కేరళకు చెందిన సాధు ఆనందవనం ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో జునా అఖాడా మహామండలేశ్వర్‌గా జనవరి 27న పదోన్నతి పొందారు. తద్వారా ఆయన భక్తుల ఆధ్యాత్మిక యాత్రను ప్రభావితం చేస్తారు. ఆది శంకరాచార్యునికి, జునా అఖాడాకు ఓ అవినాభావ సంబంధం ఉంది. జగద్గురువు సన్యాస క్రమాలను 10 క్రమాలుగా నెలకొల్పడంతో పాటుగా దేశం నలుదిక్కుల నాలుగు మఠాలను ఏర్పాటు చేశారు. అవి దక్షిణాన కర్ణాటకలో శృంగేరి పీఠం, తూర్పున ఒడిశాలో పూరి గోవర్ధన పీఠం, పశ్చిమాన గుజరాత్‌లో ద్వారక, ఉత్తరాన ఉత్తరాఖండ్‌లో జ్యోతిర్‌మఠం. నలుగురు ఆదిశంకరాచార్యులు ఈ మఠాలకు అధిపతులుగా ఉంటారు.
ఆది శంకరాచార్యులు నాలుగు మఠాధిపతుల నుంచి తనను వేరుగా చూడాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ 10 సన్యాస క్రమాలకు చెందిన సన్యాసులను భారతి, సరస్వతి, సాగరం, తీర్థ, పురి, ఆశ్రమం, గిరి, పర్వతం, అరణ్య, వన అని పిలుస్తారు. కనుక దీనిని దశనామి క్రమం అని పిలుస్తారు. అఖాడా అనే వ్యవస్థ వేర్వేరు సంప్రదాయాలు, వ్యవస్థలకు లోబడి ఉన్న సన్యాసులను ఏకం చేసేందుకు ఉద్దేశించింది. మహామండలేశ్వరులు ధర్మం ప్రాతిపదికగా అఖాడాలకు నేతృత్వం వహిస్తారు. అఖాడా అంటే మల్ల యుద్ధం చేయడానికి, సాధన చేయడానికి ఉద్దేశించిన ఓ స్థలం. ఇంకా విడమరిచి చెప్పాలంటే అఖాడాను గోదా లేదా బరి అని కూడా అనొచ్చు.
అఖాడాలు ఎప్పుడూ కూడా జప, తప, సాధనలకు తోడుగా ధర్మ పరిక్షణ కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. అఖాడాల్లో గుర్తింపు పొందిన అఖాడాలు 13 ఉన్నాయి. మొదట్లో రాసుకొచ్చిన దశనామి సన్యాస క్రమాలను 7 శైవ అఖాడాలుగా ఏర్పాటు చేశారు. అవి జునా (భైరవ్), నిరంజని, అటల్, ఆవాహన్, ఆనంద్, అగ్ని, మహానిర్వాని, వాటిలో జునా అఖాడా అతి పెద్దది, అత్యంత పురాతనమైంది. జునా అఖాడా కుంభమేళాలో ఓ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ అఖాడా ప్రధాన కార్యాలయం వారణాసిలో ఉంది. స్వామి కాశికానంద గిరి మహరాజ్ నిరంజని అఖాడా మహామండలేశ్వర్‌గా ఉన్నారు. శ్రీ నిర్మోహిని అని అఖాడా విష్ణు భక్తులకు చెందినది. గురునానక్ కుమారుడు శ్రీచంద్ బోధనలను శ్రీపంచాయతీ బడా ఉదాసీన్ అఖాడా, శ్రీపంచాయతీ నయా ఉదాసీన అఖాడా, శ్రీ నిర్మల్ పంచాయతీ అఖాడా అనుసరిస్తాయి.
- జాగృతి డెస్క్