భారతీయుల సనాతన ధర్మం విలువను పలు ప్రపంచ దేశాలు తెలుసుకుంటున్నాయి. అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ మన దేశంలో స్వయం ప్రకటిత మేధావులు కొందరు హిందువుల విశ్వాసాలపై దాడి చేయడం సర్వసాధారణంగా మారింది. సర్వే జనా సుఖినో భవంతు అంటూ ఇతర మతాల విశ్వాసాలను గౌరవిస్తున్న హిందువుల మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటున్నారు. సనాతన ధర్మం మనకు నేర్పిన సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇటీవల మన తెలుగు నేలపై జరిగిన కొన్ని ఘటనలు పరిశీలిస్తే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా లౌకివాదం ఒక్క హిందువులకే పరిమితమా అనిపిస్తుంది. మిడిమిడి జ్ఞానంతో సనాతన ధర్మంపై అవాకులు చెవాకులు పేలుతున్న వారికి ఇతర మతాలపై వ్యాఖ్యానించే ధైర్యం లేదు కానీ మాన విశ్వాసాలపై మాత్రం నోరు పారేసుకుంటున్నారు.

‘‘అజ్ఞః సుఖమారాధ్య స్సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః / జ్ఞానలవ దుర్విదగ్దం బ్రహ్మసి నరం న రంజయతి’’

(తెలియని వారికి సులభంగా తెలియజేయవచ్చు. తెలిసిన వారికి మరింత సులభంగా తెలియజేయ వచ్చు. తెలిసీ తెలియనివారికి మాత్రం తెలియ జేయడం బ్రహ్మదేవుడి తరం కూడా కాదు)

పై మాటలు నేటి కుహనా మేధావులకు, సెక్యుల రిస్టులకు సరిగ్గా సరిపోతాయి. ఇటీవల భాగ్య నగరంలో ఏర్పాటు చేసిన పుస్తకాల ప్రదర్శనలో వామపక్షవాది ఎన్‌.వేణుగోపాల్‌, సినీ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, మీడియా యాంకర్‌ శ్రీముఖి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ తమకు అన్నీ తెలుసన్నట్టు సనాతనధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయా రంగాల్లో పేరుగాంచిన వీరు చేసే వ్యాఖ్యలకు సమాజంలో విస్తృతంగా ప్రచారం లభించే అవకాశాలుండడంతో ఆచితూచి వ్యవహరించాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది. అయితే, ఆ సంగతి విస్మరించి మేము నమ్మిందే నిజం అనుకుంటూ, వాటిని నిరూపించే ప్రయత్నంలో అవాస్తవాలతో హిందువుల మనోభావాలను  దెబ్బతీస్తున్నారు. సనాతన ధర్మంపై నమ్మకం లేని వ్యక్తులు, విదేశీ శక్తుల భావాలకు ప్రభావితమై వారు చెప్పిన అసత్యాలు, కల్పితాలను నమ్మకుండా వాస్తవాలను తెలుసుకొని మాట్లాడితే మంచిదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

తెలుగు సమాజంపై సినిమాల ప్రభావం అధికం. కొందరు సినీ ప్రముఖుల రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. వారి వ్యవహార శైలి, మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉన్న నేపథ్యంలో ఏమి మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే ధోరణితో కాక ఆచితూచి వ్యవహరించాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో వెయ్యికిపైగా సినిమాలో హాస్యనటుడిగా నటించి అందరికీ ఆనందం కలిగించిన బ్రహ్మానందం ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తన స్థాయిని దిగజార్చుకున్నారు. సామాజిక మాధ్య మాలలో వెల్లువెత్తిన విమర్శలే ఇందుకు నిదర్శనం. వేదాలు, మనుశాస్త్రం స్త్రీలను చులకనగా చూశాయని, సావిత్రిబాయి ఫూలే వంటి మహిళలు నేటి మహిళలకు ఆదర్శమని అన్నారు. సావిత్రిబాయి ఫూలే గొప్పవారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాను వేదాలను ఔపోసిన పట్టినట్టు, మను ధర్మశాస్త్రంపై పరిశోధన చేసినట్టు విమర్శలు చేయడమే ఆశ్చర్యమేసింది.

