వసంత పంచమి పశ్చిమ బెంగాల్‌లో జరిగే ముఖ్యమైన ఉత్సవాలలో ఒకటి. ఆ రోజు దాదాపు అన్ని విద్యా సంస్థలలోను సరస్వతి అమ్మవారిని విద్యార్థులు పూజిస్తారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా యోగేశ్‌చంద్ర న్యాయ కళాశాలలో (ఈ కళాశాలలో విద్యార్థినులే ఎక్కువ) అమ్మవారి పూజకు జనవరి 29 నుంచి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో 30న అదే కళాశాలకు చెందిన ముస్లిం విద్యార్థులు సరస్వతి పూజ నిర్వహిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తూ బెదిరింపు సందేశాలు పంపారు. ఇదే వివాదానికి ఆరంభం. కానీ హైకోర్టు జోక్యంతో ఫిబ్రవరి 2న సరస్వతి పూజ అక్కడ యథావిధిగా జరిగింది. బీఏ ఎల్‌ఎల్‌బీ విద్యార్థి దేశ్మ ఘోష్, ఇంకొందరు విద్యార్థులు జనవరి 31న హైకోర్టుకు వెళ్లడంతో ఇది సాధ్యమైంది. కానీ కళాశాల ప్రాంగణంలోకి ప్రవేశించదలచిన విద్యార్థులు గుర్తింపు కార్డులు చూపించాలని పోలీసులు ఆదేశించడం ఉద్రిక్తతలకు దారి తీసింది.
మొదట వచ్చిన వార్తల ప్రకారం లైంగిక అత్యాచారం, హత్య బెదిరింపులలో ఉన్నాయి. తరువాత అనూహ్యంగా పూజను అడ్డుకుంటామని చెప్పినవారు బయటి గూండాలని వాదన కొత్త రూపు సంతరించుకుంది. నిజానికి మహమ్మద్ షబ్బీర్ అలీ అనే వ్యక్తి బెదిరింపుల వెనుక ఉన్నాడని బయట పడింది. ఇతడి నాయకత్వంలో ఇలాంటి నీచమైన బెదిరింపులకు పాల్పడినవారు ఎవరో కాదు, తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్. అంటే అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమే. వినడానికి వికృతంగా ఉన్నా, మరొక సంగతి చెప్పుకోవాలి. ఇంత వివాదానికి కారణమై, తన మతోన్మాదాన్ని బయటపెట్టుకున్న షబ్బీర్ అలీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ క్రమ శిక్షణ సంఘంలో సభ్యుడు. యోగేశ్‌చంద్ర కళాశాల పాత విద్యార్థి కూడా. అమ్మవారిని ప్రతిష్ఠిస్తే లైంగిక అత్యాచారం చేసి గుణపాఠం చెబుతామని టీఎంపీ విద్యార్థి విభాగం ఇతడి నాయకత్వంలోనే హెచ్చరించింది. ఈ సంగతి టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా పేర్కొన్నది.
కొందరు బయటివారు తరచు కళాశాల ప్రాంగణంలోకి చొరబడి అసభ్య పదజాలంతో విద్యార్థులను దూషిస్తున్నారని, దీని గురించి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయిందని దేశ్మ చెప్పారు. ప్రతి ఏటా ఈ కళాశాల ప్రాంగణంలో సరస్వతి అమ్మవారి పూజ జరుగడం ఆనవాయితీయేనని, ఈ ఏడాది కూడా జరుపుతామని, అది తమ హక్కు అని దేశ్మ కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఘంటాపథంగా చెప్పారు. ఈ అంశం మీదనే రాష్ట్ర హైకోర్టు, అసెంబ్లీ స్పీకర్ కూడా స్పందించవలసి వచ్చింది. తాము పూజ కోసం ఏర్పాటు చేసుకున్న పందిరిని కూడా అవతలి వర్గం కబ్జా చేసిందని హిందూ విద్యార్థులు ఆరోపించారు. ఈ పరిణామానికి నిరసనగా ఏబీవీపీ కళాశాల ద్వారం దగ్గర ప్రదర్శన నిర్వహించింది. సరస్వతి పూజను నిలువరించడానికి ఎవరు ప్రయత్నించినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ హెచ్చరించారు. ఆయన కూడా న్యాయవాదే. గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి పూజకు అనుమతించాలని ఆయన సూచించారు.
యోగేశ్ చంద్ర న్యాయకళాశాలలో తలెత్తిన సరస్వతి పూజ వివాదం ఫిబ్రవరి 2 తేదీన కొత్త మలుపు తీసుకుంది. కొన్ని పండుగల సమయాలలో సంప్రదాయబద్ధ వాతావరణంతో కనిపించే ఆ కళాశాల ప్రాంగణం ఆరోజు నినాదాలతో, ఉద్రిక్తత లతో, పోలీసు బలగాలతో నిండిపోయి కనిపించింది. ఇందుకు కారణం ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు అక్కడి రావడమే. మంత్రి రాకతో విద్యార్థి లోకం భగ్గుమంది. తాను సైతం పూజలో పాల్గొంటా నంటూ మంత్రి తయారైనప్పటికీ విద్యార్థుల ఆగ్రహం చల్లారలేదు. చిత్రం ఏమిటంటే, కళాశాలలో శాంతియుత వాతావరణం కల్పించాలని సాక్షాత్తు హైకోర్డు ఆదేశించినప్పటికీ, కళాశాల ప్రాంగణంలోనికి వచ్చే విద్యార్థుల మీద ఆంక్షలు పెట్టినప్పటికీ మంత్రి అంతా ప్రశాంతం అని ప్రకటించడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. సరస్వతి పూజ నిర్వహించా లని హైకోర్టు ఆదేశించిన మీదటే తాను, ఎంపీ, ఆ కళాశాల పాలక మండలి అధ్యక్షులు మాలా రాయ్ వచ్చామని, పూజలో పాల్గొని వెళ్లిపోతామని కూడా మంత్రి చెప్పవలసి వచ్చింది. తరువాత కూడా మీడియాతో మాట్లాడుతూ మంత్రి చెప్పిన మాటలు వింటే అసలు ఇతడు సభ్య సమాజంలో బతికేందుకు అర్హత ఉన్నవాడేనా అనిపిస్తుంది. అసలు ఈ విద్యార్థులతో మాట్లాడాలనే నేను అనుకోవడం లేదు. వీళ్లకి ఎంతసేపూ మీడియా దృష్టిలో పడాలన్న యావ తప్ప మరొకటి లేదని వాగాడు. ఇది విద్యార్థులను మరింత రెచ్చగొట్టింది. పెద్ద ఉత్సవం కళాశాల కొత్త భవనంలో దేశ్మ తదితరులు నిర్వహించారు. పాత భవనంలో కళాశాల ప్రిన్సిపాల్ పంకజ్ కుమార్ రాయ్ మరొక విగ్రహం ప్రతిష్ఠించారు. సమీపంలోనే స్థానిక టీఎంసీ ఎమ్మెల్యే అరూప్ బిశ్వాస్ మరొక విగ్రహం ప్రతిష్ఠించారు.
రాష్ట్రంలో ఎక్కడా కూడా అమ్మవారి పూజలకు జీహాదీ శక్తులు అడ్డుపడకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో కొన్నిచోట్ల సరస్వతి పూజలకు కొందరు అడ్డుపడినట్టు వచ్చిన వార్తల గురించి మీడియా ప్రస్తావించినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జిష్ణు బసు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పక్కనే ఉన్న బాంగ్లాదేశ్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా అమ్మవారి ఆరా
ధనను అడ్డుకునేందుకు జీహాదీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని అలాంటి శక్తులను రాష్ట్ర ప్రభుత్వం నిరోధించాలని ఆయన సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ బెంగాల్ పర్యటన నేపథ్యంలో జిష్ణు బసు ఈ వ్యాఖ్యలు చేశారు. సరస్వతి అమ్మవారి పూజలు కూడా పోలీసు నిఘాలో జరుపుకోవలసి వస్తున్నదంటే పశ్చిమ బెంగాల్ కూడా బాంగ్లాదేశ్‌లా మారిపోతున్నదని అర్థమని బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ అండతో ఇస్లామిస్టు ఉగ్రవాదులు పన్నుతున్న ఈ కుట్రల నుంచి బయటపడాలంటే హిందువులంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
షబ్బీర్ అలీ వాదన వింటే హతోస్మి అనిపిస్తుంది. కళాశాల పక్కనే ఉన్న సందులో తాము కూడా సరస్వతి పూజకు ఏర్పాటు చేశామని, పాత విద్యార్థిగా ఇక్కడకు వచ్చే సర్వ హక్కులు తనకు ఉన్నాయని, బెదిరింపులు శుద్ధ అబద్ధమని చెప్పాడు. అంటే ఎలాంటి ఆధారాలు చూపకుండనే హైకోర్టు గుడ్డిగా రక్షణ కల్పించమని ఆదేశాలు ఇచ్చిందని షబ్బీర్ అలీ ఉద్దేశం కాబోలు.
ఈ అంశంలో జాతీయ మీడియా చూపుతున్న ‘సంయమనం’ అద్భుతం కదా! టీఎంసీ క్రమశిక్షణ సంఘంలో సభ్యుడైనప్పటికీ అతడి పార్టీ పేరును ప్రస్తావించలేదు. సరస్వతి పూజ జరగనివ్వబోమని చెప్పినా అతడి మతోన్మాదం గురించి చెప్పరు. కానీ ప్రజలకు తెలుసు. ఇది తృణమూల్ కాంగ్రెస్‌కీ, అందులోని ముస్లిం మతోన్మాదులకీ; జాతీయవాదులకీ, హిందువులకీ మధ్య జరిగిన ఘర్షణ. దీని గురించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ‘సంయమనమే’ పాటిస్తున్నారు. తన పార్టీ క్రమశిక్షణ సభ్యుడి గూండాయిజం గురించి పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇది పశ్చిమ బెంగాల్‌లోని హిందువుల పరిస్థితి. అక్కడి ముస్లిం మతోన్మాదులు బాంగ్లాలోని తమ సాటి మతోన్మాదులను ఆదర్శంగా తీసుకున్నట్టే ఉంది. సరస్వతీ పూజకు పశ్చిమ బెంగాల్ పోలీసు బందోబస్తు అవసరమైంది.
– జాగృతి డెస్క్