ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పలు ప్రాజెక్టులు, నిధులు, ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంలోనే రూ. 3 లక్షల కోట్ల అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు కేటాయించింది. జనవరిలో ప్రధాని నరేంద్రమోదీ విశాఖలో, హోంమంత్రి అమిత్‌షా విజయవాడలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అమరావతికి రూ.12,500 కోట్లు, సోలార్ విద్యుత్తు ప్లాంట్లు రూ.15,000 కోట్లు, విశాఖ ఉక్కుకు రూ. 11,440 కోట్లు ఆర్ధికసాయం ప్రకటించిన విషయం తెలిసిందే. పలు రైల్వేలైన్లు, ఓడరేవులు, విమానాశ్రయాల అభివృద్ధి, రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రులు, పంచాయతీ భవనాల నిర్మాణంతో పాటు మంచి నీటి సదుపాయం, డ్రెయినేజీల నిర్మాణం వంటి వాటికి నిధులు కేటాయించారు. పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. గత అయిదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి.
హైవేల కోసం రూ.35 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్ జాతీయ రహదారుల అభివృద్ధికి 2019-20 నుంచి 2023-24 మధ్య రూ.3 5,186 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. రాష్ట్రంలో 1,774 కిలోమీటర్ల పొడవైన రాష్ట్ర రహదారులు, గ్రీన్‌ఫీల్డ్ మార్గాలను జాతీయ రహదారులుగా ప్రకటించారు. రాష్ట్రంలో రూ. 35,584 కోట్ల విలువైన 33 గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టులు జరుగుతున్నాయి. 852 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారుల నిర్మాణం కోసం ఇప్పటివరకు రూ.9,589 కోట్లు ఖర్చుచేశారు. ఇందులో చిలకలూరిపేట ఆరువరసల బైపాస్, చిన్న అవుటపల్లి నుంచి విజయవాడ బైపాస్, కోరలం- కంటకపల్లె 6 వరసల రహదారి పనులు మాత్రమే పూర్తయ్యాయి.
అమృత్ కింద 226 ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బజన్ ట్రాన్స్ ఫర్మేషన్ (అమృత్ పథకం) కింద మొత్తం 226 ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందిస్తున్నది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.3,333.76 కోట్లు మంజూరైతే ఇందులో కేంద్రం సహాయం కింద రూ. 1,056.62 కోట్లు ఇచ్చింది. ఇందులో ఇప్పటికే రూ.1,134.84 కోట్ల విలువైన 136 ప్రాజెక్టులు పూర్తికాగా, రూ.2,198.92 కోట్ల విలువైన 90 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి.
మౌలిక వసతులకు 878 గ్రామాల ఎంపిక
గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరతను తీర్చడానికి, ఆరోగ్యం, విద్య, అంగన్వాడీ సౌకర్యాలు, జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రధాన్ మంత్రి ధర్తి ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద రాష్ట్రంలో 878 గ్రామాలు ఎంపికయ్యాయి. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 521 గ్రామాలు ఎంపికయ్యాయి. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ జీవన ప్రమాణాలను పెంచడంలో కీలక పాత్ర పోషించే ఈ పథకం కింద, 500 మందికి పైగా జనాభా ఉన్న గ్రామాలు, అందులో కనీసం 50 శాతం గిరిజన జనాభా ఉండడం వంటి ప్రమాణాల ఆధారంగా గ్రామాలను ఎంపిక చేస్తారు. రాష్ట్రంలో ఈ పథకం కింద 25 రంగాలు ఉన్నాయి. వాటిలో పీఎంఏ వై-గ్రామీణ్ ద్వారా 20 లక్షల పక్కా ఇళ్లు, 25 వేల కిలోమీటర్ల అనుసంధాన రహదారులు నిర్మించాలని, జల్ జీవన్ మిషన్ ద్వారా అర్హతగల గ్రామానికి నీటి సరఫరా, ఆర్‌ఎఎస్‌ఎస్ శ్రీ ద్వారా ప్రతి విద్యుత్తు లేని కుటుంబానికి కనెక్షన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2022-23 కేంద్ర ప్రాయోజిత పథకం నవభారత సాక్షరత కార్యక్రమం (ఉల్లా స్) కింద ఆంధ్రప్రదేశ్‌లో 30,70,956 మంది నమోదయ్యారు.
పీఎంశ్రీ కింద 855 పాఠశాలల ఎంపిక
ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకం మొదటిదశ కింద రాష్ట్రంలో 855 పాఠశాలలను ఎంపిక కాగా, ఇందులో 35 ప్రాథమిక, 27 ప్రాథమికోన్నత, 658 మాధ్యమిక, 135 మాధ్యమికోన్నత పాఠశాలలున్నాయి.
2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలలో ఈ పాఠశాలలకు కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి రూ.1,056, 44 కోట్లు మంజూరయ్యాయి. కేంద్ర వాటా రూ.633.88 కోట్లలో రూ.293.66 కోట్లు ఈ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం విడుదల చేసింది. ఎంపికైన వాటిలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 52. అతి తక్కువగా విశాఖపట్నం జిల్లాలో 5 ఉన్నాయి.
పాలిటెక్నిక్ కాలేజీల అభివృద్ధికి రూ.77 కోట్లు
సంకల్ప్ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.77 కోట్లు మంజూరయ్యాయి. ఎంపిక చేసిన 27 పాలిటెక్నిక్ కాలేజీల్లో మహిళల హాస్టళ్ల నిర్మాణానికి రూ.27 కోట్లు, 35 పాలిటెక్నిక్ అప్ గ్రేడేషన్‌కు రూ. 50.10 కోట్లు మంజూరు చేశారు. అలాగే ‘కమ్యూనిటీ డెవలప్‌మెంట్ త్రూ పాలిటెక్నిక్’ స్కీం కింద 29 పాలిటెక్నిక్‌కు 2024 మార్చి నుంచి 2026 మార్చి వరకు ఒక్కో దానికి ఏటా రూ.19.72 లక్షలు ఇవ్వనున్నారు.
8 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు
రాష్ట్రంలో 8 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అనకాపల్లి, చిత్తూరు జిల్లాలోని వలసపల్లె, ఏలూరు జిల్లాలోని నూజివీడు, కృష్ణాజిల్లాలోని నందిగామ, గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, పల్నాడు జిల్లాలోని తాళ్లపల్లి, రొంపిచర్ల, సత్యసాయిజిల్లాలోని పాలసముద్రం, నంద్యాలజిల్లా డోన్‌లోనూ వీటిని ఏర్పాటుచేస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే 35 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి.
భూసార పరీక్షా కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో కలుపుకుని స్థిర భూసార పరీక్ష కేంద్రాలు 47, మొబైల్ భూసార పరీక్ష కేంద్రాలు 13, మినీ భూసార పరీక్ష కేంద్రాలు 1328 కొనసాగుతున్నాయి. గత ఐదేళ్ల కాలంలో ఈ భూసార పరీక్ష కేంద్రాల ద్వారా 4,76,519 మట్టి నమూనాలు పరీక్షించారు. జిల్లాల వారీగా ఎక్కువగా అనంతపురం జిల్లాలో 51,505 మట్టి నమూనా పరీక్షలు చేశారు.
32,87 లక్షల మందికి పోషకాహారం పంపిణి
మిషన్ పోషణ్ 2.0 పథకం కింద, కేంద్రప్రభుత్వం పిల్లలకు (6 నెలల నుండి 6 సంవత్సరాల వరకు) సప్లిమెంటరీ న్యూట్రిషన్ అందిస్తుంది. జాతీయ ఆహార భద్రత చట్టంలోని షెడ్యూలు-2లో పొందుపరిచిన పౌష్టికాహార నిబంధనలకు అనుగుణంగా సప్లిమెంటరీ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. రాష్ట్రానికి పీఎంజీకేఏవై కింద రూ.కోటి 32 లక్షల 87 వేల 564 మంది లబ్ధిదారులకు అందుతున్నాయి. రాష్ట్రంలో, ఏఎన్‌ఎం ఏపీ హెల్త్ యాప్ ఉపయోగించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి స్క్రీనింగ్ డేటా ప్రకారం, గర్భిణులు, మహిళల్లో రక్తహీనత ప్రాబల్యం 37.05 శాతం నుంచి 42 శాతంగా ఉంది.
88 పీహెచ్‌సీల మంజూరు
రాష్ట్రంలోని 26 జిల్లాలకు 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయి. కర్నూలు జిల్లాకు 9, పల్నాడు-7. తూర్పుగోదావరి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులకు 6 చొప్పున, శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు 5 చొప్పున, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాలకు 4 చొప్పున, విజయనగరం, ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ జిల్లాలకు 2 చొప్పున, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, అన్నమయ్య జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున పీపెచ్‌సీలుమంజూరయ్యాయి.
స్మార్ట్ సిటీలకు రూ.2,975 కోట్లు
స్మార్ట్ సిటీలు అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.3,472 కోట్లు విడుదల చేయగా, అందులో రూ.2,975 కోట్లు ఖర్చుచేశారు. ఇందులో అమరావతికి రూ.779 కోట్లు, కాకినాడకు రూ.783 కోట్లు, తిరుపతికి రూ. 574 కోట్లు, విశాఖపట్నానికి రూ.838 కోట్లు ఖర్చుచేశారు. ప్రస్తుతం ఈ 4 నగరాల్లో రూ.962 కోట్ల విలు వైన 47 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి.
సమగ్ర శిక్ష అభియాన్ కింద రూ.11,950 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు సమగ్ర శిక్ష అభియాన్ కింద 26 జిల్లాల్లోని పాఠశాలలకు కలిపి గత అయిదేళ్లలో రూ.11,944.99 కోట్లు కేటాయించారు. జూనియర్ కాలేజీలకు రూ.307.76 కోట్లు, ఉన్నత విద్యా సంస్థలకు రూ.553.25 కోట్లు కేటాయించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44,400 ప్రాజెక్టులకు గాను 32,251 పాఠశాలల్లో నిర్మాణ పనులు ప్రతిపాదించగా అందులో 16,538 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. 475 జూనియర్ కళాశాలలకుగాను 447 కాలేజీల్లో పనులు ప్రతిపాదించగా, ప్రస్తుతం అన్నిచోట్లా అవి జరుగు తున్నాయి. 157 ఉన్నత విద్యాసంస్థల్లో 132 చోట్ల నిర్మాణ పనులు ప్రతిపాదించగా అందులో 98 చోట్ల అవి జరుగుతున్నాయి.
నేషనల్ హెల్త్ మిషన్ కింద 2,737 ప్రాజెక్టులు
నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇచ్చిన 2,737 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 15వ ఆర్థిక సంఘం, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద మొత్తం 493 ప్రాజెక్టులు మంజూరయ్యాయి. 2021-26 మధ్యకాలంలో ఏపీకి ఆర్థిక సంఘం కింద రూ.2,600 కోట్లు, పీఎం ఆయుష్మాన్ భారత్ కింద రూ.1,271 కోట్ల మంజూరుకు ఆమోదముద్ర వేసింది.
248 రైల్వే వంతెనలు
2014-24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,309 కోట్ల విలువైన 248 ఆర్డీఓబీ, ఆర్ యూబీలు (రైల్వే వంతెనలు) మంజూరు చేశారు. ప్రస్తు తం నెల్లూరుజిల్లాకు 12 ఆర్ ఓబీ, ఆర్‌యూబీ లు మంజూరు చేశారు.
లక్ష పంపులు మంజూరు
ఫీడర్ స్థాయి సోలారైజేషన్ విధానంకింద రాష్ట్రానికి లక్ష పంపులు మంజూరు చేశారు. ఈ పథకం కింద రైతులు తమ భూముల్లో 2 మెగావాట్ల వరకు సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసు కొని డిస్కంలకు విద్యుత్తును విక్రయించవచ్చు. పీఎం సూర్యఘర్ యోజన కింద 10 లక్షల ఇళ్లకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంక్యుబేషన్ సెంటర్ అభివృద్ధి
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎకరం స్థలంలో ఇంక్యు బేషన్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌ను నాలుగు అంతస్తుల భవనం నిర్మిస్తుంది. రూ.18.95 కోట్లతో ఈ పనులు చేస్తున్నారు. విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్టు అంచనాలను రూ.30,609 కోట్లకు పెంచింది. ప్రకాశం బ్యారేజి-హైదరాబాద్‌ల మధ్య ఆర్సీ ఎస్ ఉడాన్ స్కీం కింద సీప్లేన్ నడపడానికి స్పైస్ జెట్ సంస్థకు అనుమతులు ఇచ్చారు.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్