సమాజంలో పేరు ప్రఖ్యాతలున్న వారు ఒక విషయంపై మాట్లాడేటప్పుదు ఒక్కటికి రెండుసార్లు ఆలోచించాలి. సనాతన ధర్మంపై ద్వేషమున్న వారు రాసిన పుస్తకాలు చదివి అవే నిజమనుకొని మాట్లాడే బదులు, వారు ఏమి చెప్పారు? ఎందుకు చెప్పారు? ఏ సందర్భంలో చెప్పారు? వంటి అంశా లపై పరిశోధిస్తూ అధ్యయనం చేయాలి. ఎందుకు అంటే, వారు విమర్శలకు దిగుతున్నది కోట్లాది మంది విశ్వాసాలకు సంబంధించిన అంశం మీద. కాల పరీక్షకు నిలిచిన జీవన విధానం మీద. అందులో ఏమైనా చెడు ఉంటే గర్హించి వాటిని విస్మరించాలి. మంచిని అనుసరించాలి. చేతకాకపోతే కనీసం అందులో ఉన్న మంచీ చెడు రెండూ కూడా చెబుతూ, ఏపక్షంగా బురదజల్లడం మానుకోవాలి.

దేవీ భాగవతం చదివితే తెలుస్తుంది ఈ జగమంత జగన్మాత సృష్టే అని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సహా దేవతలందరూ దేవీమాత కృపకు పాత్రులు కావాల్సిందే అని దేవీ భాగవతంలో ఉంది. సనాతన ధర్మంలో స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యం ఇతర ఏ మతంలో అయినా ఉందని వీరు చెప్పగలరా? హిందూ మతంలో ఉన్నట్టు మహిళ లను దేవతలుగా ఇతర ఏ మతంలోనైనా ఆరాధించి నట్టు వీరికి తెలుసా? మన వేదాల్లో ‘శ్రీ సూక్తం’, ‘దేవీ సూక్తం’ స్త్రీ శక్తిని స్తుతించారని ఆయనకు తెలుసా? మహాభారతం ఆదిపర్వంలో ‘ఏ పురుషుడూ కోపంలో కూడా తన భార్యకు నచ్చని పని చేయ కూడదు. ఆనందం, ధర్మం భార్యపైనే ఆధారపడి ఉంటుంది. స్త్రీలు లేనిదే పురుషులను ఎవరూ సృష్టించలేరని చెప్పిన విషయం వేదాల ప్రస్తావన’ తెచ్చిన బ్రహ్మానందానికి తెలుసా?

వేదాలపైనే కాకుండా మనుధర్మ శాస్త్రంపై కూడా పరిశోధన చేసినట్టు మాట్లాడిన బ్రహ్మానందానికి మనుధర్మంలో తల్లిని భూదేవీ రూపంగా చెప్పారని, స్త్రీలను సోదరులు, తండ్రులు, భర్త గౌరవించాలని, స్త్రీలను మన్నించిన చోట దేవుళ్లు సంతోషంగా ఉంటారని, స్త్రీలు బాధపడే చోట కుటుంబం సర్వనాశనమవుతుందని చెప్పిన విషయాలు ఆయనకు తెలుసా? దేనిపౖెెన అయినా విమర్శలు చేసినప్పుడు అందులో నిజమెంతో రూఢ చేసుకోకుండా మాట్లాడడం ఒక స్థాయిలో ఉన్న వారికి కళంకమే. మహిళా సాధికారత కోసం పరితపిస్తున్నట్టు నటించే ఇలాంటి పెద్ద మనుషులు మన గ్రంధాలపై వ్యాఖ్యలు చేసినట్టు ఇతర మతాలలో స్త్రీల పరిస్థితులపై మాట్లాడగలరా? మాట్లాడితే ఏమవుతుందో వారికి బాగా తెలుసు. హిందువులైతే స్పందించరని, పట్టించుకోరనే నమ్మకంతో ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు అందుకున్న బ్రహ్మానందం ఇలాంటి అర్థరహితమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయం. సనాతన ధర్మంపై సదభిప్రాయం లేని ఈయన ఈ వ్యాఖ్యల అనంతరం తిరుమలలో వైకుంఠ దర్శనం చేసుకోవడం గమనార్హం. బ్రహ్మానందం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణితో వ్యవహరిస్తే నవ్వులు పంచే ఈ నటుడే నవ్వులపాలు కావడం ఖాయం. ఆయన తన వ్యాఖ్యలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

సనాతన ధర్మంపై అవగాహనా రాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారుతున్న వేళ తెలుగు యాంకర్‌ శ్రీముఖి హిందువులు పవిత్రంగా ఆరాధించే రామాయణంలోని రాముడు, లక్ష్మణుడు కల్పిత పాత్రలు అంటూ వ్యాఖ్యానించారు. ఆదర్శపురుషుడు రాముడిపై వ్యాఖ్యలు చేసిన ఆమెకు రామాయణంపై అవగాహన ఉందా? భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగా పూజలందుకుంటున్న రామాయణం జీవనవిధానం నేర్పిస్తుంది. మనకు నడవడిక నేర్పింది. భారతదేశంలోనే కాకుండా వియాత్నం, ఇండోనేషియా, థాయిలాండ్‌, కంబోడియా, మలేషియా వంటి దేశాల ప్రజల మీద ప్రభావం కలిగిన రామాయణంపై పుణ్యభూమి అయిన మన దేశంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. యాంకర్‌ శ్రీముఖి వ్యాఖ్యలపై హిందువులు నిరసనలు తెలపడంతో అనంతరం పొర పాటు తెలుసుకున్న ఆమె తొందరగానే స్పందించి విచారం వ్యక్తం చేయడం స్వాగతించాల్సిన అంశం.

రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దేశంలో ఒక పరిపాటిగా మారింది. ముఖ్యంగా వామపక్షం, హేతువాదం భావనలకు ఆకర్షితులైన వారితో సనాతన ధర్మానికి ప్రమాదం ఏర్పడిరది. మన ఇతిహాసాలని వక్రీకరిస్తూ హిందువులు పూజించే దేవతలను విమర్శిస్తూ, రాక్షసులుగా ఉన్న వారిని కీర్తించడం ఒక ఫ్యాషన్‌గా మారింది. అందులో భాగంగానే తెలుగు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ ఇటీవల రావణాసురుడిని గొప్పవాడిగా పేర్కొన్నారు. రామాయణంలో కూడా రావణాసురుడి గుణగణాలను తెలిపినా, ఆయన ఎందుకు, ఏవిధంగా పతనమయ్యాడో తెలియజేస్తూ మనం ఎలా ఉండకూడదో తెలియజేసింది. ఇతిహాసాల్లోని చెడును ఉటంకిస్తూ మనకు ఆదర్శమైన మార్గదర్శకాలు చేయాల్సిన రచయితలు రాక్షసులను కీర్తిస్తూ నేటి తరానికి ఎలాంటి సంకేతాలు పంపిస్తు న్నారో ఆలోచించుకోవాలి.

తెలుగు సినీ రంగ ప్రముఖుల తీరు ఇలా ఉంటే సనాతన ధర్మంపై నిత్యం నిప్పులు చెరిగే వామపక్ష వాది ఎన్‌.వేణులోపాల్‌ ఇటీవల హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన బుక్‌ ఎగ్జిబిషన్‌లో మరింత రెచ్చిపోయారు. ఆయన ఏర్పాటు చేసిన పుస్తకాల స్టాల్‌లో కోట్లాది మంది ఆరాధ్యమైన వేంక టేశ్వరస్వామి పవిత్ర స్థలమైన తిరుమల ఒక బౌద్ధ క్షేత్రం అంటూ పుస్తకాన్ని విక్రయించారు. ఇలాంటి పుస్తకాలు అమ్ముతూ సనాతనధర్మం అనుసరిస్తున్న వారి మనోభావాలను ఎందుకు కించపరుస్తున్నారని, ఒక మతానికి వ్యతిరేకంగా ఉన్న పుస్తకాన్ని ఎలా అమ్ముతారని ఒక సందర్శకుడు ప్రశ్నిస్తే ‘‘నా స్టాల్‌ నా ఇష్టం. ఇతర పుస్తక స్టాల్‌లో అన్య మతస్తులను కించపరుస్తూ ఉన్న పుస్తకాలు లేవా..? ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు అమ్ముతాం.. హిందూమతం అంత దుర్మార్గం ఎక్కడా లేదు’’ అని ఆయన దురుసుగా మాట్లాడిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వ్యాఖ్యలను గమనిస్తే వీరు హిందు మతానికి వ్యతిరేకంగా వామపక్ష నీడన ఎంతగా రెచ్చిపోతున్నారో తెలుస్తుంది.

వేణుగోపాల్‌ తమ కుటుంబంలోని కొందరి ప్రమేయంతో వామపక్షం వైపు ఆకర్షితులై హిందు మతానికి, జాతీయతకు వ్యతిరేకంగా వ్యవహారాలు నడుపుతూ రచనలు చేస్తుంటారు. వీక్షణం అనే పత్రికకు ఎడిటర్‌గా ఉన్న ఈయన సనాతన ధర్మంపై దాడి చేయడంలో ముందు వరుసలో ఉంటారు. అన్ని రకాల పుస్తకాలు అమ్ముతాం అని ఈయన చెప్పినా, వారి స్టాల్‌లో హిందూ మతానికి వ్యతిరే కంగా పుస్తకాలు ఉన్నాయే కానీ, ఇతర మతాలకు వ్యతిరేకంగా ఒక్క పుస్తకం కూడా లేదు. మరోవైపు ఇతర స్టాల్స్‌లో ఇతర మతాలను కించపరుస్తూ పుస్తకాలున్నాయని ఈయన చెప్పినా బుక్‌ ఎగ్జిబిషన్‌ మొత్తం తిరిగినా ఎవరి ధర్మాల గురించి వారు గొప్పగా చెప్పుకున్న పుస్తకాలున్నాయి తప్ప అన్య మతస్తులను కించపరుస్తూ ఎలాంటి పుస్తకాలు ఎగ్జిబిషన్‌లో కనిపించలేదంటే వీరి విమర్శలు ఎంత అర్థరహితంగా ఉన్నాయో తెలుస్తుంది.

హేతువాదులం, కమ్యూనిస్టులం అని చెప్పుకునే మేధావులు ఒక ధర్మాన్ని ఎలా లక్ష్యంగా చేసుకుంటారు? కులం, మతం లేవనే వీరికి ఇతర మతాలలో ఉన్న లోపాలు కనిపించవా? లేదంటే వారంటే భయమా? కుల వ్యవస్థలున్న హిందూ ధర్మంలో మహిళలను చిన్నచూపు చూస్తారని వితండ వాదం చేయడం వీరికి ఒక పరిపాటిగా మారింది. సనాతన ధర్మంలో కుల వ్యవస్థ గురించి మాట్లాడే వీరికి ఇతర మతాలలో కుల వ్యవస్థలు, సామాజిక భేదాలు లేవని చెప్పగలరా? అందులోని లోపాలను ఎత్తిచూపే సాహసం వీరు చేయగలరా? అసలు మావోయిస్టు పార్టీలోని అణచివేత మీద, లైంగిక వేధింపుల మీద ఆ శిబిరాల నుంచి బయట పడినవారు చెప్పిన మాటలకు వీరి వద్ద సమాధానం ఉందా? ఈ పార్టీలలో, సంస్థలలో స్త్రీలకు ఇచ్చిన స్థానం ఎక్కడ? హిందూ మతంలో అన్ని కులాలకు గౌరవం ఉంది. ఇతిహాసాలు మొదలు కొని అన్నింటా అన్ని కులాలకు ప్రాధాన్యత సనాతన ధర్మంలో దక్కిందనే నిజం వీరికి తెలియదా? ఎవరైనా నిజాలను ప్రశ్నిస్తే దాడి చేయబోయారంటూ బురద జల్లుతూ గ్లోబల్‌ ప్రచారం చేయడం వీరికి ఒక ఆనవాయితీగా మారింది. ఒక మతాన్ని వ్యతిరేకిస్తూ, ఇతర మతాలంటే భయపడే వీరు హేతువాదులు ఎలా అవుతారు?

ఇటీవల విజయవాడలో జరిగిని వీహెచ్‌పీ సమావేశంలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ చేసిన ఉపన్యాసం మంచి పరిణామం. గతంలో పలు వివాదాస్పద గేయాలు రాసిన ఈయన సినీ రంగంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కొన్ని దుష్టశక్తులు వ్యవహరిస్తున్నాయని బట్టబయలు చేశారు. గతంలో తాను కూడా ఇలాంటి పాటలే కొన్ని రాశానని చెప్పిన ఈయన క్షమాపణలు కూడా కోరారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఇతర సినీ ప్రముఖులు కూడా అనంత శ్రీరామ్‌ బాటలో నడిస్తే బాగుంటుంది.

– శ్రీపాద

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE