కె.కె.భాగ్యశ్రీ

‘‘‌విద్యా… కొంచెం మంచి నీళ్లం దుకో…’’ హాల్లోనుంచి భర్త కేకేసినట్లుగా అనిపించి, చేస్తున్న పని మధ్యలోనే ఆపేసి, గ్లాసుతో మంచినీళ్లు పట్టుకుని హాల్లోకి నడిచింది విద్యావతి.
‘‘ఇదేంటి’’ అమెవైపు చూస్తూ కళ్లెగరేశాడు నిశాపతి.
‘‘మంచి నీళ్ళు అడిగారు కదా!’’
‘‘నేనడిగానా?’’ అయోమయంగా చూశాడు నిశాపతి.
‘‘ఏమో! అడిగినట్లుగా అనిపించింది. అందుకే తెచ్చాను.’’ సంజాయిషీ ఇచ్చింది విద్యావతి ఏదో తప్పు చేసినట్లుగా తలదించుకుంటూ.
‘‘సరిపోయింది సంత’’ అతడు హేళనగా అనక పోయినా, అలానే అనుభూతి చెందింది ఆమె.
‘‘నీకు వినబడాల్సినవి వినబడవు కానీ,అక్కరలేనివి మా బాగా వినిపిస్తాయి.’’ నిశాపతి విసిరిన వాగ్బాణం ఒక ములుకులా విద్యావతి మదిలో నాటుకుంది.
కళ్లలో అలుముకున్న నీటి తెరలు అతడికి కనబడకుండా ముఖం పక్కకి తిప్పుకుని, చేతిలోని నీళ్ల గ్లాసు అక్కడే ఉన్న టీపాయ్‌ ‌మీద పెట్టేసి వెనుదిరిగింది విద్యావతి.
తానన్న మాటలకి ఆమె నొచ్చుకుందని ఎరిగిన నిశాపతి ‘‘ఇప్పుడు నేనేమన్నాననీ! ఉన్నమాటేగా?’’ అన్నాడు కాస్త గట్టిగా.
ఉన్నమాటే అయినా తనలోని శారీరిక వైకల్యాన్ని పదేపదే ఎత్తి చూపుతూ, అతడు తన కుసంస్కారాన్ని బయటపెట్టుకుంటున్నాడని అతడికి ఎప్పటికి తెలుస్తుంది!
విద్యావతి కళ్లమ్మట బొటబొటా నీళ్లు కారాయి.
విద్యావతికి చెముడు చిన్నప్పటి నుంచీ లేదు. చెముడంటే పూర్తిస్థాయి చెముడు కాదు. పాక్షికంగా.. అంటే కొన్నిరకాల మాటలు, కొన్ని ఫ్రీక్వెన్సీలలో ఉండే శబ్దాలు వినబడవు.
ఉదాహరణకి ఇయర్‌ ‌ఫోన్స్ ‌పెట్టుకుని పాటలు గాని వింటే ఒక చెవిలో చక్కగా వినబడుతుంది. వేరే చెవిలో పెట్టుకుంటే ఏదో నూతిలో నుంచి వస్తున్నట్లుగా వినబడతాయి.
మామూలుగా మనుషులు మాట్లాడుకుంటూంటే స్పష్టంగా మాట్లాడే మాటలు చక్కగా వీనులని తాకుతాయి. కాని, కొంచెం వేగంగా, అస్పష్టంగా మాట్లాడే భర్త మాటలు మాత్రం వినిపించీ, వినిపించ నట్లుగా అనిపిస్తాయి. మళ్లీ మళ్లీ అడిగితే నిశాపతికి విసుగు.
‘‘అబ్బ! నీ చెముడు కాదుగాని, నేను చస్తున్నా. ప్రతీదీ ఒకటికి పదిసార్లు చెప్పాల్సి వస్తోంది.’’ అనో ‘‘నీకు చెముడు కదా అందుకే కాస్త గట్టిగా అరిచి చెప్పా.’’ అనో అసహనంగా అతడు పలికే మాటలు విద్యావతి హృదయాన్ని కల్లోలపరుస్తాయి.
అసలు విద్యావతికి ఈ స్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాల్సి వస్తే మూడేళ్ల కిందట ఆమెకు హఠాత్తుగా చెవిలో అసౌకర్యం ఏర్పడింది. అస్తమానం చెవిలో తడిగా అనిపించడం, లాడి లాంటి పదార్థం చెవిలో ఉత్పన్నమై, దుర్వాసన రావడం లాంటి ఇబ్బందులు తలెత్తాయి.
అది బయటకు కారడం లాటిదేదీ జరగలేదు గాని, చెవిలో తేమగా ఉండడంతో తరుచుగా దూది బడ్స్ ‌లాంటివి పెట్టి చెవిలో శుభ్రపరుచుకోవడం ప్రారంభించింది విద్యావతి.
వెంటనే స్పందించి, డాక్టర్‌ని కలిస్తే పరిస్థితి వేరేగా ఉండేదేమో కాని, చిన్నపాటి సమస్యే కాబోలు, దానంతట అదే తగ్గిపోతుందిలే అన్న నిర్లక్ష్యం సమస్యని పెద్దది చేసింది. కొద్దికొద్దిగా వినికిడి శక్తి తగ్గడం మొదలైంది.
ఇంట్లో చెబితే అందరూ ఆమెకి ముక్క చీవాట్లేశారు. ఇలాంటి విషయాల పట్ల అజాగ్రత్త తగదని ఆమెని మందలించి చెవి, ముక్కు, గొంతు నిపుణుడికి చూపించారు.
చెవిలో డస్ట్ ‌పేరుకుపోవడం వలన అలా అవుతోందని చెప్పి, చెవి క్లీన్‌ అవడానికి ఏవో ఇయర్‌ ‌డ్రాప్స్ ‌రాశారు. భయపడాల్సిన పనిలేదని, త•గ్గిపోతుందని డాక్తర్‌ ‌గారు హామీ ఇచ్చారు కూడా.
అప్పటికి విద్యావతి మనసు కుదుటపడింది. కాని, వైద్యుడు హామీ ఇచ్చినట్లుగా ఆమెకి నయమవలేదు. సరికదా సమస్య మరింత తీవ్రమైంది.
మళ్లీ డాక్టర్‌ ‌గారిని సందర్శించుకుంటే, వేరే మందులు మార్చి ఇచ్చారు.
ఈసారీ తగ్గలేదు. ఈయనతో లాభం లేదని వైద్యుడిని మార్చారు. ఆయన చెవిని పరీక్షించి కర్ణభేరి పొరకి చిన్న రంధ్రం పడిందని, మందుల వలన తగ్గుతుందని చెప్పారు. కాని, ఆయన హామీ కూడా ఫలించలేదు.
అప్పుడు విద్యావతి పెద్దకొడుకన్నాడు ‘ఆపరేషన్‌ అవసరమేమోనమ్మా! డాక్టర్‌ ‌గారిని అడిగి చేయించేసుకో. ఎలాగూ నాకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ‌కవరేజ్‌ ఉం‌ది కదా!’’
మళ్లీసారి డాక్టర్‌ని కలిసినప్పుడు విద్యావతి డాక్టర్‌ ‌గారిని ఈ విషయమై అడిగింది.
‘‘చూద్దామమ్మా…మందులవలన తగ్గకపోతే అదే చేద్దాం.’’ అన్నాడాయన.
మందుల వలన ఏ ప్రయోజనమూ కనిపించడంలేదు. పైగా ఆ డాక్టర్‌ ‌గారి హాస్పిటల్‌లో హెల్త్ ఇన్స్యూరెన్స్ ‌కవరేజ్‌ ‌కూడా లేదని తెలిసింది.
‘‘ఎటూ హెల్త్ ‌కవరేజ్‌ ఉం‌ది కదా! మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కన్సల్ట్ ‌చేద్దాం. అక్కడైతే ట్రీట్‌మెంట్‌ ‌బాగుంటుంది.’’ అన్నాడు నెల రోజులుగా ఇ.ఎన్‌.‌టి.ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ విసిగిపోయిన నిశాపతి.
అనుకున్నట్లుగానే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌లో ఇ.ఎన్‌.‌టి.ని కన్సల్ట్ ‌చేశారు. ఆయన విద్యావతి చెవిని పరీక్షించి ‘‘లాభంలేదమ్మా! ఆపరేషన్‌ ‌చేయాల్సిందే. చూడండి. పొర మొత్తం వదిలేసింది.’’ అంటూ కంప్యూటర్‌ ‌స్క్రీన్‌ ‌మీద కనబడుతున్న ఆమె చెవి భాగాన్ని చూపించాడు.
విద్యావతికి ఏమీ బోధపడలేదు. కాని, అర్థమై నట్లుగా తలాడించింది.
తమకి హెల్త్ ఇన్షూరెన్స్ ‌కవరేజ్‌ ఉం‌దని డాక్టర్‌కి చెప్పాడు నిశాపతి.
సంబంధిత ఇన్‌చార్జిని కలవమని, అందుకు కావలసిన ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తి చేసుకుని హాస్పిటల్‌లో చేరితే వెంటనే ఆపరేషన్‌ ‌చేసేస్తానని చెప్పాడు డాక్టర్‌.
ఆ ‌తరువాత జరగవలసిన పక్రియ అంతా పూర్తి అయ్యాక హాస్పిటల్‌లో చేరింది విద్యావతి.
ఆనాటి మధ్యాహ్నమే ఆమెకి చెవి ఆపరేషన్‌ ‌చేశారు. చెవిలో కృత్రిమ పొర వేశారు.
తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి ఆమెను మరునాటి ఉదయమే డిశ్చార్జ్ ‌చేశారు. దూరాన ఉన్న పిల్లలని ఇబ్బంది పెట్టడం దేనికని వాళ్లు పిల్లలని రమ్మని చెప్పలేదు. అనుక్షణం ఫోన్లు చేసి తల్లి యోగక్షేమాలు విచారిస్తూనే ఉన్నారు.
ఇంటికొచ్చిన తరువాత ఇంట్లోని పనులు చేయడమే నిశాపతి తలకి మించిన భారమైంది. ‘అలవాటు లేని ఔపాసన’ కారణంగా అతడు వంట చేయడానికి తడుముకున్నాడు.
తనని చూడడానికి వచ్చిన ప్రాణ స్నేహితు రాలితో భర్త పడుతున్న అవస్థ గురించి చెప్పుకుని వాపోయింది.
దానికి ఆమె ‘బాధపడకు విద్యా! నాకు తెలిసిన క్యాటరింగ్‌ అవిడ ఉంది. ఆమె కూరలు గట్రా ఇంటికి తెచ్చి ఇస్తుంది. అన్నయ్య గారిని కుక్కర్‌ ఒక్కటీ పెట్టేసుకోమను.’’ అంటూ సదరు ఆమె ఫోన్‌ ‌నంబర్‌ ఇచ్చింది.
‘‘రక్షించావు తల్లీ.’’ ఆత్మీయంగా స్నేహితురాలి చేయి పట్టుకుంది విద్యావతి.
కొన్నాళ్లు గడిచాయి. ఆపరేషన్‌ ‌చేసిన చెవి బ్రహ్మాండంగా వినిపించడంతో విద్యావతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
‘ఆధునిక వైద్యంలో అసాధ్యం అన్న పదానికి చోటే లేదు కదా!’ అనుకుని మురిసిపోయింది.
అయితే మురిపెం మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. క్రమక్రమంగా చెవి వినికిడి శక్తిని కోల్పో సాగింది. మామూలుగా మనుషులు తన సమక్షంలో మాట్లాడిన మాటలు బాగానే వినబడుతున్నా, ప్రత్యేకించి ఆపరేషన్‌ ‌చేసిన చెవి వైపు మాట్లాడే మాటలు అంతగా వినబడడం లేదు. ఇయర్‌ ‌ఫోన్స్ ‌పెట్టుకుని పాటలు వింటూంటే దెబ్బతిన్న చెవిలో అస్సలు వినబడడంలేదు. అలాగని అన్నీ కాదు. కొన్ని వినబడి, కొన్ని వినబడకా చెవిలో విపరీతమైన హోరు ధ్వనులన్నీ మారుమోగుతూ ‘గుయ్య్’‌మని శబ్దం రావడం. ఈ ఇబ్బందులన్నీ చాలా చిరాకు కలిగించడంతో విసిగిపోయింది. వెంటనే గాబరాగా డాక్టర్‌ ‌దగ్గరకు పరుగెత్తింది విద్యావతి.
ఆయన యధావిధిగా చెవిని తనిఖీ చేసి ‘‘అంతా బాగానే ఉందమ్మా. పొర కొంచెం వెనక్కి జరిగినట్లుంది. ఎందుకైనా మంచిది. వినికిడి పరీక్ష చేయించుకోండి.’’ అంటూ హియరింగ్‌ ‌సొల్యూషన్స్ ‌వారికి రాసి ఇచ్చాడు.
అక్కడికీ వెళ్లింది విద్యావతి. అక్కడి సిబ్బంది ఆమెను పరీక్షించి హియరింగ్‌ ఎయిడ్‌ ‌పెట్టుకుంటే మంచిదని సూచించారు.
ఆ రిపోర్ట్ ‌పట్టుకుని డాక్టర్‌ని సందర్శించింది.
‘‘అవునమ్మా! మీరు డయాబెటిక్‌ ‌కాబట్టి చెవిలో నరాలు చచ్చుబడిపోయి మీకు శాశ్వత బధిరత్వం ఏర్పడినట్లుగా అనిపిస్తోంది. చెవికి మిషన్‌ ‌పెట్టుకోవడమే పరిష్కారం.’’అని చెప్పాడాయన.
హతాశురాలైంది విద్యావతి. ప్రపంచంలోని చైతన్యమంతా ఒక్కసారి స్తంభించిపోయినట్లుగా అనుభూతి చెందింది.
పంచేద్రియాలలో ఒకటైన చెవి, తన పనితనాన్ని కోల్పోవడం వలన, తాను శాశ్వతంగా చెవిటి దానిగా మిగిలిపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది.
‘‘ఇప్పుడేమైందమ్మా! అలా బాధపడుతున్నావు. నీ ఎదురుగా మాట్లాడిన మాటలు బాగానే వినబడు తున్నాయి కదా! ఇక హియరింగ్‌ ఎయిడ్‌ అం‌టావా? ఇప్పటి నుంచీ చెవిలో మిషన్‌ ‌పెట్టుకుని ఎంతకని బతుకుతావు? మరీ అవసరం అనుకుంటే పెట్టుకుందువు గాని.’’ ఆవేదన చెందుతున్న తల్లిని ఊరడించాడు పెద్దకొడుకు.
కొడుకు చెప్పిన మాటా బాగానే ఉందనిపించింది విద్యావతికి. అక్కడి నుంచీ మొదలైనాయి ఆమెకి రకరకాల అగచాట్లు. ఏదైనా వినిపించక, మళ్లీ మళ్లీ అడిగితే బాహాటంగానే విసుక్కోవడం ప్రారంభించాడు నిశాపతి. ఆమె అడిగిన దానికి సమాధానం చెవులు చిల్లులు పడేంత గట్టిగా అరచి చెప్పసాగాడు.
అదేమని విద్యావతి అడిగితే ‘‘నీకు చెముడు కదా! అందుకే అలా అరిచి చెప్తున్నా.’’ అనేవాడు.
పదే పదే తన వైకల్యాన్ని ఎత్తి చూపుతూ ఉంటే భరించలేకపోతోంది విద్యావతి.
చెవిటి వాళ్లు కొంచెం గట్టిగా మాట్లాడతారని ఎక్కడో వింది ఆమె. తమకు వినిపించకపోవడంతో, ఎదుటివారికీ వినబడదనుకుని వారికి తెలియకుండానే స్వరం పెంచి మాట్లాడడం వాళ్లకి అలవాటవుతుందని ఆమెకి ఎవరో చెప్పారు. అది నిజమేనని ఆనాడు బ్యాంక్‌ ‌పనిమీద వెళ్లినప్పుడు నిరూపితమైంది.
కౌంటర్‌లోని ఉద్యోగి ఏదో ప్రశ్నించినప్పుడు కాస్త గట్టిగా బదులిచ్చిన విద్యావతిని కొరకొర చూస్తూ ‘‘ఎందుకంత గట్టిగా అరుస్తారు? నాకేమీ చెముడు లేదు.’’ అంది కాస్త పరుషంగా.
‘‘సారీమ్మా నాకుంది’’ అంది విద్యావతి తనలో తానే మాట్లాడుకుంటున్నట్లుగా.
ఆమెకి చాలా అవమానంగా ఉంది. ఈ బాధ భరించలేక చెవిటి మిషన్‌ ‌పెట్టుకుందామంటే అదీ చిరాకుగానే ఉంటుందని ఆగిపోతోంది.
మొత్తమ్మీద ఈ వినికిడి శక్తి తగ్గడం ఆమె జీవన విధానాన్నే దెబ్బతీసింది.
తనకి చెవిలో సమస్య ఉందని తెలిశాక అంతలా ఆరాటపడి తనకు వైద్యం చేయించిన భర్త, ఆ వైద్యానికి ప్రయోజనం లేకపోయిన తరువాత మునుపటిలా మాట్లాడడం తగ్గించాడు. మనసులో మాటలు కూడా పంచుకోవడం మానేశాడు.ఆర్థిక• లావాదేవీల గురించిన చర్చలు అసలే లేవు.
ఏదో తనకు పరిచయంలేని వింతలోకంలోకి వెళ్లి జీవిస్తున్నట్లుగా అనిపిస్తోంది విద్యావతికి.
కాలం భారంగా సాగుతోంది.
ళి ళి ళి
గత నాలుగు రోజులుగా భర్తని గమనిస్తూన్న విద్యావతికి అతడేదో మానసిక బాధను అనుభవిస్తు న్నట్లుగా అనిపించింది.
పదేపదే ఫోన్‌లో మాట్లాడుతూ దేనికో ఆందోళన పడుతున్నాడు నిశాపతి. ఆ కాల్స్ ‌బిల్డర్‌ ‌దగ్గర నుంచి అని విద్యావతి తెలుసుకుంది.
ఎప్పుడో పదిహేనేళ్ల కిందట కొన్న స్థలంలో డ్యూప్లెక్స్ ‌హౌస్‌ ‌కట్టించాడు నిశాపతి బ్యాంకులో లోన్‌ ‌తీసుకుని నాలుగు నెలల క్రితమే అతి కొద్దిమంది బంధుమిత్ర సమేతంగా నూతన గృహప్రవేశం కూడా కావించాడు. ఇంట్లో దిగిన తరువాత కూడా ఇంటిపనులు కొనసాగాయి. కొద్దిపాటి ఫినిషింగ్‌ ‌వర్క్ ఉం‌డిపోతే నెమ్మదిగా నత్త నడకన చేయసాగాడు బిల్డర్‌.
అతడికి కొద్ది మొత్తంలో డబ్బు బాకీ కూడా ఉండిపోయింది. దాచుకున్న మూలనిధులన్నీ తరిగిపోయి, రిక్తహస్తాలతో మిగిలాడు నిశాపతి.
అలాంటప్పుడు భర్తని సముదాయించింది విద్యావతి. ‘‘ఎలాగోలా ఇద్దాం లెండి. మీరు బెంగ పెట్టు కోకండి.’’ అన్న విద్యావతిని హేళనగా చూసి ‘‘హా…మీ తాత దాచిన ముల్లె తీసుకొద్దువుగాని. లేకపోతే బ్యాంకుకి కన్నం వేద్దాం’’ అన్నాడు నిశాపతి.
మనసు చివుక్కుమన్నా అప్పటికి మౌనంగా ఉండిపోయింది విద్యావతి.
మొత్తానికి ఈ మధ్యనే బిల్డర్‌ ‌పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేశాననిపించాడు.
మరుక్షణం నుంచీ నిశాపతి మీద ఇవ్వాల్సిన డబ్బులకోసం ఒత్తిడి తీసుకు రాసాగాడు.
ఇవేమీ భార్యకి చెప్పలేదు నిశాపతి. అంతగా వినపడని దానికి చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాడో ఏమో! భర్త అలా ముఖం వేలాడేసుకుని దిగులుగా కూర్చోవడం గమనించిన విద్యావతి, అతడి మనోవ్యాకులతకి కారణం ఏమై ఉంటుందో గ్రహించగలిగింది. భర్త వేదన తనదిగా భావించింది.
‘అప్పు లేనివాడు అధిక సంపన్నుడు’ అన్నారు. అందుకే అతడిని రుణ విముక్తుడిని చేయడంలో తన వంతు సహకారమందించాలని తలపోసింది.
‘‘హు…’’ తన ముందు నిలబడి చిన్నగా దగ్గిన భార్యకేసి ప్రశ్నార్థకంగా చూశాడు నిశాపతి.
‘‘బిల్డర్‌ ‌డబ్బులకోసం పీడిస్తున్నాడులా ఉంది?’’
‘‘అవును.అయినా ఈ విషయాలు నీకెందుకు? నువ్వేమన్నా ఆర్చేదానివా? తీర్చేదానివా?’’ ముఖం ముడుచుకున్నాడు నిశాపతి.
విద్యావతి మాట్లాడకుండా తన చేతిలో ఉన్న పోట్లాన్నీ అతడి ముందుంచింది.
మళ్లీ అదే చూపు చూశాడు నిశాపతి.
‘‘ఇవి అమ్మో, తాకట్టు పెట్టో అతగాడి అప్పు తీర్చేయండి.’’ మృదువుగా పలికింది విద్యావతి.
నిశాపతి ఆశ్చర్యపోతూ ఆ పోట్లాం విప్పి చూశాడు. అందులో మిలమిల మెరుస్తున్న మూడుపేటల చంద్రహారం, అరడజను గాజులు ఉన్నాయి. ‘‘నీ బంగారం అమ్మడమా!? ఇది మీ అమ్మ నీకు పెట్టిన బంగారం’’ నివ్వెర•పోయాడు.
‘‘ఫరవాలేదు. బతికి బాగుంటే మళ్లీ చేయిద్దు రుగాని.’’ నవ్వింది విద్యావతి.
నిశాపతి నోరు మూగవోయింది. చూపులో అపరాధభావన నిండింది.
‘‘అసలు బిల్డర్‌ ‌నన్ను డబ్బులకోసం వేధిస్తున్నాడని నీకెలా తెలిసింది?’’ మాట పెగల్చుకున్నాడు నిశాపతి.
‘‘నేను మీ భార్యని. మీ బాధ, ఆనందం, కష్టం- సుఖం ఇవన్నీ నాకు మీరు నోరు విప్పి చెప్పకుండానే తెలిసిపోతాయి. మీరు చెప్పినా ఇప్పుడు నాకు వినిపించదనుకోండి. నాకు ఒక చెవిలో కొన్ని మాటలు, ఇయర్‌ ‌ఫోన్స్ ‌పెట్టుకున్నప్పుడు కొన్ని రకాల పాటలు వినబడవని మీకూ తెలుసు.
నాకు వినికిడి శక్తి తగ్గిపోయి ఉండవచ్చు. కాని, నా మనసుకి చెవులున్నాయి. మీ గుండె చప్పుళ్లని అవి వినగలవు.
మీ ఎద సవ్వళ్లు, మీ మనసులోని భావాలు నాకు ‘వినిపించే రాగాలు’. మీరు నోరు విప్పి చెప్పకపోయినా మీ అంతరంగం నాకు సుతిమెత్తని సంగీతంలా నా లోలోపలి వీనులకి వినిపిస్తూనే ఉంటుంది.’’ సున్నితంగా నవ్వి అవతలకి తరలి పోతున్న విద్యావతివైపు వెర్రివాడిలా చూస్తూండి పోయాడు నిశాపతి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE