సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి మాఘ శుద్ధ షష్ఠి 03 ఫిబ్రవరి 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
ప్రజాస్వామ్యం నవనవోన్మేషంగా పరిఢవిల్లుతున్నదనడానికి గీటురాయి న్యాయ వ్యవస్థకు దక్కిన, దక్కుతున్న గౌరవమే. శాసన నిర్మాణ, కార్యనిర్వాహక వ్యవస్థలు పరిధులు దాటకుండా న్యాయవ్యవస్థ గీసిన లక్ష్మణరేఖ వెనుకే ఉంటున్నాయని చెప్పుకోగలగడమే ప్రజాస్వామ్యానికి గీటురాయి. అందుకే న్యాయవ్యవస్థ అందరికీ సమన్యాయం, సమాన హక్కులు ప్రజాస్వామ్యం ఇస్తుంది మూడో స్తంభంగా మన్నిస్తారు (నాలుగో స్తంభంగా పత్రికా వ్యవస్థను గౌరవిస్తారు). భారత అత్యున్నత న్యాయస్థానం జనవరి 28, 2025తో 75 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భం అందుకే స్మరణీయమైంది. చరిత్రాత్మకమైనది కూడా. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఇందుకు సంబంధించిన ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
ఈస్టిండియా కంపెనీ కాలంలోనే (1774) కలకత్తాలో (నేటి కోల్‌కతా) అత్యున్నత న్యాయస్థానం ఏర్పడిరది. తరువాత మద్రాస్ (1800), బొంబాయి (1823) సుప్రీం పేరిట న్యాయస్థానాలు ఆవిర్భవించాయి. హైకోర్టులు కూడా కంపెనీ ఏలుబడిలోనే 1861లో మొదలయ్యాయి. ఇక మన రాజ్యాంగ వ్యవస్థలన్నింటికీ మూలమని చెప్పే భారత ప్రభుత్వ చట్టం 1935 పుణ్యమా అని ఫెడరల్ కోర్టు ఏర్పడిరది. నేటి సుప్రీంకోర్టుకు మాతృక ఇదే. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రెండు రోజుల తరువాత, జనవరి 28, 1950న సుప్రీంకోర్టు ఉనికిలోనికి వచ్చింది. ప్రధాన న్యాయమూర్తితో కలిపి 8 మందితో ఆరంభమైన మన సుప్రీంకోర్టు ఇప్పుడు 34 మందితో రాజ్యాంగ రక్షణ కృషిలో నిమగ్నమై ఉంది. ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ ప్రధాన న్యాయమూర్తి. హక్కులు ఉంటాయి. అలా అని నిరపేక్షమైనవి కావు. మన హక్కు అవతలివారి హక్కునకు భంగం కలిగించేటట్టు ఉంటే దానిని సరిదిద్దవలసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో కోర్టులు మాత్రమే చేయగలవు. ఆ బాధ్యతను నిర్వర్తించే సమున్నత వేదికే సుప్రీంకోర్టు.
సుప్రీంకోర్టు ప్రధాన విధి అప్పీళ్లను విచారించడమే. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన అప్పీళ్లను ఇది పరిశీలిస్తుంది. చట్టాల సమీక్ష కూడా ఈ న్యాయస్థానం బాధ్యతే. కొన్ని తీవ్ర వివాదాల విషయంలో నేరుగా కూడా విచారణ జరుపుతుంది. ఏకసభ్య ధర్మాసనం మొదలు, 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం వరకు (కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం,1973) న్యాయస్థానం వ్యాజ్యాన్ని బట్టి పరిస్థితులను చర్చించి తీర్పులు ఇచ్చిన చరిత్ర ఉంది. ఎన్నో కీలక తీర్పులు ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేశాయి. మత విశ్వాసాలకు, ప్రాంతీయ తత్వాలకు, ప్రలోభాలకు లోనుకాకుండా మన సుప్రీంకోర్టు తన తీర్పులు వెలువరించింది. షరియాకు వ్యతిరేకమని ఆ వర్గం చెబుతున్నా, సుప్రీంకోర్టు మహిళలకు జరగవలసిన న్యాయాన్ని మాత్రమే పరిగణనలోనికి తీసుకుని షాబానో కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. కానీ ఆ తీర్పును తుంగలో తొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. సుప్రీం కోర్టు చరిత్రలో చూస్తే 1947-1964 మధ్య ఆస్తి హక్కు గురించి ఒక స్పష్టత రావడానికి ఆస్కారం కల్పించే పరిణామాలు కనిపిస్తాయి. 1965 నుంచి 1993 వరకు రాజ్యాంగ సవరణల గురించి తన వైఖరి ఏమిటో వివరించిన సమయంగా కనిపిస్తుంది. 1993-2018 న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి విధి విధానాలపై సూత్రీకరణలు జరిగాయి. అయినా ఇప్పటికీ కేంద్రానికీ, అత్యున్నత న్యాయస్థానానికీ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కొలీజియం వ్యవస్థ. చిత్రంగా భారత అత్యున్నత న్యాయస్థానంలో కూడా 80,439 (2023 నాటికే) కేసులు అపరిష్కృతంగా ఉండిపోవడం విచారకరమే. ఇందుకు కోర్టునే బోనెక్కించడం ఇక్కడ ఉద్దేశం కాదు. మిగిలిన ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటిని త్వరితంగా పరిష్కరించాలి. రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉన్నప్పటికీ మౌలిక స్వరూపాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చలేదనీ (కేశవానందభారతి కేసు), రాష్ట్రాల మీద కేంద్ర పాలన విధింపునకు పరిమితులు ఉన్నాయని (ఎస్‌ఆర్ బొమ్మయ్ కేసు), పనిచేసే చోట మహిళల లైంగిక వేధింపుల నిరోధం (వైశాఖ వర్సెస్ రాజస్తాన్ కేసు), ప్రాథమిక హక్కుల రక్షణకు ఇంకా ఎన్నో తీర్పులు మన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచి లావాదేవీలను నిర్వహించాలని అమృతోత్సవాల సందర్భంగా నిర్ణయించడం ముదావహం.
మనకు గతం నుంచి, విదేశీ పాలన నుంచి సంక్రమించిన విషాదాలూ, వివాదాలూ తక్కువేమీ కాదు. వాటిలో చాలావాటిని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు తనవంతుగా గొప్ప సేవ చేసింది. అందులో పేర్కొనదగినది అయోధ్య రామ జన్మభూమి వివాదం. ఐదువందల ఏళ్ల నాటి ఆ వివాదాన్ని నవంబర్ 9, 2019న తన తీర్పు ద్వారా పరిష్కరించింది. ఇందుకు జాతి మన అత్యున్నత న్యాయస్థానానికి ప్రణమిల్లాలి. ఈ దేశంలో హిందువులు అధిక సంఖ్యాకులు కాబట్టి తీర్పు రాముడికి అనుకూలంగా వచ్చిందని బాధ్యతనెరిగిన వారు ఎవరూ వ్యాఖ్యానించలేదు. ఆ వివాదాన్ని కూడా భూ వివాదంగానే విచారించి తీర్పును నిర్ధారించామని ధర్మాసనం పేర్కొన్నది. దరిమిలా అయోధ్యలో రాముడిని హిందువులు ప్రతిష్ఠించుకున్నారు. ఇప్పుడు భారతదేశంలో పరిణామాలంటే అయోధ్య వివాదానికి ముందు, అయోధ్య వివాదానికి తరువాత అన్న తీరులో అంచనా వేయవలసి ఉంది. అందుకే ఈ తీర్పు సుప్రీంకోర్టు చరిత్రలో లేదా భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక మలుపు. సెక్యులరిజం పేరుతో జరిగిన దగా, మైనారిటీల బుజ్జగింపు ధోరణి, ఇంతకు ముందు న్యాయవ్యవస్థలలో జరిగిన అవాంఛనీయ జాప్యం వంటి అన్ని అంశాలను, దాని పర్యవసానాలను ఆ తీర్పు బట్టబయలు చేసింది. అవి ఈ దేశానికీ, ఈ దేశ వైవిధ్యానికీ, మత సామరస్యానికీ తెచ్చిన చేటును కూడా సాధారణ భారతీయుడు తెలుసుకునే సదవకాశం ఇచ్చింది. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటూ మన ప్రజాస్వామ్యం మరింత పరిఢవిల్లాలని మనసారా కోరుకుందాం.