అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌

‌శాలివాహన 1946 శ్రీ క్రోధి మాఘ బహుళ ఏకాదశి

పేరు భారత జాతీయ కాంగ్రెస్‌ ‌కావచ్చు. కానీ భారతీయత పట్ల తనకు ఉన్న ప్రతికూలతను, దేశ సార్వభౌమాధికారం పట్ల, భద్రత పట్ల ఉన్న అగౌరవాన్ని ఆ పార్టీ బాహాటంగానే వెల్లడిస్తున్నది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్నీ, దేశాన్ని రక్షించే సైన్యాన్నీ గౌరవించుకునే తత్త్వం ఆ పార్టీలో పలచబడిపోయింది. భారత్‌తో శత్రుత్వం ప్రకటించిన, వైరాన్ని ప్రదర్శిస్తున్న ప్రతి వ్యవస్థతోను ఆ పార్టీ పెద్దలు మమేకమై ఉండడం కూడా తిరుగులేని వాస్తవమే. భారత వ్యతిరేక వ్యవస్థలతో తమ అనుబంధాన్ని వ్యక్తీకరించడానికి శతాధిక సంవత్సరాల పార్టీ రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నది. టుక్డే టుక్డే ముఠాల నాయకులకి సిద్ధాంత రూపకల్పనలో పెద్ద పీట వేయడం, భారత్‌లో ప్రభుత్వాలను అస్థిరపరిచే పనిలో ఉన్నవాళ్లకి తోడ్పాటునివ్వడం, టూల్‌కిట్‌ ‌ముఠాల హక్కుల కోసం గోల చేయడం, భారత్‌తో నిరంతరం కాలు దువ్వే ఇరుగు పొరుగు గొప్పతనాన్ని వేనోళ్ల కీర్తించడం ఆ పార్టీలో బాహాటంగా కనిపిస్తున్న పోకడ. ఆ పార్టీ ప్రవాస భారత విభాగం అధ్యక్షుడు శామ్‌ ‌పిత్రోడా చైనా మంచితనాన్ని కీర్తిస్తూ చేసిన తాజా వ్యాఖ్యలూ; అస్సాం కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు, ఎంపీ, గౌరవ్‌ ‌గొగొయ్‌ ‌బ్రిటిష్‌ ‌జాతి భార్యపై వచ్చిన ఆరోపణలూ దేశాన్ని ఆ దిశగా ఆలోచింపచేసేవే.

చైనాను శత్రువుగా చూడొద్దు అంటున్నారు శామ్‌. అసలు ఆది నుంచి భారత్‌ ‌చైనాతో ఘర్షణ వైఖరితోనే ఉన్నదట. ఆ దేశం గొప్పతనాన్ని గుర్తించి గౌరవించాలట. ఐఏఎన్‌ఎస్‌ అనే వార్త సంస్థతో మాట్లాడుతూ శామ్‌ ఈ ‌హితవచనాలు పలికారు. ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌శ్వేత సౌధంలో సమావేశమైనప్పుడు ఈ ఇరు ఆసియా దిగ్గజాల మధ్య ఉన్న సంఘర్షణను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం వహిస్తామంటూ అగ్రదేశం ఉత్సాహం చూపించడం, అందుకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రీ నిరాకరించడం తెలిసిందే. ఆ నేపథ్యంలో వెలువడిన శామ్‌ ‌వ్యాఖ్యలను సాధరణమైనవిగా పరిగణించడం సాధ్యం కాదు. చైనా గురించి అమెరికా చెబుతున్న భాష్యం ఆధారంగా డ్రాగన్‌ను శత్రువుగా పరిగణించడం తప్పిదమని శామ్‌ ‌వాపోతున్నారు. కాబట్టి భారత్‌ ‌చైనా పట్ల తన వైఖరిని మార్చుకోవడం తక్షణావసరమని కూడా అమెరికాలో ఉండే శామ్‌ ‌హితోపదేశం చేశారు. ఇక్కడ ఒక ప్రశ్న. శామ్‌ ‌భారత్‌ను బెదిరించదలిచారా? చైనా అనే ఎర్రభూతం చేసిన, చేస్తున్న ఘోరాలను మరచిపొమ్మనీ, అణగిమణిగి ఉండాలనీ, లేదంటే మనకే నష్టమని చెప్పడం ఆయన ఉద్దేశమా? అక్కడ అభివృద్ధి నిజమే. కానీ అది నియంతృత్వం నీడలో జరిగింది. భారత్‌లో అభివృద్ధి ప్రజాస్వామ్య పంథాలో సాగింది. ఇది గుర్తించాలి. చైనా అభివృద్ధికి మానవీయ కోణం లేదు. కాబట్టి దానిని చూసి నేర్చుకోవలసిన అవసరం భారత్‌కు ఉండదు.

ఆది నుంచి చైనాతో భారత్‌ ‌సంఘర్షణాత్మక వైఖరితోనే ఉందని చరిత్ర పట్ల కనీస అవగాహన ఉన్నవారు ఎవరైనా చెప్పగలరా? అంతర్జాతీయ దౌత్య విలువలను చైనా ధ్వంసం చేసిన తీరుతెన్నులు ఎరిగిన ఎవరైనా డ్రాగన్‌తో ఘర్షణ అవాంఛనీయమని తీర్పు ఇవ్వగలరా? హిందీ-చీనీ భాయి భాయి అనే నినాదాన్ని దారుణంగా భగ్నం చేసినది ఎవరో శామ్‌ ‌వంటివారికి తెలియకపోతే ఆ పార్టీలో ప్రముఖులైనా నేర్పితే మంచిది. ‘పంచశీలలో ఊడిపోయిన సీల పేరు చైనా’ అంటాడు మన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌.1962‌లో ఎవరు ఎవరి మీద దండెత్తారు? అరుణాచల్‌‌ప్రదేశ్‌ ‌మీద చైనా వాదన ఎంత అసంబద్ధమో శామ్‌కు తెలియనిది అనుకోగలమా? 1962 యుద్ధం తరువాత డార్జిలింగ్‌ ‌చైనాకే చెందుతుందని వాదించిన కమ్యూనిస్టులను ఆనాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎందుకు ఊచలు లెక్క పెట్టించవలసి వచ్చింది? పీవీ నరసింహారావు అంటే కాంగ్రెస్‌ ‌పెద్ద కుటుంబానికి ఈసడింపు ఉండవచ్చు. కానీ ఆయనను కాంగ్రెస్‌వాది కాదని ఎవరూ అనలేరు. కాబట్టి పీవీ ఆత్మకథాత్మక కథ ‘ది ఇన్‌సైడర్‌’‌లో చైనా ఎంతటి ప్రమాదకారో తెలియచేస్తూ, నిరంతరం గుర్తు చేస్తూ నెహ్రూకు సర్దార్‌ ‌పటేల్‌ ‌రాసిన లేఖల ప్రస్తావన గురించి శామ్‌ ‌గమనించాలి. అంతర్జాతీయ శాంతిదూత హోదా మత్తులో పడిపోయిన నెహ్రూ గాఢ నిద్రను వదిలించడానికి పటేల్‌ ‌పెద్ద ప్రయత్నమే చేశారు. అది విఫల మైంది. ఫలితం, యుద్ధం. పాకిస్తాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌లో చైనా ఆక్రమించుకున్న భూభాగం చూసినా మనమే చైనాతో సంఘర్షణాత్మక వైఖరితో ఉన్నామని ఎవరైనా అంటే వాళ్ల దృష్టిని శంకించవలసిందే. గల్వాన్‌ ‌లోయ పరిణామాలతో కూడా చైనా పట్ల మనమే ఘర్షణ వైఖరితో ఉన్నామని అంటే దేశం పట్ల వాళ్లకి ఉన్న దృక్పథాన్ని, దేశం పట్ల వాళ్ల ప్రేమని అనుమానించక తప్పదు.

అస్సాం కాంగ్రెస్‌ ‌నాయకుడు, ఎంపీ గౌరవ్‌ ‌గొగొయ్‌ ‌బ్రిటిష్‌ ‌భార్య ఎలిజబెత్‌ ‌కోల్‌బర్న్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. అస్సాం కేంద్రంగా భారత్‌ ‌వ్యతిరేక కార్యకలాపాలు జరుపుతున్న ముఠాలపై దర్యాప్తు కోసం హిమంత ఒక కమిటీని కూడా నియమించారు. ఎలిజిబెత్‌తో కలసి పని చేసిన పాకిస్తాన్‌ ‌దేశీయుడు అలీ తౌకీర్‌ ‌షేక్‌ అనే వ్యక్తి మీద ఆ కమిటీ కేసు నమోదు చేసింది.

ఈ రెండు అంశాల మీద కాంగ్రెస్‌ ‌రెండు రకాలుగా స్పందించవలసి వచ్చింది. శామ్‌ ‌పిత్రోడా వ్యాఖ్యలు వ్యక్తిగతమనీ, వాటికీ పార్టీకీ ఏమీ సంబంధం లేదని ఆ పార్టీ మేధోవర్గ నేత జైరామ్‌ ‌రమేశ్‌ ‌చెప్పుకున్నారు. కానీ ఎంపీ గౌరవ్‌ ‌గొగొయ్‌ ‌భార్య విషయం మాత్రం పార్టీని అప్రతిష్ట పాల్జేయడానికి పన్నిన ఎత్తుగడ అని ఆయన తేల్చి పారేశారు. నిజానికి చైనా లేదా పాక్‌ ‌పట్ల అవ్యాజమైన అనురాగం చూపించడం ఆ పార్టీకి కొత్త కాదు. ఇప్పుడు కాస్త ఎక్కువైంది. కాంగ్రెస్‌కు భారత్‌ ‌పట్ల ఎప్పుడూ గౌరవం లేదని బీజేపీ ఆరోపించడం అందుకే. భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేకత, భారత్‌ ‌పట్ల వ్యతరేకత వేర్వేరని ఆ పార్టీ ఎప్పుడు గుర్తిస్తుంది?

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE