్న అర్బన్‌ ‌టెర్రరిస్టు వ్యూహాన్ని కమలనాథులు పసికట్టలేకపోతున్నారు. పద్మ పురస్కారాల ఎంపిక – వివాదం సందర్భంగా ఈ సిద్ధాంత నేపథ్యాన్ని తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. నీరు లేకుండా చేప జీవించలేదు. అలాగే పురస్కారాలు లేకుండా కమ్యూనిస్టులు బ్రతకలేరు. రాష్ట్ర కేంద్ర పురస్కారాల కోసం వాళ్లు ఎంతకైనా దిగజారుతారు. ఎన్ని పాపాలైనా చేస్తారు. భారతదేశాన్ని సావర్కర్‌ ‌భావజాలం పాలించాలా? మావో – జిగ్‌పింగ్‌ ‌భావజాలం పాలించాలా? అనే సమస్య మీద ఈ పద్మపురస్కారాల వివాదం సాగుతున్నది. ప్రచార వ్యూహంలో బీజేపీ కన్నా కమ్యూనిష్టులు చాలా ముందంజలో ఉన్నారు.

నెహ్రూ యుగంలో వి.కె. కృష్ణమీనన్‌, ఇం‌దిరమ్మ యుగంలో మణిశంకర్‌ అయ్యర్‌, ‌సోనియమ్మ కాలంలో పి. చిదంబరం, రాహుల్‌ ‌గాంధీ యుగంలో కన్హయ్య కుమార్‌ ‌వంటి అర్బన్‌ ‌నక్సల్స్ ‌కీలక భూమిక పోషించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కమ్యూనిష్టులు తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అవతారం ఎత్తారు. తమిళనాడుతో డిఎంకెతో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణాలో కేసీఆర్‌ ‌చంకలో దూరారు. ఇలా ప్రాంతీయ పార్టీలను చైనా తన జేబులో వేసుకొని ఫెడరలిజం పేరుతో కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. ఈ వ్యూహాన్ని సంఘ పరివార్‌ ఎం‌త వరకు పసికట్టిందో తెలియదు. మనకు వ్యక్తి నిర్మాణమే ముఖ్యం, ప్రచారాలు, పురస్కారాలు ఎందుకు? అని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తన కార్యకర్తలకు చెబుతున్నది. ఇక్కడే ఒకటి ఆలోచించాలి. మరి జాతీయవాద కవుల కలాలు, గళాలు ఎందుకు మూగపోయాయి? వీరేమో వన భోజనాలకు, కవన భోజనాలకు పరిమితమైనారు. అటు ఉగ్రవాదులు మోహన్‌ ‌భాగవత్‌ను, సావర్కర్‌ను తిడుతూ ఇవ్వాళ పత్రికా ప్రకటనలు చేశారు.

మొన్న జితే•ందర్‌ ‌రెడ్డి అనే సినిమా వచ్చింది. మల్లారెడ్డి గారి కుమారుడు జితేందర్‌ ‌దేశభక్తుడు. ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ టెర్రరిస్టులకు స్ఫూర్తి గద్దర్‌. ‌తన ఆటతో పాటతో అడవి అన్నలను ఉద్రేకపరిచాడు. అలాంటి గద్దర్‌ ‌పేరు మీద కాంగ్రెసు ప్రభుత్వం అవార్డులు ఇస్తున్నది. ఇందులో ఔచిత్యం ఎంత? అని ఎవరూ ఆలోచించడం లేదు. ఎన్‌.‌టి. రామారావుకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు? ఆధ్యాత్మిక రంగంలో సామవేదం షణ్ముఖశర్మ, కమలానంద భారతీ, పరిపూర్ణానంద స్వామిలకు  గుర్తింపును కేంద్రం ఎందుకు ఇవ్వలేదు? ఇంగ్లీషు జర్నలిజంలో రిపబ్లిక్‌ ‌ఛానల్‌ అర్ణవ్‌ ‌గోస్వామి, నావికా చేస్తున్న సేవ అనితర సాధ్యం.

కేంద్రం కూడా కొన్ని అంశాలు పరిగణనలోనికి తీసుకోవాలి. మేధావి వర్గానికి చెందిన రాజీవ్‌ ‌మల్హోత్రా, సుబ్రహ్మణ్యస్వామి, గురుమూర్తి (తమిళనాడు) పద్మశ్రీ పురస్కారానికి అర్హులు కారా? 85 ఏళ్ల వయసులో ఈ వ్యాసకర్త 152 పుస్తకాలు రచించి, ప్రచురించాడు. కాంగ్రెసు, కమ్యూనిస్టులకు నేనంటే కోపం. మరి బీజేపీ వారు ఈ విషయం దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది కదా! అది జరుగలేదు. ఎందుకని?

స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి వామపక్షీయులు చిత్రరంగాన్ని స్వాధీనం చేసుకొని పురస్కారాలు ఇప్పించుకున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా ఈ ధోరణిని ఆపలేకపోయింది. హైదరాబాదు దీప్తి శ్రీనగర్‌ ‌జి.సత్యవాణి అనే ఆధ్యాత్మిక సాధ్వి ఉంది. ఆమె చేస్తున్న సేవలను ఇటు రాష్ట్ర ప్రభుత్వమూ, అటు కేందప్రభుత్వమూ గుర్తించలేదు. కోటి దీపోత్సవాన్ని ఒక ఉద్యమంలాగా నిర్వహిస్తున్న భక్తి చానల్‌ అధిపతి నరేంద్ర చౌదరి పేరు ఎవరూ రికమండ్‌ ‌చేయలేదా? వరంగల్‌ ‌చేతనావర్త కవి కోవెల సుప్రసన్నాచార్య పురస్కారానికి యోగ్యుడు కాడా? నేడు అగశ్రేణి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పేరు ఢిల్లీకి వెళ్లలేదా? ఎందుకని?

మహాత్మా గాంధీని పంది అని తిట్టిన ఋత్విక్‌ ‌ఘటక్‌ అనేవాడికి బెంగాల్లో జ్యోతిబసు పద్మశ్రీ ఇప్పించి సత్కరించడం దుర్మార్గం కాదా? ‘‘నేను తెలుగు దేశం పార్టీ సపోర్టర్ను అనే కారణంతో నాకు పద్మశ్రీ ఇవ్వవద్దు అని కాంగ్రెసు వారు అన్నారు’’ ఇది కైకాల సత్యనారాయణ అనే అగశ్రేణి ఫిలిం నటుడు నా ముందే చేసిన ప్రకటన. ఇదంతా దేనిని తెలియజేస్తున్నది?

కేంద్ర రాష్ట్ర (ఉగాది) పురస్కారాల ఎంపికకు మీ మీ విధివిధానాలు, ప్రమాణాలు ఏమిటో పత్రికాముఖంగా ప్రకటించండి. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధరబాబు తండ్రి మహనీయుడు శ్రీపాదరావును హత్య చేసిన వారు గద్దర్‌ ‌పాటలు విని స్ఫూర్తి పొందినవారే.

నూరు ఎలుకలు తిన్న పిల్లి హజ్‌ ‌యాత్ర చేసింది అని ఉర్దూలో ఒక సామెత ఉంది. వందలాది భారత సైనికులను, శ్రీపాదరావు, హయగ్రీవాచారి వంటి కాంగ్రెసు నాయకులను చంపించినవారికి పద్మ పురస్కారాలు ఎందుకు ఇవ్వాలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వాలి. నేడు ఖద్దరు కప్పుకున్న గద్దర్‌ ‌మీకు బుద్ధునిలా కన్పించడానికి కారణం ఏమిటి? అతని పేరు మీద నంది పురస్కారాలు ఇవ్వడమేమిటి?

ఎర్రదండు పురస్కారోన్మాదం

పైరవీలు చేసి జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు సంపాదించిన దేశద్రోహులు ఎలాంటి భాష ఉపయోగిస్తారో కొన్ని ఉదాహరణలు చూడండి:

‘‘గద్దరు అవార్డు ఎందుకు? గద్దర్‌ అనే పేరే ఒక అవార్డు’’

-టి.వి.-10 యాంకర్‌.

‘‘‌నరేంద్ర మోడీ మూర్ఖుడు’’

– అమర్త్యసేన్‌ – 1999 ‌భారతరత్న, నోబుల్‌ ‌బహుమతి గ్రహీత,

‘‘మోదీ అధికారంలోకి వస్తే నేను భారతదేశం వదిలిపెట్టి వెళ్తాను’’ – యు.ఆర్‌. అనంతమూర్తి (కర్ణాటక) జ్ఞానపీఠ్‌ ‌పురస్కార గ్రహీత.

‘‘ఇండియా హిందువులకు చెందదు. ఇదొక బహుళజాతి సమ్మేళనం’’ – వల్లంపాటి వెంకట సుబ్బయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత.

భారతమాతను బూతులు తిట్టిన దిగంబర కవులకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. భారత జాతీయవాదాన్ని తిరస్కరించిన మహాశ్వేతాదేవి (బెంగాల్‌)‌కు జ్ఞానపీఠ పురస్కారం ఇప్పించారు. సుమారు 20 ఏళ్ల నాటి మాట: కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షునిగా ఒక జాతీయవాది నారంగ్‌ ఎం‌పిక అయినాడు. అతనిని గద్దె దింపేవరకు రచయిత్రి మహాశ్వేతా నిద్రపోలేదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.

ప్రొ. ముదిగొండ శివప్రసాద్‌

‌విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE