యతో ధర్మస్తతో జయ: (ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం పరిఢవిల్లుతుంది). భారత అత్యున్నత న్యాయస్థానం నినాదం ఇదే. భారత అత్యున్నత న్యాయస్థానం ప్రస్థానంలో అలాంటి విజయాన్నే మనం దర్శించుకోవచ్చు. ఇది మహాభారతంలో పదే పదే ప్రస్తావనకు వచ్చే శ్లోకపాదం. నిజానికి చట్టం, న్యాయం అనే వ్యవస్థలు కూడా పురాతనమైనవే. సనాతనమైన వ్యవస్థలే. ఒక సమాజం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి కొండ గుర్తు విజయవంతమైన న్యాయ వ్యవస్థ కొనసాగడమే కూడా. నీవు శాంతిని కోరుకుంటే ఒక న్యాయవాది న్యాయం కోసం పోరాడినట్టు పోరాడు అంటాడు సిసిరో. ఆ క్రమం ఇలా చెప్పారాయన. న్యాయం అనే దేవాలయానికి పూజారులు న్యాయవాదులు. న్యాయవాదులు అంటే శాంతి స్థాపకులనే ప్రజలు కూడా భావిస్తారు. రాజ్యాంగం ప్రకారం పౌరులకు హక్కులు ఇచ్చామంటేనే సరికాదు. అలాంటి హక్కులు కేవలం నీటి బుడగలు. హక్కులకు విలువ ఎప్పుడు వస్తుందంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే. ఆ పని న్యాయవాదుల ద్వారా న్యాయమూర్తులు అమలు చేస్తారు. అలాంటి న్యాయవ్యవస్థకు శిఖరమే సుప్రీంకోర్టు. ఇవన్నీ భారత సుప్రీంకోర్టుకూ వర్తిస్తాయి.
వందల ఏళ్ల పోరాటంతోనే భారతదేశానికి స్వాతంత్య్రం సాధ్యమైంది. రాజ్యాంగం కూడా అంతే. ఆ తరువాతే భారత స్వతంత్ర అత్యున్నత న్యాయ స్థానం ఆవిర్భవించింది. కానీ చట్టం, ధర్మం, శిక్ష, పాలన, చట్టాలకు వ్యాఖ్యానం ఇవన్నీ మన పురాతన భారతదేశానికి తెలియనివి మాత్రం కావు.
ప్రపంచంలోనే అత్యంత పురాతన న్యాయ వ్యవస్థ భారతీయులదేనని అంటారు జస్టిస్ ఎస్‌ఎస్ ధావన్ (అలహాబాద్ హైకోర్టు). ప్రస్తుతం మనం అమలు చేసుకుంటున్న న్యాయ వ్యవస్థ మూలాలు పాశ్చాత్యు లవే కావచ్చు. కానీ వీటి కోణం నుంచి మన పురాతన న్యాయ వ్యవస్థను పరిశీలించడం సరికాదు. అలాగే బ్రిటిష్ జాతే ఈ దేశానికి న్యాయవ్యవస్థను అందించిందనడం కూడా చారిత్రక దృక్పథం కాలేదు. వాస్తవం ఏమిటి? మన పాలకులు కొందరు ధర్మ గంటను ఏర్పాటు చేశారు. మనుషులకే కాదు, నోరు లేని జీవులకు కూడా న్యాయం చేయాలన్న సంకల్పం ఉన్నవారు. అందుకు సాక్ష్యమే, ఆవు, లేగదూడ, రాజపుత్రుని మరణ దండన కథ. తన షరతులకు అంగీకరిస్తే తప్ప ఒక మత్స్యకారుడు తన కుమార్తెను రాజుకు ఇచ్చి వివాహం చేయడానికి నిరాకరించిన సన్నివేశం మహాభారతంలో కనిపి స్తుంది. ఇది ఈ దేశంలో ప్రజలకు ఉన్న స్వేచ్ఛ. ఒక పాలకుడు పదవీ బాధ్యతలను విస్మరిస్తే అతడిని కుక్కను కొట్టి చంపినట్టు చంపాలి అంటుంది మహా భారతం. తమను రక్షించలేని, తమ ఆస్తులకు రక్షణగా నిలవలేని రాజును రాజు అనలేం. వ్యవస్థకు అతడొక దురదృష్టం అని కూడా ఆ మహా కావ్యం వ్యాఖ్యానిం చింది. దేశ ప్రజల పట్ల తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి వారిని సంతోషపెట్టడమే, రాజుకు కూడా సంతోషదాయకమవుతుందని కౌటిల్యుని అర్ధశాస్త్రం సూత్రీకరించింది. వివిధ రకాల వివాదాలకు, వివిధ రకాల న్యాయస్థానాలు ఉన్నాయని బృహస్పతి స్మృతి ద్వారా తెలుస్తుంది. ప్రాడ్వివాక, లేదా అధ్యక్ష అన్నది అత్యున్నత న్యాయ మూర్తికి ఉన్న పేరు. ఇవి మన పురాతన న్యాయ వ్యవస్థ విరాడ్రూపాన్ని గమనించడానికి కొన్ని రుజువులు మాత్రమే.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రెండు రోజుల తరువాత నుంచి భారత సుప్రీం కోర్టు ఉనికి లోనికి వచ్చింది. అత్యున్నత న్యాయస్థానం ప్రధాన విధి రాజ్యాంగ రక్షణ. ప్రాథమిక హక్కులకు రక్షణగా నిలవడం కూడా. అలాగే అప్పీళ్లను విచారించడం. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన అప్పీళ్లను ఇది పరిశీలిస్తుంది. భారత పార్లమెంట్ చేసిన చట్టాలను మార్చకున్నా, దాని గురించి అభిప్రాయం చెబుతుంది. చట్టాల సమీక్ష కూడా సుప్రీంకోర్టు బాధ్యతే. కొన్ని తీవ్ర వివాదాలను నేరుగా కూడా విచారణ జరుపుతుంది. ఏకసభ్య ధర్మాసనం మొదలు, 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం వరకు (కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం,1973) న్యాయస్థానం వ్యాజ్యాన్ని బట్టి పరిస్థితులను చర్చించి తీర్పులు ఇచ్చిన చరిత్ర ఉంది. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేశాయి. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, మైనారిటీలు ఎవరైనా చట్టం పరిధిలోనే వారి కేసులను పరిష్కరించింది. మత విశ్వాసాలకు, ప్రాంతీయ తత్వాలకు, ప్రలోభాలకు లోనుకాకుండా మన సుప్రీంకోర్టు తన తీర్పులు వెలువరించింది. తీర్పులను మార్చడానికి, న్యాయ మూర్తులను ప్రభావితంచేసే తీరులో సుప్రీం నిర్ణయం షరియాకు వ్యతిరేకమని ఆ వర్గం చెబు తున్నా, అత్యున్నత న్యాయస్థానం మహిళలకు జరగ వలసిన న్యాయాన్ని మాత్రమే పరిగణనలోనికి తీసుకుని షాబానో కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. షాబానో తీర్పు అనంతర పరిణామాలు ఉన్నప్పటికీ ట్రిపుల్ తలాక్ పద్ధతి చెల్లదని సుప్రీంకోర్టు చెప్ప గలిగింది. మహిళ ఆత్మ గౌరవాన్ని కించపరిచినా, సమన్యాయానికి దూరం చేసినా వివక్ష చూపినా ఆ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఆగ్రహానికి గురికాక తప్పదు అని జస్టిస్ దీపక్ మిశ్రా ఒక కేసులో ప్రకటించిన సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కానీ ఆ షాబానో అనుకూల తీర్పును తుంగలో తొక్కి, బుజ్జగింపు ద్వారా మతోన్మాద శక్తులకు ఊతమివ్వడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న సమయంలో దానితో ఉన్న ప్రమాదం గురించి కూడా ఒక న్యాయమూర్తి చాలామంచి వ్యాఖ్య చేశారు. మనలని వేలిముద్ర వేసే స్థాయి నుంచి సంతకం చేసే వరకు తీసుకు వెళ్లినది విద్యే. కానీ సాంకేతిక పరిజ్ఞానం మనలని సంతకంచేసే స్థాయి నుంచి వేలిముద్ర (థంబ్ ఇంప్రషన్) స్థాయి మళ్లీ తీసుకు వచ్చింది అన్నారు జస్టిస్ ఏకే సిక్రి. వందమంది దోషులు తప్పించు కున్నా, ఒక నిర్దోషికి శిక్ష మాత్రం పడకూడదన్న సూత్రాన్ని కూడా న్యాయవ్యవస్థ గౌరవించింది. పేదరికమే అన్ని నేరాలకు మూలమని, ఆకలి ఏ మనిషినైనా దొంగలా మారుస్తుందని సుప్రీంకోర్టు కూడా భావించినట్టు కనిపిస్తుంది. అదే నిజం కూడా. కాబట్టి ఈ క్రమంలోనే వ్యవస్థ మార్పుమీద కొన్ని కఠిన వ్యాఖ్యలు కూడా చేయవలసి వచ్చింది.
సుప్రీంకోర్టు ప్రస్థానాన్ని పరిశీలిస్తే చాలా ఆశ్చర్యంగాఉంటుంది. వలసపాలన మిగిల్చిన సమస్యలను ఒక్కొక్కటిగా తెంచుకుంటూ వచ్చింది. 1947`1964 మధ్య ఆస్తి హక్కు గురించి ఒక స్పష్టత రావడానికి ఆస్కారం కల్పించే పరిణామాలు కనిపిస్తాయి. 1965 నుంచి 1993 వరకు రాజ్యాంగ సవరణల గురించి తన వైఖరి ఏమిటో వివరించిన సమయంగా కనిపిస్తుంది. 1993`2018 న్యాయ మూర్తుల నియామకానికి సంబంధించి విధి విధానాలపై సూత్రీకరణలు జరిగాయి. అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంత బలోపేతమైన ప్పటికీ కేంద్రానికీ, అత్యున్నత న్యాయస్థానానికీ మధ్య కొన్ని విభేదాలు రాకపోలేదు. అందులో ముఖ్యమైనది కొలీజియం వ్యవస్థ. కేసుల జాప్యం విషయంలోను సుప్రీంకోర్టుకు కొన్ని సమస్యలు ఉన్నాయి. భారత అత్యున్నత న్యాయస్థానం ముందు 80,439 (2023 నాటికే) కేసులు పరిష్కారం కోసం వేచి ఉన్నాయి. న్యాయం చేయడంలో జాప్యం, న్యాయం అందిం చడంలో వైఫల్యమేనన్న సూత్రం ఇక్కడ అత్యున్నత న్యాయస్థానానికి కూడా వర్తిస్తుందని కొందరు అంటారు. వాటిని త్వరితంగా పరిష్కరించాలి. రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉన్నప్పటికీ మౌలిక స్వరూపాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చలేదనీ (కేశవా నందభారతి కేసు), రాష్ట్రాల మీద కేంద్ర పాలన విధింపునకు పరిమితులు ఉన్నాయని (ఎస్‌ఆర్ బొమ్మయ్ కేసు), పనిచేసే చోట మహిళల లైంగిక వేధింపుల నిరోధం (వైశాఖ వర్సెస్ రాజస్తాన్ కేసు), ప్రాథమిక హక్కుల రక్షణకు ఇంకా ఎన్నో తీర్పులు మన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచి లావాదేవీలను నిర్వహించాలని అమృతోత్సవాల సందర్భంగా నిర్ణయించడం ముదావహం.
గతం నుంచి, విదేశీ పాలన నుంచి సంక్ర మించిన విషాదాలు చాలా ఉన్నాయి. వైవిధ్యం ఒక భారతీయ వ్యవస్థకు వరమే అయినా, దానితో కొన్ని వివాదాలూ లేకపోలేదు. వీటిని ఒక కొలిక్కి తీసుకు రావడానికే కోర్టుకు చిరకాలం పట్టిందంటే అతిశ యోక్తి కాదు. అలాంటి క్లిష్ట వ్యాజ్యాలు చాలావాటిని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు తనవంతుగా గొప్ప సేవ చేసింది. అందులో పేర్కొనదగినది అయోధ్య రామజన్మభూమి వివాదం. ఐదువందల ఏళ్ల నాటి ఆ వివాదాన్ని నవంబర్ 9, 2019న తన తీర్పు ద్వారా పరిష్కరించింది. ఈ దేశంలో హిందువులు అధిక సంఖ్యాకులు కాబట్టి తీర్పు రాముడికి అనుకూలంగా వచ్చిందని బాధ్యతనెరిగిన వారు ఎవరూ వ్యాఖ్యానించలేదు. ఆ వివాదాన్ని కూడా భూ వివాదంగానే విచారించి తీర్పును నిర్ధారించామని ధర్మాసనం పేర్కొన్నది. దరిమిలా అయోధ్యలో రాముడిని హిందువులు ప్రతిష్ఠించుకున్నారు. ఇప్పుడు భారతదేశంలో పరిణామాలంటే అయోధ్య వివాదానికి ముందు, అయోధ్య వివాదానికి తరువాత అన్న తీరులో అంచనా వేయవలసి ఉంది. అందుకే ఈ తీర్పు సుప్రీంకోర్టు చరిత్రలో లేదా భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక మలుపు. సెక్యులరిజం పేరుతో జరిగినదిగా, మైనారిటీల బుజ్జగింపు ధోరణి, ఇంతకు ముందు న్యాయవ్యవస్థలలో జరిగిన అవాంఛనీయ జాప్యం వంటి అన్ని అంశాలను, దాని పర్యవసానా లను ఆ తీర్పు బట్టబయలు చేసింది. చరిత్రకారుల మోసాన్ని కూడా సుప్రీం తీర్పు ఎండ గట్టింది. అవి ఈ దేశానికీ, ఈ దేశ వైవిధ్యానికీ, మత సామరస్యా నికీ తెచ్చిన చేటును కూడా సాధారణ భారతీయుడు తెలుసుకునే సదవకాశం ఇచ్చింది. అయోధ్య వివాదం తరువాత వివాదాలు ఉండవని, ఈ దేశంలో అన్ని వర్గాలు కలసి ఉంటాయని చెప్పడం కాస్త కష్టమే. దేశభక్తిని ఎద్దేవా చేయడం, దేశం పట్ల అవిధేయత, న్యాయస్థానాల పట్ల విముఖత, హక్కుల వక్రభాష్యం, వక్ఫ్ వంటి సమస్యలు ఇప్పటికీ ఈ దేశం ముందు ప్రశ్నార్థకాలుగానే ఉన్నాయి. కాలం మారుతున్న కొద్దీ కొత్త కొత్త సమస్యలు సుప్రీంకోర్టు ముందుకు వస్తూనే ఉంటాయి. అందుకే అన్నారు, దేశాధ్యక్షుడు రావచ్చు, పోవచ్చు, కానీ అత్యున్నత న్యాయస్థానం ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది. ఉండడమే కాదు, అది పటిష్టంగా, పవిత్రంగా కూడా ఉండాలి.
ఇంపే నుంచి ఖన్నా వరకు….
స్వతంత్ర భారత అత్యున్నత న్యాయస్థానం జనవరి 28, 2025తో 75 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భం స్మరణీయమైనది, చరిత్రాత్మక మైనది. భారత అత్యున్నత న్యాయస్థానం మూలాలు ఈస్టిండియా కంపెనీ కాలంలోనివేనని గమ నించాలి. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773తో భారత్‌లో అత్యున్నత న్యాయస్థానం అన్న వ్యవస్థ అంకు రించింది. కోర్ట్ ఆఫ్ రికార్డ్ పేరుతో కలకత్తాలో ఆరంభమైంది. మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. నిజానికి తొలి అత్యున్నత న్యాయ స్థానం పరిధి బెంగాల్, ఒరిస్సా, పట్నాలే. తరువాత 1800, 1834 సంవత్సరాలలో మూడో జార్జి చక్రవర్తి రెండు అత్యున్నత న్యాయ స్థానాలు (సుప్రీంకోర్టులు) ఏర్పాటు చేశాడు. అవే బొంబాయి, మద్రాస్ సుప్రీం కోర్టులు. చాలా చిత్రంగా ఇప్పుడు ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా చెప్పే పత్రికా రంగానికీ, నాటి అత్యున్నత న్యాయస్థానానికి ఆదిలోనే రగడ ఆరంభమైంది. భారతదేశంలో తొలి పత్రిక హికీస్ జనరల్. లేదా కలకత్తా క్రానికల్. దీని సంపాదకుడు జేమ్స్ ఆగస్టస్ హికీ. ఇతడు సర్ ఎలిజా ఇంపే మీద ఆరోపణలు చేస్తూ వార్తలు ప్రచురిం చాడు. ప్రధాన న్యాయమూర్తి విమర్శలకు అతీతుడు, విమర్శించినవారు శిక్షార్హులు అంటూ నాటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ ప్రకటించాడు. హేస్టింగ్స్ ఆదేశం మేరకు హికీ న్యాయమూర్తి మీద ఆరోపణలు ఆపేశాడు. ఆయన భార్య మీద ఆరోపణలు ప్రారంభించాడు. దీనితో అతడిని బలవంతంగా ఇంగ్లండ్ ఓడ ఎక్కించారు. హైకోర్టులు కూడా కంపెనీ ఏలుబడిలోనే 1861లో మొదలయ్యాయి. మన రాజ్యాంగ వ్యవస్థలన్నింటికీ మూలమని చెప్పే భారత ప్రభుత్వ చట్టం 1935 పుణ్యమా అని ఫెడరల్ కోర్టు ఏర్పడిరది. నేటి సుప్రీంకోర్టుకు మాతృక ఇదే. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రెండు రోజుల తరువాత, జనవరి 28, 1950న సుప్రీం కోర్టు ఉనికి లోనికి వచ్చింది. ప్రధాన న్యాయ మూర్తితో కలిపి 8 మందితో ఆరంభమైన మన సుప్రీంకోర్టు ఇప్పుడు 34 మందితో పని చేస్తున్నది. ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ ప్రధాన న్యాయమూర్తి.