సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి మాఘ శుద్ధ త్రయోదశి – 10 ఫిబ్రవరి 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
సభా మర్యాదలను ఉల్లంఘించడంలో ప్రతిపక్షాలుగా చెలామణి అవుతున్న కాంగ్రెస్, దాని తైనాతీలు వాటి రికార్డును అవే బద్దలు కొట్టుకుంటున్నాయి. ప్రధానిమంత్రినో, ఆయన మంత్రివర్గ సహచరులనో, బీజేపీనో, దాని నాయకులనో విమర్శిస్తే అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రపతిని కూడా అమర్యాదకరమైన భాషతో దూషిస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని అధికార పార్టీ జేబు సంస్థగా తూలనాడడం సరే, న్యాయ వ్యవస్థలో నిమ్నకులాలకు స్థానం లేదని చెప్పడం మరొకటి. బడ్జెట్‌కు ముందు హల్వా తయారీలో బడుగులకు చోటు లేదనడం మరొక వికృత ఆరోపణ. ఆయన కాంగ్రెస్ పార్టీకి నామమాత్రపు అధ్యక్షుడే కావచ్చు. కానీ ప్రయాగ్‌రాజ్‌లో వేలాది మంది చనిపోయారని మాట్లాడడం, మృతదేహాలను నదిలోకి విసిరేశారని ఆరోపించడం, దీనికి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ వంత పాడడం అత్యంత జుగుప్సాకరంగా కనిపిస్తున్నది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని అవమానకరమైన తీరులో వ్యాఖ్యానించడం దీనికి పరాకాష్ట.
బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్రపతి ముర్ము సరిగా చదవలేకపోయారట. ఆమె అలసిపోయారట. ‘పూర్ లేడీ’ అట. ఇవి కాంగ్రెస్ నాయకురాలిగా, రాజ్యసభ సభ్యురాలిగా తిష్ట వేసిన సోనియా అన్న మాటలు. సోనియా బహిరంగ సభలలో చదివిన ఉపన్యాసాలు జనాన్ని ఎంత విసిగించేవో మనకి తెలియదా? రాసుకున్న ఉపన్యాసం తెచ్చి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడంలో సోనియాకు సోనియాయే సాటి కాదా! అసలు ఆది నుంచి కూడా రాష్ట్రపతి ముర్ము పట్ల ఆ పార్టీ చులకన భావంతోనే ఉంది. ‘రాష్ట్రసతి’ అంటూ ఇంతక్రితం లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్‌రంజన్ చౌధురి వ్యాఖ్యానించి దేశ ప్రజలందరి చేత ఛీ అనిపించుకున్నాడు. ఇప్పుడు సోనియా అన్న మాటలు కూడా అధీర్ మాటలకి, చేసిన అవమానానికి తక్కువేమీ కావు. దీని మీద సహజంగానే దేశంలోని గిరిజన వర్గం భగ్గున మండిరది. సోనియా మీద, ఇలాంటి కూతలే కూసిన బిహార్ ఇండిపెండెంట్ ఎంపీ పప్పు యాదవ్ (లోక్‌సభ) మీద బీజేపీ ఎంపీలు హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. ముర్ము చదివినది బడ్జెట్ ప్రసంగం వలె కాకుండా ప్రేమలేఖ వలె ఉన్నదని ఈ ప్రబుద్ధుడు వాగడం విడ్డూరమే. ఈ ఇద్దరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిందని అటు రాజ్యసభ చైర్మన్‌కు, ఇటు లోక్‌సభ స్పీకర్‌కు గిరిజన ఎంపీలు వినతిపత్రాలు సమర్పించారు. సోనియా వాగుడును ఆ ఎంపీలంతా తీవ్రంగా పరిగణిస్తున్నారనీ, అందుకే ఆమెపై చర్య తీసుకోవలసిందిగా రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ థన్‌ఖడ్‌కు వినతిపత్రం ఇచ్చారనీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ వెల్లడిరచారు కూడా. రాష్ట్రపతి హోదాను దిగజార్చే విధంగా ఆ ఇద్దరు ఎంపీలు మాట్లాడారన్నదే ఆదివాసీ ఎంపీల ఫిర్యాదు.
ఇక కుంభమేళా జరిగిన తొక్కిసలాట గురించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిండు సభలో చేసిన వ్యాఖ్యలు మరీ నీచం. వాటిని వెనక్కి తీసుకోకుండా మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ ఆయన తరువాత చెప్పిన మాటలు మరీ కేతిగాడి మాటలను తలపించాయి. ప్రయాగరాజ్ తొక్కిసలాటలో వేలాదిమంది చనిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నోటికి అడ్డూ ఆపూ లేకుండా అనేశారు. దీనితో అధికార పక్షం భగ్గుమంది. ఆ మాటను వెనక్కి తీసుకోవాలని, లేదంటే నిరూపించాలని రాజ్యసభ చైర్మన్ థన్‌ఖడ్ ఖర్గేను ఆదేశించారు. తనది తప్పే అయితే సవరించుకుంటానని, కానీ ప్రభుత్వం మృతుల అసలు లెక్క వెల్లడిరచాలని అన్నారాయన. ఇక బాధ్యత రాహిత్యంతో మాట్లాడడంలో దిట్ట అయిన రాహుల్ గాంధీ అయితే, మోదీని అమెరికా పిలిచేటట్టు చేసుకునేందుకే మన విదేశాంగ మంత్రి మూడు నాలుగు సార్లు అగ్రరాజ్యానికి ప్రయాణం కట్టారని ఆరోపించారు. ఇదో చచ్చుపుచ్చు ఆరోపణ అని మంత్రి ఎస్. జైశంకర్ వెంటనే ఖండిరచారు. అంతకు ముందే రాహుల్ పీవీపై మరొకసారి నీచమైన విమర్శ చేశారు. 1990లలో తమ పార్టీ దళితులకు న్యాయం చేయలేకపోయిందట. మరి పీవీ ప్రధాని కదా! ఈ మాటను ఆంధ్రులు సహించగలరా?
తమ అధినేతలను మెప్పించేందుకు ఖర్గే, జయాబచ్చన్ వంటి నేతలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. కుంభమేళాలో మునిగితే నిరుద్యోగం పోతుందా అని ప్రశ్నించారు ఖర్గే. మరి జైపూర్ దర్గాకి చదర్ సమర్పిస్తే పోతుందా? వక్ఫ్‌బోర్డుకి ఎడాపెడా హక్కులు కల్పించి దేశాన్ని విధ్వంసం దిశగా నెట్టివేయడం పేదరికం పోవడానికే ఏమో ఆ నేతలే చెప్పాలి. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ను మెప్పించే క్రమంలో జయా బచ్చన్ హోదా మరచిపోయారు. ప్రయాగరాజ్ కుంభమేళా నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం సెవెంటీ ఎంఎంలో విపక్షాలకు కనిపిస్తున్నదట. పుష్కరం కిందటి కుంభమేళాలో అదే ప్రయాగరాజ్‌లో 42 మంది చనిపోయిన సంగతి తెలిసి కూడా జయ వంటివారు ఇలాంటి వెన్నెముక లేని మాటలు మాట్లాడుతున్నారు. ఆనాటి కుంభమేళా నిర్వహణకు నాయకత్వం వహించినదే వివాదాస్పద ముస్లిం నాయకుడు ఆజామ్‌ఖాన్. అసలు ఒక హిందూ సమ్మేళన నిర్వాహకునిగా ముస్లింను ఎలా నియమించారు? దీని గురించి అడగగలదా ఆమె? అదే చేస్తే మరొకసారి రాజ్యసభ సీటు రాదుగా!
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే ఏదో ఒక రాద్ధాంతాన్ని తెచ్చి భగ్నం చేయడం విపక్షాలకు పరిపాటిగా మారింది. రఫేల్, ఆదానీ వంటి అస్త్రాలన్నీ తుప్పు పట్టాయి. టూల్‌కిట్ దాదాపు మూత పడిరది. అది హిండెన్‌బర్గ్ దుకాణం కట్టేయడంతోనే రుజువైంది. కాబట్టి ప్రయాగరాజ్ తొక్కిసలాటను రంగం మీదకు తెచ్చారు. వక్ఫ్ బిల్లును సభలో ప్రవేశపెడతారన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. తాజా బడ్జెట్ దేశ ప్రజలను విశేషంగా ఆకర్షించిన సంగతిని తట్టుకోలేకనే ఈ రగడ లేవదీశారనీ చెప్పవచ్చు.